LATEST UPDATES

25, ఏప్రిల్ 2020, శనివారం

ఆహా ఎంతమార్పు -రచయిత షేక్ రంజాన్

ఆహా ఎంతమార్పు
            ......................
కాలుష్యము  తొలగిపోయ్యాను
చెట్టు కొమ్మ  చిగురించెను
ఆకుపైన  సీతాకోకచిలుక
రెమ్మ నుండి  మొగ్గలెన్నో
పూల నుండి   కాయలెన్నో
కాయ రంగు   మారిపొయ్యాను
           ~ఆహా ఎంతమార్పు

ఫ్యాక్టరీలు  మూతపడ్డవి
పర్వతాలు బయటపడినవి
నది జలాలు  రంగుమారేను
నెమలి  నాట్యమాడుతున్నది
కోకిల   పాటపాడుతున్నది
జింక  పరుగులెడుతున్నది
పిచ్చుక   గూడుకడుతున్నది
           ~ఆహా ఎంతమార్పు

జనసాంద్రత  తక్కువయా
శబ్ద కాలుష్యము       తగ్గిపోయి                          
 నీటి కలుషితము కాకపోయా
కలుషిత ఆహారము  లేకపోయా
డ్రైనేజీలు  శుభ్రమయా
దోమలు ఈగలు  లేకపోయా రోగాలు   రాకపాయా
        ~ఆహా ఎంతమార్పు

ఇంటికి   పరిమితమై
ఇల్లు    శుభ్రత చేయచుంటిరి
పాత రోలు  బయట పడే
రోకలి  చేత బూని
మానిసన కారం  దంచుతుంటిరి
గొడ్డు కారం  నూరుతుంటిరి
           ~ఆహా ఎంతమార్పు        
 మూలనున్న   చల్ల కవం
కడవలోన   పెరుగును
చిలికి చిలికి  వెన్నెతీసి
నేయిని  చేస్తుంటిరి
           ~ఆహా ఎంతమార్పు

రచయిత.......
షేక్  రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఏం మాయ చేసావే కరోనా

🌴 ఏం మాయ చేసావే కరోనా 🌴

1. పెన్ను పేపర్ ముట్ట లేదు
    ఫైనల్ పరీక్షలు రాయలేదు
    కరోనా కంగారుతో
    పొట్టే గాండ్లను  పై తరగతులకు
    ప్రమోట్  చేయడం తో
    ఎగిరి గంతేసి సెల్ ఫోన్లు, టీవీలతో
    తీన్మార్ జేస్తుండ్రు.
2 . బాటిల్ లో సుక్క లేక
     ప్లేట్లో లో ముక్క లేక
     బార్ షాపులు తెరుచుకోక
     దోస్త్ గాళ్ళు ఇంటికి రాకా
     రోజంతా పొద్దు పోక
     అలవాటుపడ్డ పాణాలు
     గాయి గాయి  అయితున్నయి.
3. లాక్ టౌన్ కాలం ఎక్కువై
    అత్తా కోడళ్ళ మధ్య
    ఆలుమొగల్ల మధ్య
    చిటపటలు,చిందులు ఎక్కువై
    ఓపిక సహనం తక్కువై
    ఫిర్యాదుల కేసులు
     పరేషాన్ జేస్తున్నయి
4. కూలి నాలి కులవృత్తోల్లకు
    పని లేక కరెన్సీ కష్టాలతో
    శ్రమజీవుల బతుకు సమరం
    దిన దిన గండం తో
    బతుకు సుడిగుండం లా మారింది
5. మందిర్, మసీద్,
    చర్చిలను మూత పెట్టి
    చరిత్రను తిరగబెట్టి
    భగవంతున్ని ఇంటికి తెచ్చి
    మందిరంలో కాదు దేవుడు
    మదిలోనే ఉండాలని నేర్పింది
6.  అమెరికా నీ దెబ్బతో అల్లాడుతుంది
     అందమైన ఐరోపా ఆగమౌతుంది
     విశ్వమంతా ఇసురుకొని
    పసికూనల నుండి పండుటాకుల వరకు
    ఆకు తినే పురుగు లాగా ఆరగిస్తుంది.
7. శాస్త్రీయతకు సవాల్ విసిరి
    ప్రగతి నంతా ప్రశ్నార్ధకం చేసి
    ప్రకృతిని మరిచిన మనిషికి
    జ్ఞానోదయం కలిగించింది.
-------------------------------
✍✍✍ తాటిపాాముల రమేష్
 జడ్.పి.హెచ్.ఎస్ వర్ధన్నపేట.

నీతి కథలు - 17 చిట్టెలుక ఉపకారం

నీతి కథలు - 17

చిట్టెలుక ఉపకారం

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.

ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.

చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... "ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు" అని చిట్టెలుకతో అంది. అవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి.

అక్బర్-బీర్బల్ కథలు - 9నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..!

అక్బర్-బీర్బల్ కథలు - 9

నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..!

ఒకసారి అక్బర్ చక్రవర్తి.. తన మందీ మార్బలంతోపాటు బీర్బల్‌ను కూడా వెంటబెట్టుకుని వినోదం కోసం అడవికి వెళ్లాడు. అయితే తన గుర్రం తాను కోరుకున్నంత వేగంగా పరిగెత్తక పోవటంతో అక్బర్‌కు చాలా కోపం వచ్చింది. ఒక కొరడా తీసుకుని దాన్ని కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

అది చూసిన బీర్బల్ వెంటనే "మహారాజా.. దయచేసి దాన్ని కొట్టకండి" అంటూ అడ్డుపడ్డాడు. "నా తిండి తింటుంది కాబట్టి అది చచ్చినట్లు కా కోసం పని చెయ్యాల్సిందే. అదలా చేయకపోతే దాన్ని కొట్టే హక్కు నాకుంద"ని బదులిచ్చాడు అక్బర్. అయినప్పటికీ.. "దయచేసి తమరు ఆ గుర్రంమీద జాలి చూపించండ"ని పదే పదే వేడుకున్నాడు బీర్బల్.

"అది సరేగానీ.. నేను నువ్వు చెప్పినట్లుగానే వింటాను. కానీ నా తిండి తిన్న వాళ్లెవరైనా సరే నా పని చేయాల్సిందే" అన్నాడు మొండిగా అక్బర్. ఆ తర్వాత కొంతదూరం వెళ్లిన తరువాత వారికి జింక ఒకటి కనిపించింది. దాన్ని వేటాడి చంపేసి కోటకు తీసుకెళ్దామని అన్నాడు అక్బర్.

అలా ఆ జింకను వేటాడుతూ అక్బర్, బీర్బల్‌లు ఇద్దరూ మిగతా మందీ మార్బలం నుంచి వేరుగా అయిపోయారు. కాసేపటి తరువాత అక్బర్‌కు బాగా ఆకలి వేసింది. మన ఆహార పదార్థాలన్నీ మన వాళ్లవద్దనే ఉండిపోయాయి. ఇప్పుడెలా మహాప్రభూ..? అని అన్నాడు బీర్బల్. అయితే ప్రస్తుతం మనవద్ద గుర్రం తినే దాణా తప్ప మరింకేమీ తినేందుకు లేవని చెప్పాడు బీర్బల్.

"ఏమీ లేని దానికన్నా గుర్రం దాణా అయినా నయమే కదా..? అదే ఇవ్వు" అన్నాడు అక్బర్. దాంతో ఇద్దరూ గుర్రం మెడకు వేళాడుతున్న సంచిలోని గుగ్గిళ్లు తీసుకుని గుప్పిళ్లకొద్దీ తిన్నారు. ఆకలి తీరిన తరువాత అక్బర్.. "ఇక మనవాళ్ల కోసం వెతుకుదాం పదా..?!" అంటూ గుర్రం ఎక్కబోయాడు.

అయితే అసలే ఆకలిగా ఉన్న ఆ గుర్రం అక్బర్‌ను వెనుక కాళ్లతో తన్నింది. కోపంతో ఊగిపోయిన అక్బర్ కొరడాతో దాన్ని బాదేందుకు సిద్ధపడగా బీర్బల్ అడ్డుకున్నాడు. "ఎంత పొగరు, దాన్ని చంపేస్తానంటూ" గుర్రం మీదికి ఉరికాడు అక్బర్. "అయ్యా మీరు అలా చేయలేరు" అన్నాడు బీర్బల్

"ఏం ఎందుకు చేయలేను? నన్ను ఆపవద్ద"ని చెప్పి గుర్రం మీది మీదికి వెళ్లాడు అక్బర్. "అలా చేయటం సరికాదు ప్రభూ..! ఎందుకంటే మీరు ఇప్పుడే దాని తిండి తినేశారు. మీరే దాని పని చేయాలి" అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటలకు అక్బర్‌కు కోపం స్థానంలో నవ్వు పలుకరించింది.

"ఏంటి బీర్బల్..? గుర్రంపని నేను చేయటమా..? ఏం చెయ్యాలేంటి..?" నవ్వుతూనే అడిగాడు. మరేం లేదు మహారాజా..! మీరు దాని తిండి తినేశారు కాబట్టి దాని పని చేయాలి. దాని అది పని చేయాలంటే.. దాన్ని మీమీద ఎక్కి స్వారీ చేయనివ్వండి అన్నాడు. దాంతో బీర్బల్ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన అక్బర్.. తన పొరపాటును గ్రహించాడు. ఆ తరువాత బీర్బల్‌ను వెంటబెట్టుకుని ఆ అడవిలో కనిపించకుండా పోయిన తమవాళ్లకోసం వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.

ప్రశ్న: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

ప్రశ్న: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

జవాబు:
నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసంతోనే కాకుండా, ద్రాక్షరసం నుంచి తయారు చేసే 'వినిగర్‌'తో కూడా తొలగించవచ్చు. కుళాయిలపై వాటిలో ప్రవహించే నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం అయాన్ల వల్ల ఏర్పడే లవణాల మూలంగా తెల్లని సున్నపు మరకలు ఏర్పడతాయి. ఉప్పునీటిలో ఈ లవణాల శాతం అధికంగా ఉంటుంది. కుళాయిలపై నీటి అణువులు భాష్పీభవనం చెందిన తర్వాత ఈ మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. వీటిని ఏ రసాయనిక ద్రావకం ద్వారానైనా తొలగించవచ్చు. కానీ అతి గాఢత కలిగిన ఆ ద్రావకాల వల్ల రసాయనిక చర్యలు జరిగి కుళాయిలు తయారయిన లోహాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ కుళాయిలపై సున్నపు మరకలు పడిన ప్రదేశాలను అతి తక్కువ గాఢత ఉండే నిమ్మరసం లేక వినిగర్‌తో రుద్దితే, నిమ్మరసంలోని సిట్రిక్‌ ఆమ్లం, వినిగర్‌లో ఉండే ఎసిటిక్‌ ఆమ్లం, ఆ కుళాయిలకు అంటుకుపోయిన తెల్లటి సున్నపు మరకలను అంటే ఆ లవణాలను తొలగిస్తాయి. తర్వాత ఆ ప్రదేశాలను నీటితో కడిగితే, కుళాయిలు మునుపటి లాగే మెరుస్తుంటాయి.

23, ఏప్రిల్ 2020, గురువారం

మాయ రోగం మమ్మల్నేం జేస్తది

🌴మాయ రోగం మమ్మల్నేం జేస్తది 🌴
1. పలుగు పార పట్టేటోళ్ళం
     మేడి పట్టి దుక్కి దున్నేటోళ్ళం 
     నాటు, కలుపు,కోత కోసేటోళ్లం
     పుట్ల కొద్దీ తూర్పార బట్టి
     ఎడ్ల బండ్ల కు ఎత్తేటోళ్ళం
     మాయ రోగం మమ్మల్నేం జేస్తది
2.  కొండలను పిండి చేసి
      బండలను చిట్లగొట్టి
      ఫూటు రౌతు ఎత్తెటోళ్ళం
      ఇటుక ఇటుకను పేర్చి
      ఇండ్లను కట్టెటోళ్ళం
      మాయరోగం మమ్ముల్నేం జేస్తది.
3.    పోగు పోగు పేర్చి
       కన్నీళ్లతో కండెలను చుట్టి
       అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి
       ప్రపంచాన్ని అబ్బురపరచినోళ్ళం
       మోకు ముస్తాదు చేతబట్టి
       కత్తి పట్టి కల్లును గీసేటోళ్ళం
       మాయ రోగం మమ్ముల్నేం జేస్తది
4.   మట్టిలో కెమిస్ట్రీని మిక్స్ చేసి
       చక్రంతో మనసు దోచే
       మట్టి పాత్రలు చేసేటోళ్ళం
       కత్తి, బ్లేడు ను చేతబట్టి
        స్టైల్ గా కటింగ్ చేసేటోళ్ళం
       మాయ రోగం మమ్ముల్నేం జేస్తది
5.    డప్పు కొట్టి దరువు వేసేటోళ్ళం
       మేడ మిద్దెలకు రంగులద్దెటోళ్ళం
       కష్టాల కావడిని మోస్తూ
       కలవరం చెందకుండా
       సబ్బండ వర్గాలు
       సవాల్ గా తీసుకుంటాం
      కరోనా అంతమే
      మా పంతంగా కదులుదాం.
6.   కాలు బయట పెట్టకుండా
      నీ గొలుసును కత్తిరిస్తం
     సానిటైజర్లను వాడి
     నీకు సమాధి కడతాం
     పిడికిలెత్తి పోరు సల్పి
     నిన్ను పొలిమేర దాటిస్తాం.
------------------------------------------
✍✍✍ తాటిపాముల రమేష్
 జడ్పీహెచ్ఎస్ వర్ధన్నపేట.

నీతి కథలు - 15 కుందేలుకు గుణపాఠం

నీతి కథలు - 15

కుందేలుకు గుణపాఠం

కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు.

తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు.

గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గరే కూలబడి, ‘‘నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదూ!’’ అంది. ‘‘అవును. నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలనే ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. రా భోజనం చేద్దాం’’ అంటూ పిలిచింది తాబేలు. దానితో కుందేలు తన తప్పు తెలుసుకుంది.

అక్బర్-బీర్బల్ కథలు - 8 ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

అక్బర్-బీర్బల్ కథలు - 8

ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

ఒకరోజు అక్బర్‌ పాదుషా తన మంత్రి బీర్బల్‌‌తో కలిసి వేటకు బయలుదేరాడు. అది చలికాలం కావడంతో చలి విపరీతంగా ఉంది. కొంతదూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దారి ప్రక్కన ఒక పేదవాడు పడుకుని కనిపించాడు. ఆ మనిషి శరీరం మీద ఒక చిరిగిన అంగీ తప్ప మరే వస్త్రం లేదు.

అక్బర్‌ ఆ మనిషిని పరీక్షగా చూసి.. "బీర్బల్..‌! ఈ వ్యక్తి మరణించినట్లున్నాడు కదూ..?" అని ప్రశ్నించాడు. బీర్బల్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి, "లేదు ప్రభూ..! ఈ వ్యక్తి మరణించలేదు. ఆదమరచి నిద్రపోతున్నాడ"ని చెప్పాడు.

బీర్బల్‌ మాటలపై నమ్మకం కలగకపోవటంతో అక్బర్‌... "క్రింద పరుపులేదు. కప్పుకోవడానికి కంబళిలేదు క్రింద రాళ్ళు, రప్పలు, పైన చలి యింత చలిలో విశ్రాంతిగా నిద్రించడం ఎవరికైనా సాధ్యమా...? ఇతడు నిశ్చయంగా మరణించాడు" అని అన్నాడు. "లేదు ప్రభూ...! ఇతను మంచి నిద్రలో ఉన్నాడు. ఇటువంటి నిద్ర మీకూ, నాకు కూడా పట్టద"ని చెప్పాడు బీర్బల్‌.
కష్టపడకపోతే ఇంతే మరి...!!

వెంటనే అక్బర్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. ఆ మనిషి గాఢనిద్రలో ఉన్నట్లుగా గ్రహించి ఆశ్చర్యపోయాడు. వెంటనే... "బీర్బల్...‌! నువ్వన్నట్లుగానే ఈ వ్యక్తి గాఢనిద్రలో ఉన్నాడు. కానీ యితనికి ఈ రాళ్ళ మీద యింత చలిలో ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం కావడం లేద"ని అన్నాడు.

"జహాపనా...! ధనికుడై ఉండడానికి, నిద్ర పట్టడానికి ఏమీసంబంధంలేదు. నిద్ర ష్టపడితేనే వస్తుంది. ఈ పేదవాడు కష్టపడి పనిచేసి అలసిపోయాడు. అందువల్లనే ఇతనికి గాఢనిద్ర పట్టింది. ఇటువంటి సుఖనిద్ర కష్టపడితేనే లభిస్తుంద" ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అయినప్పటికీ... బీర్బల్‌ మాటలపై అక్బర్‌కు నమ్మకం కలుగలేదు. "అది కాదు బీర్బల్‌..! ఈ వ్యక్తికి ధనవంతుల ఆహార పానీయాలూ, నిద్రపోవడానికి హంసతూలికా తల్పాలు వుంటే... ఇతడు ఇంతకంటే గాఢంగా నిద్రపోగలడు కదా..!" అని అన్నాడు అక్బర్. "హుజూర్...‌! మీరు అన్న మాటలు నిజంకావు. కావాలంటే ఇతనిని కొంతకాలం ధనవంతునిగా చేసి చూడండి" అని చెప్పాడు బీర్బల్‌ .

దీంతో.. తాను చెప్పిన మాటలే నిజమని నిరూపించాలని నిశ్చయించుకున్నాడు అక్బర్‌ చక్రవర్తి. ఆ వ్యక్తిని నిద్ర నుండి లేపి తన వెంట రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తి నివసించడానికి సకల సౌకర్యాలతో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశాడు. రుచికరమైన ఆహార పానీయాలు, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన హంసతూలికాతల్పం వగైరా అన్ని ఏర్పాట్లు చేయిం చాడు.

కష్టపడి కాయకష్టం చేసుకునే ఆ వ్యక్తికి ఆ రాజ భవనంలో తినడం విశ్రాంతి తీసుకోవడం తప్ప, వేరే పనేమీ లేకుండా పక్షంరోజులు గడిచిపోయాయి. ఒకనాడు అక్బర్‌ ఆ వ్యక్తిని గురించి బీర్బల్‌ని అడిగాడు. "ప్రభూ..! ఆ నకిలీ ధనికుడికి మూడు దినాలుగా జ్వరం" అని చెప్పాడు. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డ అక్బర్... "అంటే అతనికి విశ్రాంతి లేదన్నమాట, ఎవరి నిర్లక్ష్యంవల్ల ఇలా జరిగింద..?"ని ప్రశ్నించాడు.

"జహాపనా...! నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఈయన బండిలో కూర్చుని షికారు వెళ్ళాడు. దారిలో చలిగాలి తగిలింది. దాంతో అతనికి జలుబు చేసి జ్వరం వచ్చింది" అని చేప్పాడు బీర్బల్‌ . "చలి నుండి రక్షించుకోడానికి ఆ సమయంలో అతని దగ్గర కంబళి లేదా..?" అని ప్రశ్నించాడు అక్బర్‌. "లేకేం ప్రభూ...! ఆ మనిషి మీద తమకు అపార దయ ఉంది ఇంక వస్త్రాలకు లోటేమిటి..? అతని తల నుండి కాళ్ళ వరకూ ఉన్ని వస్త్రం కప్పి ఉంది. అయినా అతనికి జలుబు చేసింద"ని చెప్పాడు బీర్బల్‌.

"అతనికి నిద్ర బాగా పడుతున్నది కదూ..?" అడిగాడు అక్బర్‌. "ఏపూటా సరైన నిద్రలేదు. హంసతూలికాతల్పం మీద విశ్రమించిన పిదప నౌకర్లు కాళ్ళుపడితే కాసేపు నిద్ర పోగలుగుతున్నాడని" చెప్పాడు బీర్బల్‌. "ఏం..? ఎందుకని..? అక్కడ రోడ్డు ప్రక్కన చిరిగిన బట్టలతో పడుకున్నప్పుడు చలివేయలేదు. ఇక్కడ ఉన్ని వస్త్రం కప్పుకున్నా చలి వల్ల జలుబు చేసింది. అక్కడ అతను రాళ్ళ మీద హాయిగా నిద్రపోగలిగాడు. ఇక్కడ హంసతూలికా తల్పం మీద పడుకున్నా నిద్రపట్టడం లేదు. ఎంత ఆశ్చర్యం?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అక్బర్.

"దీంట్లో ఆశ్చర్యపోయేందుకు ఏమీలేదు ప్రభూ..! అతడు పాపం ధనికుడై కష్టాలపాలయ్యాడంతే.." అన్నాడు బీర్బల్‌. "రాళ్ళురప్పలపై హాయిగా నిద్రించిన వ్యక్తి హంసతూలికాతల్పం మీద నిద్రించలేకపోతున్నాడు. ఇది ధనికుడైనందు వలన అతడికి కలిగిన శిక్ష. ఇంతకు ముందు ఇతడు పగలంతా కష్టపడి పనిచేసేవాడు. అందువలన అతని శరీరం ఆరోగ్యంగా ఉండేది. దాంతో మంచి నిద్రపట్టేది. ఇప్పుడు మీరు ఇతనికి విశ్రాంతినిచ్చి సుకుమారంగా తయారు చేశారు. మామూలు చలి, వేడి కూడా ఇతను ఇప్పుడు భరించలేకపోతున్నాడ"ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అక్బర్‌కు ఇప్పుడు కూడా బీర్బల్‌ మాటలపై నమ్మకం కలుగలేదు. ఆ రాత్రి ఆయన బీర్బల్‌ని వెంట బెట్టుకుని ఆ నకిలీ ధనవంతుడున్న భవంతికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి మంచం మీద నిద్రపట్టక అవస్థపడుతున్నాడు. "ఆ వ్యక్తికి ఎందుకని నిద్రపట్టడం లేద"ని బీర్బల్‌ని అడిగాడు అక్బర్.

"జహాపనా..! అతని పక్కమీద ఏదో ఉండి గుచ్చుకుంటోంది. అందుకే అతనికి నిద్ర పట్టలేదు" అన్నాడు బీర్బల్. బీర్బల్‌ లోపలికి వెళ్లి అతని తల్పాన్ని పరీక్షించాడు. దుప్పటి కింద ఒక ప్రత్తి గింజ కనిపించింది. దాన్ని అక్బర్‌కి చూపించి "చూడండి ప్రభూ..! దీని కారణంగా ఈ కొత్త ధనికుడికి నిద్రపట్టడం లేద"ని అన్నాడు.


"ఇంతకు ముందు ఇతనికి రాళ్ళు కూడా గుచ్చు కోలేదు. ఇప్పుడు ఈ చిన్న విత్తనం ఇతనికి కష్టం కలిగింది. మీరు ఇతని చేత్తో పక్కకూడా దులపనివ్వడం లేదు. ఇది ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష. కష్టపడి పనిచెయ్యకపోవడమే దీనికి కారణం" అని అక్బర్‌తో అన్నాడు బీర్బల్. అప్పటికి బీర్బల్‌ మాటలతో ఏకీభవించిన అక్బర్.. మరునాడు ఆ వ్యక్తిని రాజ భవనం నుంచి పంపిస్తూ.. ముందులాగే కష్టపడి, శ్రమించి సుఖంగా జీవించమని చెప్పి రాజభవనం నుంచి పంపించేశాడు అక్బర్..!

ప్రశ్న: అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

ప్రశ్న: అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

జవాబు:
ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్‌ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.

అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా 'యూరో'ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.

22, ఏప్రిల్ 2020, బుధవారం

అక్బర్-బీర్బల్ కథలు - 7 చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

అక్బర్-బీర్బల్ కథలు - 7

చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. హాస్యప్రియుడయిన అక్బర్ ఒకరోజు రాజ ప్రాసాదంపై నిలబడి ఆకాశంవైపుకి చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనన్ని కనిపించాయి. వాటిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోని చిలిపితనానికి ఆయనకే నవ్వు వచ్చి, కిసుక్కున నవ్వేశాడు.

తెల్లారగానే సభకు వచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ... మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి, అవెన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు.

నక్షత్రాలను లెక్క పెట్టేందుకు ఓ పదిహేను రోజుల గడువును కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పాడు అక్బర్ చక్రవర్తి. దీంతో సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో..! ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాలను లెక్కగట్టి, ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా..? అదెలా సాధ్యమవుతుందని అందరూ తమలో తాము అనుకోసాగారు.
ఆవగింజల్ని లెక్కపెట్టారట..!

అప్పుడు బీర్బల్ లేచి... మహారాజా..! మీరు చెప్పినట్లు చుక్కలు లెక్కపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దానికి మహారాజు సరేనని అన్నాడు. ఇక ఆరోజు నుంచి బీర్బల్ ఏకధాటిగా చుక్కల్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. అలా పదిహేను రోజులు గడిచాయి. ఆ మరుసటిరోజు సభకు వచ్చాడు.

మహారాజా..! మీరు చెప్పినట్లుగానే చుక్కలన్నింటినీ లెక్కపెట్టాను. అయితే నోటితో లెక్కపెట్టలేకపోయాను. కాగితంపై కూడా రాసేందుకు వీలు కాలేదు. అందుకే ఒక ఆవాల బస్తా దగ్గర పెట్టుకుని ఒక్కో నక్షత్రాన్ని చూస్తూ, ఒక్కో ఆవగింజను ఈ సంచిలో వేశాను. మొత్తం పదిహేను రోజులూ ఇలాగే చేశాను. కాబట్టి, ఈ సంచిలో ఎన్ని ఆవగింజలున్నాయో, ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి మహాపభ్రూ అంటూ... మూట విప్పి ఆవాలను కుప్పగా పోశాడు.

ఆవాలను చూసిన అక్బర్ చక్రవర్తి... నవ్వుతూ చాలా ఉన్నాయే అని అన్నాడు. మహారాజా.. మీకు నమ్మకం లేకపోతే ముందు ఈ ఆవగింజలన్నింటినీ లెక్కపెట్టించండి. తరువాత నక్షత్రాలను లెక్క పెట్టించండి. అందరి అనుమానం తీరిపోతుందని తెలివిగా బదులిచ్చాడు బీర్బల్.

బీర్బల్ యుక్తిని మెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి.. సంతోషంగా తాను ఇస్తానను వెయ్యి బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చాడు. సభలోనివారంతా కూడా బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుని హాయిగా నవ్వుకోసాగారు.

నీతి కథలు - 14 వర్తకుడి సమయస్ఫూర్తి

నీతి కథలు - 14

వర్తకుడి సమయస్ఫూర్తి

ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు.

‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు. 

రాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు. 

చాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడిని పట్టుకోలేకపోయినందుకు సైనికాధికారులను కేకలేశాడు. అయితే ఆ మరునాడు వర్తకుడు అదే గుర్రంతో తిరిగి ఆస్థానానికి రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు.  వర్తకుడు వినయంగా రాజుకు నమస్కరించి ‘‘ప్రభూ! నా గుర్రాల పనితనాన్ని, నాణ్యతను మీకు తెలియజేయాలని అలా చేశాను. నన్ను క్షమించండి’’ అన్నాడు.

వర్తకుడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకు రాజు ఎంతగానో సంతోషించాడు. వర్తకుడి దగ్గర ఉన్న గుర్రాలన్నింటినీ అతడు చెప్పిన ధర చెల్లించి కొన్నాడు రాజు.

ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

జవాబు:
మనం వేసుకొనే వస్త్రాల మీద, శరీరం మీద చేరే మురికి కణాలు రెండు రకాలు. కొన్ని నూనె లాంటి జిడ్డు పదార్థాలకు చెందినవైతే, మరికొన్ని విద్యుదావేశాలు కలవి. గాలిలోని కణాలు ఒకదానిని మరొకటి రాసుకోవడం వల్ల వాటికి విద్యుదావేశం కలుగుతుంది. మామూలుగా నీటిలో ముంచి బట్టలు ఉతకడం వల్లకానీ శరీరంపై నీరు పోసుకుని రుద్దుకోవడం వల్ల కానీ ఈ మురికి కణాలు సులభంగా తొలిగిపోవు. పైగా ఉతకడం వల్ల, రుద్దడం వల్ల ఈ కణాలలో విద్యుదావేశం తొలిగిపోయి బట్టలకు, ఒంటికి అంటుకుపోతాయి. నూనె కణాలు నీటితో కలవక పోవడం వల్ల అవి మరీ అతుక్కుపోతాయి. సబ్బు వివిధ రకాల రసాయనిక పదార్థాల సమ్మేళనం. సబ్బులోని రసాయనిక అణువులకు ఉన్న ప్రత్యేక ధర్మం, అణు నిర్మాణం మూలంగా అవి మురికిలోని జిడ్డుతో కూడిన కణాలకు, విద్యుదావేశం ఉన్న కణాలకు అంటుకుంటాయి. తర్వాత నీరు పోసి ఉతకడం గానీ, రుద్దడం కానీ చేయగానే సబ్బుకణాలు మురికి కణాలను తమతో పాటు, గుడ్డలనుంచి, ఒంటి నుంచి తొలగిస్తాయి.

స్నానానికి వాడే సబ్బుల్లో మురికిని తొలగించే రసాయన పదార్థాలతో పాటు సువాసన వెదజల్లే పదార్థాలు కూడా ఉండటం వల్ల మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది.

21, ఏప్రిల్ 2020, మంగళవారం

నీతి కథలు - 13 చిత్రకారుడి సమయస్ఫూర్తి

నీతి కథలు - 13

చిత్రకారుడి సమయస్ఫూర్తి

కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు.

వెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు.


గంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్రాలు గీయటం పూర్తి చేశారు. అందులో మొదటి చిత్రకారుడు తాను గీసిన చిత్రం తీసుకెళ్లి రాజుకి చూపించాడు. అచ్చం రాజుగారిలా వున్న చిత్రానికి రాజుగారికి మల్లే మెల్లకన్నూ యధావిధిగా చిత్రించాడు అతడు. అది చూసిన రాజు ఊహించినట్టుగానే ఉగ్రుడై చిత్రకారుడిపై కోపం ప్రదర్శించి తన అసహనం చూపించాడు. రెండవ చిత్రకారుడు చాలా ఆనందంగా తాను గీసిన చిత్రం తీసుకుని రాజు వద్దకొచ్చాడు. ఆ చిత్రం కూడా రాజులాగే చాలా అందంగా ఉంది. చిత్రంగా రాజు రెండు కళ్లూ సరిగ్గా వున్నట్టు గీసాడతడు.ఆ చిత్రకారుడి అతి వినయానికి తెలివికి చిరాకు పడ్డాడు రాజు. అసంతృప్తితో నిరుత్సాహంగా దాన్ని పక్కన పడేశాడు.


చివరగా మూడో చిత్రకారుడు చాలా ధైర్యంగా తాను గీసిన సుదర్శనుడి అందమైన చిత్రపటాన్ని రాజు చేతికందించాడు. దాన్ని తీక్షణంగా చూసిన రాజు మొహంలో చిరునవ్వులు మెరిశాయి.ఆ చిత్రకారుడి యుక్తికి నైపుణ్యానికి మనసారా అభినందించి విలువైన బహుమతులు అందించడమేగాక అతడ్ని ఆ రాజ్యానికి ఆస్థాన చిత్రకారుడిగా నియమించాడు రాజు. అందమైన రూపంతో జీవకళ ఉట్టిపడే ముఖ కవళికలు, అపురూప ఆభరణాలు రాచఠీవితో హుందాగా ఒక పక్కకు చూస్తూ కూర్చున్నట్టు గీసిన రాజుగారి బొమ్మలో సరిగ్గా ఉన్న కన్నును మాత్రమే చిత్రకారుడు బొమ్మలో చూపించాడు. మెల్లకన్ను చిత్రంలో అవతలి వైపుగా ఉండి కన్పించకుండా ఉండేట్టు గీశాడు. చిత్రకారుడి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా ఆనందించడమే గాక అందమైన రూపంలో మంచితనంలో చిన్న అవలక్షణం, చెడ్డ గుణం కనిపించవనే నిండు నిజం తెలుసుకున్నారు.

అక్బర్-బీర్బల్ కథలు - 6 గుడ్డివారు ఎవరు..?

అక్బర్-బీర్బల్ కథలు - 6

గుడ్డివారు ఎవరు..?

ఒకరోజు అక్బరు చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు. "మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువమంది ఉన్నారా..? లేక మంచివారు ఎక్కువమంది ఉన్నారా..?" అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి. ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.

అప్పుడు బీర్బల్ లేచి... "మహారాజా..! మన పట్టణంలోనే కాదు, లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నార"ని అన్నాడు. అయితే వారిని మీకు చూపేందుకు నాకు రెండురోజులు గడువు ఇప్పించండని అడిగాడు బీర్బల్. అందుకు అక్బర్ సరేనని తలూపాడు.

మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు వెళ్లలేదు. బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు. అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పును కుడుతూ కూర్చున్నాడాయన. ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పనివాళ్లను నియమించుకున్నాడు.

ప్రతిఒక్కడూ వచ్చి "పండిట్ జీ... ఏమి చేస్తున్నారు మీరు..?" అని ప్రశ్నిస్తూ వెళ్లిపోతున్నారు. అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు. అలా సాయంకాలం అయ్యింది. రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు. ఆయన కూడా బీర్బల్‌ని చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగాడు. అంతే రాజుగారి పేరు కూడా లిస్టులో చేరిపోయింది.

మరుసటిరోజు ఉదయాన్నే బీర్బల్ అక్బర్ సభకు తరలివచ్చాడు. వస్తూనే అక్బర్ వద్దకు వెళ్ళి.. "ఈ లిస్టు చూడండి మహారాజా... మన పట్టణంలో గుడ్డివారు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుంద"ని అన్నాడు. వెంటనే రాజుగారు ఆ లిస్టు తీసుకుని చదవడం ప్రారంభించాడు.

ఆ లిస్టులో చాలామంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి. అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ ఖంగుతిన్నాడు. "అదేంటి బీర్బల్...! నా పేరును కూడా ఈ లిస్టులో రాశావెందుకు..?" అని ప్రశ్నించాడు మహారాజు.

అప్పుడు బీర్బల్ మాట్లాడుతూ... "మహారాజా...! మీరందరూ నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నావని అడిగారు కదండీ... కళ్ళుండి కూడా చూడలేనివారు గుడ్డివారే కదా...!!" అన్నాడు. దీంతో అక్బర్‌కు తాను చేసిన పొరపాటేంటో అర్థమై, దానికి చింతిస్తూ... బీర్బల్‌ తెలివితేటలను అభినందించాడు.

ప్రశ్న: కొందరు మనుషులు పొట్టిగా, మరి కొందరు బాగా ఎత్తుగా ఉంటారెందుకు?

ప్రశ్న: కొందరు మనుషులు పొట్టిగా, మరి కొందరు బాగా ఎత్తుగా ఉంటారెందుకు?

జవాబు:
విపరీతమైన జన్యులక్షణాలు, గర్భస్థ సమయంలో పిండంలో కలిగిన మార్పుల మూలాన ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తిగా సుమారు ఎనిమిది అడుగుల 3 అంగుళాల ఎత్తుగల సుల్తాన్‌ కోసెన్‌ గిన్నిస్‌ రికార్డుకెక్కాడు. ప్రపంచంలో నేటి వరకు రికార్డు ప్రకారం అత్యంత పొట్టి వ్యక్తి నేపాల్‌ దేశానికి చెందిన చంద్ర బహద్దూర్‌ డాంగీ. ఇతని ఎత్తు కేవలం ఒక అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇలాంటి విపరీతమైన వ్యత్యాసాలు మినహాయిస్తే సాధారణ ప్రజానీకంలో ఎత్తు పొడవులు తేడా ఉండటానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి, అప్రధానమైనవి ఉన్నాయి. అప్రధానమైనవి అరుదుగా సంభవించే కారణాలు. ఉదాహరణకు గర్భంలో ఉండగా తల్లి సరిగా ఆహారం తీసుకోనట్లయితే పిండం ఎదుగుదలలో లోపం వచ్చి ఆ తర్వాత ఎంత తిన్నా పొడవు పెరగక పోవచ్చు. ఒక వేళ మామూలుగానే తల్లి ఆరోగ్యంగా గర్భం ధరించినా ప్రసవం తర్వాత నూతన శిశువుకు బాలారిష్టాలు కల్గి ఎముకల ఎదుగుదలలో లోపాలు వచ్చినా, పెరిగే క్రమంలో పోషకాహారం లేకున్నా, బాల్యంలోనే ఎదుగుదల క్షీణించవచ్చు. మనిషి సుమారు 20 సంవత్సరాల లోపే ఎదుగుతాడు. ఆ తర్వాత ఎదుగుదల ఉండదు. కాబట్టి 20 సంవత్సరాల లోపు పోషకాహారం, వ్యాయామం, మంచి నిద్ర అవసరం.

ప్రధానమైన కారణాలు జన్యు సంబంధమైనవి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇరువురూ పొడవుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా పొడవుగానే ఎదిగే అవకాశం ఉంది. చైనా, జపాన్‌, నేపాల్‌, మలేషియా వంటి ప్రాంతాల్లో ప్రజల జన్యుతత్వం అక్కడ సగటు మనిషి ఎత్తు 5 అడుగుల వరకే ఉండేలా ఉంది. అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అలాంటి జన్యుతత్వం లేదు.
సాధారణంగా వారు 6 అడుగుల వరకు పెరుగుతారు. భారతీయులు సగటుగా 5 నుంచి 6 అడుగుల మధ్య ఉంటారు. అత్యంత పొడవుకు కూడా జన్యువులే కారణం.

19, ఏప్రిల్ 2020, ఆదివారం

నీతి కథలు - 11 చేప ముందుచూపు

నీతి కథలు - 11

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.

మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.

ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.

ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.

అక్బర్-బీర్బల్ కథలు - 4 కథ అడ్డం తిరిగింది..!

అక్బర్-బీర్బల్ కథలు - 4

కథ అడ్డం తిరిగింది..!

ఒకరోజు బీర్బల్ రాజదర్బారుకు వస్తున్నాడు. దారిలో రేగుపండ్లు అమ్మేవాడు కనిపించాడు. రేగుపండ్లు చూడ్డానికి చాలా బాగా, అనిపించటంతో గంప మొత్తాన్ని కొనేసి రాజు అంతఃపురానికి తీసుకువచ్చాడు బీర్బల్.

అక్బర్ చక్రవర్తి దర్బారుకు వెళ్లేందుకు తయారవుతూ గంపవైపు చూశాడు. ఏంటయ్యా ఆ గంప..? అందులో ఏముంది అని ఆరా తీశాడు.

ప్రభూ.. ఇవి రేగుపండ్లు, చాలా బాగున్నాయి. ప్రభువులవారు తింటారని తెచ్చాను అన్నాడు. బీర్బల్ ఆ అంతఃపురంలో తనతోనూ, రాణిగారీతో చనువు ఉన్నవాడు కాబట్టి, వెంటనే రాణీగారిని కూడా అక్కడకు పిలిపించాడు అక్బర్ చక్రవర్తి.

ఒక పెద్ద పళ్లెంలో రేగుపండ్లు పోసి బల్లమీద ఉంచారు. రాణీగారూ, చక్రవర్తీ ఒకవైపు... వారిద్దరికీ ఎదురుగా బీర్బల్ కూర్చొన్నారు. ముగ్గురూ పండ్లు తినడం ప్రారంభించారు. కానీ రాజుగారు పండ్లు తినేసి, గింజలను మాత్రం రాణీగారివైపు వేస్తున్నాడు. రాణిగారిని తిండిపోతుగా చేసి హేళన చేయాలని రాజు ఉద్దేశ్యం గాబోలు.

తినగా, తినగా... రాణీగారి వైపు గింజలు ఎక్కువయ్యాయి. అక్బర్ చక్రవర్తి దగ్గర మాత్రం అసలు గింజలే లేవు. బీర్బల్ వద్ద మాత్రం కాసిన్ని గింజలు ఉన్నాయి.

ఇంతలో అక్బర్ చక్రవర్తి.. "చూశావా బీర్బల్... రాణీగారు ఎంత తిండిపోతో.. ఆమె ముందు చూడండి ఎన్ని గింజలున్నాయో..?" అని అన్నాడు. ఆ మాట విన్నవెంటనే రాణీగారు సిగ్గుతో తలవంచుకున్నారు.

అయితే బీర్బల్ ఊరికే ఉంటాడా... వెంటనే "మహారాజా.. రాణీగారికంటే తమరే ఎక్కువ తిండిపోతులాగా ఉన్నారు. రాణీగారు పండ్లు తిని గింజలు మాత్రమే వదలిపెట్టారు. తమరు పండ్లుతోపాటు గింజల్ని కూడా మింగేశార"ని అన్నాడు. పాపం.. రాజుగారు.. సిగ్గుపడక తప్పలేదు. రాణీగారిని ఇరికించాలనుకుంటే తానే ఇలా దొరికిపోయానని మనసులో అనుకున్నాడు అక్బర్ చక్రవర్తి.

ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?

ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?

జవాబు:
నడుస్తున్నపుడు తలకు ఆకులు తాకేలా పొట్టిగా ఉన్న చెట్ల కింద ఎక్కువ సేపు రాత్రుళ్లు ఉండకూడదనేది ఓ సూచన. అలా ఉన్నంత మాత్రాన విపరీతమైన సమస్య, ప్రాణాపాయం ఏమీ రాదు. కానీ ఆక్సిజన్‌ను మనతో పాటు చెట్టు కూడా శ్వాసక్రియలో వాడుకుంటుంది. మనలాగే శ్వాసక్రియలో చెట్లు కూడా కార్బన్‌ డయాక్సైడును విడుదల చేస్తాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ అణుభారం 44. నైట్రోజన్‌, ఆక్సిజన్‌లున్న గాలి కన్నా ఇది ఎక్కువ. అదే పనిగా చెట్టు కిందే ఉంటే కార్బన్‌డయాక్సైడ్‌ బరువెక్కి చెట్టు కిందికి పోగవుతుంది కాబట్టి మనకు ప్రాణ వాయువయిన ఆక్సిజన్‌ తక్కువగా లభ్యమవుతుంది. అయితే చెట్టు ఆకులు తగిలేలా ఎవరూ చెట్లకింద నడవరు, పడుకోరు.

చెట్టు కొమ్మలకు, నేలకు మధ్య బాగా సందు ఉన్నట్లయితే గాలి ఎప్పటికప్పుడు విసరణం చెందుతుంది. కాబట్టి అదేపనిగా కార్బన్‌డయాక్సైడు అక్కడే ఉండిపోదు. మామూలుగా ఎత్తుగా ఉన్న చెట్ల కింద పగలయినా రాత్రయినా నడిస్తే ప్రత్యేక తేడా ఉండదు. ప్రమాదం ఏమీ లేదు. భోజనం తర్వాత కొంత నడక మంచిది అన్న సామెత నేడు చెల్లదని వైద్యులు అంటున్నారు. భోజనం తర్వాత కొంత విశ్రాంతి అవసరమని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు.

అయినా భోజనానికీ, చెట్లకు సంబంధం ఏముంటుంది? చెట్ల కింద రాత్రుళ్లు నడవాలా వద్దా అన్నదే మీమాంస లేదా భోజనం తర్వాత నడవటం మంచిదా, కాదా అనేది సంశయం.