ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?
జవాబు:
నడుస్తున్నపుడు తలకు ఆకులు తాకేలా పొట్టిగా ఉన్న చెట్ల కింద ఎక్కువ సేపు రాత్రుళ్లు ఉండకూడదనేది ఓ సూచన. అలా ఉన్నంత మాత్రాన విపరీతమైన సమస్య, ప్రాణాపాయం ఏమీ రాదు. కానీ ఆక్సిజన్‌ను మనతో పాటు చెట్టు కూడా శ్వాసక్రియలో వాడుకుంటుంది. మనలాగే శ్వాసక్రియలో చెట్లు కూడా కార్బన్ డయాక్సైడును విడుదల చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ అణుభారం 44. నైట్రోజన్, ఆక్సిజన్‌లున్న గాలి కన్నా ఇది ఎక్కువ. అదే పనిగా చెట్టు కిందే ఉంటే కార్బన్‌డయాక్సైడ్ బరువెక్కి చెట్టు కిందికి పోగవుతుంది కాబట్టి మనకు ప్రాణ వాయువయిన ఆక్సిజన్ తక్కువగా లభ్యమవుతుంది. అయితే చెట్టు ఆకులు తగిలేలా ఎవరూ చెట్లకింద నడవరు, పడుకోరు.
చెట్టు కొమ్మలకు, నేలకు మధ్య బాగా సందు ఉన్నట్లయితే గాలి ఎప్పటికప్పుడు విసరణం చెందుతుంది. కాబట్టి అదేపనిగా కార్బన్‌డయాక్సైడు అక్కడే ఉండిపోదు. మామూలుగా ఎత్తుగా ఉన్న చెట్ల కింద పగలయినా రాత్రయినా నడిస్తే ప్రత్యేక తేడా ఉండదు. ప్రమాదం ఏమీ లేదు. భోజనం తర్వాత కొంత నడక మంచిది అన్న సామెత నేడు చెల్లదని వైద్యులు అంటున్నారు. భోజనం తర్వాత కొంత విశ్రాంతి అవసరమని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు.
అయినా భోజనానికీ, చెట్లకు సంబంధం ఏముంటుంది? చెట్ల కింద రాత్రుళ్లు నడవాలా వద్దా అన్నదే మీమాంస లేదా భోజనం తర్వాత నడవటం మంచిదా, కాదా అనేది సంశయం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి