LATEST UPDATES

7, మే 2016, శనివారం

ఎవరి పని వారే చెయ్యాలి (evari pani vare cheyali)

    అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాకలి రామయ్య ఉండేవాడు. ఆయనకు ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద రోజూ చాకిరేవుకు బట్టలు మోసేది. కుక్క ఇంటికి కాపల కుసేది. రామయ్య వాటికి సరైన ఆహారం పెట్టెవాడు కాదు. ఆహారం సరిగా పెట్టడం లేదని అవి రోజూ బాధపడుతుండేవి.
     ఒక రోజు రామయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. కుక్క దొంగలు రావడం చూసింది. కాని మొరగకుండా ఉండిపోయింది. గాడిద కూడా దొంగలు రావడం, కుక్కమొరగ కుండా ఉండడం గమనిస్తూనే ఉంది.
     ‘‘మన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారు కదా ఎందుకు నువ్వు మొరగడం లేదు? అవి అడిగింది గాడిద.
     ‘‘యజమాని మనల్ని ఉంచుకొన్నాడు. ఆయనకు మనం ఎంతో సేవ చేస్తున్నాం. అయినా మనకు కడుపు నిండా ఆహారం పెట్టడం లేదు. అందుకే నేను మొరగడం లేదు?’’ అంది కుక్క.
     గాడిద మనస్సు ఒప్పుకోలేదు. యజమాని ఎలాగైనా నిద్రలేపాలని బిగ్గరగా గాండ్రించడం మొదలు పెట్టంది.
     గాడిద అరుపులకు దొంగలు పారిపోయారు కాని, మంచి నిద్రలో ఉన్న రామయ్యకు, నిద్రాభంగం కలిగింది. గాడిద  అలా అరవడం అతనికి కోపం తెప్పించింది. కట్టె తీసుకొని గాడిదను ఎడాపెడా కొట్టాడు. ఆ దెబ్బకు గాడిద విలవిలలాడింది.
     ‘ఎవరి పని వారే చెయ్యాలి’ అని అందుకే అంటారు.

బాతు - బంగారు గుడ్డు(Bathu - Bangaru guddu)

     ఒక పల్లి ఒక బాతును తరుముతోంది.
     దీనిని రంగన్న అనే ఆసామి చూశాడు.
     పిల్లిని తరిమేసి బాతును కాపాడాడు.
     ‘‘రంగన్నా రంగన్నా నన్నెందుకు కాపాడావు’’ అంది బాతు.
     ‘‘నువ్వు ఆపదలో ఉన్నావు కదా అందుకే!’’ అన్నాడు రంగన్న.
     ‘‘నువ్వు నన్ను కాపాడవు కదా... నేను నీకు రోజుకో బంగారు గుడ్డును ఇస్తాను’’ అంది బాతు.
     చెప్పినట్లుగానే బాతు రంగన్నకు రోజుకో బంగారు గుడ్డు ఇవ్వసాగింది.
     రంగన్న వాటిని అమ్ముకొని  ధనవంతుడయ్యాడు.
     ధనవంతుడైన రంగన్నకు దురాశ కలిగింది.
     ‘ఈ బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతోంది.
     దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉంటాయో ఏమో! దీని కడుపు కోస్తే అన్నీ ఒకే మారు తీసుకోవచ్చు కదా!’ అనుకొన్నాడు.
     బాతు కడుపును కోశాడు.
     కాని దాని కడుపులో మరుసటి రోజు గుడ్డు ఒకటి మాత్రమే ఉంది.
     ‘అయ్యో! బంగారు బాతును చేతులారా చంపుకొన్నానే’ అని ఏడుస్తూ కూర్చున్నాడు రంగన్న.

కూరగాయల కథ (Kuragayala katha)

     అనగనగా ఉల్లిపాయంత ఊరు.
     ఆ ఊరిలో ఉండే ముసలమ్మ ఒక రోజు పొలం వెళుతోంది.
     ఆమెకు వంకాయంత వజ్రం దొరికింది.
     ఆ వజ్రాన్ని భద్రంగా పట్టుకొని ఇంటికి వచ్చింది.
     దాన్ని బీరకాయంత బీరువాలో దాచింది.
     ముసలమ్మ వజ్రాన్ని దాచడం కిటికీ లోంచి దొండకాయంత దొంగ చూశాడు.
     ముసలమ్మ తిరిగి పొలం వెళ్ళిపోయాక వాడు బీరకాయంత బీరువాను పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు.
     ఆ దొంగను ముసలమ్మ చూసింది.
     వెంటనే పొట్లకాయంత పోలీసుకు వెళ్ళి చెప్పింది.
     ఆ పోలీసు జీడి పప్పంత జీపు వేసుకొని దొండకాయంత దొంగను పట్టుకొన్నాడు.
     జామకాయంత జైలులో పెట్టాడు. ఆ జైలుకు తాటి కాయంత తాళం వేశాడు.

కోతి - మేకు(Kothi - Meku )

     ఒక చెట్టుపైన కొన్ని కోతులున్నాయి. ఆ చెట్టు కింద వడ్రంగి వారు పని చేస్తున్నారు.
     మధ్యాహ్నం వండ్రంగి వారు ఇంటికి వెళ్ళి పోయారు.
     అంతకు ముందు వారు చేసిన పనిని కోతులు గమనించాయి. అవి కిందికి దుమికి ఆడుకోసాగాయి.
     వాటిలో ఒక కోతి ఒక దూలంపైకి ఎక్కింది. ఆ దూలాన్ని పనివాళ్ళు మధ్యకు నిలువుగా కోస్తున్నారు. పని పూర్తి కాలేదు. సగం చీలిన దూలం మధ్య మేకులు ఉన్నాయి.
     ‘‘ఏయ్ నేనేం చేస్తున్నానో చూడు’’ అంది దూలం మీదికి ఎక్కిన కోతి.
     ‘‘ఇంత క్రితం వాళ్ళు మేకులు పెడుతూ తీశారు కదా’’ అంది చాలా తెలివి ఉన్న దానిలా.
     ‘‘అవునవును’’ అంటూ అన్నీ తల లూపాయి.
     ‘‘ఇప్పుడు నేను  ఈ మేకులు తీయబోతున్నాను’’ అంది.
     ‘‘అలాగలాగే’’ అన్నాయి. మిగితా కోతులన్నీ ముక్త కంఠంతో.
     కోతి మేకు ఊడ బెరికెటప్పుడు ఆ దూలం రెండు భాగాల మధ్య కోతితోక ఉండిపోయింది. కోతి మేకు ఊడబెరకగానే ఆ రెండు భాగాలు మూసుకుపోయి తోక అందులో ఇరుక్కుపోయింది.
     మేకు పీకినందున మిగితా కోతులన్నీ చప్పట్లు కొట్టాయి. కాని ఈ కోతికి మటుకు కళ్ళలోంచి నీళ్ళు కారాయి.
     ఇంతలో వడ్రంగి పనివాళ్ళు వచ్చారు. మిగితా కోతులన్నీ పారిపోయాయి. ఈ కోతి మాత్రం మిగిలిపోయింది.
     ‘‘మళ్ళీ ఇలాంటి పని చేస్తావా?’’ అడిగాడు వడ్రంగి.
     ‘‘చేయను. బుద్దొచ్చింది.’’ అని లెంపలేసుకొంది కోతి.
     వడ్రంగి మళ్ళీ మేకు కొట్టడంతో కోతి తోక బయటి కొచ్చింది. ‘బ్రతికాన్రా’ అనుకొని పారిపోయింది తోకను‘ఉఫ్ ఉఫ్’ అని ఊదుకొంటూ!

కుక్క - మాంసపు ముక్క (kukka - mamsapu mikka)

     అనగా అనగా ఒక కుక్క.
     దానికి ఆకలి వేసి ఆహారం కోసం వెదకసాగింది.
     కుక్కకు ఒక మాంసపు ముక్క దొరికింది.
     అది నోగ కరుచుకొని మంచి స్థలంలో కూర్చుని తిందామనుకొంది.
     కుక్క వెళుతున్న దారిలో దానికి ఓ కాలువ కనబడింది.
     కాలువకు అటువైపు వెళ్ళి తిందామని కాలువ మీదున్న తాటి వంతెన మీదుగా నడుస్తూ నీళ్ళలోకి చూసింది.
     నీటిలో తన నీడ కనిపించింది.
     ఆ నీడను చూసి మరో కుక్క నీటిలో ఉంది అని అది అనుకొంది. దాని నోట్లో మాంసం ముక్క కూడా తీసుకుంటుందని ‘భౌ భౌ’ అని అరిచింది.
     కుక్క నోట్లో మాంసం ముక్క నీళ్ళలో పడిపోయింది.
     ‘అయ్యో!’ అనుకొంటూ మాంసం ముక్క కోసం కుక్క నీళ్ళలోకి దుమికింది. నీటిలో అది తడిచిపోయింది కాని మాంసం ముక్క దొరకలేదు.

పిల్లికి సన్మానం (Pilliki sanmanam)

     ఒక ఇంటిలో ఒక పెద్ద గండు పిల్లి ఉండేది.
     అది ఆకలేసినప్పుడల్లా ఎలుకలను పట్టి తినేది.
     ఎలుకలన్నీ ఒక రోజు గుంపుగా చేరాయి.
     పిల్లి కాళ్ళకు గజ్జెలు కట్టాలని నిర్ణయించాయి.
     దాని కాళ్ళకు గజ్జెలు కడితే అది వచ్చినప్పుడు గజ్జల మోత వినిపిస్తుంది.
     అది విని తాము పారిపోవచ్చుని అనుకొన్నాయి.
     కాని పిల్లి కాళ్ళకు గజ్జెలు ఎవరు కట్టేది ?
     గజ్జెలు కట్టడానికి వెళ్ళే ఎలుకను పిల్లి తినేస్తుంది.
     తెలివిగల చిట్టెలుక ‘‘కుక్క మామను పిలుద్దాం’’ అంది.
     ఎలుకలు కుక్కమామను కలిసి తమ ఆలోచన చెప్పాయి.
     కుక్క సరే అని పిల్లి దగ్గరకు వెళ్ళింది.
     ‘‘పిల్లీ! పిల్లీ! నీకు ఘన సన్మానం చెయ్యాలని అనుకొంటున్నాం. నీ అంగీకారం వచ్చాను’’ అంది.
     కుక్క వచ్చి అలా అడగటంతో సంతోషపడింది.
     పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. ఎలుకలు ‘‘ అందమైన దానివి నువ్వు. నీ కాళ్ళకు గజ్జలు కడిదే మరింత అందంగా ఉంటావు’’ అంటూ పొగిడాయి.
     ఆ పొగడ్తల మైకంలో పిల్లి ‘సరే’ అంది.
     ఎలుకలు పిల్లికి గజ్జెలు కట్టాయి.
     ఆ వేదిక మీద పిల్లి హుందాగా అటూ ఇటూ పచార్లు చేసింది. ఆనందంలో నృత్యం చేసింది. ఎలుకలు ‘ఆహా ఓహో’ అన్నాయి.
    ఎలుకల సమస్య తీరిపోయింది.
     పిల్లి వచ్చిన ప్రతిసారీ గజ్జెల చప్పుడు వినిపించేది. దాంతో ఎలుకలు పారిపోయి ప్రాణాలు కాపాడుకొనెవి.

కోడి - కుక్క - నక్క (Kodi - kukka - nakka)

     అనగా అనగా ఒక అడవిలో కోడి, కుక్క ఉండేవి.
     అవి రెండు మంచి స్నేహితులు. ఒక రోజు కోడి, కుక్క సరదాగా షికారు బయలు దేరాయి అలా వెళుతూ, వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది. అరె! చీకటి పడింది. ఇప్పుడెలా? అడవి జంతువులు వస్తాయో ఏమో అనుకొని భయపడ్డాయి. కోడి తెలివిగా చెట్టుమీద కూర్చింది. కుక్కేమో చెట్టు తొర్రలో దాక్కుంది.
     కొంత సేపటికి ఒక నక్క అటువైపుగా పోతూ కోడిని చూసింది.
     ‘‘కోడమ్మా! కోడమ్మా! పాట పాడవా’’ అని అడిగింది.
     ‘‘కొక్కొరకో .... కో’’ అంటూ కోడి పాట పాడింది.
     ‘‘కోడమ్మా - కోడమ్మా చెట్టు దిగి వచ్చి పాడవా?’’ అంది నక్క.
     నక్క మోసం కోడికి అర్థం అయింది.
     ‘‘నక్క బావా! నక్క బావా! నా యింకో స్నేహితుడు చెట్టు తొర్రలో ఉన్నడు. వాడిని అడుగు’’ అంది.
     ఎంచక్కా వాణ్ణి తినొచ్చు. ఆ తర్వాత నీ సంగతి చూస్తా’’ అనుకొని నక్క చెట్టు తొర్రలో మూతి పెట్టింది.
     లోపల ఉన్న కుక్క నక్కను కరిచింది.
     ‘‘చచ్చాను బాబోయ్!’’ అని అరుస్తూ నక్క పరుగు తీసింది.
     కోడి - కుక్క సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి.

గాడిద - తోడేలు(Gadida - Thodelu)

     ఒక గాడిదకు ముల్లు గుచ్చుకొంది.
     కుంటడం మొదలు పెట్టింది.
     అడవిలో ఉండే తోడేలు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఊరి దగ్గరికి వచ్చింది.
     దానికి కుంటే గాడిద కనిపించింది.
     దాన్ని ఎలాగైనా తినాలని తోడేలు అనుకొంది.
     గాడిద కూడా తోడేలును చూసింది. దానికి భయం వేసింది.
     పారిపోదామంటే కాలులో ముల్లు గుచ్చుకొంది కదా!
     ఏం చెయ్యాలా అని ఆలోచించింది.
     ‘‘గాడిదా! గాడిదా! ఎందుకు కుంటుతున్నావ్?’’ అని అడిగింది తోడేలు.
     ‘‘ నా కాల్లో ముల్లు గుచ్చుకొంది. నువ్వు నన్ను తినాలనుకొంటే ఆ ముల్లు నీకు గుచ్చుకొంటుంది. అందుకని ముందు ముల్లు తియ్యి. అప్పుడు ఎంచక్కా తినొచ్చు’’ అంది గాడిద.
     ‘‘ఓహో అలాగా!’’ అంటూ తోడేలు గాడిద కాలిలో ముల్లు తీయడానికి కూర్చుంది.
     తోడేలు నోటితో ముల్లు తీయగానే దాని మూతి మీద గాడిద కాలితో ఓ తన్ను తన్నింది.
     ‘‘అయ్య బాబోయ్ చచ్చాన్రో’’ అంటూ తోడేలు అడవిలోకి పరుగు పెట్టింది.

కోతి - రెండు పిల్లలు (Kothi -Rendu pillulu)

     రెండు పిల్లులు మంచిగా స్నేహంగా ఉండేవి.
     వాటికి ఒకరోజు ఒక రొట్టే దొరికింది.
     ‘‘ముందు నేను చూశాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ యివ్వాలి’’ అంది ఓ పిల్లి.
     ‘‘కాదు నేనే చూశాను. నాకే కొద్దిగా ఎక్కువ యివ్వాలి’’ అంది రెండో పిల్లి.
     ఇలా కొద్ది సేపు వాదులాడుకొని రెండూ సరిసమంగా పంచుకోవాలని నిర్ణయించుకొన్నాయి.
     మళ్ళీ మనం గొడవ పడకుండా మధ్యవర్తిని ఎవరినైనా పెట్టుకొందాం మనుకొన్నాయి.
     మధ్యవర్తి కోసం వెళుతున్న వాటికి కోతి బావ ఎదురయ్యాడు. వీళ్ళ గొడవ విన్నాడు.
     సరే నేను మీకు గొడవ రాకుండా రొట్టెను సరిసమానంగా పంచుతానని ఓ త్రాసు తెచ్చాడు. రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో అటూ ఇటూ వేశాడు.
     ఓ వైపు మొగ్గు ఎక్కువ చూపింది. ఎక్కువ ఉన్నవైపు రొట్టె కొంచెం ముక్క తీసుకొని నోట్లో వేసుకొన్నాడు కోతిబావ. అలా ఆ రొట్టెను దాదాపు సగం వరకు కోతిబావే తినేశాడు.
     మన మధ్య పంపకానికి మూడో వాడి దగ్గరకు వెళితే మనకి అసలుకే మోసం వస్తుందని పిల్లులు గ్రహించాయి.
     ‘‘నీ తీర్పు ఇక చాలు’’ అంటూ మిగిలిన రొట్టె తీసుకొని పిల్లులు ఉడాయించాయి.

6, మే 2016, శుక్రవారం

రంగు మారిన తోడేలు(Rangu Marina Thodelu)

     ఒక తోడేలు అడవిని దాటింది. ఊరు చేరింది. ఎక్కడైనా ఒక కోడిని పట్టుకొని గుటుక్కున మింగేద్దామని దాని ఆలోచన. ఒక ఇంటిలోకి దూరింది. అది రంగులద్దే వాడి ఇల్లు. తోడేలు కాలుజారి నీలిరంగు నింపి ఉన్న తొట్టెలో పడింది. ఆ రంగంతా అంటుకొని తోడేలు కాస్తా నీలిరంగు తోడేలై పోయింది.
     అడవిలోకి వెళ్ళిన తోడేలును మిగితా జంతువులు వింతగా చూశాయి.
     ‘‘నే నెవరను కొన్నారు?’’గంభీరంగా అడిగింది తోడేలు.
     ‘‘మాకు తేలీదు’’ ముక్త కంఠంతో అన్నాయి మిగితా జంతువులు.
     ‘‘నన్ను చంద్ర లోకం నుండి దేవుడు పంపించాడు’’ మరింత గంభీరంగా, హుందాగా అంది తోడేలు.
     మిగితా జంతువులన్నీ భయపడ్డాయి.
     ‘‘ఇవాల్టి నుండి మీ రాజును నేనే ... లేదంటే దేవుడికి కోపం వస్తుంది’’ అంది బెదిరిస్తున్నట్లు.
     ‘‘అవును - అవును -అలాగే .... అలాగే.... నువ్వే మా రాజువి’’ అన్ని జంతువులు చేతులు జోడించి చెప్పాయి.
     సింహం తన తలపైని కిరీటాన్ని తీసి నీలి తోడేలు తలపైన ఉంచింది. తోడేలు రాజయింది. తనిప్పుడు రాజు కదా! తోడేేలు లాగ ఉండ కూడదు అని చాలా జాగ్రత్తగా చాలా ఠీవిగా ఉండసాగింది.
     ఒకరోజు నాలుగైదు తోడేళ్ళు కలిసి ఒకేసారి గుంపుగా అరిచాయి. నీలిరంగు తోడేలు తన నైజ గుణాన్ని అణచుకోలేకపోయింది. తాను కూడా మిగిలిన తోడేళ్ళలాగ అరిచింది. దాని బండారం బయట పడింది.
     ఏనుగు తొండంతో నీళ్ళు తెచ్చి దానిమీద కుమ్మరించింది. తోడేలు అసలు రంగు బయట పడింది. తోడేలు పారిపోయింది. జంతువులు పకపకా నవ్వాయి.

కట్టెలు కొట్టేవాడు (Kattelu Kottevadu)

     అనగా అనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు.
     అతడు చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్దాలు చెప్పేవాడు కాదు.
     ఒకరోజు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్టసాగాడు.
     ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది.
     కట్టెలు కొడతూ ఉంటే గొడ్డలి చెయ్యిజారి బావిలో పడింది.
     గొడ్డలి పోవడంతో అతను చాలా బాధ పడ్డాడు.
     చెట్టు దిగి ఏడవడం మొదలు పెట్టాడు.
     ఇంతలో జలదేవత ప్రత్యక్షమైంది.
     ‘‘ఎందుకయ్యా ఏడుస్తున్నావు?’’ అని అడిగింది.
     ‘‘ నా గొడ్డలి బావిలో పడిపోయింది’’ అన్నాడు.
     ‘‘బాధ పడకు నేను తెచ్చి యిస్తాను’’ అంటూ మాయమైంది. కొద్ది సేపటిలోనే ఒక బంగారు గొడ్డలి తెచ్చింది. ‘‘ఇది నాది కాదు’’ అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే అని జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది.
     ‘‘ఇది కూడా నాది కాదు’’ అన్నాడు కట్టెలు కొట్టేవాడు.
     జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి నిజంగానే అతని గొడ్డలి తెచ్చింది. దాన్ని చూడగానే ఆనందంగా ‘‘ఇధి నా గొడ్డలే!’’ అన్నాడు కట్టెలు కొట్టేవాడు.
     జలదేవత అతని నిజాయితీని మెచ్చుకొంది.
     ‘‘నీది కాని దాని కోసం ఆశపడక నిజాయితీగా నిజమే చెప్పినందుకు నీకు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా బహుమతిగా యిస్తున్నాను’’ అంది.

నాలుగు తోకల ఎలుక ( Nalugu Thokala Eluka)

     అనగా అనగా ఎలుక.
     దానికి నాలుగు తోకలుండేవి.
     దానిని అందరూ గేలి చేసేవారు.
     ‘‘నాలుగు తోకల ఎలుక నాలుగు తోకల ఎలుక’’ అని పిలిచేవారు.
     ఎలుక పిల్లల అరుపులు భరించలేక దర్జీ దగ్గరకు వెళ్ళి ఒక తోక కత్తిరించమంది.
     దర్జీ తోకను కత్తిరించాడు.
     మరునాటి నుండి పిల్లలు మూడు తోకల ఎలుక అని పిలిచేవారు.
     ఎలుక కోపంతో వెళ్ళి దర్జీతో మళ్ళీ ఒక తోకను కత్తిరించమంది.
     దర్జీ అలాగే తోకను కత్తిరించాడు.
     అయినా పిల్లలు గోల చేయడం ఆపలేదు.
     ఇప్పుడు ‘ రెండు తోకల ఎలుక రెండు తోకల ఎలుక’ అని గోల చేయసాగారు.
     ఎలుక మరో తోకను కత్తిరించమంది.
     ఎలుకకు ఒకటే తోక మిగిలింది.
     తెల్లవారింది. జనం ‘ఒంటి తోక ఎలుక, ఒంటి తోక ఎలుక’ అనసాగారు.
      పాపం ఎలుక ఈ గొడవ పడలేక ఉన్న ఒక తోకా కత్తిరించేయమంది.
     మరి జనం ఊరకుంటారా?
     ‘‘తోకలేని ఎలుక తోకలేని ఎలుక’’ అనడం మొదలు పెట్టారు.

తేలు - తాబేలు (Thelu - Thabelu)

     ఒకసారి ఒక తేలు నీళ్ళలో పడి కొట్టుకొని పోతుంది.
     దానికి ఈత రాదు కదా!
     ఒక తాబేలు కొట్టుకు పోతున్న తేలును చూసింది.
     పాపం అనుకొని ‘‘తేలూ తేలూ నా మీద ఎక్కు నిన్ను ఒడ్డుకు చేరుస్తాను’’ అంది.
     తేలు తాబేలు వీపు మీద ఎక్కింది.
     కానీ అది తాబేలును కుట్టడం మొదలు పెట్టింది.
     తాబేలుకు బాధ అనిపించింది.
     ‘‘నేను నీకు సహాయం చేస్తుంటే నన్నెందుకు కుడుతున్నావు’’ అంది తాబేలు.
     ‘‘కుట్టడం నా స్వభావం’’ అంది తేలు.
     ‘‘ఓహో అలాగా! అయితే మనగడం నా స్వభావం’’ అంటూ తాబేలు బుడుంగున నీటిలో మునిగి పోయింది.
      అంతే! తేలు మళ్ళీ నీళ్ళలో పడి కొట్టుకు పోయింది.

నీకు ఒకటి నాకు రెండు (Neeku Okati Naku Rendu)

     ఒక గ్రామంలో ఓ భార్యాభర్తలు జంట ఉండేది.
     ఇద్దరికీ చాదస్తం ఎక్కువ. ఒక రోజు భర్త జొన్నలు తెచ్చి రొట్టె చేయమంది.
     భార్య చక్కగా రొట్టెలు చేసింది.
     భర్త తెచ్చిన జొన్నలతో మూడు రొట్టెలు అయ్యాయి.
     ఇద్దరూ తినడానికి కూర్చున్నారు.
     భార్య రెండు రొట్టెలు వేసుకొని భర్తకు ఒకటి వేసింది.
     అది చూసి భర్త నాకు రెండు నీకు ఒకటి అన్నాడు.
     కాదు నాకు రెండు నీకు ఒకటి అంది భార్య.
     ఈ విధంగా ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు.
     చివరకు ఒక ఒప్పందానికి వచ్చారు.
     ఇద్దరూ కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి.
     ఎవరు కదిలినా, మాట్లాడినా వాళ్ళు ఒక రొట్టే తినాలి.
     ఇద్దరూ సరే అంటే సరే అనుకొని కదలకుండా, మాట్లాడకుండా కూర్చున్నారు.
     కొద్దిసేపటికి ఒక కుక్క వచ్చింది.
     భార్యాభర్తలిద్దరినీ చూసింది. వాళ్ళు కదలడం లేదు.
     కుక్క భౌ భౌ అని అరిచింది.
     అయినా కదలలేదు.
     మెల్లగా వారిద్దరి మధ్యలో ఉన్న రొట్టెలను ఎత్తుకొని పోయింది.
     భార్యాభర్త లిద్దరూ లబోదిబోమని ఏడ్చారు.

పట్టిందల్లా బంగారం (Pattindalla Bangaram)

     అనగా అనగా ఒక ఊరు.
     ఆ ఊరిలో ఒక ధనవవంతుడైన వ్యాపారి ఉన్నాడు.
     ఆయన పేరు కోటయ్య.
     ఆయన దగ్గర కావలసినంత డబ్బు, బంగారం ఉంది.
     అయినా ఇంకా బంగారం కావాలని ఆశ పుట్టింది.
     గుడికి వెళ్ళి దేవతను ప్రార్థించాడు.
     దేవత ప్రత్యక్షమై ‘ఎం వరం కావలో కోరుకో’ అంది.
     కోటయ్య ‘‘ నేను పట్టిందల్లా బంగారం కావాలి’’ అని కోరుకొన్నాడు.
     ‘‘సరే! నువ్వు కోరిన వరం ఇచ్చాను వెళ్ళు’’ అంది దేవత.
     కోటయ్య ఇంటికి వచ్చాడు.
     ఆయన పట్టుకొన్నదల్లా బంగారు అయింది.
     తోటలోకి వెళ్ళి పూల మొక్కలను తాకాడు.
     అవి కూడా బంగారంగా మారాయి.
     కోటయ్య ఆనందానికి హద్దులు లేవు.
     కాసేపటికి ఆయనకు ఆకలి వేసింది.
     వంట గదిలోకి వెళ్ళి ముందుగా కాసిన్ని నీళ్ళు తాగాలను కొన్నాడు.
     కాని అతని చేయి తగలగానే నీరు బంగారంగా మారిపోయింది.
     అంతలో ఆయన కూతురు వచ్చింది.
     కూతురును ముట్టుకోగానే ఆమే కూడా బంగారం విగ్రహాంగా మారిపోయింది.
     కోటయ్యకు ఏడుపు ఆగలేదు.
     వెంటనే దేవతను తలచుకొన్నాడు.
     దేవత ప్రత్యక్షమై ‘‘ మళ్ళీ ఏం కావాలి?’’ అని అడిగింది.
     ‘‘అమ్మా! నాకేమి వద్దు. నీ వరం నువ్వు వెనక్కి తీసుకో!’’ ఉన్నదాంతోనే తృప్తిగా జీవిస్తాను అన్నాడు.
     ‘‘సరే’’ అంటూ దేవత మాయం అయింది.
     కోటయ్య మామూలు మనిషిగా మారి హాయిగా ఉన్నాడు.

బలపం (Balapam)

     రాధ పలక మీద అ ఆ లు దిద్దుతోంది.
     దిద్దుతూ గట్టిగా పలుకుతోంది.
     అంతలో రాధని వాళ్ళమ్మ పిలిచింది. రాధ పలక, బలపం పక్కన పెట్టింది. అమ్మ దగ్గరకు పరుగు తీసింది.
     అప్పటిదాకా రాధ వేళ్ళ మధ్య ఉన్న బలపం ‘ అమ్మయ్య’ అని గాలి పీల్చుకొంది. ఈ పాపను వాళ్లమ్మ ‘రాధ’ అని కేక వేసింది. ఆ పాప పేరు రాధ అయితే మరి నా పేరు? అనుకొంది బలపం.
     బలపానికి ఎంతసేపు ఆలోచించిన తన పేరు గుర్తు రాలేదు.
     రాధ వచ్చేలోగా తన పేరు తెలుసుకు రావాలని బయలు దేరింది బలపం.
     బలపానికి గబగబా నడిచి వెళుతున్న ఒక టీచర్ ఎదురయ్యాడు.
     ‘‘సార్ సార్! నా పేరు మరచి పోయాను. ఒకసారి గుర్తు చేయరా?’’ అని అడిగింది బలపం.
     ‘‘నాకు ఇప్పటికే బడికి ఆలస్యం అయిపోయింది. పిల్లలకంటే ముందుగానే టీచర్ బడిలో ఉండాలి. ఇప్పుడు కాదు తర్వాత కనబడు’’ అంటూ వెళ్ళి పోయాడు టీచర్.
     బలపం దగ్గరలో ఉన్న పాఠశాల వైపు నడుస్తోంది. దానికి రోడ్డు మీద ఒక కనిపించింది. బలపం పుస్తకం దగ్గరకు వెళ్ళింది.
     ‘‘ మా రాధమ్మ అ ఆ లు దిద్దుతుంటే నా పేరు మర్చిపోయాను. నా పేరు ఏమిటి?’’ అని అడిగింది బలపం.
     ‘‘నువ్వు యిలా రోడ్ల మీద పడి అందరినీ అడిగే బదులు మీ రాధనే అడగవచ్చు కదా?’’ అంది పుస్తకం.
    బలపానికి ఆ ఆలోచన నచ్చింది. వెంటనే ఇంటికి వెళ్ళింది. ఏం తెలీనట్లు పలక పక్కనే కూర్చింది.
     ‘‘ఎక్కడికి పోయావు’’ అడిగింది పలక.
     ‘‘ నాపేరు మర్చిపోయా! తెలుసుకొందామని వెళ్ళాను’’ అంది.
     నన్నడిగే నే చెప్పేదాన్ని కదా! నీ పేరు బలపం. నా పేరు పలక. మనిద్దరి సహకారం లేనిదే ఎవరూ అ ఆ లు కూడా నేర్చుకోలేరు’’ అంది పలక.

నక్క - ద్రాక్షపళ్ళు (Nakka Draksha pallu )

     ఒక నక్కకి ఆకలి వేసింది.
     ఏదైనా తిందామని వెదుకుతూ బయలు దేరింది.
     ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు ద్రాక్షతోట కనిపించింది.
     దానికి నోరు ఊరింది.
     ద్రాక్ష పందిరి ఎత్తుగా ఉంది.
     ఓ గెంతు గెంతి అందుకోవాలని ప్రయత్నించింది.
     ద్రాక్ష పళ్ళ గుత్తి అందలేదు.
     ‘ఇంకాస్త పైకి’ అనుకొంటూ మళ్ళీ మళ్ళీ గెంతింది.
     ఎంతసేపు గెంతినా ద్రాక్షపళ్ళు అందలేదు.
     నోరు ఊరించే ద్రాక్షపళ్ళు ఆనక్కకు అందలేదు.
     అవి దానికిప్పుడు అందంగా కనిపించడం లేదు.
     ‘‘ఛీ! ఈ పళ్ళు ఏం బాగుంటాయి? పుల్లగా ఉంటాయి’’ అనుకొంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది.

దాచిన సంపద(Dhachina Sampada)

     అనగనగా అనగా ఒక రైతు.
     ఆయనకు ఐదుగురు కొడుకులు.
     వాళ్ళు తండ్రి సంపాదించింది తింటూ సోమరులుగా తిరిగే వాళ్ళు.
     రైతుకు కొడుకుల గురించి బెంగ పట్టుకొంది.
     ఆయన చాలా కాలం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
     ఒక రోజు కొడుకులను పిలిచి యిలా చెప్పాడు.
     ‘‘మన కుటుంబం భూమిని నమ్ముకుని జీవిస్తోంది. చాలా కాలంగా మీకు తెలీకుండా కొంత ధనం పోగుచేసి మన పొలంలో దాచి ఉంచాను. నేను పెద్ద వాడినై పోమాను. ఆ నిధి ఎక్కడ దాచానో ఇప్పుడు గుర్తులేదు. మీరు మన పొలంలో వెతికి ఆ నిధిని తీసుకోండి. మీ జీవితం సుఖంగా గడిచి పోతుంది’’. ఐదుగురు కొడుకులు పొలం అంతా తవ్వి చూశారు. ఎంత తవ్వినా తండ్రి చెప్పిన నిధి వారికి దొరకలేదు.
     తండ్రి మీద కాళ్ళు ఎంతగానో చిరాకు పడ్డారు.
     ‘‘నేను మీ కోసం నిధిని దాచింది నిజమే! సమయం వచ్చినపుడు అది బయట పడుతుంది. మీరు ఎలాగూ భూమిని చక్కగా తవ్వారు కాబట్టి సాగు చెయ్యండి’’ అన్నాడు రైతు.
     తండ్రి చెప్పింది విని కోపం వచ్చినా, తప్పదు కదాని పొలం సాగు చేశారు.
     పంట విరగ పండింది.
    రైతు కొడుకులను మళ్ళీ చేర పిలిచి ‘‘నాయనలారా! మీరు పండించిన పంటే నేను దాచి పెట్టిన నిధి. కష్టపడితే ప్రతి సంవత్సరం మీకీ నిధి దొరుకుతుంది’’ అన్నాడు.
     రైతు కొడుకులకు శ్రమించడంలోని ఆనందం తెలిసి వచ్చింది.

ఐకమత్యం(Ikamathyam)

     మన శరీరంలో కాళ్ళు, చేతులు, తల, నోరు ఇలా చాలా అవయవాలున్నాయి. అవన్నీ సవ్యంగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం!
     ‘‘నడవాలన్నా, పరిగెత్తాలన్నా నేనే చెయ్యాలి. నా గొప్పదనం మిగితా వాటికి తెలియడం లేదు’’ అనుకొన్నాయి. కాళ్ళు. వెంటనే నడవడం మానుకొన్నాయి.
     ‘‘ఏ పని చెయ్యాలన్నా నేనే కదా చెయ్యాల్సింది. ముట్టుకోవడం, పట్టుకోవడం, మొయ్యడం అన్నీ నేనే. నా గొప్పదనం ఎవరూ గుర్తించండం లేదు. కాళ్ళేమో తామే గొప్ప అనుకొంటూ నడవడం మానేశాయి. సరే! నేను నా పని చెయ్యను’’ అనుకొని చేతులు పని చెయ్యడం మానేశాయి.
     వీటిని చూసి కళ్ళు చూడటం మానేశాయి. నోరు ఆహారం తీసుకోవడం మానేసింది.
     నోరు ఎప్పుడైతే ఆహారం తీసుకోవడం మానేసిందో అప్పటి నుండి మిగితా అవయవాలు దానివైపు గుర్రుగా చూడసాగాయి. రెండు మూడు రోజులు గడిచేసరికి వాటి శక్తి సన్నగిల్లిపోయింది.
     ఇహ లాభం లేదని అవన్నీ నోటి దగ్గరకు వెళ్ళి ఆహారం తీసుకోమని వేడుకొన్నాయి. అది ‘సరే’ అంది.
     ‘‘కాళ్ళు, చేతులు, తల, కళ్ళు, చెవులు, గుండె, ఊపిరితిత్తులు ఇలా మనందరం ఒక చోట ఉంటున్నాం. మనం ఎవరు గొప్ప అని పోటీపడితే తేల్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరిగొప్ప వారికి ఉంది. గొప్పలు పక్కన పెట్టిన ఐకమత్యంతో ఉంటే ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు’’ అంది నోరు.

5, మే 2016, గురువారం

ఎవరు గొప్ప? (Evaru goppa)

     ఒక నాడు అడవిలో జంతువులు, పక్షులు ఒక చోట చేరాయి.
     ‘‘నేను గొప్పంటే నేను గొప్ప’’ అని పోటీ పడ్డాయి.
     ‘‘అందరి కంటే పెద్దగా, బలంగా ఉంటాను నేనే గొప్ప’’ అంది ఏనుగు.
     ‘‘అందరి కన్నా గొప్ప దాన్ని నేనే కదా! అందుకే నన్ను మృగరాజు అంటారు’’ అంది సింహం.
     ‘‘అందరి కంటే వేగంగా పరుగెత్తుతాను. కాబట్టి నేనే గొప్ప’’ అంది జింక.
     ‘‘నిన్ను వేటాడి చంపేస్తాను కదా? నా కన్నా నువ్వు గొప్పా?’’ అని మండిపడింది పులి.
     ‘‘నాలాగ ముద్దుగా ఎవరూ పలకలేరు. కాబట్టి నేనే గొప్ప’’ అంది చిలుక.
     నాలాగ ఎవరూ అందంగా నాట్యం చెయ్యలేరు. అందువల్ల నేనే గొప్ప’’ అంది నెమలి తన పింఛం విప్పుతూ.
     ‘‘నేను లేకుండా వనమే లేదు. నా వల్లే చెట్లు కాయలు కాస్తాయి. కాబట్టి నేనే గొప్ప’’ అంది సీతాకోక చిలుక.
     ఇదంతా వింటున్న వనదేవత చిరునవ్వుతో వారి మధ్య ప్రత్యక్షమయింది.
     ‘‘మీరు మాట్లాడు కొంటున్నదంతా నేను విన్నాను. మీరందరూ ఉంటేనే వనానికి అందం. మీలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎవరి గొప్పవారిదే! ఇంకెప్పుడూ యిలాంటి విషయాల్లో పోటీ పడకండి. నేల తల్లి ఆనందంగా ఉండాలంటే వనాలు కావాలి. నేను సంతోషంగా ఉండాలంటే మీరంతా ఉండాలి’’ అంది.
     అది విని అడవిలోని జంతువులు, పక్షులు తమలో తాము ఎవరు గొప్పని వాదులాడుకోవడం తప్పని తెలుసుకొన్నాయి.

గంగాళం చచ్చిపోయింది (Gangalam chachipoindi)

     తెనాలి రామలింగడు ఇంటికి సమీపంలో పాపాయమ్మ అనే ఆవిడ ఉండేది.
     పెళ్ళిళ్ళు, పేరంటాలు వంటి శుభకార్యాలకు అవసరమైన పాత్రలు అవీ అద్దెకు యిచ్చి జీవనం సాగించేది.
     ఆ ఊళ్ళో అలా పాత్రలను అద్దెలకు యిచ్చేవారు ఎవరూ లేకపోవడంతో ఆవిడ ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉండేది.
     ఆవిడకు ఎలాగైనా బుద్ది వచ్చేలా చేయాలని రామలింగడు అనుకొన్నాడు.
     ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళి ఓ మూకుడును అద్దెకు తెచ్చుకొన్నాడు.
     రెండు రోజుల తరువాత దాన్ని తిరిగి యిచ్చేస్తూ ఓ అట్లకాడను కూడా ఇచ్చాడు.
     మీరు ఇచ్చిన మూకుడు రాత్రి అట్లకాడను ప్రసవించింది అని చెప్పాడు.
     కానీ ఖర్చులేకుండా ఊరికే అట్లకాడ రావడంతో పాపాయమ్మ సంతోషించింది.
     కొద్ది రోజులు గడిచాక రామలింగడుకు గంగాళం అవసరమైందని తీసుకువెళ్ళాడు.
     మర్నాడు ఉదయమే వచ్చి పాపాయమ్మను నిద్రలేపి ‘‘పాపాయమ్మ గారూ! మీ గంగాళం రాత్రి ప్రసవ వేదనతో పురిటిలో చనిపోయింది. అది ఈ చెంబును కనింది’’ అంటూ పాపాయమ్మకు ఓ చిన్న చెంబు యిచ్చి కన్నీరు పెట్టాడు.
     పాపాయమ్మ కోపంతో ‘‘గంగాళం ఎక్కడైనా చచ్చిపోతుందా?’’ అని అరచి గొడవ చేసింది.
    ‘‘ఆ రోజు మూకుడుకు అట్లకాడ పుట్టినప్పుడ, ఈ గంగాళం ప్రసవించడంలో చనిపోడంలో ఆశ్చర్యం ఏం ఉంది?’’ అన్నాడు తెనాలి రామలింగడు.
     పాపాయమ్మకు ఏం చెయ్యాలో తోచక నోరు మూసుకొని కూచుంది.

అక్బర్ - బీర్బల్ (Akbar - Birbal)

     అక్బర్ ఒక రాజు. అతని మంత్రి బీర్బల్.
     ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చాడు. రాజు దానికి కారణం అడిగాడు.
     ‘‘మహారాజా! పిల్లవాడికి సముదాయించి రావడంలో యింత ఆలస్యం అయింది’’ అన్నాడు బీర్బల్.
     ‘‘పిల్లలను సమదాయించడం అంత కష్టమా?’’ అన్నాడు అక్బర్.
     ‘‘అవును. కావాలంటే మీరు నాకు తండ్రిగా నటించి నన్ను సముదాయించి చూడండి’’ అన్నాడు బీర్బల్. రాజు ‘సరే’ అన్నాడు.
     ‘‘నాన్నా నాకు కుండ కావాలి’’
     ‘‘అలాగే’’ అంటూ వెంటనే కుండ తెప్పించాడు రాజు.
     ‘‘నాకు ఏనుగు కావాలి.’’
     రాజు ఏనుగును తెప్పించాడు.
     ‘‘నాన్నా! ఈ కుండలో ఆ ఏనుగును పెట్టండి’’
     ‘‘కుండలో ఏనుగును పెట్టడం వీలుకాదు నాయనా!’’
     ‘‘ఊ! ఊ! ఊ! పెట్టాలి’’ అంటూ ఏడుపు అందుకొన్నాడు బీర్బల్.
     అక్బర్ ‘‘పిల్లలను సముదాయించడం కష్టమే’’ అని తెలిసి వచ్చింది.

రంగు మారిన కోడి పిల్లలు (Rangu marina kodipillalu)

     ఓ రోజు ఒక కోడి తన ఆరుగురు పిల్లలతో షికారు బయలు దేరింది.
     కోడి తన పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తోంది.
     కోడి పిల్లలు కనిపించిన గింజలు, పురుగులు తింటూ తల్లి వెంట వెళుతున్నాయి.
     అలా అవి చాలా దూరం వెళ్ళాయి.
     తల్లితోపాటు నడుస్తున్న కోడి పిల్లలకు రోడ్డు పక్కన పడి ఉన్న ఒక పొగగొట్టం కనిపించింది.
     అవి దానిలో దూరి అటు నుంచి ఇటు వైపుకు వచ్చాయి.
     ఈ లోగా తల్లికోడి వెనుతిరిగి చూసి పిల్లలు కనిపించకపోయేసరికి కంగారు పడింది.
     ఏం చెయ్యాలో తెలీక ‘కొక్కొరోకో’ అంటూ గట్టిగా పిలిచింది.
     పొగగొట్టంలోంచి బయటకు వచ్చిన కోడి పిల్లలు గొట్టం  మసి అంటుకొని నల్లగా మారాయి.
     తల్లికోడి వాటిని గుర్తుపట్టలేక పోయింది.
    తల్లి పిలుపు విని కోడి పిల్లలు కూడా నెమ్మదిగా ‘కొక్కొరోకో’ అని అరిచాయి.
    రంగు మారిన పిల్లల్ని తల్లికోడి గుర్తించలేదు. కాని వాటి అరుపును గుర్తించింది. బిడ్డ గొంతును తల్లి గుర్తిస్తుంది కదా.

నక్క - తాబేలు (Nakka - Thabelu)

     అనగనగా ఒక అడవిలో ఓ నక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ తిరగసాగింది. నక్క ఓ నది ఒడ్డున వెళుతుంటే దానికి నీటిలో తాబేలు కనిపించింది. నక్క దానిని నోటితో గబుక్కున పట్టుకొంది. ఆత్రంగా తినబోయింది. కాని తినలేకపోయింది.
     ‘‘నక్కబావా! నక్కబావా! నన్ను నీటిలో నానబెట్టు. నేను మెత్తబడతాను. అప్పుడు సులభంగా నువ్వు తినచ్చు’’ అంది తాబేలు.
     ‘‘అయ్యో! నువ్వు నీటిలోకి వెళితే మళ్ళీ ఒడ్డుకురావు’’ అంది నక్క.
     ‘‘అయితే నా వీపు మీద కూర్చుని కొంత ముందుకు నీళ్ళలో వెళ్ళింది. ‘నానేవా? నానేవా?’ అని అడిగింది. తాబేలు యింకా నానలేదు అంటూ మరింత ముందుకు పోసాగింది.
     నక్కకి కోపం వచ్చింది. ‘‘నువ్వు నానేవా లేదా?’’ అంటూ గద్దించి అడిగింది.
     తాబేలు భయం నటిస్తూ ‘‘నువ్వు కూర్చున్న స్థలం తప్ప అంతా నానేను. నువ్వు కొంచెం పక్కకు జరిగితే నేను పూర్తిగా నాన్తాను’’ అంది.
     నక్క తాబేలు మాటలు నమ్మి పక్కకు జరిగి నీటిలో పడిపోయింది. తాబేలు వెంటనే నీటి అడుగుకు జారిపోయింది.

పక్షులు - బోయవాడు (Pakshulu - Boyavadu )

     అదొక పెద్ద అడవి.
     ఒక వేటగాడు అడవిలో పక్షుల్ని పట్టుకోవడానికి వలపన్ని చెట్టు చాటున దక్కొన్నాడు.
     చెట్టు కింద గింజలు చల్లాడు.
     గాలిలో ఎగిరే పక్షులు నేలమీద గింజల్ని చూశాయి.
     అందులో ఒక పక్షి చాలా తెలివైంది.
     ‘‘ఈ అడవిలో గింజలు ఎలా వస్తాయి. ఇందులో ఏదో మోసం ఉంది. మనం తినవద్దు’’ అంది.
      కాని మిగితా పక్షులు దాని మాట వినలేదు.
     పక్షులు నేలమీద వాలి వలలో చిక్కుకొన్నాయి.
     అయ్యో! అంటూ బాధపడసాగాయి.
     ‘‘మనం ఎలాగైనా తప్పించుకోవాలి. అందరం కలిసి ఒకేసారి పైకి ఎగురుదాం’’ అంది తెలివైన పక్షి.
     అలా పక్షులన్నీ వలతో పాటు ఎగిరి పోతుంటే వేటగాడు ఏడుస్తూ వెంట పడ్డాడు..
     కానీ పక్షులు చిక్కలేదు.
     పక్షులు అలా ఎగురుకొంటూ వెళ్ళి వాటి స్నేహితుడైన ఎలుక ముందు వాలాయి.
     ఎలుక వలను కొరికి పక్షులను రక్షించింది.

కాకి - కడవ (kaki - kadava)

     వేసవి కాలం. మిట్ట మధ్యాహ్నం.
     ఒక కాకి ఎండలో తిరిగి తిరిగి అలసిపోయింది.
     దానికి దాహం వేసింది.
     నీళ్ళ కోసం వెతుకుతూ, వెతుకుతూండగా ఓ ఇంటి పెరటిలో ఒక కడవ కనిపించింది.
     కాకి రివ్వున వెళ్ళి కడవ మీద వాలింది.
     కడవలో సగం దాక నీళ్ళు ఉన్నాయి.
     అయినా అవి దానికి అందలేదు.
     కాకికి నీళ్ళు చూడగానే మరింత దాహం వేసింది.
     నీళ్ళు ఎలా తాగాలా అని ఆలోచిస్తూ అది పెరటి గోడ మీద వాలింది.
     అక్కడ నుంచి ఎగిరి చెట్టు కొమ్మ మీద వాలింది.
     అది అలా ఆలోచిస్తూ పెరడు అంతా ఎగురుతూ, వాలుతూ ఉంది.
     దానికి పెరటిలో చిన్న చిన్న గులకరాళ్ళు కనిపించాయి.
     దానికి వెంటనే ఓ ఆలోచన వచ్చింది.
     కాకి ఒక్కో గులకరాయి తెచ్చి కడవలో వేయసాగింది.
     కొంత సేపటికి కడవలో నీళ్ళు పైకి వచ్చాయి.
    కాకి తన దాహం తీర్చుకొని ఆనందంగా ఎగురుకొంటూ ఇంటికి పోయింది.

కప్పగంతులు (kappa ganthulu)

     అనగనగా ఒక రాజు.
     ఆయనకు ప్రతిరోజు చెరువు గట్టుకు షికారు వెళ్ళడం అలవాటు.
     రాజు ప్రతిరోజు చెరువు దగ్గరకు రావడం గమనించింది ఓ కప్ప.
     ఒక రోజు రాజుగార్ని పలకరించింది కప్ప.
     ‘‘మహారాజా! ప్రతిరోజూ మీరు వంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తారు ? ’’అని అడిగింది.
     ‘‘ ఈ చెరువు మా పూర్వీకులు తవ్వించారు. ఇక్కడికి వస్తే వారిని చూసినంతగా ఆనందం కలుగుతుంది.’’ అన్నాడు. రాజు.
     ‘‘నేను కూడా నీలానే ఈ చెరువులోని కప్పలకు రాజును. నేను నీలాగ అడుగులో అడుగు వేసి నడువను. గెంతుతూ వెళతాను. నాలాగా నువ్వు చెయ్యగలవా?’’
     ‘‘నీలాగ గెంతడం నాకు చేత గాదు’’ అన్నాడు రాజు.
     ‘‘నాలాగా బెకబెక మనగలవా?’’ అంది కప్ప.
     ‘‘అదీ నాకు చాతకాదు’’ అన్నాడు రాజు.
     ‘‘నేను నీళ్ళలోను, భూమి కూడా జీవించగలను తెలుసా?’’ అంది కప్ప.
     ‘‘ఆ! ఆ! తెలుసు. నువ్వు కప్పవి. కప్పకి తగిన లక్షణాలు నీకున్నాయి. నేను రాజును కదా! కాబట్టి నేను రోజులాగే ఉండాలి. నీలాగా గెంతుతూ ఉంటే అందరూ నవ్వరూ?’’ అన్నాడు రాజు.
     కప్ప మరోమాట మాట్లాడకుండా చెరువులోకి ఒక గెంతు గెంతింది.
    

సింహం - నాలుగు ఆవులు (Simham - naalugu Avulu )

     పూర్వం ఓ గ్రామంలో నాలుగు ఆవులు ఎంతో ఐకమత్యంతో, స్నేహంగా ఉండేవి.
     అవి ఎప్పుడూ కలిసే ఉండేవి.
     అవి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కడుపునిండా మేసేవి.
     ఆ అడవిలో ఓ సింహం ఉండేది.
     అది ఆవుల మీద కన్నేసింది.
     ఆవులను తినాలనే కోరిక దానికి కలిగింది.
     తాను మృగరాజుననే గర్వం, చాలా బలవంతుడినన్న అహం ఆ సింహానికి ఉన్నాయి.
     సింహానికి కోరిక కలగగానే ఆవుల మీద లంఘించింది.
     నాలుగు ఆవులు ఐకమత్యంతో సింహాన్ని ఎదుర్కొన్నాయి.
     వాటి దెబ్బకు సింహం పారిపోయింది.
     కొన్నాళ్ళకు నాలుగు ఆవుల మధ్య ఐక్యత చెడిపోయింది.
     ఒకదానితో ఒకటి పోట్లాడుకొన్నాయి.
     అప్పటి నుండీ అవి దేనికదే విడివిడిగా అడవిలో తిరగసాగాయి.
     సింహం ఇది గమనించింది.
     నాలుగూ ఒకచోట ఉంటే వాటి మీద పడడానికి ఇబ్బంది కానీ ఒక్కొక్కటీ విడివిడిగా ఉండే కష్టమేమిటి?
     సింహం ఒక్కో ఆవును పట్టుకొని తిని కడుపు నింపుకొంది.

Chevula Pilli (చెవుల పిల్లి )

     ఒక కుందేలు, తాబేలు స్నేహంగా ఉండేవి.
     ‘తను బాల తెల్లగా బొద్దుగా, అందంగా ఉంటా’ నని కుందేలుకు గర్వం.
     ఒకసారి తాబేలును ఆట పట్టించాలనే కోరిక కలిగింది కుందేలుకు.
     ‘‘తాబేలు మామా! తాబేలు మామా! నువ్వు మా యింటికి వస్తావా ? నీకు చక్కటి పాయసం చేసి యిస్తాను’’ అంది.
     తాబేలు ‘‘సరే వస్తాను’’ అంది.
     తాబేలు గబగబా నడవలేదు కదా! అందుకని తాబేలు రాగనే ‘‘ నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. ఇక నువ్వు రావని చేసిన పాయసం అంతా నేనే తాగేశాను’’ అంది కుందేలు.
     కుందేలు ఎందుకు యిలా చేసిందో తాబేలు గ్రహించింది. దానికి బుద్ది చెప్పాలనుకొంది.
     కొద్ది రోజుల తర్వాత కుందేలును విందుకు ఆహ్వానించింది తాబేలు.
     కుందేలు రాగానే ‘‘శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రా! విందు ఆరగిద్దాం’’ అంది తాబేలు.
     కుందేలు కాళ్ళు కడుక్కొని వచ్చింది. తాబేలు దాని కాళ్ళకు మసి అంటించింది. ‘‘మళ్ళీ శుభ్రంగా కడుక్కురా’ అంది.
    అలా కాళ్ళు కడుక్కొని వచ్చిన ప్రతిసారి కాళ్ళకు మసి అంటించింది తాబేలు.
     కుందేలుకు ఎంతో విసుగు అనిపించింది.
     అది తాబేలు గ్రహించింది. ‘నేను నెమ్మదిగా బాధ పెట్టాను. అందుకు ఇప్పుడు నేను యిలా చేయాల్సి వచ్చింది. అనవసరంగా ఎవరినీ బాధపెట్టకు’’ అంది తాబేలు మందలిస్తూ.

Kothulu Topilu ( కోతులు - టోపీలు)

     అనగనగా ఒక ఊళ్ళో రాజయ్య అనేవాడు టోపీలమ్మేవాడు. ఒకరోజు అతను టోపీలు అమ్మడానికి పక్క గ్రామం బయలు దేరాడు.
     టోపిలమ్మా టోపీలు
     రంగు రంగు టోపీలు
     రకరకాల టోపీలు...
     అని పాడుకొంటూ వెళ్ళసాగాడు. చాలా మంది టోపీలను ఎగబడి కొన్నారు.
     మధ్యహ్నం అయ్యేసరికి రాజయ్యకు ఆకలి వేసింది. ఒక చెట్టు క్రింది కూర్చుని అమ్మ ఇచ్చిన టిఫిన్ తిన్నాడు. ఇంతలో వాడికి నిద్ర ముంచుకు రావడంతో నిద్రపోయాడు.
     చెట్టుపై నున్న ఒక కోతి రాజయ్య తలపై నున్న టోపీని చూసింది. అది వెంటనే కిందికి దిగింది. రాజయ్యక సంచిలోంచి ఒక టోపిీ తీసుకొని తలపై పెట్టుకొంది. అది చూసి మిగితా కోతులన్నీ వచ్చి ఒక్కో టోపీ తీసుకొని  తమ తలపై పెట్టుకొని చెట్టు ఎక్కేసాయి. సంచీ ఖాళీ అయిపోయింది.
     రాజయ్య నిద్రలేచి చూసే సరికి సంచీ ఖాళీగా కనిపించింది. తలపైకెత్తి చూశాడు. చెట్టుమీద టోపీలు పెట్టుకొన్న కోతులు కనిపించాయి.
     రాజయ్యకు దుఃఖం వచ్చింది. టోపీలు ఎలా సంపాదించాలా అని బుర్ర గోక్కున్నాడు. అది చూసి కోతులన్నీ బుర్ర గోక్కున్నాడు. అది చూసి కోతులన్నీ బుర్ర  గోక్కోసాగాయి. వాటి ప్రవర్తన  చూసిన రాజయ్యకు ఒక ఉపాయం తట్టింది.
     వెంటనే అను వెక్కిరించాడు. కోతులు వెక్కించాయి. రాజయ్య ఎగిరాడు. కోతులూ అలాగే ఎగిరాయి. రాజయ్య ఎలా చేస్తే కోతులూ అలానే చేశాయి. చివరగా రాజయ్య తన తలపైని టోపీని తీసి నేలపైకి విసిరాడు. కోతులన్నీ టోపీలను తీసి  కిందికి విసిరాయి.
     రాజయ్య గబగబా ఆ టోపీలన్నీ ఏరుకొని సంచీలో వేసుకొని వెళ్ళి పోయాడు.
     ‘టోపీలమ్మా టోపీలు... అంటూ మళ్ళీ పాట మొదలు పెట్టాడు.