భలె భలె భలె భలె బాలలమండి
భలేగ ఆటలు ఆడెదమండి
చెట్లు చేమలు ఎక్కేస్తాం
కోతికొమ్మచ్చులు ఆడేస్తాం
చెమ్మా చెక్కా, చిర్రాగోనె
చెడుగుడు ఆటలు ఆడేస్తాం!
బొంగరాలు భలే తిప్పేస్తాం
బొమ్మరిళ్ళనే కట్టేస్తాం
పరుగుపందెం, పచ్చీసాట
పతంగులను మేం ఎగరేస్తాం!
బంతీ బ్యాటూ పట్టేస్తాం
సిక్సర్లు, ఫోర్లు కొట్టేస్తాం
రాజు - రాణి, దొంగ - పోలీస్,
దాగుడుమూతలు ఆడేస్తాం!
అష్టాచెమ్మా ఆడేస్తాం
బస్సు, రైలు నడిపేస్తాం
కళ్ళగంతలు, కప్పగంతులు
ఒప్పులకుప్ప ఆడేస్తాం!
దూకుళ్లాటలో దూకేస్తాం
కుంటుళ్ళాటలో ముందొస్తాం
దస్తీలాట, కస్తీలాట
దిగుడుపుల్ల ఆడేస్తాం!
గోళీలతో గురిపెట్టేస్తాం
బొమ్మబొరుసు వేసేస్తాం
తాకుళ్ళాట, తొక్కుడబిళ్ళ
ముక్కుగిల్లుడు ఆడేస్తాం!
ఊడల ఊయల లూగేస్తాం
ఊహల్లో మేం విహరిస్తాం
గవ్వలాటలు, గుజ్జనగూళ్ళు
వామనగుంటలు ఆడేస్తాం!
కత్తిపడవలు చేసేస్తాం
వాగులు వంకలు విహరిస్తాం
వేలిముద్రలతో చిత్రాలూ
మట్టితో బొమ్మలు చేసేస్తాం!
సమతా మమతలు పంచేస్తాం
సమభావంతో మెలిగేస్తాం
నేస్తాలతో మేం సర్దుకుపోతూ
చెలిమిని చక్కగ చేసేస్తాం!
అభినందిస్తే ఆనందిస్తాం
ప్రేమను పంచితే స్వాగతిస్తాం
స్వేచ్ఛను మాకు మీరిస్తే
చంద్రమండలమే చుట్టొస్తాం!
దస్తీలాట అంటే ఎలా ఆడతారు
రిప్లయితొలగించండిపచ్చీసాట ఎలా ఆడుతారు
రిప్లయితొలగించండి