LATEST UPDATES

26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

పులితోలు కప్పుకొన్న మేక (కథ)

     అనగనగా ఒక మేక ఉండేది.
     పాపం దానికి ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా కడుపు నిండేది కాదు.
     ఎటు వెళ్ళినా పచ్చటి తోటలు కనిపించేవి. లోపలికి దూరి తిందామంటే కాపలావాళ్ళు ఉండేవాళ్ళు. వరుసగా కొన్ని రోజుల పాటు కడుపు నిండా తినాలని మేక ఆశ. ఆ ఆశ తీరే మార్గం కోసం వెదకసాగింది.
     దానికి ఒక రోజు అడవి ప్రాంతంలో పులితోలు దొరికింది.
     అది కప్పుకొని మేక ఒక తోట లోకి వెళ్ళింది. తోటకు కాపలా కాస్తున్న వాళ్ళు నిజంగా పులి వచ్చిందని భయపడి పారిపోయారు.మేక కడుపు నిండుగా హాయిగా మేసింది.
     పులితోలు తన కోరిక తీర్చిందని సంతోషపడింది.
     మేక ప్రతిరోజు పులితోలు కప్పుకొని తోటలలో పడి మేయసాగింది. తోట మాలికి అనుమానం వచ్చి మేక వెనగ్గా వెళ్ళి దాని మోసం తెలుసుకొన్నాడు.
     మర్నాడు అది అలవాటుగా తోటలోకి రాగనే దాన్ని  పట్టుకొని కట్టివేశాడు.

ఎలుక - పిల్లి - కుక్కలు (కథ)

     ఒక చెట్టు కింద కలుగులో ఓ ఎలుక ఉండేది.
     అది ఒకరోజు ఆహారం కోసం బయటికి వచ్చి అటూ ఇటూ తిరుగతోంది. దాన్ని ఓ అడవి పిల్లి చూసింది.
     పిల్లి ఎలుక వెంట పడింది. ఎలుక పిల్లికి దొరకలేదు. పరుగెత్తుకెళ్ళి తన కలుగులోకి దూరింది.
     అడవి పల్లి భయంతో ఎలుక కలుగులోనే ఎక్కువ రోజులు ఉండి పోయింది. అడవి పిల్లి వల్ల తనకు కష్టాలు వచ్చాయని  దిగులు పడసాగింది.
     ఒకరోజు ఎలుక ఉన్న ప్రాంతంలో చాలా హడావిడిగా ఉంది.
     ఎలుక సంగతేమిటో చూద్దామని బయటకు వచ్చింది.
     ఎవరో వేటగాళ్ళు, వాళ్ళ వెంట రేచు కుక్కలు కనిపించాయి.
     ఎలుకకు తన కష్టాలు తీరే ఉపాయం తోచింది.
     ఎలుక కుక్కలు ఉన్న చోటికి వెళ్ళి వాటి ఎదురుగా నృత్యం చేయడం మొదలు పెట్టింది.
     ‘మనం కొరికి తినే ఎముక ముక్కంత కూడా లేని యిది మన నృత్యం చేయడమా?’ అని కుక్కలకు కోపం వచ్చింది.
     అవి ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించాయి.
     ఎలుక అటు ఇటూ తిరిగి చివరికి అడవి పిల్లి ఉన్న చోటికి వెళ్ళ పొదల్లో దాక్కుంది.
     కుక్కలు రొప్పుకొంటూ అక్కడికి వచ్చి ఎదురుగా అడవి పిల్లి కనిపించగానే గట్టిగా మొరిగాయి.
     కుక్కలు ఎక్కడ తనను చంపుతాయో అని భయపడి అడవి పిల్లి అడవి వదిలి పారపోయింది.

25, ఫిబ్రవరి 2016, గురువారం

దయ - 3వ తరగతి (చదువు ఆనందించు)

     పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడ ఉన్నది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు.

    ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికి పోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందుపడ్డది. గౌతముడు జాలితో, కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు.

     అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి, ‘‘నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే!’’ అన్నాడు. ‘‘ మిత్రమా! ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా!’’ అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళ కొట్లాట రాజుగారి దగ్గరికి పోయింది.

     ఇద్దరూ రాజాస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుని బాణం వల్ల హంస చచ్చిపోతే అది అతనిది అయ్యేది. కాని భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందు వల్ల అది గౌతమునిదే అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దానిమీద హంసను ఉంచమన్నాడు. గౌతముణ్ణి, దేవదత్తుణ్ణి విడివిడిగా హంసను పిలువమన్నాడు. అది ఎవరి దగ్గరకు పోతే అది వారిది అవుతుందని చెప్పాడు. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు.

     అతని కోపపు చూపుకు, కఠినమైన పిలుపుకు హంస రాలేదు. గౌతముడు అప్యాయంగా హంసను పిలువగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులకు ఎగిరి వచ్చి, చేతిపైన వాలింది. గౌతముని అహింసా పద్ధతికి సభలోని వారంతా చప్పట్లు కొట్టారు. రాజు, న్యాయాధికారి సంతోషించారు.

అందువల్ల కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్నవాళ్ళకే అందరి మన్నన దొరుకుతుంది.

అమ్మ - 3వ తరగతి పాఠ్యాంశము


అమ్మ (http://telugu.naabadi.org)
అమ్మ మనకు దైవమురా!
అమ్మ ప్రేమ రూపమురా!
అమ్మవంటి దేవత ఈ
అవనిలోన లేదురా!

     తన రక్తము పోసి మనను
     కనిపెంచునురా!
     తీపికథలు చెప్పిబువ్వ
     తినిపించునురా!

అమ్మపిలుపులో ఎంతో
కమ్మదనం ఉందిరా!
అమ్మ పలుకు మాటల్లో
అమృతమే చిందురా!

     జోలపాట పాడి
     ఉయ్యాల లూపురా!
     లాలిపాట పాడి
     నిదుర బుచ్చురా!

 ‘‘బాల గేయాలు - వేముగంటి నరసింహాచార్యులు’’

వానదేవుడా... - 3 వ తరగతి పాఠ్యాంశము

వానదేవుడా (http://telugu.naabadi.org)

వానల్లు కురువాలె వానదేవుడా!
వరిచేలు పండాలె వానదేవుడా!!
నల్లాని మేఘాలు వానదేవుడా!
సల్లంగ కురువాలె వానదేవుడా!!
తూరుపు దిక్కున వానదేవుడా!
తుళ్ళి తుళ్ళి కురువాలె వానదేవుడా!!
 చాటంత మబ్బుపట్టి వానదేవుడా!
వర్షంగా మారాలె వానదేవుడా!!
చుక్కచుక్క నీరు చేరి వానదేవుడా!
మాకు ఆసరవ్వాలె వానదేవుడా!!
మావూరి కుంటల్లు వానదేవుడా!
మత్తడై దుంకాలె వానదేవుడా!!
చెరువులన్ని నిండాలె వానదేవుడా!
అలుగులై పారాలె వానదేవుడా!!
 పద్దలంతా కలిసి వానదేవుడా!
కాలువలు తవ్వాలే వానదేవుడా!!
బీడు భూములన్నీ వానదేవుడా!
బిరాన తడ్వాలె వానదేవుడా!!
పడావు భూములన్ని వానదేవుడా!
పంట చేలవ్వాలి వానదేవుడా!!
పన్నెండు పరగణాల వానదేవుడా!
చేలన్ని తడవాలె వానదేవుడా!!
మూన్నాళ్ళు యెదగాలి వానదేవుడా!
యెన్నుల్లు వేయాలె వానదేవుడా!!
పన్నెండు ధాన్యాలు వానదేవుడా!
పంట చేల్లో పండాలె వానదేవుడా!
భాగ్యాలు కలుగాలె వానదేవుడా!!
 పేదసాద బతుకాలె వానదేవుడా!
గొడ్డుగోద బతుకాలె వానదేవుడా!!
కూలినాలి దొరుకాలె వానదేవుడా!
వెతలన్ని తీరాలె వానదేవుడా!!
వలసబోయినోళ్ళంత వానదేవుడా!
ఊళ్ళకు రావాలె వానదేవుడా!!
బతుకులన్ని మారాలె వానదేవుడా!
సౌభాగ్యమందాలి వానదేవుడా!!

పాము - ముంగిస (కథ)

     అనగనగా ఒక గ్రామంలో గోపయ్య అనే రైతు  ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ. వాళ్ళు ఒక ముంగిసను పెంచేవారు. ఇలా ఉండగా గంగమ్మకు ఓ పిల్లవాడు పుట్టాడు. ముంగిస పిల్లవాడితో చక్కగా ఆడుకునేది.

     ఒకరోజు గంగమ్మ మంచి నీళ్ళు తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చే సమయానికి ఆమెకు గుమ్మంలోనే ముంగిస ఎదురయింది. ముంగిస నోరంతా ఎర్రగా రక్తంతో నిండి ఉంది. గంగమ్మ ముంగిసను చూసి కంగారు పడింది. అది తన ముద్దుల కొడుకుని చంపేసి ఉంటుందని భావించింది. అలా అనుకోగానే ముందు వెనుకలు చూడకుండా చేతిలోని నీళ్ల చిందెను ముంగిస మీద పడేసింది. ఆ దెబ్బకు ముంగిస గిలగిల లాడుతూ ప్రాణాలు వదిలింది.

     గంగమ్మ ఆదుర్దాగా పిల్లవాణ్ణి పడుకో పెట్టిన చోటుకు పరుగు తీసింది. పిల్లాడు చక్కగా కేరింతలు కొడుతూ ఆడుకొంటున్నాడు. వాడి దగ్గరలో చచ్చిపడి ఉన్న పాము కనిపించింది. పాము బారిన పడకుండా పిల్లవాణ్ణి ముంగిస కాపడిందని  గంగమ్మకు అర్థం అయింది. తన తొందరపాటుకు చింతించింది.

కాకుల జంట - కథ

     అడవిలో ఒక చెట్టు మీద కాకుల జంట ఉండేది. ఆ చెట్టు కిందకు తరుచుగా ఇతర జంతువులు కూడా కచ్చి విశ్రాంతి తీసుకునేవి. చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక నల్ల తాచుపాము ఉండేది.

     కాకి జంట చెట్టుమీద గూడు కట్టుకుంది. ఆ గూటిలో గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను పొదగగానే నాలుగు కాకిపిల్లలు బయటకు వచ్చాయి. కాకుల జంట చాలా సంబరపడి పిల్లలను ముద్దాడాయి.

     ఒకరోజు కాకులు తమ పిల్లలకు ఆహారం తేవడం కోసం బయటకు వెళ్ళాయి. అప్పుడు చెట్టు కింద ఉన్న పాము చెట్టుపైకి ఎక్కి గూటిలో ఉన్న పక్షి పిల్లలను తినివేసింది.

     ఆహారం తీసుకొని వచ్చిన కాకుల జంటకు పాము చెట్టు దిగతుండటం కనిపించింది. అవి భయపడ్డాయి. వెంటనే గూటిలోకి వెళ్ళి చూస్తే వాటికి పిల్లలు కనిపించలేదు. వాటికి పాము తినేసిందన్న విషయం అర్థం అయింది. కాకులు చాలాసేపు ఏడ్చాయి.

     మళ్ళీ కొన్నాళ్ళకు కాకుల జంట గుడ్లు పెట్టాయి. ఈసారి కూడా పాము వచ్చి తినేస్తుందేమోనని చాలా భయపడ్డాయి. పాము బారి నుండి ఎలాగైనా పిల్లలకు రక్షించుకోవాలని  అనుకున్నాయి. కాకుల జంట తమ గద్ద మిత్రుని దగ్గరకు వెళ్ళినాయి. జరిగిన విషయాన్ని చెప్పాయి. ఈ సమస్యను పరిష్కరిస్తానని గద్ద చెప్పింది. గద్ద కాకుల జంటకొక ఉపాయం చెప్పింది. అవి సరేనని వెళ్లాయి.

     ఉపాయం ప్రకారం కాకుల జంట, గద్ద చెట్టు మీద వాలాయి. ఇవి చూస్తుండగానే పాము బయటకు వచ్చి చెట్టు ఎక్కబోయింది. ఇది కాకుల జంట గద్దకు సైగ చేసాయి. గద్ద రయ్యిమని వచ్చి పామును తన్నుకొని పోయింది. కాకుల జంట పాము పీడ విరగడయిందని సంతోషించాయి.

గాడిద సలహా! - కథ

     ఒక రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు. బండికి కట్టి లాగించే వాడు.  సాయంత్రానికి అది చాలా అలసిపోయేది. యజమాని మీద కోపం వచ్చేది. కొన్ని సంవత్సరాల తర్వాత రైతు ఒక గాడిదను కొని తెచ్చాడు. ఆ గాడిద ఎద్దుతో యజమాని నిన్ను బాగా చూస్తాడా? అని అడిగింది. ఎద్దు దానితో తన కష్టాన్నంతా చెప్పుకుంది. అప్పుడు గాడిద నీకు పని తప్పించుకునే ఉపాయం చెపుతానంది. మేత మానేసి నీళ్ళు మానేసి జబ్బు చేసినట్లుగా నటించమంది. మర్నాడు ఎద్దు లేవలేదు. మేత తినలేదు, నీళ్ళు తాగలేదు. రైతు దాన్ని చూసి జాలిపడి వదిలివేసి పొలానికి వెళ్ళిపోయాడు. రెండవ రోజు కూడా ఎద్దు అలాగే చేసింది. రైతు దాన్ని వదిలిపెట్టి గాడిదను పొలానికి తీసుకొని వెళ్ళాడు. దానితో పని చేయించాడు. ఆ పని దానికి కష్టమైపోయింది. అయ్యో! పొరపాటు చేశానే! సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది. ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది. సాయంత్రం ఎద్దును కలిసినప్పుడ ఇలా అంది. ‘‘రెండు రోజులు కులాసాగానే గడిచాయి. కాని, ఒక్కటే విచారం. నిన్ను రేపు ‘పశువధశాల’కు తోలుకుని పోతానని రైతు అన్నాడు’’ అంది. అంతే ఎద్దుకు భయం వేసింది. మరునాడు మామూలుగా మేత తిన్నది. రైతు పొలానికి తీసుకొని వెళ్ళాడు. దీనితో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది.

ఎవరు చేస్తారు? - కథ

     ఒక ఊళ్ళో ఒక కోడి, బాతు, కుక్క, పంది స్నేహంగా ఉండేవి. కలిసి తిరిగేవి. కోడి కష్టపడి పని చేసేది. మిగితావి సోమరిగా ఉండేవి. ఒకరోజు కోడికి మొక్కజొన్న విత్తనం దొరికింది. దాన్ని మిత్రులకు చూపించి ‘‘దీన్ని ఎవరు నాటుతారు’’ అని అడిగింది.

     ‘‘నేను కాదు, నేను కాదు’’ అన్నాయి అవి. సరేనని కోడి ఆ విత్తనాన్ని నాటింది. కొన్ని రోజుల్లో చిన్న మొలక వచ్చంది.

     ‘‘ఈ మొక్కకు నీళ్ళు ఎవరు పోస్తారు?’’ మిత్రులను అడిగింది కోడి. ‘‘నేను కాదు, నేను కాదు’’ అంటూ తప్పించుకొన్నారు మిత్రులు. కోడి రోజూ శ్రద్ధగా మొక్కకు నీరు పోసింది. మొక్క పెరిగి కంకివేసింది.

     ‘‘కంకులను ఎవరు కోస్తారు?’’ మరోసారి మిత్రులను అడిగింది కోడి. ‘‘నేను కాదు, నేను కాదు’’ అన్నారు మిత్రులు. కోడే కంకులు కోసింది. వాటిని బాగుచేసి పిండి చేసింది. ఆ పిండితో రొట్టెలు చేసింది. మిత్రులైన బాతు, కుక్క, పంది ఏ పనిలోనూ సహాయ పడలేదు.

     కోడి రొట్టెను చేసి ‘‘దీన్ని ఎవరు తింటారు?’’ అని అడిగింది. ‘‘నేనంటే, నేనంటూ’’ బాతు, కుక్క, పంది ముందుకు దూకాయి.

     ‘‘గింజను తెచ్చింది, నాటింది, కంకికోసింది, పిండి చేసింది, రొట్టె కాల్చింది నేనే కదా! మీ కసలు రొట్టె ఎందుకు ఇవ్వాలి?’’ అంటూ మొత్తం కోడి తినేసింది.

     మిత్రులు సిగ్గుపడి ఆ రోజు నుండి కష్టపడి పని చేయడం మొదలు పెట్టారు.

నక్క - కాకి (కథ)

     అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి.
     ఆ కాకికి ఒకరోజు మాంసం ముక్క దొరికింది.
     దాన్ని చెట్టుకొమ్మ మీద కూర్చుని తినాలనుకొంది కాకి.
     అప్పుడు ఆ దారి వెంట ఒక నక్క వెళుతోంది.
     కాకమ్మ, దాని నోట్లో మాంసం ముక్క నక్క కంట పడ్డాయి.
     ఎలాగైనా కాకమ్మను మోసం చేసి మాంసం తినాలనుకొంది నక్క.
     ‘‘కాకమ్మా కాకమ్మా ఒక పాట పాడవా? నీ పాటంటే నాకు చాలా ఇష్టం. చిలకమ్మా, కోకిలమ్మా నీ ముందో లెఖ్ఖా? అడవిలో అందరూ నీ గురించే అనుకొంటున్నారు’’ అంటూ పొగిడింది.
     ఆ పొగడ్తలకు పొంగిపోయింద కాకి.
     ‘‘కా...  కా...’’ అంటూ పాడింది.
     కాకి నోట్లోని మాంసం ముక్క కింద పడింది.
     నక్క ఆ మాంసం ముక్క అందుకొని తింది. కాకి ఏడుస్తూ బాధడింది.

చాకలివాడి గాడిద - కథ

     ఒక చాకలివాడు గాడిదపైన బట్టల మూటవేసి, మూట మీద తన కొడుకును కూచోపెట్టి ఇంటికి బయలుదేరాడు.
     దారిలో కొందరు కలిశారు. వాళ్ళు గాడిద మీద కూర్చున్న కొడుకుతో ‘‘ఏమయ్యా........ ముసలి తండ్రిని నడిపిస్తూ నువ్వు గాడిద పైన ఎక్కావా?’’ అని తిట్టారు.
     వెంటనే అతను గాడిద దిగి తండ్రిని కూర్చోపెట్టి తాను నడవసాగాడు.
     మరికొంత దూరం వెళ్ళే సరికి ఇంకెవరో ఎదురయ్యి తండ్రితో ‘‘ ఏమయ్యా! చిన్న  పిల్లవాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిద ఎక్కుతావా?’’ అన్నారు.
     తండ్రి మళ్ళీ కొడుకును తనతోపాటు గాడిద మీ కూచోపెట్టుకొని వెళ్ళసాగాడు. అంతలోనే కొందరు. ఎదురుపడ్డారు.
     ‘‘ఏమయ్యా! మీకు బుద్ధి ఉందా! బక్క చిక్కినా గాడిద మీద బట్టల మూటతో పాటు మీరిద్దరూ ఎక్కుతారా? మీరసలు మనుషులేనా?’’ అని తిట్టారు.

     వాళ్ళిద్దరూ ఏం చెయ్యాలో పాలుపోలేదు. చివరికి ఇద్దరూ కలిసి గాడిద కాళ్ళు కట్టి కర్రకు వేలాడదీసి నడవసాగారు.
     ఈ వింత చూస్తూ దారిలో వాళ్ళు అల్లరి చేయసాగారు.
     ఆ అల్లరికి గాడిత బెదిరిపోయింది. అటు ఇటు గింజుకొని తాళ్ళు తెంపుకొని పరుగు పెట్టింది.
     తండ్రీ కొడుకులు బాధపడుతూ గాడిదను వెతకడానికి బయలుదేరారు.

కప్ప పాట - కథ

     ఒక రోజు కప్పకు పాట పాడాలనుకొంది.
     కోయిలమ్మ దగ్గరికి వెళ్ళి తనకూ పాట నేర్పమంది.
     కోకిల నవ్వింది. ‘‘నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు’’ అంది.
     ‘‘లేదు. నేను పాట నేర్చుకోవాలి’’ అని గోల చేసింది. కప్ప.
    ‘‘పోనీలే కొద్ది రోజులు నేర్పితే కప్పకు తెలిసి వస్తుంది’’ అనుకొంది కోయిల.
     ప్రతి రోజూ కప్పకు పాటలు నేర్పసాగింది కోయిల.
     ఎన్ని రోజులు గడిచినా కప్పకు పాట రాలేదు.
     ఈ లోగా మామిడి చెట్లు పూతకు వచ్చాయి.
     మావి చిగురు తిన్న కోయిల పాట పాడబోయింది.
     కాని కోయిల కూ... అని పాడబోతే ‘బెక బెక’ అనే శబ్దం వచ్చింది.
     కోయిల పాట కప్పకు రాలేదు కానీ కప్ప ‘బెక బెక’ మాత్రం కోయిల కొచ్చింది.
     తన గొంతు ఏమయిందోనని కోయిలకు భయం వేసింది.
     మొదటి పనిగా కప్పకు పాట నేర్పించే పని మానేసింది.

పొగరుబోతు కుక్క - కథ

     అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క ఉండేది. దాని యాజమాని దాన్ని చిన్నప్పటి నుండి ఎంతో ముద్దుగా పెంచాడు. మిగితా కుక్కలు కంటే నేను గొప్పదాన్నని దానికి గర్వం. ఆ విధిలో ఎవరు వెళుతున్న గట్టిగా అరవడం, కరవడం చేసేది. దాన్ని అందరూ పొగరుబోతు కుక్క అనేవాళ్ళు.

     కుక్క యజమానికి అదొక తలనొప్పిగా తయారయింది. ఆయనకు అదంటే ఎంతో ప్రేమ. అందుకని వదులుకోలేడు. కాని వీధిలో వాళ్ళ గొడవ ఎక్కువయింది. అందరితో మాట్లాడి ‘ఈ కుక్క మెడలో గంట కడుతాను. ఇది వస్తుంటే గంట చప్పుడవుతుంది. కదా! ఎవరైన సరే దీనికి దొరకుండా పారిపోవచ్చు’ అన్నాడు.

     గంట కట్టడంతో జనం అమ్మయ్య అనుకొన్నారు. అది వస్తుంటే గంట శబ్దం వినిపించేది. దాంతో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేవాళ్ళు. కుక్కకు మాత్రం గంట కట్టాక గర్వం పెరిగిపోయింది. నేను గప్పదాన్ని కాబట్టి గంట కట్టారు అని అది మిగతా కుక్కలతో అనేది.

     కుక్కకు బుద్ధి చెప్పాలని ఓ రోజు ముసలి కుక్క ఒకటి ‘‘ఈ గంట నీకు అలంకారం అనుకొని గర్వ పడుతున్నావ్. నువ్వు గర్వం గల కరిచే కుక్కవని అందరూ జాగ్రత్తగా ఉండటానికే ఈ గంట కట్టారు’’. అంది.

     పొగరుబోతు కుక్క ఆలోచలనలో పడింది. మొదటి నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకొంది. తనతో ముసలి కుక్క చెప్పిన మాటలు నిజమని తెలుసుకొంది. బుద్ధి తెచ్చుకొంది. ఆరోజు నుండి అది ఎవరినీ కరవలేదు.


24, ఫిబ్రవరి 2016, బుధవారం

చీమ కథ

     చీమ చాలా చిన్నది. అయినా ఆ చిన్న చిన్న చీమల మధ్య ఐకమత్యం ఎక్కువ.

     ఎప్పుడూ కలిసి మెలసి ఉండే చీమల లోంచి ఓ చిన్న చీమ దారి తప్పింది.

     తన వాళ్ళను వెతుక్కుంటూ తిరుగుతోంది. అలా తిరిగి తిరిగి అలసిపోయింది.

     దానికి ఆకలి వేసింది. దగ్గరలో చీమకు చక్కెర కనిపించింది.

     దాన్ని తిందామనుకోనేలోగా వానజల్లు పడింది.

     చక్కెర కరిగిపోయింది.

     వానజల్లు తగ్గాక మళ్ళీ ముందుకు సాగింది.

     దానికి బియ్యపు గింజ కనిపించింది.

     ఆత్రంగా దానివైపు పరుగు తీసింది చీమ.

     అంతలో పెద్దగాలి వీచి బియ్యపు గింజ కొట్టుకుపోయింది.

     చీమకు ఏడుపు వచ్చినంత పనైంది.

     దాని అదృష్టం బాగుండి దానికి రొట్టె ముక్క కనిపించింది.

     అది తిందామనుకొని అటువైపు వెళ్ళింది.

     అంతలో ఒక ఎలుక పరిగెత్తుకొచ్చి రొట్టె ముక్కను తీసుకుపోయింది.

     చీమకు ఆకలితో కళ్ళు తిరగసాగాయి.

     అది నెమ్మదిగా ఓ యింట్లోకి వెళ్ళింది.

     అక్కడ పాలు కనిపించాయి.

     చీమకు ప్రాణం లేచి వచ్చింది.

     పాలు తాగుదామనుకొని గిన్నె దగ్గరికి చేరింది.

     నెమ్మదిగా గిన్నె మీదిగా పాకింది.

     ఈ లోగా పిల్లి వచ్చి పాలన్నీ తాగేసింది.

     చీమ ‘‘ఓ భగవంతుడా! నన్ను యింత చిన్న దానిగా ఎందుకు పుట్టించావు’’ అంటూ ఏడవసాగింది.

     దేవుడికి జాలి కలిగింది. చీమ ముందు ప్రత్యక్షమై ‘‘ఎందుకు ఏడుస్తున్నావు?’’ అని అడిగాడు.

     చీమ జరిగిందంతా చెప్పింది.

     దేవుడు చీమకు చక్కెర, బియ్యం, రొట్టె, పాలు యిచ్చాడు. చీమ ఆనందించింది.

రాజు - కథ

     ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. రాజు వేటకు వెళ్లాడు. రాజు తిరిగి భవంతికి రావడానికి చాలా రోజులు పడుతుంది. ఒక ఊరపిచ్చుక రాజుగారి పట్టెమంచం పట్టెల మీద గూడు కట్టింది.

     ఊరపిచ్చుక గుడ్లు పెట్టి నాలుగు పిల్లలు చేసింది. అది పిల్లలకు మేత తెచ్చి పెట్టేది.

     కొన్నిరోజులు గడిచాక ఆడ పిచ్చుక, మగ పిచ్చుకతో ‘‘ఏమయ్యా మన పిల్లగాండ్లు పెరిగాక వాళ్లు గూడు ఎక్కడ పెట్టుకోవాలి’’ అడిగింది.

     మగ పిచ్చుక ‘‘మనం రాజు మంచం పట్టె మీద గూడు పెడితే మన పిల్లలు రాజు కొడుకుల మంచం పట్టెల మీద పెట్టుకుంటారు’’ అంది.

అక్షరాల కథ

     అనగనగా ఒక ఇల్లు. ఆ ఇంట్లో క, గ, చ, జ, ట అనే స్నేహితుండేవారు. ఒకరోజు ‘క’ అనే అక్షరం ఆకలేస్తుంది తిందాం అంది. ‘గ’ అనే అక్షరం ఎక్కడ తెచ్చుకుని తిందాం అంది. అప్పుడు ‘చ’ అనే అక్షరం అప్పు తెచ్చుకుని తిందాం అంది. వెంటనే ‘జ’ అనే అక్షరం చేసిన అప్పు ఎలా తీరుద్దాం అని అడిగింది. సమాధానంగా ఎగకొట్టి పారపోదాం అంది ‘ట’ అక్షరం. తప్పు, తప్పు అందరం కష్టపడి అప్పు తీరుద్దాం అన్నాయి మిగితావి.

పల్లెవాడు - పాము (కథ)

     ఒక ఊళ్ళో రామయ్య అనే రైతు ఉండేవాడు.

     రామయ్యకు మంచివాడని, దయగల వాడని మంచి పేరు.

     ఒక రోజు రామయ్య పొలం వెళుతున్నాడు. ఓ డొంక దారిలో నడుస్తుండగా అతనికి సమీపంలో ఒక పొద దగ్గర మంట కనిపించింది.

     ఏమయిందా అని అనుకొంటూ పొద దగ్గరకు వెళ్ళాడు.

     పొద చుట్టూ మంటలు. మధ్యలో ఒక పాము. అది బయటకు రావడానికి నానా అవస్థ పడుతోంది.
 
    ఆ పామును చూడగానే రామయ్యకు ఎంతో జాలి వేసింది. దాన్ని ఎలా అయినా కాపాడాలని అనుకొన్నాడు.

     చేతిలోని చేతికర్ర చివర తన భుజం మీది తుండు ఉట్టిలా కట్టి పాము దగ్గరగా పెట్టాడు.

     పాము నెమ్మదిగా తుండులోకి పాకింది. దాన్ని గబుక్కున బయటకు లాగాడు. అయితే పాము తనను కాపాడింది ఎవరన్నది కూడా ఆలోచించకుండా రామయ్యను కాటు వేసింది.

    అందుకే అంటారు అపకారికి ఉపకారం చేయకూడదు అని.

ఎవరి న్యాయం వాళ్ళది - కథ

     ఒక చెట్టు తొర్రలో ఒక పక్షి గూడు పెట్టుకుంది. ఒకరోజు అది గూటికి ఆలస్యంగా తిరిగి వచ్చింది. అప్పటికే ఒక కుందేలు ఆ చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోయింది.

     ఏయ్! ఎవరు నువ్వు? నా గూటికి ఎందుకొచ్చావు. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అని పక్షి అంది. దేవుడిచ్చిన భూమిని, చెట్లను, చెట్ల తొర్రలను ‘నా స్వంతం’ అని ఎవరూ అనలేదు. ఈ స్థలం నీది కాదు, నాది. కావాలంటే ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి న్యాయం చెప్పమని అడుగు అని కుందేలు పక్షితో అంది.

     పాపం పక్షి రాత్రంతా చెట్టు కొమ్మలమీద గడిపింది తెల్లవారగానే పక్షి, కుందేలు పెద్ద మనిషిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఒక చెరువు గట్టున బావురు పిల్లి కన్పించింది. రెండూ కూడబలుక్కొని బావురు పిల్లిని పెద్దమనిషిగా అంగీకరించి తమ కథలు మొదలు పెట్టాయి. కాని బావురుపిల్లి చెవిటి దానిగా నటిస్తూ ‘‘నేను ముసలి దాన్ని నాకు చెవులు సరిగా పని చేయడం లేదు. ఇంకాస్త దగ్గరికి వచ్చి చెప్పండి’’ అంది. పక్షి, కుందేలు బావురుపిల్లికి బాగా దగ్గరగా వచ్చి మళ్లీ కథ మొదలు పెట్టబోయింది. అంతే! బావురు పిల్లి చప్పున ఒక చెేత్తో పక్షిని, ఇంకో చేత్తో కుందేలును అదిమిపట్టి చంపి తినేసింది.

చేసుకున్న వాడికి చేసుకున్నంత - కథ

     ఒక కుక్క తన ఎడమ కాలిలో చెవిని గోక్కుంటోంది. అకస్మాత్తుగా ఎలుకలను వెదుకుతూ ఒక పిల్లి అటు వచ్చింది. దానిని చూచి కుక్కకు నోరూరింది. దానని తినాలనే కోరిక కలిగింది. వెంటనే దానపై దూకకుండా తెలివిగా పట్టుకోవాలనుకుంది. పిల్లి కూడా కుక్కను చూచి తటాలున నిలబడిపోయి తియ్యగా ఇలా అంది: ‘శ్రీమాన్ తమరు విచారముగానున్నట్లు కనిపించుచున్నారు! కారణమేమిటి?’ దానికి ఏమి చెప్పమంటావు పెద్దమ్మా! నా రెండు కాళ్ళలో ముళ్లుగుచ్చుకున్నాయి అంది కుక్క. ‘వెధవ ముళ్ళు మీకెందుకుగుచ్చుకొన్నాయని’ పిల్లి అడిగింది. ‘‘దారిలో అవి గుచ్చుకున్నాయి. నీ పళ్ళతో వీటిని తీసివేయ్యి. జీవితాంతం నీకు ఋణపడి ఉంటాను. భయపడకు. నిన్నేం చెయ్యను’’ అంది. కుక్క నాకు ముళ్ళు తీయడం రాదని పిల్లి చెప్పింది. నేను నేర్పుతాను. దగ్గరకు రమ్మనమని కుక్కపిలిచింది. ఈ కొత్త కళ నేర్చుకోవడానికి నాకు దృష్టి దోషం ఉంది. దగ్గరలో ఈ కళ తెలిపిన ఒక దయ గల తోడేలు ఉంది. దాన్ని తీసుకొని వస్తానని పిల్లి అనడంతో కుక్క తోడెలు మాట వినగానే తుళ్ళిపడి వద్దు అంది. పిల్లి ఇప్పుడే తీసుకొని వస్తా అంటూ వెనుకకు పరిగెత్తింది. కుక్క కూడా కంగారుపడి భయంతో పారిపోయింది.

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

మేకపోతు గాంభీర్యం - కథ

     అనగా అనగా ఒక అడవిలో ఒక మేక ఉండేది. ఒక రోజు మేక షికారుకు బయలు దేరింది. ఆడుతూ పాడుతూ అడవంతా సరదాగా తిరిగింది. తిరిగి తిగిరి చూద్దామని వెళ్ళిన మేక అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుందామనుకుంది. అంతలో అక్కడికి సింహం వచ్చింది. సింహాన్ని చూడగానే మేకకు భయం వేసింది. ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి? అనుకుంది. లేని గాంభీర్యాన్ని నటిస్తూ సింహంతో ‘‘ఓ సింహమా! మంచి సమయానికి వచ్చావు. నేను పులులు, ఏనుగులు అన్నీ జంతువులను తిన్నాను. కాని ఇంత వరకు సింహాన్ని రుచి చూడలేదు. నా కోరిక ఇవాళ తీరేలా ఉంది. నేను రాక్షసి మేకను అంటూ రెండడుగులు ముందుకు వేసింది. సింహం ఆ మాటలు నిజమే అనుకొని ఒకటే పరుగు తీసింది. మేక తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది.

పక్షులు - కథ

     ఒక ఊరిలో ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు నిండా పక్షులు ఉండేవి. ఆ పక్షులను వేటగాళ్ళు వచ్చి రెండు పక్షులను ప్రతిరోజు తీసుకొని వెళ్ళేవారు. ఒక రోజు అందులో ఒక పక్షికి అనుమానం కలిగి పక్షులను లెక్కించింది. రెండు తక్కువగా ఉన్నాయి. మరునాడు లెక్కపెట్టగా మరో రెండు తక్కువగా ఉన్నాయి. దాంతో అవి ఏమైపోతున్నాయని ఆరా తీయడానికి రాత్రంతా నిద్రపోకుండా చెట్టుపై కాపలాకాసింది. అప్పుడు వేటగాళ్ళు పక్షులకై వచ్చారు. పక్షి వెంటనే వేగంగా ఎగిరి వచ్చి వారి కంటిలో పొడిచింది. అప్పుడు వేటగాళ్ళు కంటిచూపు పోయింది. ఈ విషయంను మిగిలిన పక్షులు తెలుసుకొని ఆ పక్షిని ఎంతగానో అభినందించాయి. ఇక ఆ పక్షులకు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాయి.

తెలివితక్కువ ఏనుగు - కథ

     అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది ఏమాత్రం పనిపాటా లేక ఊరకే తిరుగుతూ ఉండేది. ‘‘కొండంత ఉన్నావు. బండెడు తింటావు. బుద్దేమి లేదురా బండన్న’’ అంటూ చిన్న కుందేళ్ళు సైతం ఆటపట్టిస్తూ ఉంటే దానికి కోపం వచ్చి బుద్ది పెంచుకోవాలని ఊళ్ళోకి బయలుదేరింది.

     దారిలో ఒక ఎద్దు కనిపించింది. దానితో ‘‘ఎద్దన్నా ఎద్దన్నా తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే చెప్పవా’’ అంది. ‘‘అబ్బో! బండి కట్టడం, కాడి ఎత్తడం, మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది కానీ నన్ను వదిలేయవయ్యా’’ అంది ఎద్దు. సరేలే అనుకుని అటుపక్కగా వెళుతున్న చీమతో ‘‘చీమతల్లి, చిన్న చెల్లి నాకు బుద్దంటే ఏమిటో చెప్పవా?’’ అంది ‘‘ఏమీ అనుకోవద్దు ఏనుగన్నా వానాకాలం వస్తే నాకు సున్నా అందుకే ఇలా పరిగెడుతున్నా. ఖాళీ ఉన్నప్పుడైతే చెపుతా ఏనుగన్నా’’ అంటూ వెళ్ళిపోయింది. ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి. కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు.

     విసిగి విసిగి వెనక్కు వచ్చిన ఏనుగుతో చెట్టుమీద చిన్న కాకి ఇలా చెప్పింది. ‘‘బుద్ది కోసం బజారును పడి తిరగాల్సిన  అవసరం లేదు. బుద్ది మంతులు అందరూ ఎవరు పని వారు చేసుకుంటారు. నీ పని నీవు చేసుకో చాలు.’’ ఏనుగుకు నిజంగా బుద్ది వచ్చింది. తన పని తాను చేసుకుంటూ ఎవరితోనూ మాటపడకుండా హాయిగా జీవించింది.

నక్క - భూదేవర (కథ)

     ఒక నక్కకు భూమిమీద ఒక పైస దొరికింది. అది పైసతో పుట్నాలు కొనుక్కుంది. తినేసింది. కొన్ని రోజులు గడిచాయి. భూమి మీద పైస దొరికింది గనుక ఆ పైస భూదేవరది. ‘‘నాపైస నాకు తిరిగి ఈయవా?’’ అని భూదేవర అడిగింది. నక్క భూమిని తప్పించుకోవడానికి ఎంతో దూరం పరుగెత్తింది.

     అక్కడ కూడా భూమి ఉన్నది కదా!. ‘‘నాపైస తిరిగి ఈయవా’’ అని భూదేవర మళ్ళీ అడిగింది. నక్క మళ్ళీ పరుగెత్తింది. అక్కడ కూడా భూమి ఉన్నది. భూదేవర మళ్ళీ అడిగింది. నక్క మళ్ళీ పరుగెత్తింది. అలా తొగరి చేండ్ల నుండి పరుగెత్తుంటే దాని కంటికి తొగరి పుల్ల గుచ్చుకుంది. దాని కన్నొక్కటి పోయింది. భూదేవర నక్కను మళ్ళీ పైస అడిగినప్పుడు నక్క కోపంతో ‘‘నీవు గుడ్డి నక్కకు ఇచ్చావా మంచి నక్కవా’’ అని అడిగింది. భూదేవర ‘‘మంచి నక్కకే’’ అని అంది. నక్క తన కన్నును చూపింది. భూదేవర మళ్ళీ ఆ నక్కను పైస అడగలేదు.

     ‘‘నా కంటిని మంచిగా చేయి’’ అని నక్క పోచమ్మ దేవరను వేడుకుంది. భోనము వేస్తాను అంది. పోచమ్మ నక్క కన్నును నయం చేసింది. నక్క భోజనము వేయడం మరచిపోయింది. పోచమ్మ తల్లి నక్కను భోజనమేయమంది. ‘‘అమ్మా నీకు గుడ్డి నక్క భోనమేస్తా అన్నదా మంచి నక్కనా’’ అని నక్క అడిగింది. ‘‘గుడ్డి నక్కనే’’ అని పోచమ్మ తల్లి అంది. ‘‘నా కన్ను చూడు. నేను గుడ్డినక్కనా?’’ అని నక్క అడిగింది. ‘‘కాదు’’ అంది పోచమ్మ. మరి నేను భోనమువేయను అని నక్క తప్పించుకుంది.

22, ఫిబ్రవరి 2016, సోమవారం

విద్య - కథ

     అనగనగా ఒక ఊళ్ళో రాము, సోము అనే అన్నదమ్ములు ఉన్నారు. వాళ్లు బడికి వెళ్లకుండా అల్లరిగా తిరిగే వారు. వాళ్ళ అమ్మానాన్నా చాలా బాధ పడేవారు.

     ఒకరోజు వాళ్ల ఊరి చెరువు గట్టు మీద ఒకతను నడుచుకుంటూ వస్తూ, కాలు జారి చెరువులో పడ్డాడు. అందరూ అయ్యో! అయ్యో! అంటున్నారే కాని ఎవరు ఆయన్ని కాపాడటం లేదు. అక్కడే ఆడకొంటున్న రాము, సోము చెరువులో పడ్డ అతనిని కాపాడి ఒడ్డుకి తెచ్చారు.

     ఈ విషయం రాము, సోము వాళ్ల అమ్మానాన్నకు తెలిసి పరుగెత్తుకుంటూ వచ్చారు. తమ బిడ్డలు ఒక మనిషి ప్రాణం కాపాడారని తెలిసి సంతోషంచారు. ఆ పెద్దాయన ఎవరోకాదు ఆ ఊరికి కొత్తగా వచ్చిన మాష్టారు. ఆయన పేరు రామయ్య.

     రాము, సోము బడికి రాకపోవడం చూసి, వాళ్లింటికి వెళ్లాడు. రాము, సోముల గురించి వాళ్ల అమ్మానాన్నను అడిగి తెలుసుకున్నారు. పిల్లలిద్దర్నీ దగ్గర కూర్చోచెట్టుకొని మీరు గొప్ప వారవుతారు. రోజూ బడికి రండి మీకు మంచి కథలూ, పాటలూ, ఆటలూ నేర్పుతాను అని చెప్పారు. అప్పటినుండి రాము, సోము బడికి వెళ్లి బాగా చదువుకున్నారు. గొప్పవారయ్యారు.

చీమ - కథ

     ఒక ఊరిలో మూడు చీమలుండేవి. వాటి పేర్లు ఎర్రచీమ, నల్లచీమ, తెల్లచీమ. అవి స్నేహంగా ఉండేవి.

     ఒక రోజు ఎర్రచీమకు నల్లచీమ మీద సందేహం కలిగింది. ఎర్రచీమ వెళ్ళ నల్లచీమ, నల్లచీమా! నల్లచీమా! నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావు? అని అడిగింది. నల్లచీమ దానికి నేను ఎండలో ఉంటాను కాబట్టి నల్లగా ఉంటానని చెప్పింది.

     ఒక రోజు నల్లచీమ వెళ్ళి ఎర్రచీమను నువ్వెందుకు ఎర్రగా ఉంటావని అడిగింది. నేను పళ్ల రసాలు తాగుతాను కాబట్టి ఎర్రగా ఉంటానని చెప్పింది.

     నల్లచీమ, ఎర్రచీమ రెండు కలిసి వెళ్ళి తెల్లచీమను నువ్వెందుకు తెల్లగా ఉంటావని అడిగాయి. దానికి తెల్లచీమ నేను పౌడర్ పూసుకుంటానని జవాబిచ్చింది.

అరటి మేలు (కథ)

     అనగా అనగా ఒక అడవి. అడవిలో రకరకాల పండ్ల చెట్లున్నాయి. ఆ పండ్లన్నీ స్నేహంగా ఉండేవి. ఆ ఫండ్లన్నింటిలో యాపిల్ ని అడవికి రాజుగా ఎన్నుకున్నాయి. యాపిల్ తాను ఎర్రగా అందంగా ఉంటానని గర్వపడేది. మిగితా పండ్లకు ఇది నచ్చేది కాదు. ఒక రోజు యాపిల్ ‘నాతో ఎవరు పోటీకి వస్తారు’ అంది అరటి ముందు కొచ్చింది. ‘అడవి చివర రాము, సోము ఇద్దరున్నారు. వీరిలో ఒకరు యాపిల్, మరొకరు అరటిపండు తిన్నారు. వారిద్దరిలో ఏ పండు తిన్నవారు బలంగా బొద్దుగా ఉంటారో ఆ పండు అడవికి రాజు అని చిలుక చెప్పింది. కొన్ని రోజులు అలా తిన్న తరువాత రాము బలంగా, బొద్దుగా తయారయ్యాడు. సోము ఎప్పటిలానే ఉన్నాడు. అరటి పండును రాజుగా ఎన్నుకున్నారు. యాపిల్ గర్వం అణిగింది. మిగితా పండ్లన్నీ సంతోషించాయి.

మూడు నిజాలు (కథ)

     అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తెలివైన మేకపిల్ల ఉండేది. అది ఒకసారి మందలో నుంచి తప్పిపోయింది. తన వాళ్ళ కోసం అడవి అంతా తిరిగింది. అయినా ఏ ఒక్కరూ కనిపించలేదు. చివరకు నీరసంగా ఒక చెట్టుకింద కూలబడింది. అప్పుడే అక్కడికొక పులి వచ్చింది. మేకపిల్ల పులిని చూసింది. అయినా భయపడలేదు. దాని ధైర్యం చూసి పులికి ముచ్చటేసింది. మేకపిల్ల దగ్గరకెళ్ళి ‘ఏమోయ్.. నేనంటే నీకేం భయం లేనట్టుంది’ అంది పులి. ‘చూసి భయపడేంత భయంకరంగా లేవే!’ అంది మేక పిల్ల. ‘ఆహా.. మాటలు బాగానే మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావు?’ అడిగింది పులి. ‘మందలో నుండి తప్పిపోయాను, మా వాళ్ళ కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. మరి వెళ్తాను..’ బయలు దేరుతూ అంది మేకపిల్ల. ‘ఎక్కడికెళ్లేది? నన్ను తప్పించుకుని వెళ్ళడం నీతరం కాదు’ అంది పులి. ‘కాదు నేను వెళ్ళి తీరాలి’ గట్టిగా అంది మేక. తప్పకుండా వెళ్లి తీరాలంటే నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి’ అంది పులి. ‘చెప్తే నా దారిన నన్ను వెళ్ల నిస్తావా?’ అడిగింది మేకపిల్ల. ‘ఓ నిక్షేపంగా’ అంది పులి అయితే వినండి ‘నేను మావాళ్ల వద్దకు వెళ్లి.. నేనొక పులిని చూశాను. అది నన్నుచంపకుండా వదిలేసింది’ అంటాను. ‘వాళ్ళు నమ్మరు. ఇది మొదటి నిజం’. ఇక రెండో నిజం... ‘మీరు మీ స్నేహితుల దగ్గరకెళ్లి నేనొక మేకపిల్లను చూశాను. దాన్ని నేను చంపకుండా వదిలేశాను’ అంటారు. వాళ్లెవరూ మీరు చెప్పింది నమ్మరు. ఇది రెండో నిజం అంది మేకపిల్ల. మరి మూడో నిజం.. అంటూ కుతుహలంగా అడిగింది పులి. ‘ఎదురుగా నేనున్నా మీరు నింపాదిగా మాట్లాడుతూ కూర్చున్నారంటే ఇప్పుడు మీకు ఆకలెయ్యట్లేదు. ఇదే మూడో నిజం అంది మేక పిల్ల. ‘అబ్బో! ఏమో అనుకున్నాను. నువ్వు నిజంగా తెలివైన మేకపిల్లవే. నీ తెలివి తేటలకు మెచ్చి నిన్ను వదిలేస్తున్నాను అంది పులి. మేక పిల్ల సంతోషంగా వెళ్లపోయింది.

కోతులు - తోట (కథ)

     అనగ అనగ ఒకరాజు. అతడు ఒకనాడు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఉళ్ళో వాళ్ళందరినీ పిలిచాడు. అందరూ వెళ్ళారు. ఒక రైతు వెళ్ళలేదు. అతను తోటలో కూర్చొని విచారిస్తూ ఉంటాడు. అది ఒక కోతి చూచింది. ‘‘రాజుగారి భోజనానికి ఎందుకు వెళ్ళలేదు ?’’ అని అడిగింది.

     రైతు ‘‘మొక్కలకు నీరు పెట్టేది ఉంది. అందుకే వెళ్లలేదు’’ అని అన్నాడు. ‘‘నీవు వెళ్లు. నేను నీరు పెడతా’’ అన్నది కోతి. ‘‘వేళ్లు నానేటట్లు నీరు ఇవ్వాలి’’ అన్నాడు. రైతు. కోతి ‘‘సరే’’ అంది.

     రైతు రాజు గారింటికి భోజనానికి వెళ్ళాడు. కోతి తన మిత్రులను పిలిచింది. వందలు వేలు కోతులు వచ్చాయి. ‘‘ ఈ మొక్కలన్నింటికి నీరు ఇవ్వాలి’’ అంది కోతి. కోతులన్నీ ‘సరే’ అన్నాయి. డొన్నలు కుట్టి, వాగు నుంచి నీళ్ళు తెచ్చాయి. మొక్కలకు పోశాయి. ‘‘నీరు మొక్కల వేళ్ళకు తగిలాయా’’ అంది కోతి. ‘‘తెలవదు’’ అన్నాయి మిగితా కోతులు. ‘‘మొక్కను పీకి చూడండి’’ అంది కోతి. కోతులు మొక్కలన్నింటిని పీకి వాటి వేళ్ళను చూశాయి.

     తిరిగి వచ్చిన రైతు తన తోటను చూసి లబోదిబోమన్నాడు.

రాము తెలివి - కథ

     రామాపురంలో రాము అనే తెలివైన అబ్బాయి ఉండేవాడు. రోజూ లాగానే బడికి వెళ్ళే దారిలో బఠానీలు కొన్నాడు. దుకాణం తాత బఠానీలు తక్కువగా ఇచ్చాడని గమనించాడు. మరుసటి రోజు ఇంకొంచెం తగ్గటం తెలుసుకుని ‘ఎందుకు తాతా తగ్గిస్తున్నావు’ అని అడిగాడు. ‘బాబు బఠానీలు ఎక్కువగా ఉంటే నీవు మోయలేవు’ అని తాత చెప్పాడు.

     సరేనని రాము తక్కువ డబ్బులు ఇచ్చాడు. ‘ఏంది బాబూ తక్కువన్నాయి’ అడిగాడు తాత. ‘ ఏం లేదు తాతా ఎక్కువ ఇస్తే నీవు లెక్క పెట్టుకోలేవని తక్కువ ఇచ్చాడు’ అన్నాడు ఆ తెలివైన అబ్బాయి. రాము తెలివికి తాత తప్పు తెలుసుకున్నాడు. అప్పటి నుండి సరిపడా బఠానీలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

5. పారిపోయిన గిన్నెలు(Paripoina ginnelu) - 3 తరగతి తెలుగు

విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలకు తమ అవనరాలకోసం అతని దగ్గర అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవారు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.

ఒకరోజు రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళి ‘‘ మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది. అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి’’ అని అడిగాడు. అందుకు వరహాలయ్య ‘‘రెండు బంగారు నాణేలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను,’’ అన్నాడు. రామకృష్ణుడు సరేనని ముందుగానే రెండు బంగారు నాణేలు చెల్లించి గిన్నెను తీసుకువెళ్ళాడు.

రెండు రోజుల తరువాత రామకృష్ణుడు తాను తీసుకువెళ్ళిన గిన్నతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇచ్చాడు. ‘‘నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి ఈ గిన్నె పుట్టింది,’’ అని చెప్పాడు. రామకృష్ణుడు ఇంత అమాయకుడా ? వరహాలయ్య సంబరపడిపోయాడు. అతనేటువంటి వాడయితేనేం నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడు.

వారం రోజుల తర్వాత రామకృష్ణుడు తిరిగి వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు. ‘‘ రేపు అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను. నాకు కొన్ని గిన్నెలు కావాలి. ఇదివరకటిలాగే అద్దె చెల్లిస్తాను,’’ అన్నాడు.

అందుకు వరహాలయ్య, ‘‘ కొన్ని కాదు, నాదగ్గర ఉన్న అన్ని గిన్నెలూ ఇస్తాను,’’ అన్నాడు సంతోషంగా, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండిమీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా చూడసాగాడు. వరహాలయ్య.

పది రోజులు గడిచిపోయాయి. రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు. చివరకు వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెలను గురించి అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, ‘‘ నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి,’’ అని చెప్పాడు. ‘‘గిన్నెలు పారిపోవడం ఏమిటి ? అంతా మోసం!’’ అంటూ అరిచాడు వరహాలయ్య. నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు.

రాజుగారు రామకృష్ణుణ్ణి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నరు. వరహాలయ్య గుిరించి కూడా వివరాలు సేకరించారు.

వరహాలయ్యతో, ‘‘నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా!’’ అన్నాడు రాజు.

వరహాలయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటినుండి వరహాలయ్య నీతిగా జీవించాడు.