సామెత కథ
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
పూర్వం మన దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.
చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.
మహర్షిని చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.
తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!
ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం " అనుకున్నాడు.
అది ఇల్వలుడికి వినపడలేదు.
ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు "వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా! " అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.
అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు" అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.
తాపసి దయతలచి సరే అన్నాడు.
ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.