LATEST UPDATES

4, ఏప్రిల్ 2020, శనివారం

నాలుగక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో

నాలుగక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో
అవతల అవసరం అవగతం అలమర అలగటం
అసహనం అపజయం ఆచరణ ఆదరణ ఆమరణ
ఆచమనం ఇరగటం ఇవతల ఇరవడం ఇమడటం
ఉడకటం ఉరవటం ఉతకడం ఊడవటం ఎగరటం
ఎదగడం ఎవరన ఏడవటం కదలక కరవడం
కలపక కలవరం కలకలం కలపడం గణగణ
గబగబ గలగల గరగర గడవటం గడపడం
గజగజ ఘనఘన చదవటం చకచక జలజల
జరజర టపటప టకటక డబడబ డగడగ
తరతమ తళతళ తడవక తలపక తరలక
తహతహ దడదడ దబదబ ధనధన దశరధ
నడవడ నవశకం నవరసం నరనరం నరహర
నమలటం పడమర పరంపర పకపక పసపస
పటపట పరవశం పరపర బరబర బలవడం
బలవంతం భగభగ మరవక మరలక మడవక
మలమల మనవనం మదగజం మసలడం యనమల
యకశక లకలక లగలగ లబలబ వడకడం
వలవల వదలక షకలక సలసల సహచర
సడలక హరహర కళకళ
వీడియోను వీక్షించడానికి ఇక్కడ నొక్కండి..

మూడక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో

మూడక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో
అలక అరక అమల అటక అచట
అబల అనగ అకట అపర అక్షరం
ఆవల ఆపద ఆవడ ఆనక ఆనప
ఆమడ ఆయన ఆలన ఆసర ఇతర
ఇగర ఇరగ ఇచట ఈదర ఈవల
ఈయన ఉడక ఉదక ఉడత ఉపమ
ఉరక ఉలవ ఊయల ఊహల ఊదర
ఊరక ఎచట ఎడమ ఎకరం ఎసర
ఎదర ఏలన ఏడవ ఏమర ఐదవ
ఔనట కమల కడవ కడవ కడప
కలత కలక కలప కవల కపటం
కనకం కలశం గడప గవద గరళం
గలబ గనక గగనం గమనం గణన
చదరం చరక చమట చవక చవట
చలమ చలక జనప జలజ భజన
జగడం తడవ తగరం తబల తపన
తనయ దవడ దహనం ధవళం నరకం
నడక నయనం నలక నవల పనస
పడక పడవ పలక పరమ పదవ
పసర బడవ బయట బరక బరమ
బంజర మకరం మగధ మందస మడత
మడమ మడవ మసక మరల మరక
యతల లవంగం రగడ రభస రచన
రమణ రక్షణ లగడం లవణం లలన
వనజ వరద వలన వరస వదనం
వచనం వలస శనగ శరభం సరళ
సహనం లక్షణం
వీడియోను వీక్షించడానికి ఇక్కడ నొక్కండి..

విక్రమాదిత్య కథలు - వడ్డికాసుల చెట్టు!

విక్రమాదిత్య కథలు - వడ్డికాసుల చెట్టు!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని  బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ప్రతి ఒక్కసారీ కార్యభంగం కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చదగిందే.

కానీ, లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ, నిగూఢంగానూ వుంటుంది. అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి, ఆత్మబంధువుల మధ్యా, రక్తసంబంధీకుల మధ్యా పరస్పర అనుమానాలూ, ద్వేష భావాలూ కల్పిస్తూంటారు. అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి వుంటారన్న అనుమానం కలుగుతున్నది. ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా వుండేందుకు, జడనాధుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు: భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం. ఇద్దరూ ఎంతో మంచి వారు; దానశీలురు. అడిగినవారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు. ఇంటికొచ్చినవారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి.

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు! ఆ దంపతుల ఒక్కగానొక్క కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యే సరికి, వారికి తాతలనాటి ఇల్లు మినహాయించి ఇంకేమీ మిగల్లేదు. నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నదీ గుణదీపుడికి తెలియదు. వాడు అదే ఊళ్ళోని జడనాధుడనేవాడితో కలిసి దూరప్రాంతాలకు వెళ్ళి, వైద్యవిద్యనభ్యసించాడు. కొడుకు గుణదీపుడికేకాక జడనాధుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడు పంపుతూండేవాడు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భద్రపురం వచ్చేసరికి, గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసివచ్చాయి.

‘‘పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేసి, నాచేతికి చిప్పనిచ్చావు. ఇప్పుడేం చేయాలో నాకు పాలుపోవడం లేదు,’’ అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో. ‘‘నాయనా! సంపదలు మనవెంట రావు. మన మంచి మనలను సర్వదా కాపాడుతుంది.  నీ తండ్రి చేసిన పనులన్నింటి వెనకా, నా ప్రోత్సాహం కూడా వుంది. అది తప్పని నీవనుకుంటే, ఆ తప్పు మా ఇద్దరిదీ. ఇప్పటికీ మనకు వచ్చిన లోటులేదు. నిలువ నీడ వుంది. నువ్వు వైద్యవృత్తి ప్రారంభించావంటే, నీకు బోలెడు ఆదాయం వస్తుంది,’’ అంటూ కొడుకును సముదాయించింది వేదవతి.

గుణదీపుడు వైద్యవృత్తిని స్వీకరించాడు. అంతో ఇంతో ఆదాయం బాగా వస్తున్నా, అతడికి తృప్తిగా వుండేది కాదు. అందుకు కారణం జడనాధుడు. సంవత్సరం తిరక్కుండానే జడనాధుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడన్న పేరు వచ్చింది. వైద్యం కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చే రోగులతో, అతడి ఇల్లు కిటకిటలాడిపోతూండేది. క్రమంగా అతడివద్ద సంపద పెరగసాగింది.  ‘‘నీ డబ్బుతోనే వైద్యవిద్య నేర్చుకుని, నీ కొడుక్కే పోటీగా తయారయ్యాడీ జడనాధుడు! నీ మూలంగా నా ఆస్తీ పోయింది. నేర్చిన వైద్యవిద్యా అక్కరకు రావడం లేదు,’’ అంటూ గుణదీపుడు తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు.

‘‘నాయనా! ఇప్పుడు నీ ఆదాయం తక్కువేంకాదు. వైద్యవృత్తిలో సేవాధర్మమే ప్రధానం. నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు. అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు. నీకు జీవితంలో ఏ లోటూ వుండదు,’’అని మణిదీపుడు, కొడుక్కు హితవు చెప్పాడు కానీ, గుణదీపుడి దృష్టంతా సంపాదన మీదనే వుండేది. అదేమో పెరక్కుండా వుంది! ఈ విషయం ఆ ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి  తెలిసింది. ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు. తనకు మగబిడ్డలు లేనందున, ఆయన యోగ్యుడైన యువకుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని  చూస్తున్నాడు. అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకుని, ‘‘బాబూ!

నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. నీ పూర్వీకులు ఎన్ని దానధర్మాలు చేసినా, మీ కుటుంబం సిరిసంపదలతో వర్థిల్లుతూండేది, అది వారి జాతకబలం. నీ తల్లిదండ్రులు నష్టజాతకులు! వారితో కలిసివుంటే నీకు ఏమీ  అచ్చిరాదు. నా కూతుర్ని పెళ్ళిచేసుకో. నా ఇంటికి ఇల్లరికం వచ్చేయి. నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు,’’అంటూ తనకు అనుకూలంగానూ, అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు. ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి. అటుపైన రత్నమాల అందం కూడా అతణ్ణి ఆకర్షించింది. తానామెను పెళ్ళాడాలనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. అందుకు వాళ్ళు, ‘‘నాయనా! నీవు పెద్దవాడివయ్యావు. నీ మంచిచెడ్డలు నీకే బాగా తెలుసు. మేము నిన్ను దీవిస్తున్నాం!’’ అన్నారు.

దీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి, ‘‘మీకిప్పుడు బొత్తిగా ఆదాయం లేదు. కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద వుంది. నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే, లోకులు నన్ను దుమ్మెత్తిపొయ్యరా?’’అని అడిగాడు. మణిదీపుడు నవ్వి, ‘‘లోకాపవాదుకు భయపడి, నీవు మమ్మల్ని చేరదీయవద్దు. మా గురించి నీకు ఏ బెంగా వద్దు. నారు పోసినవాడే నీరూ పోస్తాడు,’’ అన్నాడు  గుణదీపుడు, రత్నమాలను పెళ్ళిచేసుకుని, అత్తవారింటికి  వెళ్ళిపోయాడు. ఈ లోగా జడనాధుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది. అతడు వారిని చూడబోతే వాళ్ళు, ‘‘మేము సుఖంగా వున్నాం. మా అబ్బాయి ఎంత బ్రతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు. మా కట్టెలు, ఈ ఇంటనే వెళ్ళిపోవాలని మా కోరిక!’’ అంటూ, పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు.

జడనాధుడు కొద్దిక్షణాలు మౌనంగా వూరుకుని, ‘‘నేనిక్కడికి స్వార్థంతో వచ్చాను. మీ పెరట్లో ఒక చెట్టు వుంది. దాని పేరు ఎవరికీ తెలియదు. అయితే, ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని, నాకు తెలిసింది. అది ఏడాది పొడుగునా కాయలు కాస్తూనే వుంటుంది గదా. ఒక్కోకాయ పది బంగారు కాసుల విలువచేస్తుంది. ఐతే, అంత ధర నేనివ్వలేను.  మీరు  రోజూ నాకు ఒక కాయ ఇస్తే, నేను మీకు ఒక్క బంగారు కాసు ఇవ్వగలను. మీరు జీవించి ఉన్నంతకాలం,  ఆ చెట్టు కాయలు మరెవరికీ అమ్మబోమనీ, ప్రతిరోజూ నాకొకకాయ తప్పక అమ్మగలమనీ పత్రం రాసి ఇస్తే, నాకెంతో మేలుచేసినవారౌతారు,’’ అని చెప్పాడు.

మణిదీపుడు ఆలోచనలో పడి, ‘‘నీవు చెప్పేవరకూ నాకు మా చెట్టుకాయల విలువ  తెలియదు. వాటిని నీవడిగిన ధరకు తప్పక ఇవ్వగలను. కానీ నేను నీకు పత్రమెందుకు రాయాలో తెలియడంలేదు,’’ అన్నాడు. ‘‘అయ్యా! ఈ కాయల విలువ బయటి వాళ్ళకు తెలిస్తే ప్రమాదం. వాటిని అమ్మమని చాలామంది అడుగుతారు.  ఆ కాయలను  ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది; మరొకరకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా కాగలదు.  ఇవి నావంటివాడి చేతిలో వుంటేనే దురుపయోగం కాకుండా వుంటాయి. మీరు పత్రం రాయడం వల్ల, మీపై వేరెవరూ ఒత్తిడిచేసే అవకాశం లేదు,’’ అని జడనాధుడు వివరించి చెప్పాడు. మణిదీపుడు, జడనాధుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు. ఆ రోజు నుంచీ మణిదీపుడి దశ తిరిగింది. ఆయన తను సుఖంగా తింటూ, అవసరంలో వున్నవారిని ఆదుకుంటూ, ఎప్పటిలా పరోపకారం కొనసాగిస్తున్నాడు.

తండ్రి పరిస్థితి మళ్ళీ మెరుగుపడినట్టు గ్రహించిన గుణదీపుడు, కారణం అర్థంకాక సతమతమయ్యాడు. అతడి భార్య రత్నమాల, అతడితో, ‘‘నీ తండ్రి నిన్ను మోసం చేశాడు. ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా వుండి వుంటుంది. ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అందులో వాటా అడుగు,’’ అంటూ రెచ్చగొట్టింది.

గుణదీపుడు, తండ్రిని కలుసుకుని, ఆస్తివిషయమై నిలదీశాడు. మణిదీపుడికి  పెరటిచెట్టు కాయల విషయం చెప్పక తప్పలేదు. ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోకి పరిగెత్తి, అవి వేల సంఖ్యలో వుండడంతో గుండెలు బాదుకుని, ‘‘ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచడమేకాక, నాతో సంప్రదించకుండా కాయల గురించి పత్రం కూడా రాశావు.  ఇది చాలా అన్యాయం.  నా వాటాకోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను,’’ అంటూ గొడవ చేశాడు. ఈ సంగతి గ్రామాధికారిదాకా వెళ్ళడం ఇష్టంలేక, మణిదీపుడు, జడనాధుడికి కబురు పెట్టాడు. అతడు వచ్చి సంగతి తెలుసుకుని, ‘‘గుణదీపుడి మాటల్లో న్యాయముంది. నేనొక ఉపాయం చెబుతాను. ఈ చెట్టు కాయల్లో నాలుగువేల కాయలను తీసుకుని వెళతాను.

అందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున, పదకొండు సంవత్సరాలు ఇవ్వాల్సి వుంటుంది. అయితే, కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి, మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది. అందువల్ల నేను, మీరు  జీవించి వున్నంతకాలం రోజుకొక్క బంగారు కాసు ఇచ్చుకుంటాను. ఈ రోజు నుంచీ, ఈ చెట్టుపైనా, దాని కాయలపైనా సర్వాధికారాలు గుణధీపుడికే విడిచిపెడదాం,’’ అన్నాడు మణిదీపుడితో.  ఇది గుణదీపుడికీ నచ్చింది. ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే, ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే  ఎలాంటి గుణం లేదన్నారు వైద్యులు. చివరకు గుణదీపుడు, జడనాధుడి వద్దకే వెళ్ళి, ‘‘నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో,’’ అన్నాడు. జడనాధుడు నవ్వి, ‘‘ఆ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను?’’ అన్నాడు.

‘‘అవి పిచ్చికాయలా?  వాటికేగా నువ్వు కాయకు బంగారుకాసు చొప్పున వెల గట్టావు!’’ అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా. ‘‘నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే, ఆ కాయలు నాకు విలువైనవి. మీ పెరటిచెట్టు వడ్డికాసుల చెట్టు! నీతండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయలనది కాస్తుంది!’’ అన్నాడు జడనాధుడు. ఆ జవాబుకు గుణదీపుడి ముఖం వెల వెలపోయింది. అతడు తలవంచుకుని కొంతసేపు మౌనంగా వూరుకుని, ‘‘జడనాధా! నువ్వు మా కుటుంబ విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు. ఏమైనా నాకళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు!’’ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! వైద్య విద్య పూర్తిచేసి తిరిగివచ్చినప్పటి నుంచీ, మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాధుడి ప్రవర్తన విచిత్రంగానూ, నిగూఢంగానూ వున్నట్టు తెలుస్తూనే వున్నది కదా?  తన సహాధ్యాయి అయిన గుణదీపుడు, తల్లిదండ్రుల పట్ల కనబరుస్తున్న నిరాదరణ, జడనాధుడికి తెలియంది కాదు. ఐనా, అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించ లేదు. వైద్య వృత్తిలో తనకు మితిమించిన సంపాదన వున్నది గనక, మణిదీపుడి పెరటిచెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్టు కనబడుతున్నది. అది తను వైద్యవిద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాదా, కృతఘ్నతా అనిపించుకుంటుంది గదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,’’ అన్నాడు.

దానికి విక్రమార్కుడు, ‘‘జడనాధుడి ప్రవర్తనలో విచిత్రం, నిగూఢత కాక; ఆర్థికంగా, మానసికంగా స్థాయీభేదాల్లో వుండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసులు కోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతున్నది. ఎంత నిరాదరణకు గురైనా నిర్మల మనస్కు లైన తల్లిదండ్రులు, తమ కన్నబిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు. ఆ కారణం వల్లనే మణిదీపుడు, జడనాధుడితో - మా అబ్బాయి  ఎంత బతిమాలినా, వాడి దగ్గరకు వెళ్ళడం లేదు, అన్నాడు.

అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక, తనకు మేలు చేసినవారి పట్ల కృతజ్ఞత కనబరచడానికి, జడనాధుడు పెరటిచెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి,  మణిదీపుడికి సాయపడ్డాడు. ఆ తర్వాత, గుణదీపుడు చెట్టుకాయలకు తోచిన వెలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాధుడు - నీతండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు. ఆ జవాబుతో, జరిగిన వాస్తవం, తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ, ఏమిటో గ్రహించిన గుణదీపుడు, నా కళ్ళు తెరిపించావంటూ కృతజ్ఞత చెప్పుకుని వెళ్ళి పోయాడు,’’ అన్నాడు.  రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

రెండు అక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో

రెండు అక్షరాల సరళ పదాలు మరియు వీడియో
అర ఆట ఆడ ఆన ఆవ ఆశ
ఆహ ఇల ఇక ఇంట ఇహం ఈక
ఈగ ఈత ఈడ ఈశ ఈల ఈట
ఉమ ఉప ఉపం ఉష ఊడ ఊక
ఊచ ఊబ ఊర ఊహ ఎద ఎడం
ఎల ఎర ఏక ఏత ఏట ఏడ
ఎంత ఏల ఐన ఐస ఒర ఒక
ఓడ ఓర ఔర కల కండ కడ
కఫం కథ కరం గద గడ గళం
చంప జగం జడ జత జనం జల
తల తరం తడ తన తమ దడ
దండ దళం ధనం దయ నగ నట
నరం నవ నస నల పగ పటం
పద పర పస బస బండ బంక
మగ మఠం మంగ మండ మతం మంద
మన మలం మమ యమ రమ రసం
రణం లత లంక లవం లయ లక్ష
వడ వంద వనం వరం వల వంట
వస శకం శత శరం సగం సన
సమం సహ హలం హర హంస క్షమ
క్షయ క్షణం ఱంపం
వీడియోను వీక్షించడారనికి ఇక్కడ నొక్కండి...

మూసుకోకురా కళ్ళు మూసుకోకురా కోవిద్-19 పాట,రచన : శ్రీ రమేశ్ గోస్కుల గారు, పాడినవారు : ఐ. వసంత టీచర్

మూసుకోకురా కళ్ళు మూసుకోకురా

కోవిద్-19 పాట    
రచన :  శ్రీ రమేశ్ గోస్కుల గారు
పాడినవారు : ఐ. వసంత టీచర్


మూసుకోకురా కళ్ళు మూసుకోకురా
కళ్ళు మూసి లోకమంతా కూల్చబోకురా 


గడపదాటితే చాలు గండమైతది
గండమై బ్రతుకు సుడి గుండమైతది
విను సోదరా జర విను సోదరి
వినకుంటే చీకట్లు ముంచి వేయురా
 
మూసుకోకురాఖండాలు దాటుతూ గుండెల్నిపిండుతూ
మహమ్మారి కరోనా మైకాన ముంచును
ఉసురుతీయును ఉప్పు పాతరేయునూ
ఉన్నచోట ఉంటే మీకు మేలు జరుగును
చెప్పినట్లు వింటె నీదె దేశ సేవరా
చేరువైతే మనకు ఎంతో ముప్పు వచ్చురా

మూసుకోకురా

చైనాను దాటింది ఇటలీని కూల్చింది
మన దేశం చేరింది మనల బాధ పెడుతుంది
పేద ధనిక తేడా లేదు షేక్ హాండ్ ఇస్తే చాలు
మందులేని వీడిపోని మాయదారి మహమ్మారి
కళ్ళు తెరిచి ఉన్న కూడా మాటు వేసి కాటు వేయు
దూరాన్ని పాటించు రోగాన్ని ఓడించు

మూసుకోకురా


దొంగలాగ నిన్ను చేరి దొరలాగా మారురా
చుట్టు చేరినోళ్ళనంతా చుట్టి మట్టు పెట్టురా
మాస్కు కట్టరా ముక్కు నోరు దాయరా
శుభ్రతను పాటించి వైరస్ ను తరమరా
దగ్గు,జలుబు వస్తే డాక్టర్లా కలువరా
క్వారంటైన్ తో నీవు ఆరోగ్యం పొందరా!స్వీయ పరిశుభ్రతను పాటించండి
కరోనాను తరిమి తరిమికొట్టండి
ధన్యవాదములు


తెనాలి రామకృష్ణ కథలు - 18 అత్యంత మూర్ఖుడు

తెనాలి రామకృష్ణ కథలు - 18
అత్యంత మూర్ఖుడు

కృష్ణదేవరాయల మహారాజు ఆస్దానంలో ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరిగేది. పాల్గొనే వారందరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఆ సంవత్సరానికిగానూ అత్యంత ముర్ఖుడు అనే బిరుదునిచ్చి 5000 వరాహాలు బహుమానంగా అందజేసేవారు. ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి 5000 వరాహాలు ఎగరేసుకు పోయేవాడు. ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్ధానకవులు, అధికారులు అతని వద్ద పనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు. ఆ కుర్రాడు అలాగే చేశాడు.

పోటీ అయిపోయిన తర్వాత రామలింగడు సభకు చేరుకున్నాడు. "ఇదేమిటి రామలింగా! నీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావు" అని అడిగాడు కృష్ణదేవరాయలు. "ప్రభూ! నాకు వంద వరహాలు అవసరమయ్యాయి. వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది" అని జవాబిచ్చాడు రామలింగడు.

"నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే 5000 వరహాలు సంపాదించేవాడివి కదా! వంద వరహాలు కోసం 5000 వరహాలు కాదనుకున్నావు" అన్నాడు మహారాజు. "ప్రభూ! నేనొక పెద్ద మూర్ఖుడిని" అన్నాడు రామలింగడు. బదులుగా మహారాజు "నువ్వు అత్యంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనే లేదు" అన్నాడు.

"అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట!" అని ఎగిరి గంతేశాడు రామలింగడు. అప్పటికి గాని రాజుగారికి తను నోరుజారానని అర్ధం కాలేదు. కాని రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు. మరోసారి రామలింగడే అందరికన్నా తెలివైన మూర్ఖుడని రాయలవారి ఆస్ధానంలో నిరూపితమైంది.

ప్రశ్న: చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

ప్రశ్న: చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

జవాబు :
 చలికాలము లో దోమలు ఎక్కడికీ పోవు . చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరనము సరిపోక దోమలు ఎటో పారిపోతాయనుకుంటాము కాని నిజానికి అవి ప్రతికూల పరిస్థితులనుండి  తప్పించుకునేందుకు దాక్కుంటాయి. ఎక్కువగా ..వేడిగా ఉన్న మన బెడ్ రూములలోనే నివాసాలు ఏర్పరచుకుంటాయి. వీలైతే మనకు కుట్టడానికి ప్రయత్నిస్తాయి. చలికాలము ముందు పెట్టిన గుడ్లు పొదగబడక అలాగే ఉంటాయి. ప్యూపా దశకు చేరినవి అలాగే నిలబడతాయి.  ఇక పెడ్ద దోమలయితే గోడలకు అంటిపెట్టుకుని అటూ ఇటూ ఎగరక శరీరములో నిలువ చేసునివున్న శక్తిని వినియోగించుకుటాయి. తిరిగి చల్లని ఉష్ణోగ్రత పోయి అనుకూల పరిస్థితులు రాగానే గుడ్లు , ప్యూపాల నుండి దోమలు పుట్టుకొస్తాయి.

విక్రమాదిత్య కథలు - నాగదేవత

విక్రమాదిత్య కథలు
నాగదేవత

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా, నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే.కాని, కార్యం ఫలించనున్న తరుణంలో, ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగావుండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమతెలియకుండా, విను, '' అంటూ ఇలా చెప్పసాగాడు:

ధర్మాంగదుడు, విశ్వనాధుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు.అయితే, వారిస్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు. దొంగ పత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆ…యన, ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టుపెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ మూడువేల వరహాలయిందనీ, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాననీ కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని, భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయాధికారి కాసేపాలోచించి, ‘‘ఏ నేరంపైన అయినా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివనీ తెలుసు, భూష…య్య మోసగాడనీ తెలుసు. అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే, నీవువెయ్యి వరహాలు ధరావతు కట్టాలి. ఎవరైనా నీగురించి హామీ ఇవ్వాలి,'' అన్నాడు.

అప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బులేదు. అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకింతో అంతో పరపతివుంది కాబట్టి అప్పు పుడుతుందను కున్నాడు. కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి, ఎవరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు.
ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాధుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు. అయితే, అదే సమయంలో విశ్వనాధుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్ళి సంబంధం వచ్చింది. పెళ్ళి ఖర్చులకు అయిదు వేల వరహాలదాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసం విశ్వనాధుడు శతవిధాల ప్రయత్నిస్తూంటే భూషయ్య అతణ్ణి కలుసుకుని, ‘‘నీకు నేను సాయపడతాను. బదులుగా నువ్వు నాకు సాయపడాలి,'' అన్నాడు.

విశ్వనాధుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగదుడి విషయంలో హామీవుండడానికి నిరాకరించాడు. ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలం భూషయ్య పాలయింది.అప్పుడు ధర్మాంగదుడికి, భూషయ్య మీదకంటే విశ్వనాధుడి మీద ఎక్కువ కోపం వచ్చింది. ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకు డనిపించుకుని ఉరికంకంబ మెక్కాల్సివస్తుంది.

పోనీ, విశ్వనాధుణ్ణి కసితీరాకొడదామన్నా - అప్పుడూ అందరూ తనను పరమదుష్టుడని అసహ్యించుకుంటారు! విశ్వనాధుడి మీద పగతీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు, ఊరిచివర కొండగుహలో వుండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడనీ, ఆయన మహిమలు చేయగలడనీ అంతా చెప్పుకుంటారు. బైరాగి, ధర్మాంగదుడు చెప్పింది విని, ‘‘తన స్వార్థంకొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాధుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాధుడికి అపకారం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వూ మంచి మిత్రుడివి కావు!'' అన్నాడు.

‘‘స్వామీ, అపకారం చేసింది విశ్వనాధుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవడం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను,'' అన్నాడు ధర్మాంగదుడు. ‘‘ఇప్పుడు నీ మనసునిండా పగవుంది. పాముకు విషమెలాంటిదో, మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నీవు పగను విడిచి పెట్టిరా. అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం,'' అన్నాడు బైరాగి. ‘‘స్వామీ! నామనసులోని పగపోయే మార్గం కూడా, మీరే చెప్పండి. ఆ పగ ఉధృతాన్ని తట్టు కోలేకుండావున్నాను,'' అన్నాడు ధర్మాంగదుడు.

బైరాగి కొద్దిసేపు ఆలోచించి, ‘‘అయితే విను. నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగ అంతా విషంగా మారి, నీతలలో చేరుతుంది. ఆ విషం బారినుంచి బయట పడగానే, నీకు తిరిగి మనిషిరూపు వస్తుంది. పాము రూపంలో వున్నంత కాలం నీకు పూర్వజ్ఞానం వుంటుంది కానీ, బుద్ధులు మాత్రం పామువే వుంటాయి. ఎటొచ్చీ పాము రూపంలో వుండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రం ఆరూపంలోనే మరణిస్తావు!'' అన్నాడు. ధర్మాంగదుడు మారాలోచనలేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతణ్ణి పాముగా మార్చేశాడు.పాముగా మారిన ధర్మాంగదుడు, అక్కణ్ణించి పాకుతూ పొలాలవైపు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కరన్రు నేలకు తాటిస్తూ వస్తూంటే, దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది.

అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి, ధర్మాంగదుడితో, ‘‘నువ్వా మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడడం మనకు ప్రమాదం అని తెలుసుగదా!'' అన్నది. ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు. తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషివల్ల అపకారం జరిగినా, ప్రాణప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది, ధర్మాంగదుడికి. కానీ విశ్వనాధుడు తన శత్రువు. అతణ్ణి మాత్రం కాటువేయాలి. అప్పుడు విశ్వనాధుడి ప్రాణాలు పోతాయి. తనకు శిక్షావుండదు!

ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకుని, ఎవరికంటా పడకుండా విశ్వనాధుడి ఇల్లు చేరాడు. ఇంట్లోని ముందరిగదిలో విశ్వనాధుడి కొడుకు ఆరేళ్ళవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగదుణ్ణి చూడనే చూశాడు. వెంటనే భయంతో, ‘‘పాము!'' అని గట్టిగా అరిచాడు. ఆ కురవ్రాణ్ణి కాటేసి విశ్వనాధుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు కానీ, తనకే అపకారమూ చేయనివాడి జోలికి వెళ్ళడం తప్పని, అతడికి అనిపించింది. అందుకని అక్కణ్ణించి చరచరా పాక్కుంటూ పూజగదిలోకి దూరాడు.

ఇంతలో ఇంటిల్లపాదీ విశ్వనాధుడి కొడుకు చుట్టూ చేరారు. వాడు చెప్పిందివిని, అంతా పూజగదిలోకి వెళ్ళారు. చూస్తే, అక్కడ పూజామందిరంలో, పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు. ‘‘నాగదేవత! కళ్ళు మూసుకుని నమస్కరించండి. ఎవరికీ ఏ అపకారమూ జరగదు! ఈ రోజుతో మనకూ, మనవాళ్ళకూ వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగి పోవాలని నాగదేవతకు మొక్కుకో నాయనా,'' అన్నది విశ్వనాధుడి తల్లి. అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పామురూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కి పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు.

‘‘ఛీ! నాయీ విషంవల్ల ఏ ప్రయోజనమూ లేదు,'' అనుకుంటూ ధర్మాంగదుడు తనకోరలతో పూజామందిరాన్ని కాటువేశాడు. కోరల విషం బ…యట పడగానే, అతడి పాము రూపంనశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు. అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే వుండడంతో తనూ లేచి వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాధుడి తల్లి, మందిరంలో నాగదేవత మాయంకావడం చూసి, మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్ళి పాముపుట్టలో పాలు పోసివచ్చేది.

ఎలాంటి కష్టాలు వచ్చినా, నాగదేవత కరుణవల్ల తొలిగి పోతాయని కొడుకుకు చెపుతూండేది. విశ్వనాధుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి, పక్కనేవున్న ధర్మాంగదుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలి…యక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగదుడు, ‘‘మిత్రమా! నీ అవసరం నీచేత చేయించిన పనివల్ల, నాకు పొలం పోయింది. అంత మాత్రాన, అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగాలేను,'' అన్నాడు.

ఈ మాటలకు విశ్వనాధుడితో పాటు, అతడి కుటుంబం వారందరూ ధర్మాంగదుణ్ణి ఆకాశాని కెత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వారందరు కూడా, ధర్మాంగదుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా, ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దు కున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! విశ్వనాధుడు, ధర్మాంగదుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా వుంటూ, ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ, అతడికి సహాయం నిరాకరించాడు.అటువంటి మిత్రద్రోహి మీద పగసాధించేందుకు ధర్మాంగదుడు, మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు గదా? కానీ, పూజామందిరంలో అవకాశం వున్నా అతడు, విశ్వనాధుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకూ, పాముగా అతడి ప్రవర్తనకూ పొంతన వున్నట్టు లేదుకదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,'' అన్నాడు.

దానికి విక్రమార్కుడు, ‘‘మనుషులలాగే పశుపక్ష్యాదులక్కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావమంటూ ఒకటి వుంటుంది. ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఊహాపోహలతో, పాములకు తను సహజంగా వున్నవనుకుంటున్న దుష్టస్వభావం, పగల గురించి ఆలోచించాడు. బైరాగి, అతడికి పాముగా పూర్వ జ్ఞానం వుంటుందనీ, బుద్ధిమాత్రం పాములదేననీ చెప్పాడు! ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు, ఆ పాము - పాములు తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించు కుంటాయనీ, వాటికి పగ అన్నది తెలి…యదనీ చెప్పింది.

ఆ సమయాన, బుద్ధి విషయంలో పాముల స్థాయిలో వున్న ధర్మాంగదుడికి, అది ఆచరించదగిందిగా తోచింది. పైగా, విశ్వనాధుడు, ధర్మాంగదుడు మిత్రులే. అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే, ఆ సమయంలో విశ్వనాధుడు కూడా తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్ళి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండడం వల్ల, స్నేహితుడు కోరిన సాయం చేయలేక పో…యాడు. అయితే, ధర్మాంగదుడు అది గ్రహించలేక, ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజగదిలో పామును చూడగానే విశ్వనాధుడి తల్లి అన్నమాటలతో ధర్మాంగదుడికి తన పొరబాటు తెలియవచ్చింది. అందువల్లనే, అతడు విశ్వనాధుణ్ణి కాటువేయలేదు,'' అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

2, ఏప్రిల్ 2020, గురువారం

తెనాలి రామకృష్ణ కథలు - 17 సోమరి పని

తెనాలి రామకృష్ణ కథలు - 17
సోమరి పని

సభలో కొలువుతీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది. వినయంగా నమస్కరించి ''అయ్యా, మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు పాండయ్య. యుక్తవయసు కూడా వచ్చింది. ఇప్పటికీ మా కష్టంతోనే వాడ్ని పోషించాల్సి వస్తోంది. ఏ పనికి వెళ్లమన్నా వెళ్లడు. బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. వాడి తోటివాళ్ళంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు. వాడికి మీరే బుద్ధి చెప్పి, దారిలో పెట్టాలి'' అని వేడుకున్నారు.

శ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు. అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు.

''ఏంటి పాండయ్యా! ఏ పనీ చెయ్యకుండా కాలక్షేపం చేస్తే ఎలా? ఏదైనా పని చెయ్యాలి కదా?'' అడిగారు రాయలువారు.

''అయ్యా! నాదేం తప్పులేదు. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పట్నించీ పని చేయనీయకుండా గారాబంగా పెంచారు. ఇప్పుడు చేద్దామనుకున్నా పనిరాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు'' చెప్పాడు పాండయ్య.

''నేను నిన్ను పనిలో పెట్టుకుంటా'' అని చెప్పి... భటులతో ''వీడ్ని తీసుకెళ్లి గుర్రపు శాలలో లద్దె ఎత్తించండి'' ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు. భటులు పాండయ్యని తీసుకెళ్లారు.''మీకేం భయం లేదు. సోమరితనం పోయి మీవాడు మంచి పనిమంతుడవుతాడు. నిశ్చింతగా ఇంటికెళ్లండి'' అభయమిచ్చాడు

 శ్రీకృష్ణదేవరాయలు. దండంపెట్టి వెళ్లిపోయారా దంపతులు.


తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య. ఆనందంగా గుర్రపుశాలలోకి అడుగెట్టాడు. తీరా చూస్తే అదంతా చిందర వందరగా, అసహ్యంగా ఉంది. ''నేనీ పని చెయ్యను. వెళ్లిపోతాను'' అని పేచీ పెట్టాడు.''లద్దె ఎత్తి, పెంటదిబ్బ మీద పడేసి, గుర్రపుశాలను శుభ్రంగా ఉంచుతావో, పనిచేయకుండా రోజుకో వంద కొరడాదెబ్బలు తింటావో నీ ఇష్టం. నిర్ణయించుకో... ఇది రాజుగారి ఆజ్ఞ'' అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య.

''లద్దే ఎత్తుతాను. కొరడా దెబ్బలంటేనే భయమేస్తుంది. అసలే గారబంగా పెరిగాను'' అని తట్ట తీసుకుని లద్దె ఎత్తడం మొదలు పెట్టాడు పాండయ్య.

ఒక గుర్రం దగ్గర లద్దె ఎత్తుతుంటే అందులో ఒక వరహా కనిపించింది. చప్పుడు చేయకుండా, ఎవరికీ కనిపించకుండా గబాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య. ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. కాని దొరకలేదు. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిడండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరహా ఇచ్చాడు. పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది. మరుసటి రోజు తెల్లవారు జామునే గుర్రపుశాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహా కనిపించింది. దాన్నీ జేబులో వేసుకుని, గుర్రపుశాలంతా శుభ్రం చేశాడు. అక్కడ దొరికే వరహాల కోసం, జ్వరం వచ్చినా, నలతగా ఉన్నా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా గుర్రపుశాలకు వెళ్లేవాడు. ఆ వరహా మరెవరికన్నా దొరుకుతుందేమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పనిచేయసాగాడు. ఇప్పుడు పాండయ్యకి పని ఓ వ్యసనంగా మారింది. ఖాళీగా ఉండాలన్నా ఉండలేక పోతున్నాడు. వరహా దొరక్కపోయినా సరే ఎప్పటిలాగే పనిచేయసాగాడు. అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం పనిచేశాడు.

ఆ రోజు పనికెళ్లిన పాండయ్యతో ''ఇంక నువ్విక్కడ పని చేయనవసరం లేదు. ఇంటికెళ్లి పోవచ్చు'' అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య. పాండయ్య బేర్‌మన్నాడు. ఇంటికెళ్లి జరిగిన విషయమంతా చెప్పి వెక్కివెక్కి ఏడ్చాడు. రాజుగారిని అడుగుదామని ముగ్గురూ సభకు వెళ్లారు.

''అయ్యా! మావాడు పనిచేసిన ప్రతిరోజూ గుర్రపుశాలలో ఒక వరహా దొరికింది. వరహా కోసం వాడు రోజూ పనికి వెళ్లాడు. ఈ వరహాలన్నీ మీ గుర్రపుశాలలో దొరికాయి. కాబట్టి అవన్నీ మీకే చెందాలి. మొదటి రోజే ఇద్దామనుకున్నాను. కాని మావాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు'' అని మూడు వందల అరవై ఐదు వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు. రాయలు చిన్నగా నవ్వాడు. ''తమరివల్ల మావాడి సోమరితనం పోయింది. పని లేకపోతే, పిచ్చివాడై పోతున్నాడు. ఇలా అర్థాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు. దయచేసి, ఏదో ఒక పని ఇప్పించి, మా కుటుంబాన్ని ఆదుకోండి'' అని వినయంగా నమస్కరించారా దంపతులు. శ్రీకృష్ణదేవరాయలు విలాసంగా నవ్వి ''మీ వాడికి వరహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను. ప్రతిఫలం లేకపోతే ఎవరూ పనిచేయరు. ఆ వరహాలన్నీ మీవే. పాండయ్య ఇంతకాలం పని చేసినందుకు ప్రతిఫలం. వాటితో భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ బతకండి. చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు. కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరికి తెచ్చారు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను'' అని చెప్పాడు.

ప్రశ్న : నల్లేరు పై బండి నడక అంటే ఏమిటి?

ప్రశ్న : నల్లేరు పై బండి నడక అంటే ఏమిటి?

జవాబు :
నల్లేరు మీద నడక---అతి సులబమైన పని అని అర్థం.
వివరణ:..... బండి నడిచే దారిలో నల్లేరు అడ్డంగా వుంటే బండి నడకకు అడ్డమేమి కాదు. దాన్ని తొక్కు కుంటూ అతి సులబంగా బండి పెళ్లి పోతుంది. గ్రామాలలో రహదారులు తినంగా ఉండక బాగా గోతులతో అధ్వాన్నము గా ఉండేవి . అటువంటి గోగులలో బండి నడకకు అవరోధము గా ఉన్నాప్పుడు ఆ గోతులలొ నల్లేరును పడేసేవారు. ఆ తీగలను వేయడం ద్వారా బండి నడక సాఫీగా సాగిపోవడము వల్ల ... అనాయాసం గా జరిగే కార్యాలకు ఆవిధంగా " నల్లేరు పై బండి నడక " అనడం అలవాటుగా మారింది.

విక్రమాదిత్య కథలు - స్వార్థంలో నిస్వార్థం

విక్రమాదిత్య కథలు
స్వార్థంలో నిస్వార్థం

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు స్వార్థం కోసం ఇలా కష్టపడుతున్నావో, లేక నిస్వార్థ చింతనతో ఇంతగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు.

అయితే, లోక వ్యవహారాలను నిశితంగా పరిశీలించి చూసినట్టయితే స్వార్థం కేంద్రబిందువు గానే మానవులందరూ ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. నిస్వార్థం, పరార్థం, పరులహితం ఇవన్నీ పైపై తొడుగులుగా, అమాయకులను మభ్యపెట్టడానికి నయవంచకులు వాడే మాట లుగా మాత్రమే కనిపిస్తాయి.

ఇందుకు ఉదాహరణగా సజీవుడనే వైద్యుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,'' అంటూ ఇలా చెప్పసాగాడు: విరూపదేశంలోని రసపురమనే చిన్న పట్టణంలో ఉండే రత్నాంగుడనే వ్యాపారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళిళై్ళ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. చివరివాడు సజీవుడికి ఇరవై ఏళ్ళొచ్చినా వ్యాపారమంటే ఆసక్తిలేదు సరికదా-అడిగినవారికి లేదనకుండా ధనసాయం చేసేదయూ గుణం ఉంది.

 పిన్నలూ, పెద్దలూ అందరూ అతడితో స్నేహంచేసి నాలుగు మంచి మాటలు చెప్పి డబ్బడిగి తీసుకువెళ్ళేవారు. అది ఇంట్లో ఎవరికీ నచ్చేదికాదు. కొడుకునెలా మార్చాలా అని రత్నాంగుడు దిగులు పడితే, పెళ్ళి చేస్తే మార్పురావచ్చునని భార్య చెప్పింది. విషయం తెలిసిన రత్నాంగుడి స్నేహితుడొకడు, ‘‘సజీవుడిది జాలిగుండే కాని లోకజ్ఞానం లేదు.

నా కూతురు మనోరమకు జాలిగుండె, లోకజ్ఞానంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి. ఆమెతో పెళ్ళి జరిపిస్తే మీవాణ్ణి దారిలో పెడుతుంది,'' అన్నాడు. ఆ విధంగా త్వరలోనే మనోరమ సజీవుడి భార్య అయింది. తండ్రి మాటలు నిజం చేస్తూ ఆమె పెళ్ళయిన కొన్ని రోజులకే భర్తను కొంగున ముడేసుకుంది. ఒక రోజున భర్తతో, ‘‘నువ్వు మంచి మనసుతో దానాలు చేస్తున్నా, అవి పుచ్చుకున్న వారిలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని ఇంట్లో అంతా అంటున్నారు.

అది నిజం కాదని రుజువు చెయ్యి. లేదా నీ పద్ధతి మార్చుకుని ఇంట్లోవారిని సంతోషపరుచు,'' అన్నదామె. సజీవుడది సవాలుగా తీసుకుని, ముందుగా సంజయుడింటికి వెళ్ళాడు. అప్పుడు సంజయుడు తన ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు. సజీవుణ్ణి చూడగానే, ‘‘నువ్విచ్చిన డబ్బుతో చాలా కాలం తరవాత నిన్ననే మా ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం.

మేమంతా బావున్నాం కాని మితిమీరి తిన్న మా నాన్నకూ, నా చిన్న కొడుక్కూ అజీర్ణం చేసింది. వైద్యుడు మందిస్తే అబ్బాయికి నయమయింది కాని, నాన్నకింకా తగ్గలేదని మూడు రోజులు కటిక లంఖణాలు చేయమన్నాడు వైద్యుడు.

నాన్న ఉక్రోషంతో డబ్బిచ్చిన నిన్నూ, పిండి వంటలు చేయించిన నన్నూ నోటి కొచ్చినట్టు తిడుతున్నాడు,'' అన్నాడు దీనంగా. ఇంట్లో వాళ్ళ మాట నిజమయిందని నిరుత్సాహపడినా, అందరి విషయంలోనూ అలాగే జరగదన్న నమ్మకంతో, సజీవుడు అక్కడి నుంచి సుగ్రీవుడింటికి బయలుదేరాడు. గుమ్మంలోనే ఆ ఇంటివాళ్ళ తిట్లు వినిపించాయి.

జరిగిందేమిటంటే-కూతురికీవేళ పెళ్ళిచూపులని నిన్ననే సుగ్రీవుడతణ్ణి నూరు వరహాలడిగి పట్టుకెళ్ళాడు. ఈ రోజు అతడి కూతురికి ఒళ్ళెరుగని జ్వరం వచ్చింది. చూడ్డానికి వచ్చిన మగపెళ్ళివారు పిల్లరోగిష్టిదని చిరాకు పడి వెళ్ళిపోయూరు. సంబంధం మంచిదనీ, సజీవుడి డబ్బు అందిన వేళ అచ్చిరాకనే అది తమకు కాకుండా పోయిందనీ ఇంట్లోవాళ్ళు తిట్టుకుంటున్నారు.

వెనక్కు తిరిగిన సజీవుడు మరో నాలుగిళ్ళకు వెళితే అన్ని చోట్లా అదే పరిస్థితి. ఏకారణంవల్లనైతేనేం, తన సాయం పొందినవారెవ్వరూ సంతోషంగా లేరని గ్రహించి సజీవుడు ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పి, ‘‘స్నేహితులను సంతోషంగా ఉంచడానికి నాది సరైన పద్ధతి కాకపోతేనేం? నావల్ల వారి అవసరాలు తీరుతున్నాయి. అంతకంటే మంచి పద్ధతి ఉంటే చెప్పమను. తప్పక అనుసరిస్తాను,'' అన్నాడు. మనోరమ వెంటనే, ‘‘అయితే నేను చెప్పినట్టు చెయ్‌.

మనిషికి నిజమైన సంతోషాన్నిచ్చేది ఆరోగ్యం. ఆరోగ్యం లేనివాడికి ఎన్ని సంపదలున్నా సంతోషముండదు. నీ స్నేహితులకూ, తెలిసినవారికీ నిజమైన సుఖసంతోషాలివ్వాలనుకుంటే నువ్వు వైద్యం నేర్చుకో. ఉన్నవారివద్ద డబ్బు తీసుకో. లేనివారికి ఉచితంగా వైద్యం చెయ్‌,'' అన్నది. ‘‘వైద్యం నేర్చుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుందికదా?'' అన్నాడు సజీవుడు.

‘‘బృహదరణ్యంలో ఆసవుడనే తపస్వి అర్హతగల శిష్యుడికి ఒక్క సంవత్సరంలో వైద్యం నేర్పగలడట. నువ్వు అక్కడికి వెళితే తొందరగా వైద్యుడివికాగలవు,'' అన్నది మనోరమ. సజీవుడు అప్పటికప్పుడే బయలుదేరి బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుణ్ణి కలుసుకున్నాడు. ఆయన అతణ్ణి శిష్యుడిగా స్వీకరించి ఏడాదిలో వైద్యశాస్ర్త పారంగతుణ్ణి చేశాడు.

విద్యాభ్యాసం పూర్తయ్యూక ఆసవుడతడితో, ‘‘వైద్యశాస్ర్తంలో ప్రపంచంలో ఏ వైద్యుడికీ తెలియని చికిత్సావిధానాలు నీకు నేర్పాను. కానీ, మందులకు లొంగని జబ్బులింకా కొన్ని ఉన్నాయి. వాటిని నయం చేయగల మంత్రాలను రూపొందించి గ్రంథస్థం చేశాను. సేవాదీక్షతో నిస్వార్థంగా వైద్యం చేసేవాడికే ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉంటుంది. నీకా గ్రంథం పొందే అర్హత ఉన్నదని నా నమ్మకం.

అది రుజువైనప్పుడు నీకు ఎవరో ఒకరు నా పిలుపు అందజేస్తారు. అప్పుడు వచ్చావంటే ఆ గ్రంథాన్ని ఇస్తాను,'' అన్నాడు. సజీవుడు గురువుకు పాదాభివందనం చేసి, రసపురానికి తిరిగి వచ్చి జరిగింది భార్యకు చెప్పాడు. ఆమె చెప్పిన ప్రకారం పేదలకు ఉచితంగానూ, కలిగినవారికి హెచ్చుమొత్తం తీసుకుంటూనూ వైద్యం చేయసాగాడు. ఒకసారి ఒక సాధువు సజీవుడి ఇంటి ముందు, ‘‘భిక్షాందేహి'', అనబోయి సజీవుడొక పేదరోగిని శ్రద్ధగా పరీక్షించడం గమనించి ఆగాడు.

అంతలో ఆ ఇంటి ముందు ఆగిన గురప్రు బగ్గీలోంచి దిగిన ఒక భాగ్యవంతుడు సజీవుడి వద్దకు వెళ్ళి, ‘‘వైద్యోత్తమా, తమరు కోరిన ధనమిస్తాను. ముందు నన్ను పరీక్షించండి,'' అన్నాడు దర్పంగా. సజీవుడాయన్ను ఒకసారి తేరిపారజూసి, ‘‘కోరిన ధనమివ్వగలిగితే తప్పక తీసుకుంటానుగానీ, చికిత్సకు ముందు వెనకలు డబ్బుతో కాక, రోగాన్ని బట్టి నిర్ణయించాలి. నీదంత ప్రమాదకరమైన జబ్బు కాదని చూడగానే తెలిసింది.

నీవంతు రాగానే నిన్ను నేనే పిలుస్తాను. అంతవరకు ఆ పక్కనే కూర్చో,'' అన్నాడు. భాగ్యవంతుడు వెళ్ళి అరుగు మీద కూర్చుంటూండగా, సజీవుడి దృష్టి ఇంటి ముందు నిలబడ్డ సాధువు మీద పడింది. అతడు సాధువుకు నమస్కరించి, ‘‘తమరీపూట మా ఇంట భోజనం చేసి మమ్మల్ని అనుగ్రహించండి,'' అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, ‘‘పనిముగించుకుని లోపలకురా. ఇద్దరం కలిసి భోంచేద్దాం,'' అంటూ ఇంట్లోకి వెళ్ళాడు.

సజీవుడు అక్కడున్న రోగులను పరీక్షించి, మందిచ్చి పంపి లోపలకు వెళ్ళేసరికి బాగా ఆలస్యమయింది. అతడు క్షమాపణ కోరితే సాధువు, ‘‘నీలా రోగులపట్ల శ్రద్ధ, డబ్బుకు లొంగని నిస్వార్థం, సాధుజనుల పట్ల ఔదార్యంగల వైద్యులు అరుదు.

ఆసవుడి వైద్యమంత్ర గ్రంథం అందుకునే అర్హత నీకున్నది. వెంటనే బృహదరణ్యానికి వెళ్ళు,'' అన్నాడు. ఆయన్ను ఆసవుడే పంపాడని గ్రహించిన సజీవుడు భార్యకు విషయం చెప్పాడు. ఆమె, ‘‘బృహదరణ్యానికి వెళ్ళిరావడానికి పట్టే వారం రోజులూ రసపురంలో నీ మీద ఆధారపడ్డ రోగులకు ఇబ్బంది అవుతుంది. రోగులు లేని సమయంలో గురువర్యులను కలుసుకోవడం మంచిది,'' అన్నది. ఆ మాటలే సజీవుడు సాధువుకు చెప్పాడు.

ఆయన సరేనని భోజనం చేసి వెళ్ళిపోయూడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజు భీమసేనుడి తల్లికి భరించలేని తలనొప్పి వస్తే రాజవైద్యుడి మందులేమీ పనిచేయలేదు. రాజమాతకు నయం చేస్తే కనకాభిషేకం చేస్తానంటూ సజీవుడి కోసం దూతను పంపాడు రాజు. భార్య సలహా మీద సజీవుడా దూతతో వినయంగా, ‘‘నేను కదిలితే ఇక్కడ ఎందరో రోగులకు ఇబ్బంది. ప్రజాహితం కోరే మన రాజది హర్షించరు. చికిత్సకు రాజమాతే ఇక్కడికి రావడం మంచిది,'' అని చెప్పి పంపాడు.

ఆ మరునాడు సాధువతణ్ణి కలుసుకుని అతడి ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ మెచ్చుకుని బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుడి వైద్యమంత్ర గ్రంథాన్ని తెచ్చుకోమన్నాడు. కాని సజీవుడు పూర్వంలాగే బదులిచ్చాడు. మరికొన్నాళ్ళకు రసపురంలోకెల్లా భాగ్యవంతుడైన మహేంద్రుడికి పెద్ద జబ్బు చేసింది. సజీవుడికా రోగలక్షణాలు అంతుబట్టక తికమక పడుతున్న సమయంలో సాధువు మనోరమను కలుసుకుని, ‘‘మహేంద్రుడి జబ్బుకు మంత్రాలే పనిచేస్తాయి.

ఇకనైనా నీ భర్తను బృహదరణ్యానికి పంపు,'' అన్నాడు. మనోరమ సరేనని భర్తను వెంటనే బృహదరణ్యానికి వెళ్ళి రమ్మన్నది. కాని సజీవుడు అందుకు అంగీకరించలేదు. అప్పుడు మనోరమ సాధువు సలహాపై, తనకూ ఏదో వింత జబ్బు వచ్చినట్టు నటించింది. తనే మందిచ్చినా భార్యకు పనిచేయడం లేదన్న దిగులుతో సజీవుడు తన వద్దకు వచ్చే రోగులకు రోగనిదానం సరిగ్గా చేయలేక పోతుంటే సాధువతణ్ణి కలుసుకుని, ‘‘ఇకనైనా వెళ్ళి ఆసవుడి వైద్యమంత్రగ్రంథం తెచ్చుకో. లేకుంటే నీ భార్య నీకు దక్కదు,'' అని హెచ్చరించాడు.

మనోరమ కూడా వెళ్ళిరమ్మని కోరడంతో సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుడి వైద్య మంత్ర గ్రంథాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు. మహేంద్రుడితో పాటు ఎందరికో వైద్యసేవలు అందించి కృతార్థుడయ్యూడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా, సాధువు ఎంత చెప్పినా వెళ్ళడానికి నిరాకరించిన సజీవుడు భార్యకు జబ్బు చేయగానే ఆసవుడి వద్దకు వెళ్ళడం స్వార్థం కాదా? తమ వద్ద వైద్యమంత్రగ్రంథం వుంటే మహేంద్రుడు వంటి భాగ్యవంతులకు వైద్యం చేసి ధనం ఆర్జించవచ్చన్న ఆశతో వింత జబ్బు వచ్చినట్టు నటించి భర్తను బృహదరణ్యానికి వెళ్ళిరమ్మని భర్తను ప్రోత్సహించడం మనోరమ స్వార్థంకాక మరేమిటి?

ఇలారెండు రకాల స్వార్థంతో వచ్చిన సజీవుడికి ఆసవుడు నిస్వార్థ పరులకు మాత్రమే ఇస్తానన్న వైద్యమంత్ర గ్రంథాన్ని ఇవ్వడం నియమభంగం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయూవో నీ తల పగిలిపోతుంది,'' అన్నాడు. దానికి విక్రమార్కుడు, ‘‘అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యను కాపాడవలసిన బాధ్యత భర్తగా సజీవుడికి ఉన్నది. ఆమె వైద్యంకోసం అతడు బృహదరణ్యానికి వెళ్ళడం స్వార్థం అనిపించుకోదు.

సజీవుడు పేదసాదలకు వైద్యసేవలు అందించడానికి కారణం మనోరమ. అలాంటి ఆదర్శపత్నికి ధనాశ అనే స్వార్థం అంటగట్టడం సమంజసం కాదు. ఆమె అనారోగ్యం పాలయిందని తెలియగానే, ఇతర రోగులకు సరైన వైద్యం చేయలేక సజీవుడు అవస్థపడ్డాడు. అలాంటిది భార్య జబ్బుముదిరి మంచం పడితే, తట్టుకోలేక వైద్య వృత్తినే మానేసే అపాయం లేకపోలేదు. భార్యకోసమని తెచ్చిన వైద్యగ్రంథం మరెందరికో మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఉపయోగపడింది.

అందువల్ల సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళడం నిస్వార్థమే తప్ప, స్వార్థం అనిపించుకోదు. అతనికి వైద్యగ్రంథం ఇచ్చి ఆసవుడు నియమభంగం చేశాడనడానికి ఏమాత్రం తావు లేదు,'' అన్నాడు. రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టు ఎక్కాడు.

1, ఏప్రిల్ 2020, బుధవారం

తమాషా ప్రశ్నలు

తమాషా ప్రశ్నలు:

1. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?

2. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?

3. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?

4. అందరూ భయపడే బడి ఏమిటి?

5. అందరూ నమస్కరించే కాలు ఏమిటి?

6. వీసా అడగని దేశమేమిటి?

7. ఆయుధంలేని పోరాటమేమిటి?

8. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?

9. కనిపించని వనం ఏమిటి?

10. నీరు లేని వెల్ ఏమిటి?

11. నారి లేని విల్లు ఏమిటి?

12. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?

13. వేసుకోలేని గొడుగు ఏమిటి?

14. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?

15. వేయలేని టెంట్ ఏమిటి?

16. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?

17. రుచి లేని కారం ఏమిటి?

18. చారలు లేని జీబ్రా ఏమిటి?

19. అందరూ కోరుకునే సతి ఏమిటి?

20. అందరికి నచ్చే బడి ఏమిటి?

జవాబులు

1) గ్రానైట్
2) న్యూస్ పేపర్.
3) ఫైరింగ్
4) చేతబడి.
5) పుస్తకాలు
6) సందేశం.
7) మౌనపోరాటం.
8) పకోడి
9) పవనం.
10) ట్రావెల్
11) హరివిల్లు
12) బ్లడ్ బ్యాంక్
13) పుట్టగొడుగు.
14) బ్రౌన్ షుగర్
15) మిలిటెంట్
16) శిరోజాలు.
17) ఆకారం
18) ఆల్జీబ్రా
19) వసతి.
20) రాబడి.

దేవత -- విక్రమాదిత్య కథలు

దేవత -- విక్రమాదిత్య కథలు

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా, నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే.కాని, కార్యం ఫలించనున్న తరుణంలో, ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగావుండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమతెలియకుండా, విను,'' అంటూ ఇలా చెప్పసాగాడు:

ధర్మాంగదుడు, విశ్వనాధుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు.అయితే, వారిస్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు. దొంగ పత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆ…యన, ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టుపెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ మూడువేల వరహాలయిందనీ, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాననీ కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని, భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయాధికారి కాసేపాలోచించి, ‘‘ఏ నేరంపైన అయినా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివనీ తెలుసు, భూష…య్య మోసగాడనీ తెలుసు. అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే, నీవువెయ్యి వరహాలు ధరావతు కట్టాలి. ఎవరైనా నీగురించి హామీ ఇవ్వాలి,'' అన్నాడు.

అప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బులేదు. అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకింతో అంతో పరపతివుంది కాబట్టి అప్పు పుడుతుందనుకున్నాడు. కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి, ఎవరూ అతడికి అప్పివ్వడానికి ముందుకు రాలేదు.
ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాధుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు. అయితే, అదే సమయంలో విశ్వనాధుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్ళి సంబంధం వచ్చింది. పెళ్ళి ఖర్చులకు అయిదు వేల వరహాలదాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసం విశ్వనాధుడు శతవిధాల ప్రయత్నిస్తూంటే భూషయ్య అతణ్ణి కలుసుకుని, ‘‘నీకు నేను సాయపడతాను. బదులుగా నువ్వు నాకు సాయపడాలి,'' అన్నాడు.

విశ్వనాధుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగదుడి విషయంలో హామీవుండడానికి నిరాకరించాడు. ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలం భూషయ్య పాలయింది.అప్పుడు ధర్మాంగదుడికి, భూషయ్య మీదకంటే విశ్వనాధుడి మీద ఎక్కువ కోపం వచ్చింది. ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకు డనిపించుకుని ఉరికంకంబ మెక్కాల్సివస్తుంది.

పోనీ, విశ్వనాధుణ్ణి కసితీరాకొడదామన్నా - అప్పుడూ అందరూ తనను పరమదుష్టుడని అసహ్యించుకుంటారు!విశ్వనాధుడి మీద పగతీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు, ఊరిచివర కొండగుహలో వుండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడనీ, ఆయన మహిమలు చేయగలడనీ అంతా చెప్పుకుంటారు. బైరాగి, ధర్మాంగదుడు చెప్పింది విని, ‘‘తన స్వార్థంకొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాధుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాధుడికి అపకారం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వూ మంచి మిత్రుడివి కావు!'' అన్నాడు.

‘‘స్వామీ, అపకారం చేసింది విశ్వనాధుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవడం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను,'' అన్నాడు ధర్మాంగదుడు. ‘‘ఇప్పుడు నీ మనసునిండా పగవుంది. పాముకు విషమెలాంటిదో, మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నీవు పగను విడిచి పెట్టిరా. అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం,'' అన్నాడు బైరాగి. ‘‘స్వామీ! నామనసులోని పగపోయే మార్గం కూడా, మీరే చెప్పండి. ఆ పగ ఉధృతాన్ని తట్టు కోలేకుండావున్నాను,'' అన్నాడు ధర్మాంగదుడు.

బైరాగి కొద్దిసేపు ఆలోచించి, ‘‘అయితే విను. నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగ అంతా విషంగా మారి, నీతలలో చేరుతుంది. ఆ విషం బారినుంచి బయట పడగానే, నీకు తిరిగి మనిషిరూపు వస్తుంది. పాము రూపంలో వున్నంత కాలం నీకు పూర్వజ్ఞానం వుంటుంది కానీ, బుద్ధులు మాత్రం పామువే వుంటాయి. ఎటొచ్చీ పాము రూపంలో వుండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రం ఆరూపంలోనే మరణిస్తావు!'' అన్నాడు. ధర్మాంగదుడు మారాలోచనలేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతణ్ణి పాముగా మార్చేశాడు.పాముగా మారిన ధర్మాంగదుడు, అక్కణ్ణించి పాకుతూ పొలాలవైపు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కరన్రు నేలకు తాటిస్తూ వస్తూంటే, దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది.

అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి, ధర్మాంగదుడితో, ‘‘నువ్వా మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడడం మనకు ప్రమాదం అని తెలుసుగదా!'' అన్నది. ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు. తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషివల్ల అపకారం జరిగినా, ప్రాణప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది, ధర్మాంగదుడికి. కానీ విశ్వనాధుడు తన శత్రువు. అతణ్ణి మాత్రం కాటువేయాలి. అప్పుడు విశ్వనాధుడి ప్రాణాలు పోతాయి. తనకు శిక్షావుండదు!

ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకుని, ఎవరికంటా పడకుండా విశ్వనాధుడి ఇల్లు చేరాడు. ఇంట్లోని ముందరిగదిలో విశ్వనాధుడి కొడుకు ఆరేళ్ళవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగదుణ్ణి చూడనే చూశాడు. వెంటనే భయంతో, ‘‘పాము!'' అని గట్టిగా అరిచాడు. ఆ కురవ్రాణ్ణి కాటేసి విశ్వనాధుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు కానీ, తనకే అపకారమూ చేయనివాడి జోలికి వెళ్ళడం తప్పని, అతడికి అనిపించింది. అందుకని అక్కణ్ణించి చరచరా పాక్కుంటూ పూజగదిలోకి దూరాడు.

ఇంతలో ఇంటిల్లపాదీ విశ్వనాధుడి కొడుకు చుట్టూ చేరారు. వాడు చెప్పిందివిని, అంతా పూజగదిలోకి వెళ్ళారు. చూస్తే, అక్కడ పూజామందిరంలో, పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు. ‘‘నాగదేవత! కళ్ళు మూసుకుని నమస్కరించండి. ఎవరికీ ఏ అపకారమూ జరగదు! ఈ రోజుతో మనకూ, మనవాళ్ళకూ వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగి పోవాలని నాగదేవతకు మొక్కుకో నాయనా,'' అన్నది విశ్వనాధుడి తల్లి. అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పామురూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కి పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు.

‘‘ఛీ! నాయీ విషంవల్ల ఏ ప్రయోజనమూ లేదు,'' అనుకుంటూ ధర్మాంగదుడు తనకోరలతో పూజామందిరాన్ని కాటువేశాడు. కోరల విషం బ…యట పడగానే, అతడి పాము రూపంనశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు. అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకునే వుండడంతో తనూ లేచి వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాధుడి తల్లి, మందిరంలో నాగదేవత మాయంకావడం చూసి, మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్ళి పాముపుట్టలో పాలు పోసివచ్చేది.

ఎలాంటి కష్టాలు వచ్చినా, నాగదేవత కరుణవల్ల తొలిగి పోతాయని కొడుకుకు చెపుతూండేది. విశ్వనాధుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి, పక్కనేవున్న ధర్మాంగదుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలి…యక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగదుడు, ‘‘మిత్రమా! నీ అవసరం నీచేత చేయించిన పనివల్ల, నాకు పొలం పోయింది. అంత మాత్రాన, అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగాలేను,'' అన్నాడు.

ఈ మాటలకు విశ్వనాధుడితో పాటు, అతడి కుటుంబం వారందరూ ధర్మాంగదుణ్ణి ఆకాశానికెత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళోవారందరు కూడా, ధర్మాంగదుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా, ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా! విశ్వనాధుడు, ధర్మాంగదుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా వుంటూ, ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ, అతడికి సహాయం నిరాకరించాడు.అటువంటి మిత్రద్రోహి మీద పగసాధించేందుకు ధర్మాంగదుడు, మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడుగదా? కానీ, పూజామందిరంలో అవకాశంవున్నా అతడు, విశ్వనాధుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకూ, పాముగా అతడి ప్రవర్తనకూ పొంతన వున్నట్టు లేదుకదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది,'' అన్నాడు.

దానికి విక్రమార్కుడు, ‘‘మనుషులలాగే పశుపక్ష్యాదులక్కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావమంటూ ఒకటి వుంటుంది. ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఊహాపోహలతో, పాములకు తను సహజంగా వున్నవనుకుంటున్న దుష్టస్వభావం, పగల గురించి ఆలోచించాడు. బైరాగి, అతడికి పాముగా పూర్వజ్ఞానం వుంటుందనీ, బుద్ధిమాత్రం పాముల దేననీ చెప్పాడు! ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు, ఆ పాము - పాములు తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించు కుంటాయనీ, వాటికి పగ అన్నది తెలియదనీ చెప్పింది.

ఆ సమయాన, బుద్ధి విషయంలో పాముల స్థాయిలో వున్న ధర్మాంగదుడికి, అది ఆచరించదగిందిగా తోచింది. పైగా, విశ్వనాధుడు, ధర్మాంగదుడు మిత్రులే. అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే, ఆ సమయంలో విశ్వనాధుడు కూడా తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్ళి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండడం వల్ల, స్నేహితుడు కోరిన సాయం చేయలేక పో…యాడు. అయితే, ధర్మాంగదుడు అది గ్రహించలేక, ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజగదిలో పామును చూడగానే విశ్వనాధుడి తల్లి అన్నమాటలతో ధర్మాంగదుడికి తన పొరబాటు తెలియవచ్చింది. అందువల్లనే, అతడు విశ్వనాధుణ్ణి కాటువేయలేదు,'' అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

తెనాలి రామకృష్ణ కథలు - 16 తెనాలి రామకృష్ణుడు, దొంగలు

తెనాలి రామకృష్ణ కథలు - 16
తెనాలి రామకృష్ణుడు, దొంగలు

శ్రీకృష్ణదేవరాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినయినా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు.

అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా "ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం!" అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ నిదుర పోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలసేపు వెతికాడు.

నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడి పోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటి లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు జామున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు.

రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగ రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.

ప్రశ్న: అంతరిక్షంలోని గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

ప్రశ్న:  అంతరిక్షంలోని గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

జవాబు: 
అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నైనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉంది అనే విషయంపైనే కాకుండా దాని ద్రవ్యరాశిపై తద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వం (Gravity) పై కూడా ఆధారపడి ఉంటుంది. వాయువులేక ద్రవ పదార్థాలతో కూడుకున్న గ్రహాలు, గోళాకారంలో రూపొందుతాయి. కారణం దానిపై గురుత్వం అన్ని దిశలలో ఒకే రకంగా, సమానంగా పనిచేయడమే. భూమి తొలుత ద్రవ రూపంలోనే ఉండేది. అదే వాటి అంతర్భాగాలు అప్పటికే రాతితో నిర్మితమయి ఉంటే, గురుత్వ బలంకన్నా బరువైన రాయి ప్రయోగించే బలం ఎక్కువవడంతో 'ఆస్టరాయిడ్ల' లాంటి లఘు గ్రహాలు గోళాకారంలో కాకుండా ఒక క్రమంలేని విచిత్రమైన ఆకారాలు కలిగి ఉంటాయి. కానీ ఆస్టరాయిడ్ల వ్యాసం 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే దాని గురుత్వం తగినంత బలం కలిగి ఉండడంతో అది చాలా వరకు గోళాకారాన్ని కలిగి ఉంటుంది. దీనికి 970 కిలోమీటర్ల వ్యాసం ఉండే లఘు గ్రహం 'సిరీస్‌' మంచి ఉదాహరణ.

తమ చుట్టూ తాము అతి వేగంగా తిరిగే ఖగోళవస్తువులు కచ్చితమైన గోళాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారం (Elliptical form) కలిగి ఉంటాయి. దీనికి కారణం వాటి పరిభ్రమణ వేగం వాటి విషువద్రేఖ (Equator) దగ్గర ఎక్కువగా ఉండడంతో అక్కడ ఏర్పడిన ఉబ్బు వల్లనే.

31, మార్చి 2020, మంగళవారం

కథ - రాజు-ప్రజలు

కథ - రాజు-ప్రజలు
రాజు గొప్పవాడుగా కీర్తిని పొందగలుగు తున్నాడు.నిజానికి ఆ రాజ్యంలో అరాచకం నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయి. ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న తరుణంలో ప్రజలకు అన్నీ పోయి కేవలం ఒక 'గోచిపేగు' మాత్రమే మిగిలింది. ఇది భరించలేక ప్రజలంతా కలిసి రాజుగారి దగ్గరకు వెళ్లి మాకు చాలాకష్టంగా ఉంది. కావున మాకు కొన్ని బట్టలు ఇప్పించండి.మా మానాలు కాపాడుకోవడానికి   లేకపోతే మేము ఏ పని చేయలేమని రాజభవనం ముందు కూర్చున్నారు.
దాంతో రాజుగారికి ఒక ఉపాయం తట్టింది.
వెంటనే సైనికులను పిలిచి  ప్రజల దగ్గరున్న 'గోచిపేగులు'మొత్తం లాక్కొని రండి అన్నాడు. సైనికులు ప్రజల 'గోచిపేగులు'లాగడంతో ప్రజలు లబోదిబో అంటూ 
అయ్యా రాజుగారూ " మీరు మరిన్ని బట్టలు ఇవ్వకపోయినా మంచిదే. కానీ 'మాగోచిపేగులు'మాకు ఇప్పించండి చాలు" అనడంతో  
రాజు వికటాట్టహాసం చేస్తూ నా ముందే కుప్పిగంతులా మీరు ఇకముందు ఏమీ అడగనంటేనే 'మీగోచిపేగులు'మీకు ఇస్తా ఖబర్ధార్ అన్నాడు. సరే రాజుగారు అంటూ గోచిపేగులు తీసుకొని ఎటోల్లటే వెళ్ళిపోయారు పాపం ప్రజలు.

1. చందమామ కథలు - జూలై 1947 నుండి డిసెంబర్1956 సంచికలు ఉచిత డౌన్లోడ్


Sl. No. Year Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
1 1947 ---- ---- ---- ---- ---- ---- View View View View View View
---- ---- ---- ---- ---- ---- Dnld Dnld Dnld Dnld Dnld Dnld
2 1948 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld
3 1949 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld
4 1950 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld -- -- -- -- -- -- --
5 1951 View View View View View View View View View View View View
-- -- -- -- -- -- -- -- -- -- -- --
6 1952 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld
7 1953 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld
8 1954 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld
9 1955 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld
10 1956 View View View View View View View View View View View View
Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld Dnld

తెనాలి రామకృష్ణ కథలు - 15 రామలింగడి రాజభక్తి

తెనాలి రామకృష్ణ కథలు - 15

రామలింగడి రాజభక్తి

శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది.ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగా రు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కింద ప  డతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది.

ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.

రామలింగడి సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు "శభాష్ రామలింగా! శభాష్!" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.

"ఎంత దురాశపరుడు" అన్నాడు ఆస్ధాన పూజారి. "గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు" అన్నాడు సేనాధిపతి. "అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో "ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు" అంటూ రామలింగడిని ధూషించసాగాడు.

రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.

రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.

ప్రశ్న : సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

ప్రశ్న : సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

జవాబు:
       కోట్లాది సంవత్సరాలుగా వర్షపు నీరు నదుల్లోనూ, వర్షపాత ప్రాంతాల్లోనూ ఉన్న వివిధ లవణాలను మోసుకెళ్లి సముద్రంలో కలపడం వల్ల సముద్రపు నీరు ఉప్పుమయం అయ్యింది. సముద్రపు నీరు తాగు, సాగునీరుగా పనికిరాదు. ఇలాంటి నీరు తాగితే జీర్ణవాహిక పొడవునా ఉన్న కణాల్లోని నీరు ద్రవాభిసరణం (Osmosis) ద్వారా తాగిన ఈ ఉప్పు నీళ్లలో కలుస్తుంది. తద్వారా జీర్ణవాహిక తన నిర్మాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా సముద్రపు నీటిలో ఉన్న కొన్ని నిరింద్రియ లవణాలు రక్తంలో కలిస్తే మన జీవ భౌతిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. వ్యవసాయానికి ఈ నీరు పారితే పొలంలో ఉన్న సారాన్ని హరించి వేస్తాయి. పంటలు సరిగా పండవు.

సముద్రంలో ఉన్న నీటి మొత్తాన్ని మంచినీరుగా మార్చడం వీలుకాదు. కానీ సముద్రపు నీటిని తక్కువ మోతాదులో 'రివర్స్‌ ఆస్మోసిస్‌' ద్వారా మంచి నీటిగా మార్చగలం. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. అయితే రివర్స్‌ ఆస్మాసిస్‌, స్వేదన ప్రక్రియల ద్వారా ఉప్పునీటిని మంచినీటిగా మార్చే అవకాశం శాస్త్రీయంగా ఉంది.

మనం తాగే నీరు, సాగు నీరు వర్షాల నుంచి వచ్చిందే. వర్షాలు సముద్రపు నీటి నుంచి వచ్చే మేఘాల నుంచే కాబట్టి సముద్రంపై నీరు పరోక్షంగా ప్రకృతి వరప్రసాదంగా, మంచి నీరుగా మారినట్టే కదా!

30, మార్చి 2020, సోమవారం

తెనాలి రామకృష్ణ కథలు - 14 వింతపరిష్కారం

తెనాలి రామకృష్ణ కథలు - 14
 
వింతపరిష్కారం

శ్రీకృష్ణదేవరాయలు అయిదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు "సాహితీ సమరాంగణ చక్రవర్తి" అనే బిరుదు ఉండేది. అముక్తమాల్యద, రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు. వారిని 'అష్టదిగ్గజాలు' అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల అస్థానకవి దిగ్గజాలు. ఆయన సభకు "భువన విజయం" అని పేరు.

ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవిదిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు.

మొదట 'ఆంధ్రకవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాష తేల్చుకోలేక పోయాడు. తరువాత ఆరుగురూ అంతే. చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లె వేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతో సేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేక పోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్ధండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు 'అమ్మా' అన్నాడు. అంతే! " నీ మాతృభాష తెలుగు పండితోత్తమా!" అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్! వికటకవీ అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు.

మాతృభాష గొప్పతనం అదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నతల్లిలా, మాతృభూమిలా, మాతృభాష మధురమైనది, మరపురానిది.
           

ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి !

ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి !
1. పవిత్రమయిన ఆకు
2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు.
3. శివునికి ఇష్టమయిన ఆకు.
4. బుట్టలు అల్లుకునే ఆకు.
5. అతి చిన్న ఆకు.
6. చేతికి పెట్టుకునే ఆకు.
7. భోజనానికి ఆకు.
8. వండినా ఆకారం మార్చుకోని ఆకు.
 9. శుభసంకేతం ఈ ఆకు.
10. ఆంజనేయునికి ప్రీతి ఈ ఆకు.
11. పురిటల స్నానానికి వాడే ఆకు.
12. దురదలు తెచ్ఛే ఆకు.
13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు.
14. ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు.
15. పువ్వులలో వినియోగించే ఆకు.
16. అమ్మవారిని శాంతింప జేసే ఆకు.
17. కృష్ణుడు శయనించే ఆకు.
18. సామెత కు ప్రీతి ఈ ఆకు.
19. రాధసప్తమికి నివేదన ఈ ఆకు.
20. గణేశుని ప్రీతి ఈ ఆకు.
21.కార్తీక మాసం లో తినేందుకు వాడే ఆకు.
22. పట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు.
23. నేషనల్ డ్రింక్ తయారు చేసే ఆకు.
24. శిరోజాల సొగసు ను పెంచే ఆకు.
25. మాసాలలో వాడే ఆకు.

*జవాబులు*

1) తులసి
2) ఇస్తరాకు
3) మారేడు
4) తాటాకు
5) నేల ఉసిరి
6) గోరింటాకు
7) అరటి
8) కరివేపాకు
9) మామిడి
10) తమలపాకు
11) వావిలాకు
12) దురద గుంట
13) తామర
14) కొబ్బరి
15) మరువం/దవనం
16) వేపాకు
17) వటపత్రం
18) చింత
19) చిక్కుడు
20) గరిక
21) బచ్చలి
22) అత్తిపత్తి
23) తేయాకు
24) మందారం
25) బగారా

ప్రశ్న:చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

ప్రశ్న:చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

జవాబు: 
చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్‌ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు.

29, మార్చి 2020, ఆదివారం

రామాయణం గురించి నాలుగు విషయాలు తెల్సుకోండి

రామాయణం గురించి నాలుగు విషయాలు  తెల్సుకోండి


రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి..🏹

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం  పశ్చిమ  దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన  బహుమతి ఏమిటి?
=తన మెడలోని.                 ముత్యాలహారం. 

శ్రీ రామ జయం!

టిట్టిభం అనేది చాలా చిన్న పక్షి జాతి. దీన్నే లకుముకి పిట్ట అంటాం.

  "టిట్టిభం అనేది చాలా చిన్న పక్షి జాతి. దీన్నే లకుముకి పిట్ట అంటాం.
     టిట్టిభ జాతికి చెందిన ఓ ఆడ పక్షి ఓసారి సముద్రతీరంలో గుడ్లు పెట్టింది...
    అవి బిడ్డలుగా మారాలని ఎదురుచూస్తోంది....

     ఓ రోజున ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఇంతలో ఉద్ధృతంగా వచ్చిన సముద్రపు అల ఆ గుడ్లను సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది.

      ఇంతలో ఆ పక్షి తిరిగొచ్చింది... చూస్తే గుడ్లు లేవు. కట్టుకున్న కలలన్నీ  ఛిన్నాభిన్నమయ్యాయి..
        తీవ్రంగా ఆవేదన చెందిందా పక్షి..
       తాను చూస్తే ఇంత... ఆ జలరాశేమో అనంతం... తన బిడ్డలకు ఎలాగైనా లోకం వెలుగు చూపించాలి. సముద్రం నుంచి తన గుడ్లు బయటకు తీసుకురావాలనుకుందా పక్షి. తన ముక్కుతో సముద్రపు నీటిని పీల్చి ఒడ్డున వదిలిపెట్టింది. ఇలా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తే తన గుడ్లు బయటకు వస్తాయని ఆ పిట్ట ఆలోచన‌. ఓ బుల్లి పిట్టకు సముద్రపు నీరంతా తోడటం సాధ్యమయ్యే పనేనా? పిట్టకు మాత్రం ఈ సందేహం రాలేదు. దాని మనసులో ఉన్నది ఒకే లక్ష్యం. తన బిడ్డలను లోకానికి పరిచయం చేయడం, నీరు తోడుతూనే ఉంది.

     సాటి పక్షులు ఇదంతా చూశాయి. కొన్ని పక్షులు నిరాశ పరిచాయి. మరికొన్ని తోటి పిట్టకు సాయం చెయ్యాలని తామూ నీరు తోడటం ప్రారంభించాయి. క్రమంగా  వేలాది పక్షులు ఈ పనికి జతకూడాయి. క్రమంగా ఈ విషయం పక్షిరాజు గరుత్మంతుడి వరకూ వెళ్ళింది. రాజాజ్ఞతో లక్షలాది పక్షులు సముద్రపు నీరు తోడటం ప్రారంభించాయి. తన తీరంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని సముద్రుడు గుర్తించాడు. విషయం తెలుసుకుని, తన గర్భంలో ఉన్న గుడ్లను తీసుకువచ్చి లకుముకి పిట్టకు అందించాడు. పిట్ట చిన్నదే. కానీ దాని సంకల్ప బలానికి సముద్రుడే తలవంచాడు."

    అలాగే ఇంటి నుండి ఏ ఒక్కరు బయటకు వెళ్ళకూడదు అనే సంకల్ప బలానికి కరోనా వైరస్ ఖచ్చితంగా తలవంచుతుంది. కనుక అందరు దీనిని ఒక యఙ్ఞంగా భావించి బయటకు వెళ్ళకుండ, పొంచి ఉన్న ప్రమాదం నుండి రక్షించుకోవడం లో అందరమూ భాగస్వాములం అవుదాం.