LATEST UPDATES

18, ఏప్రిల్ 2020, శనివారం

అక్బర్-బీర్బల్ కథలు - 3 అందరిలోకి అదే తెలివైంది కదా..?!

అక్బర్-బీర్బల్ కథలు - 3

అందరిలోకి అదే తెలివైంది కదా..?!

ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ... తన సేవకుడైన జమాలుద్దీన్‌ను తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వారిద్దరూ అడవికేసి నడుస్తుండగా... ఇంతలోనే ఆకాశంలో కారు మబ్బులు అలముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశంకేసి చూస్తూ.. జమాలుద్దీన్...! వాన వస్తుందంటావా...? అని అడిగాడు.

`నేనెలా చెప్పగలను ప్రభూ... నేనేమైనా భవిష్యత్తు తెలిసినవాడినా..?!' అన్నాడు జమాలుద్దీన్. అలా కొద్ది దూరం సాగిపోయిన తరువాత వారికి ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ కనిపించాడు. సరే జమాలు...! ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి, వాన వస్తుందో, రాదో కనుక్కుని రా...! అని పంపించాడు అక్బర్.

పరుగు పరుగున గొర్రెలకాపరి వద్దకు వెళ్లిన జమాలుద్దీన్... "వాన వస్తుందో, రాదో నీవేమైనా చెప్పగలవటోయ్..!" అని అడిగాడు. గొర్రెల కాపరి తన కంచర గాడిద తోకను పైకెత్తి పట్టుకుని, తేరిపారజూసి "మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతోంది.." అని అన్నాడు.

అక్బరు వద్దకు చేరుకున్న జమాలుద్దీన్.. జరిగిన విషయాన్నంతా వివరించి చెప్పాడు. అంతా విన్న అక్బర్ చక్రవర్తి నవ్వుతూ... "చూశావా... మనకన్నా ఆ చదువురాని వాడే నయం.. గాడిద తోకను చూసే వర్షం రాదనే విషయాన్ని పసిగట్టాడు.." అన్నాడు.

తరువాత ఇద్దరూ కాసేపు అలా ముందుకు సాగిపోగానే... కుండపోతగా వర్షం మొదలైంది. అక్బర్, జమాలుద్దీన్‌లు ఇద్దరూ తడిసి ముద్దయిపోయారు. అక్బర్ చక్రవర్తి చిరాకుపడుతూ... "ఇలా జరిగిందేం జమాలూ... ఇప్పుడే కదా వాన కురవదని చెప్పావు.." అన్నాడు.

అప్పుడు జమాలుద్దీన్ "ప్రభూ... వాన కురవదని చెప్పింది నేను కాదు, కంచర గాడిద తోక. పాపం ఆ గాడిద కూడా సరిగ్గానే వివరించి చెప్పి ఉండవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో గొర్రెల కాపరి పొరబడి ఉంటాడు. వాడి మాటల్ని మీరు కూడా నమ్మారు. తప్పితే ఇందులో నా తప్పు ఏముంది" అన్నాడు.

"సరే... ఈ వాన కాసేపట్లో ఆగిపోతుందా, లేక ఇలాగే రాత్రిదాకా కొనసాగుతుందా..?" మళ్లీ అడిగాడు అక్బర్ చక్రవర్తి. "కాసేపాగండి ప్రభూ...! ఇప్పుడే వస్తాను" అంటూ గబగబా అడుగులేశాడు జమాలుద్దీన్. "ఎక్కడికి వెళ్తున్నావ్.. జమాలూ..!" వింతగా చూస్తూ అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏం లేదు ప్రభూ...! "ఇందాకటి గాడిదనే అడిగేసి వస్తా..! ఎందుకంటే ఇక్కడున్న అందరిలో కంటే, అదే తెలివైనది కదా..!" అన్నాడు.

అప్పటిగానీ విషయం బోధపడని అక్బర్ చక్రవర్తి... "వాన రాకడ, పోకడ మనకు ఎలా తెలుస్తుంది. అంతా ప్రకృతి మాత చలవే కదా..!" అని అనుకున్నాడు. "ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగే వాటిని మానవులం తేల్చి చెప్పలేం కదా..!" అంటూ తన సేవకుడు సుతిమెత్తగా తెలియజెప్పిన విషయాన్ని మనసులో తలచుకుంటూ జమాలుద్దీన్ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అక్బర్ చక్రవర్తి.

నీతి కథలు - 10 టక్కరి నక్క

నీతి కథలు - 10

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.
ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.

తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి "తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది" అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి" అని అన్నాయి.
ఆహా! అలాగా అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది.

ప్రశ్న : అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

ప్రశ్న : అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

జవాబు :
ఏదైనా వస్తువు, ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం, ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతుందంటే, అది పరిభ్రమణం చేస్తుందని అంటాం. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండడానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం 'కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం' ద్వారా వివరించవచ్చు. ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతట అది ఆగిపోదు. పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని 'ములుకు'కు నేలకు మధ్య ఉన్న ఘర్షణ (friction) ప్రభావమే. ఆ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది.

ఇక నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణ విషయానికి వస్తే, అవి తమ చుట్టూ తాము పరిభ్రమిస్తున్న వాయుధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. ఈ వాయుమేఘాలు గురుత్వ ప్రభావం వల్ల క్రమేపీ తమలోకి తాము కుంచించుకుపోవడంతో కాలక్రమేణా నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వాయు మేఘాలు కుంచించుకుపోయేకొలదీ వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి. ఐస్‌పై స్కేటింగ్‌ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బార చాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా తెస్తున్నపుడు వారి పరిభ్రమణ వేగం ఎక్కువవుతున్నట్లు.

ఇలా పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపీ నక్షత్రాలుగా మారుతున్నపుడు ఆ మేఘాలలోని అతి కొద్ది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది. లేకపోతే ఆ చలన వేగానికి నక్షత్రాలు తునాతునకలై పోతాయి. ఇలా జరగకుండా నిరోధించడానికే ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు ఏర్పడి, వాయుమేఘాల తొలి పరిభ్రమణ వేగం అంటే తొలి కోణీయ ద్రవ్యవేగాన్ని తలాకొంచెం పంచుకున్నాయి. అందువల్లే నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి.

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

అక్బర్-బీర్బల్ కథలు - 2 మణిహారం దొంగ

అక్బర్-బీర్బల్ కథలు - 2

మణిహారం దొంగ

అక్బర్ చక్రవర్తికి ఒక రోజు ఉన్నట్టుండి... బీర్బల్‌ను ఏడిపించాలని ఓ సరదా ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించిన ఆయన తన మెడలోని హారాన్ని ఒకదాన్ని తీసి చేతబట్టుకుని, తన సేవకుడిని పిలిచి దాచిపెట్టమని చెప్పాడు. రాజాజ్ఞను శిరసావహించిన ఆ సేవకుడు హారాన్ని తీసుకుని దాచిపెట్టాడు.
ఈ విషయాలేమీ తెలియని బీర్బల్ ఎప్పట్లాగే ఆరోజు కూడా సభకు విచ్చేశాడు. బీర్బల్‌ను చూసిన రాజు తాను వేసిన పథకాన్ని గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు. అంతేగాకుండా... బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనన్న కుతూహలం కూడా ఆయన కలిగింది.

బీర్బల్‌తో అక్బర్ ఇలా అన్నాడు. "బీర్బల్ ఈ రోజు నామనసు ఏమి బాగాలేదు." అన్నాడు. ఈ మాట విన్న బీర్బల్ కంగారుతో.. చెప్పండి మహాప్రభూ.. ఏమైంది? మీ మనస్సు ఎందుకు బాగుండటం లేదు? అని అడిగాడు. ఏం లేదు బీర్బల్...! మహారాణి ప్రేమగా బహూకరించిన నా మణిహారాన్ని ఎవరో తస్కరించారు అని చెప్పాడు మహారాజు.

"స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!" అని అన్నాడు బీర్బల్. స్నానానికి వెళుతూ హారం తీసి పక్కన పెట్టాను. తిరిగి వచ్చి చూస్తే, హారం మాయమైపోయింది... అంటూ చెప్పసాగాడు రాజు. మహారాజు చెబుతున్నదంతా మౌనంగా విన్నాడు బీర్బల్.

అంతా విన్న బీర్బల్... "ఆ హారం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ హారం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి" అని అడిగాడు. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు రాజు. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెబుతూ ఉండే బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత మహారాజు ఇలా అన్నాడు.. "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది... నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి ఆ హారం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి" అని అన్నాడు. రాజు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకుంటూ... మహారాజా మీరు స్నానానికి వెళుతూ హారం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు. వెంటనే చక్రవర్తి ఓ అల్మరా వద్దకు తీసుకెళ్లి ఇక్కడే పెట్టానని చెప్పాడు.

అల్మరా వద్దకు వెళ్ళిన బీర్బల్... "ఆహా...! అలాగా...! సరి సరే....!!" అని అన్నాడు. దీంతో బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడున్న వారందరికీ అర్థం కాలేదు. అల్మరానే ఆయనకు ఏదో చెబుతోంది అన్నట్లుగా ఆశ్చర్యపోయి చూస్తుంటారు వాళ్ళు. వెంటనే బీర్బల్ మహారాజా హారం దొంగెవరో దొరికిపోయాడు అన్నాడు. రాజు హారాన్నే దొంగిలించే ధైర్యం ఎవరికుంది? ఎవరు వాడు చెప్ప బీర్బల్...! అన్నాడు అక్బర్.

ప్రభూ...! ఈ అల్మారా ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు స్నానం చేసి త్వరగా వచ్చేస్తారోనన్న కంగారుతో ఉన్న దొంగ గడ్డం అల్మరాలో ఇరుక్కుపోయిందట! అని చెప్పాడు. కావాలంటే మీరు అల్మరా తెరిపించండి... తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి. అన్నాడు.

దీంతో రాజు ఎవరికైతే తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకుని, మహారాజా ఇతడే దొంగ అని చూపించాడు. పట్టుబడ్డ రాజు సేవకుడు భయంతో వణుకుతూ అక్బర్ వద్దకు వెళ్ళగా... ఆయన జరిగిందంతా బీర్బల్‌కు వివరించాడు. దీంతో బీర్బల్ శాంతించి, నవ్వుకున్నాడు.

అయితే సభలో ఉన్న వారందరితో సహా మహారాజుకు కూడా.. అసలు బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో ఎవ్వరికీ అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు. అప్పుడు అసలు విషయం వివరించాడు బీర్బల్. మరేం లేదు మహారాజా..! మీరు అల్మరాలో హారం పెట్టానని చెప్పారు. మీరు చెప్పింది నిజమే అనుకున్నాను నేను.

అంతేగాకుండా మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకో ఉపాయం తోచింది. అల్మరా దగ్గరికెళ్ళి చెవి ఆనించి ఏదో విన్నట్టుగానే నటించాను. దొంగ గడ్డం అల్మరాలో చిక్కుకుపోయిందని కల్పించి చెప్పాను. నేను అలా చెప్తే నిజంగా హారం దొంగిలించిన దొంగ గడ్డం సవరించుకుంటాడని అనుకున్నాను.

అనుకున్నట్టుగానే ఆ సేవకుడు మీరు దాచిపెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోయి గడ్డం సవరించుకున్నాడు. అంతే దొంగ దొరికిపోయాడు అని చెప్పాడు బీర్బల్. బీర్బల్ తెలివితేటలను రాజు, ప్రజానీకం మెచ్చుకుని ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తారు.

నీతి కథలు - 9 మతిలేని మృగరాజు

నీతి కథలు - 9

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.

రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.

కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.

"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.

ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

జవాబు:
భూమిపై ఉన్న వందకుపైగా మూలకాల్లో సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల దగ్గర ద్రవస్థితిలో ఉన్నవి రెండే రెండు. ఒకటి బ్రోమిన్‌. ఇది అలోహం (non metal) , రెండోది పాదరసం. ఇది లోహం. అరచేతిలో పెట్టుకొంటే ద్రవంగా మారే రుబిడియం, ఫ్రాన్షియం, గెలియం వంటి ఇతర లోహాలు ఉన్నాయి. మూలకాలకు స్వతహాగా ధ్రువత్వం (polarity) ఉండదు.

ఒకే కణానికి విద్యుదావేశం ఉంటే వాటిని అయానులు అంటారు. ఉదాహరణకు (Nacl) ఉప్పులో సోడియం కణానికి ధనావేశం ఉంటుంది. ఒక కణంలో ఓ ప్రాంతంలో ధనావేశ లక్షణం, మరో ప్రాంతంలో రుణావేశ లక్షణం ఉంటే అటువంటి పదార్థాలను ధ్రువపదార్థాలు (polar materials) అంటారు. ఉదాహరణకు అమ్మోనియో (NH3) అణువులో నత్రజని పరమాణువు ప్రాంతంలో రుణావేశితం స్వల్పంగా పోగయి ఉంటుంది. హైడ్రోజన్‌లున్న ప్రాంతంలో స్వల్పంగా ధనావేశం పోగయి ఉంటుంది. అందుకే ఆ అణువును ధ్రువాణువు అంటారు. పూర్తిగాగానీ లేదా పాక్షికంగానైనా గానీ విద్యుదావేశం అదనంగా లేని పరమాణువుల్ని అణువుల్ని, పదార్థాల్ని మనం అధ్రువ పదార్థాలు అంటాం. అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలున్న పదార్థాలతోనే ప్రభావితమైనట్లే, విద్యుదావేశమున్న పదార్థాలు ఇతర విద్యుదావేశిత పదార్థాలతోనే ప్రభావితమవుతాయి. నీటి అణువు H2o కూడా ధ్రువ అణువు. ఆక్సిజన్‌ దగ్గర రుణావేశం, హైడ్రోజన్ల దగ్గర ధనావేశం స్వల్పంగా పోగయి ఉంటాయి. కాబట్టి నీటిని ధ్రువద్రావణి అంటారు. అందువల్ల అయాను లక్షణాలున్న ఉప్పు, ధ్రువ లక్షణాలున్న చక్కెర, ఆల్కహాలు వంటివి నీటిలో బాగా కరుగుతాయి, కలుస్తాయి. పాదరసానికి ధ్రువ లక్షణం లేకపోవడం వల్ల నీటిలో కరగదు. కలవదు.

16, ఏప్రిల్ 2020, గురువారం

అక్బర్-బీర్బల్ కథలు - 1 దొంగ సాధువు

అక్బర్-బీర్బల్ కథలు - 1

దొంగ సాధువు

అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు.

ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది. 

దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు.

మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.


అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.

నువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. "నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.

అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు.

నీతి కథలు - 8 బ్రాహ్మణబాలుడి కథ

నీతి కథలు - 8

బ్రాహ్మణబాలుడి కథ

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు. అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు. తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు. “చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు. "నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా, "భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

ప్రశ్న : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?

ప్రశ్న : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?

జవాబు :
ప్రస్తుత వైద్యులు  రోగిని తాకడం తగ్గించారు. . కానీ పాతరోజుల్లో వైద్యులు తమ రోగిని ముంజేయి దగ్గర పట్టుకుని చూసేవారు. అది నాడిని పట్టుకోవడము అని మనము అనుకుంటాము . వాస్తవములో వైద్యుడు రక్తనాళము పట్టుకుని చూస్తాడు . రక్తనాళము లో రక్తము ఒక క్రమవేగముతో ప్రవహిస్తుంది. అది కాకుండా ధమని గోడలు గుండె కొట్టుకోవడము మాదిరిగానే పల్స్ కొట్టుకొంటుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాదో లెక్కపెడతారు. అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆ రక్తప్రవాహ వేగము మారుతుంది. ఆ వేగము తగ్గిందా , పెరిగిందా అనేది చేయి పట్టుకుని తెలుసుకొని దానిని బట్టి రోగాన్ని అంచనావేయడము వైద్యులు చేస్తారు.

15, ఏప్రిల్ 2020, బుధవారం

నీతి కథలు - 7 నసీరుద్దీన్ కథలు

నీతి కథలు - 7

నసీరుద్దీన్ కథలు

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం. ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.  ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.


దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు. ఇలా ఉండగా ఓ రోజు తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు. ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు. 

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్. తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది."ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్. "హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్. "ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్."ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్. అయోమయంగా చూశాడు తైమూర్. 

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్. 

తైమూర్ కి మతిపోయింది.అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్. 

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు. తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్. 


ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే! కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

తెనాలి రామకృష్ణ కథలు - శ్రీ కృష్ణదేవరాయుల కల

తెనాలి రామకృష్ణ కథలు

శ్రీ కృష్ణదేవరాయుల కల

500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.

ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.

“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.
శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.
“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”

రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.
“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.

రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

ప్రశ్న: దురద కలిగించే మొక్కలుంటాయా?

ప్రశ్న: దురద కలిగించే మొక్కలుంటాయా?

జవాబు:
 ఉంటాయి... కొన్ని రకాల మొక్కలు , గడ్డి  మన చర్మానికి తాకినప్పుడు  దురద పెడుతుంది. మన ప్రాంతాలలొ దొరికే " దురదగుండాకు " అందరికీ తెలినదే. ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన పెరిగే ఓ పిచ్చి మొక్క. ఆ మొక్కల ఆకుల మీద సూచ్మ రూపములో గొట్టాలవంటి సూదులు ఉంటాయి. వాటి అంచుల్లో దురద కలిగించే రసాయనము ఉంటుంది . ఆ రసాయనము  ప్రభావము వలన దురద వస్తుంది. అది ఆ మొక్కలు రక్షణకోసము ఏర్పరచుకున్న వ్యవస్థ . 

ఈ విషయము తెలిసిన జంతువులు ఆ మొక్కలను మాత్రము తినవు . వాటికి దూరము గా ఉంటాయి. ఆత్మరక్షణ వాటి ఉద్దేశము . కాని మనిషికే ఇబ్బంది.

14, ఏప్రిల్ 2020, మంగళవారం

కొత్తయుద్ధం - కొత్త కథ

కొత్తయుద్ధం - కొత్త కథ

అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .

        ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది . అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు తోడేళ్ళను , పులులను , సింహాలను , నక్కలను తొలిసారి అక్కడే చూసింది.

       అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.

    "అవును మాది జింకలవనం " అంది.

 " ఈ అడవి మీ జింకలవనం లాంటిది కాదు .  ఇక్కడ మనల్ను చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి . వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తేలియదు . కాబట్టి ఇక్కడినుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.

 " పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది.

     అక్కడ చెట్టుకింద నిద్రపోతున్న సింహం కనిపించింది . జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .

  సింహానికి మెలకువ వచ్చింది . బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది . ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంతపని అయింది .

 వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకలవనం వైపు పరుగు తీస్తూనేవుంది . జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .

  తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనం లోకి వెళ్ళింది . దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి . సింహం ఆనందానికి అంతులేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .

   కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి .* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాయి .

   పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .

      అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది . దాని పేరు జ్ఞాననేత్ర . జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మారర్గం ఏమిటి " అని అడిగాయి .

     " జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను . ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు . దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.
ఎటు ఆలోచించినా . . ఎంత యోచించినా ఒకేఒక్క దారి కనిపిస్తుంది.

ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు . కానీ మనం 21రోజులు బ్రతకగలం.

కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది.
మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవితకాలం మరో 14రోజులు పెంచినట్లే.

  ఈరోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం.
పున్నమి నాటికి బయటకు వద్దాం తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పేద్దలదే" అంది.

జింకలన్నీ జ్ఞాననేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

             పున్నమి వచ్చింది . జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి . వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి . ఆనందంతో అరిచాయి , గెంతాయి . జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది .

అరవై సామెతలతో.. అందమైన కధ

అరవై సామెతలతో.. అందమైన కధ.

          "కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.." అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి..     " ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..

      "ఏం చెప్పమంటారు.. " చిలక్కి చెప్పినట్లు చెప్పాను" మీకు.. విన్నారా.. మీ అక్కగారి" నోట్లో నువ్వు గింజ దాగదు " అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందే గా

"తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని" మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.." మన బంగారు మంచిదవాలి కానీ".. ఇక దీనికి పెళ్ళి అయినట్టే.." అంది సుమతి.

      "ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..

"అనుమానం.. పెను భూతం.." అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.

    "ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు" ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు."ఆడలేనమ్మ మద్దెల గోల" లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.

        "ముంజేతి కంకణానికి అద్దమేల".. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. " చెవిలో జోరీగ లాగా " నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.

      "ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ" కడుపే కైలాసం.. ఇల్లే వైకుంఠం" నా మాట ఎప్పుడు పట్టించుకున్నారు కనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అనిగానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి నిష్ఠూరం గా..

  "ఓసి, పిచ్చిదానా.. " కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ".. ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..

    "అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా " తల ప్రాణం తోకకివస్తోంది" . " చెవినిల్లు కట్టుకుని పోరినా" వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి

"గుండెల మీద కుంపటి" దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి." అంది సుమతి.

      "వాడినా.. వాడు" ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయేరకం." వాడినుంచి నేను సహాయం ఆశించడం "ఇసుకలో నూనె పిండినంత".. అయినా వాడు

"అయినవాళ్ళకి ఆకులు.. కాని వాళ్ళకి కంచాలు" పెట్టే తరహా.. వాడిని చచ్చినా అడగను." అన్నాడు కాంతారావు.

  "అయ్యో.." అలా అనుకుంటే ఎలా అండీ..

  "వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు" ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత" అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకుందాం." అంది సుమతి.

     "వాడి గురించి "అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు" చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే..

"తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే" నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా..

    "హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు.."

    "మేనరికమా... లేదన్నయ్యా.. నీకు తెలీనిదేముందీ.. "పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు" అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... "మొక్కై వంగనిది మానై వంగునా" వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనే వుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు" వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..." అన్నాడు కాంతారావు..

    ఆ ఫోను లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..

    "ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య?" అంది సుమతి.

    "నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. "మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట" ఇలాంటి వాడే..."కళ్ళు నెత్తికెక్కాయి" వాడికి."కడుపు నిండిన బేరాలూ.. కడుపు నిండిన మాటలూ" వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని "గంతకి తగిన బొంతని" వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు."* *"ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు" అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను" అన్నాడు కాంతారావు కోపంగా..

      "అయ్యో.. అంతమాటన్నారా.. అయినా..

  "జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి" పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... "తలని తన్నేవాడొకడుంటే.. తాడిని తన్నేవాడొకడుంటాడు." ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. "ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు".. మీరేం బాధ పడకండి.. "మనసుంటే మార్గముంటుంది".. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో... "విత్తం కొద్దీ వైభోగం" పైగా మన దురదృష్టం "గోరు చుట్టు మీద రోకలి పోటు" లాగా పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.." అంది సుమతి.

    మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.

  "ఏంటోయ్.. "గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ".... కొంపతీసి ఉదయం నేను "నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను".. అన్నారు.. చమత్కారంగా..

      "పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. "ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి" అంది. "ముద్దొచ్చినపుడే చంకకెక్కాలి" అనుకుంది సుమతి.

        బుద్ధి గా చేతులుకట్టుకుని..ఆ.. ఇప్పుడు చెప్పు" అన్నాడు కాంతారావు.

      "నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా.. మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా

  "చిదిమి దీపం పెట్టుకునేలా వుంది" అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. "అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది" అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి

  ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... "వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు" అనిపించింది. "ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో" మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.

    "నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం." అన్నాడు కాంతారావు.

      రేపటిదాకా ఎందుకూ..

    "శుభస్య శీఘ్రం..." ."తలుచుకున్నపుడే తాత ప్రయాణం" అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను."మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది".. లేవండి.. లేవండి.." అంది సుమతి.

      "లేడికి లేచిందే పరుగు".. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.

"గంతకి తగిన బొంత" అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనిపించాలి. "ఇనుము విరిగినా అతకవచ్చుకానీ.. మనసు విరిగితే అతకలేము..".. అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు." అన్నాడు కాంతారావు.

        "పోన్లెండి.. "ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి" వదిలేయండి.. ఆయనని.. "గురివింద గింజ తనకింద నలుపెరగదట" మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.

        వెళ్లే దారిలో..."ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషం తో.. నానా మాటలు అన్నారు.."ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి".. ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయిసంబంధాలకి పోతున్నారూ.. "కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది" అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ..

"శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు... ఏది ?" అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు" అంది సుమతి.

    "పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.."గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు" పట్టించుకోకు..."గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం" తప్ప దానికి వేరే పనీపాటా లేదు.

  "పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు" అది అలా వాగుతూనే వుంటుంది. వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.." అంటూ భార్య ని ఓదార్చాడు.

          పెళ్లి చూపులు అయిపోవడం.. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమోత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద.. కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.

      పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ..

  "అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా" అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి.

      ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.

        ఇంతలో ఫోన్మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ... పెదనాన్న కొడుకు.... "ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట.  సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.." అన్నాడు..

    "ఆ.. అన్నయ్యా... "దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట".. అర్ధమయిందనుకుంటాను.." అంటూ ఫోన్ పెట్టేసాడు.

13, ఏప్రిల్ 2020, సోమవారం

సామెత కథ- ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి

 సామెత కథ

‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి’

పూర్వ కాలంలో, వ్యాపారం రెండు విధాలుగా జరెగేది. చిన్న చిన్న వ్యాపారులు వస్తువులను బళ్ళమీద ఒక ఊరి నుండి ఇంకొక వూరికి తిప్పుతూ చేసే చిల్లర వస్తువుల వ్యాపారం ఒకటి. రెండవ రకం, బాగా ధనవంతులైన వ్యాపారులు ఓడల మీద సరుకులను విదేశాలకు తీసుకువెళ్ళి చేసే వ్యాపారం. దైవం అనుకూలించనప్పుడు, అదృష్టం కలిసిరానప్పుడు, సముద్ర యానంలో సంభవించిన ఏ తుఫాను లోనో సరుకులను తీసుకెళుతూండిన  ఓడలు గల్లంతై పెద్ద పెట్టున నష్టపోయి తెల్లవారేసరికల్లా ధనవంతుడు దరిద్రుడై మిగలడం, దేశంలో పొరుగూళ్ళలో చేస్తూండిన చిన్న సరుకుల వ్యాపారమే దైవం అనుకూలించడం వలన బాగా కలిసొచ్చి కొద్ది రోజుల్లోనే బాగా ధనవంతుడై బళ్ళలో చేస్తూండిన వ్యాపారం వృధ్ధి చెంది ఓడల కెక్కి విదేశాలకు మళ్ళడం లాంటి సందర్భాలూ సన్నివేశాలూ నిజజీవితంలోనివి కథలలో కెక్కి కనిపిస్తూంటాయి.

‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న సామెత ఇలాంటి దృష్టాంతాలనుంచి పుట్టిందే. ఇందులో, కాలం కలిసొస్తే బండి ఓడవడం, కలిసి రానప్పుడు ఓడ బండవడం సరియైనది. అయితే, సుమతీ శతక కర్త అయిన బద్దెన మంత్రి ఈ సామెతను కలిమి లేముల్లాగా ఓడలు బళ్ళ మీదా, బళ్ళు ఓడల మీదా వస్తాయి అంటూ కలిమి లేముల ప్రసక్తి తెచ్చి వాటి రాకపోకలను అన్వయించడానికి చేసిన ప్రయత్నంలో, అన్వయం అంత బాగా కుదరక పోయినప్పటికీ, లోకం సరిపెట్టుకుంది. కానీ, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ గారు దీని అర్ధాన్నే పూర్తిగా మార్చి వేశాడు. కష్టాల్లో పరస్పర సహకారం అన్న అర్ధంలో దృష్టాంతంగా దీనిని వాడాడు.  సరిపెట్టుకుందామని చూసినా సరే, సరిగా అన్వయం కుదరని సందర్భం ఇందులోది. నీటిపై ఓడలో బళ్ళు ప్రయాణించడం, నేల మీద బళ్ళపై ఓడలు ప్రయాణించడం లోకానుభవానికి దృష్టాంతాలుగా సాధారణంగా దొరికే సన్నివేశాలు కావు. అందువలన, సుమతీ శతకంలోనూ, భాస్కర శతకంలోనూ వాడబడిన రూపాలు సరియయినవి కావు. అన్వయానికి కుదరని రూపాలని తేలుతుంది.

లోకానుభవాలను సామెతల రూపంలో నీతి బోధకాలుగా చెప్పే ప్రక్రియలో, అతి తక్కువ మాటలలో చెపాల్సిన విషయాన్ని చెప్పడానికి వీలుగా మాటల్ని వడపోసి వడపోసి కూర్చగా అయినవే సామెతలు. వాటిలో వ్యర్ధ పదాలూ, అర్ధ రహితమైన మాటలు సాధారణంగా ఉండవు.  ప్రతి మాట వెనుకా ఏదో బలమైన కారణం, అర్ధవంతమైన అనుభవ సారం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఈ సామెత ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న రూపమే అసలైనదీ, లోకానుభవ సిధ్ధమైనదీను!

సుమతీ శతకము లోని పద్యం

ఓడల బండ్లును వచ్చును
ఓడను నాబండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమిలేమి వసుధను సుమతీ!”


తెలుగులో ఈ సామెత  భాస్కర శతకం రచించ బడిన రోజుల నుంచీ ఉంది. దీనికి నిదర్శనం భాస్కర శతకంలోనే ఉంది. భాస్కర శతకంలో మూడవ పద్యం:

“అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్క రొక్కరి
న్మక్కువ నుధ్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!”

బేధమల్లా, ఈ పద్యంలో భాస్కర శతకకర్తగా భావింప బడుతూన్న మారయగారి వెంకయ ఇప్పుడు వాడబడుతూన్న ‘ఓడలు బళ్ళు అవుతాయి’ అన్నరూపంలో కాకుండా, ‘ఓడల బండ్లు వచ్చుట’ అన్న రూపంలో వాడాడు. అర్ధం విషయంలో సందేహం లేకుండా స్పష్టత కోసంగా ‘నీటిలో, మెరక’ అన్న పదాలు గూడా వాడాడు.  దీనిని బట్టి చూస్తే ఈ సామెత పూర్వం ‘ఓడలు బళ్ళు లాగుతాయి, బళ్ళు ఓడలు లాగుతాయి’ అన్న రూపంలో ఉండి, రాను రాను ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి’ అని మారినట్లుగా కనిపిస్తుంది.

భాస్కర శతకంలో ఈ సామెత వాడబడిన సందర్భములో విశదమయ్యే అర్ధానికీ, ఇప్పుడు వాడ బడుతూన్న అర్ధానికి కూడా తేడా కనిపిస్తుంది.  భాస్కర శతకంలో ఇది ‘ఆపత్కాలంలో పరస్పర సహకారం’ అన్న అర్ధంలో వాడబడి కనిపిస్తూండగా, ఇప్పుడు దానికి సంబంధం లేని అదృష్టంతో తారు మారు కాగలిగే పరిస్థితులకు సూచకంగా వాడబడుతోంది.

12, ఏప్రిల్ 2020, ఆదివారం

సామెతల కథలు - ఈగలమోత

సామెతల కథలు

ఈగలమోత

పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు. పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది విచిత్రసేనుడికి ఉపశమనం మాత్రమే కలిగిస్తోంది. అంతఃపురంలోని రాజపరివారమంతా ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోసాగారు.

వంద ఈగల్ని చంపితే ఒక బంగారు వరహాను బహుమతిగా ప్రకటించాడు విచిత్రసేనుడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. పనీపాట లేని వాళ్ళు తప్ప ఇతరులు ఈగల్ని చంపడానికి ఆసక్తి చూపలేదు. దాంతో.. ’ కోటనుంచి ఈగల్ని తక్షణమే తరమగలిగిన వారికి లక్షవరహాలు బహుమతి ఇవ్వబడుతుందని' దండోరా వేయించాడు.

మరుసటిరోజు కిరీటి అనే యువకుడు సభకు వచ్చాడు. ఈగల్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్న సంగతి విచిత్రసేనుడికి తెలియపరిచాడు. "నీవు ఏం చేసినా, ఎలా చేసినా... ఈగలమోత మాత్రం ఇక వినపడకూడదు. నీ పనిని ప్రారంభించు." అని రాజు ఆదేశించాడు. సభలోంచి బయటకు వెళ్ళిన కిరీటి ఓ అర్ధగంట తర్వాత తిరిగివచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికే ఈగలన్నీ బయటకు జారుకున్నాయి. సభలో ఒక్కటి కూడా లేదు! రాజు, సభికులు ఆనందం, ఆశ్చ్యర్యం కలగలిపిన ముఖాలతో ఉన్నారు.

"ఏం మంత్రం వేశావు? లేక ఏదైనా మాయ చేశావా?" విచిత్రసేనుడు అడిగాడు.

"ఇందులో మాయమంత్రాలు ఏమీలేవు... ఏదో నాకున్న కాస్త లోకజ్ఞానఫలితం" వినయంగా అన్నాడు కిరీటి.

"ఎలా చేసినా పెద్ద ఇబ్బందిని తొలిగించావు. ఇవిగో లక్ష వరహాలు.." అంటూ ధనం మూటను ఇవ్వబోయాడు విచిత్రసేనుడు.

"రాజా.. మీ బహుమతిని స్వీకరించలేక పోతున్నందుకు నన్ను క్షమించండి. ఈగలు మళ్ళీ కోటలోకి వచ్చి గతంలో లాగానే మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రస్తుతం నేను వాటిని కోట బయటికి మాత్రమే తీసుకెళ్ళగలిగాను. నాది శాశ్వతమైన పరిష్కారం కాదు."

"ఇంతకీ ఏం చేశావు?" గద్దించి అడిగాడు విచిత్రసేనుడు.

"పెద్ద బెల్లం ముద్దను కోట బయట ఉంచి వచ్చాను. దాంతో ఈగలన్నీ బెల్లం చుట్టూ చేరాయి. ఆ ముద్దను పూర్తిగా జుర్రుకోగానే కోటలోకి రావడం ఖాయం."
ఆ మాటలు వినగానే విచిత్రసేనుడికి కోపం తారాస్థాయికి చేరింది.

"మేము కోరింది శాశ్వతపరిష్కారం, ఇలాంటి చిట్కాలు కాదు. సమయం వృధా చేస్తే నీకు కారాగారశిక్ష తప్పదు." ఉచ్ఛస్థాయి గొంతుతో చెప్పాడు.

"శాశ్వతపరిష్కారం మీదగ్గరే ఉంది. విచక్షణ లేని ప్రజలు రాజ్యాన్ని చెత్తకుప్పలు, ఎరువుదిబ్బలుగా మార్చారు. వాటివల్ల పెరిగిన ఈగలు ఎన్నో రోజుల నుండి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోసాగాయి. పలుసార్లు మీ దృష్టికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటి ప్రభావం అంతఃపురానికి పాకిందనే దండోరా విన్నప్పుడు సమస్య పరిష్కార మవుతుందని సంతోషించాం. రాజ్యపరిస్థితిని పూర్తిగా తెలిపేందుకే వచ్చానుకాని, బహుమతి కోసం కాదు." వివరంగా చెప్పాడు కిరీటి.

విచిత్రసేనుడికి జ్ఞానోదయమైంది. మూలకారణాన్ని తొలగించాలే గాని, ఉపశమన చర్యల వల్ల సమస్య పరిష్కారం కాదని గ్రహించాడు. కిరీటిని మంత్రిగా నియమించుకుని రాజ్యాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనిని అప్పగించాడు.