అందమైన కుందేలు
ఆటలాడుకుందామని
ఒంటరిగా రాతినెక్కి
గంతులేయబోయింది
ఎగిరి జారి పడిపోయే
కాలేమో విరిగిపోయే
లబలబమని మొత్తుకుంది
కదలలేక ఏడ్చింది
పిచ్చుకమ్మ చూసింది
పిల్లికెళ్లి చెప్పింది
పిల్లిమామ పరిగెత్తి
కొంగమ్మకు చెప్పింది
అందరు పరుగెత్తుకొచ్చి
కుందేలును లేవదీసి
తన ఇంటికి చేర్చిరి
వైద్యుని పిలిపించిరి
డాక్టరు ఎద్దన్న వచ్చి
సిస్టరు చిలుకమ్మ వచ్చి
గాయాలను కడిగేసి
పసరు మందు వేసిరి
కర్రముక్క కట్లు కట్టి
కాలిచుట్టు బట్ట చుట్టి
కంగారుపడకనిరి
కదలకుండ ఉండమనిరి
కోడిపిల్ల, కొంగపిల్ల
కాకిపిల్ల, కొంటెకోతి
పలకరించ వచ్చాయి
పండ్లు తెచ్చి ఇచ్చాయి
కొంటెకోతి ముందుకొచ్చి
కాలు పట్టి లాగిచూసి
కలవరమే వద్దంటూ
కబుర్లన్నో చెప్పబోయె
పరామర్శ ఏమోగాని
ప్రాణాలే పోయాయని
గిలగిలమని కొట్టుకొని
వలవల కుందేలు ఏడ్చె
ఇరుగు పొరుగు, నేస్తాలను
బంధువులను చూసి చెప్పె
మీరందరు లేకపోతె
నా గతి ఏమగునో కదా !
పులిరాజో, వనరాజో
నన్ను చేయు ఫలహారం
మీ సాయంవల్ల నేను
బతికి బట్ట కట్టాను
ఎప్పటికీ మరువనమ్మ
మీ అందరి మమకారం
కష్టసుఖములయందు
కావాలి సహకారం
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి