సందేహాలు - సమాధానాలు
1. ప్రశ్న:
మూడు నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పింఛనులో మూడో వంతు కమ్యుటేషన్ చేసుకుంటే రూ.7,11,591 వస్తాయి. కానీ, నెలకు వచ్చే పింఛను రూ.8,581ని 15 ఏళ్లపాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పింఛనును పునరుద్ధరించి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా?
జవాబు:
పింఛనులో బేసిక్, కరువు భత్యం అని రెండు భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంటుతో పదవీ విరమణ చేసేప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్ అంటారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛనను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్ వల్ల ఈ పింఛను రూ.8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ.7,11,591లను సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో దాచుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.14,765 వరకూ వస్తాయి. కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తం రూ.3,659 తగ్గిపోతుంది. కానీ, గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్ చేస్తే వచ్చిన రూ.7,11,591 ను 13శాతం రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.8,581 వస్తాయి. 15ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13శాతం రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో రూ.3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛను తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికి వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు. ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకోవచ్చు.
2. ప్రశ్న:
పెన్షనర్ మరనించినచో కుటుంబ సభ్యులు ఏమి చేయాలి?
జవాబు:
పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియపరచాలి. తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్ (ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్ /ఐరిష్) ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు. రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.
3. ప్రశ్న:
PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా?
జవాబు:
వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప, సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.
4. ప్రశ్న:
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు?
జవాబు:
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసులో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు. 2020 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లుకి అవకాశం కల్పించారు.
5. ప్రశ్న:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు?
జవాబు:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల్లో వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.