LATEST UPDATES

26, మే 2020, మంగళవారం

కార్టూనికి కవిత - శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

కార్టూనికి కవిత - శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

లాక్డౌన్ కాలాన లక్షల సమస్యలాయే!
ఇంటి నుంచి పనాయే, ఇంట్లోనూ పనేనాయే!!
 కరోనా కాలంలో పనిమనిషి  రాకపోయే!
అర్థాంగి ఎన్నెన్నో ఆర్డర్లు వేసుడాయే!
షార్టులతోనే సాగిపొమ్మని హుకుం జారీచేసే!!
ముక్కు మూతి మూసుకొని భార్య  మాట వింటినాయే!
కాలమహిమ అని అట్లనే చేయబడితిని!!
బాసునుండి మెయిలాయే ఆఫీసుకు రమ్మని!
లాకుడవును కాలాన అలవాటైన ప్రాణమాయే!!
ఆఫీసులోన పాతపాట పాడితి హాయిగాఉందని!
హడావుడిగా బాసు వచ్చి కస్సుబుస్సులాడే !!
ఆఫీసనుకున్నావా? ఇల్లనుకున్నవా? అని చెడామడ వాయగొట్టే!
ఇటు బాసు ఆర్డరాయే, అటు భార్య హుకుమాయే!!
ముందు చూస్తే   గొయ్యాయే, వెనక చూస్తే నుయ్యాయే!
ఏమి పాలుపోక వాట్సప్పులోన మెస్సేజు పంపితినాయే!!
ప్రాణమిత్రుడొకడు వెంటనే బావురుమనే!
డోలువచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నదని వాపోయే!!

(కార్టూనికి  కవిత)

-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
23/05/2020, 12:10, శనివారం.

25, మే 2020, సోమవారం

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

☺️ మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా ☺️

(లాక్ డౌన్ అరవై రోజులు పూర్తైన సందర్భంగా)

ప్రభుత్వాలు చేతులెత్తేసాయ్!
ఎవరి ప్రాణం వారు కాపాడుకోవలసిందే!
"తాంబూలం ఇచ్చేసాం తన్నుకు చావండి"
ఇది నాటి అగ్నిహోత్రవదాన్ల మాట!
"లాక్ డౌన్ ఎత్తేసాం మీ చావు మీరు చావండి"
ఇది నేటి పాలకుల అంతరంగం!

కరోనాకు తాళాలు ఇచ్చేసారు
ఇక తన్నుకు చావవలసిందే!
ప్రభుత్వాలు ఆధాయాన్వేషణలో పడ్డాయి!
రైల్లు,బస్సులు, కార్లు,ఆటోలు
ఎప్పటిలాగే రోడ్లెక్కాయి!
కరోనా తో కాపురం వేగవంతమయ్యింది!

ఆహారం దొరకని పులి
ఆబగా పొంచి చూసినట్టు
మీ కోసం కార్పొరేట్ ఆసుపత్రులు
గ్రీన్ కార్పెట్ పరచి ఎదురుచూస్తున్నాయ్!
దొరికితే సున్నంలోకి
ఎముకలు కూడ మిగలవు!
మరికొన్నిరోజులుపోతే
ఆసుపత్రులేవి ఖాళీ ఉండకపోవచ్చు!

ఇకనుంచి అందరివి
అనుమానపు బ్రతుకులే!
ఇక అనుమానించడమే
నీ జన్మహక్కు అవుతుంది!
ఎవరికి కరోనా ఉందో తెలియక
సతమతమైపోవలసిందే!
నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి!

ఇకపై హెల్త్ బులెటిన్ లు ఉండకపోవచ్చు!
ప్రసారమాధ్యమాలు మన్నుతిన్న పాములౌతాయి!
నాయకుల మాటలు కోటలు దాటతాయి!

ప్రాణంపోతే తేలేము!
అప్రమత్తంగా లేకపోతే మనలేము!
చావో బ్రతుకో మీ చేతిలోనే!
మరణానికి కొంచెం దూరంగా
మరి కొంచెం దగ్గరగా అంతే!

ఇది కరోనా కాలం!
మీ తలరాతలు మారి'పోయేకాలం'!!

డా.గూటం స్వామి
(9441092870)
☺️☺️☺️☺️☺️☺️☺️☺️

24, మే 2020, ఆదివారం

వలస కూలీల వెతలు - రచన శ్రీ తాటిపాముల రమేష్


వలస కూలీల వెతలు - రచన శ్రీ తాటిపాముల రమేష్🌴 వలస కూలీల వెతలు 🌴
1. పేదరికమే శాపమై
బతుకే జీవిత పోరాటమై
పనినెతుక్కుంటూ పట్నం పోయి
రెక్కలు ముక్కలు గా చేసి
ఆకాశ హార్మ్యాలను నిర్మించినం
రోడ్లన్నీ అద్దాలు గా మార్చినం.
2. ఇప్పుడు నగరం నడిబొడ్డున మీరు
మురుగు కాలువ పక్కన మేము
ఏసీ గదుల్లో  మీ విలాసాలు
దొడ్డు దోమలు దద్దుర్ల తో మా జీవితాలు
సెంటు బట్టలు మీవాయే
చినిగిన బట్టలు మావాయే
పరమన్నాలు మీవాయే
పాశిఅన్నం, పచ్చడి మెతుకులు మావాయే
3.  మా చెమట చుక్కలు చిందించి
 మీ వీధులన్నీ వెలుగుపూలను పూయించాము.
కరెంటు కాంతులు మీకాయే
గుడ్డి దీపం మాకాయే
మా రక్తాన్నంతా దారవోసి
మీ అభివృద్ధిలో అరిగిపోయినం.
4.  కరోనా కల్లోలం తో
రెక్కలు తెగిన పక్షులైనం
చేద్దామంటే పని లేక
చేతిలో పరక లేక
కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ
ఎర్రటెండలో పల్లె బాట పట్టినం
మీకు కనికరం లేదు
తొంగి కూడా చూడట్లే  తోపుగాళ్ళు
కన్నెత్తి చూడట్లే  కోట్లున్నోళ్ళు
పల్లెత్తి మాట్లాడట్లే పాలకులు
పాస్ పోర్ట్, వీసాల తో
పెద్దోళ్లు తెచ్చిన రోగానికి
పేదోళ్ళం బలైనం.
--------------------------------------‐-------
✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

23, మే 2020, శనివారం

ఆటవెలది పద్యం - 5 - రచన శ్రీమతి యం. రమ

ఆటవెలది పద్యం:

చెంతచేరనీకు చెడ్డయాలోచనా
చేరుగమ్యమందు చేటుచేయు
ఆకులలములన్ని యడ్డుగావచ్చినా
సవ్యమార్గమెంచి సాగునదులు.
 -యం. రమ


నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

💐 నాకొక పాట కావాలి  💐
*********

నేను పాడుకునేందుకు
ఒక పాటకావాలి!
ఆ పాటలో కథం తొక్కించే
భాష ఉండాలి!
ఆ పాటలో ఉత్తేజపరిచే
పదాలు ఉండాలి!
యుగళ గీతంలా కాదు
యువకుల నెత్తురు మండేలా ఉండాలి!

నేను పాడుకునేందుకు
 ఒక పాట కావాలి!
ఆ పాటలో ఉప్పెంగే
సముద్రముండాలి!
వసంత కాల మేఘగర్జన ఉండాలి!
పర్వత శిఖరాల్ని తాకే
జలపాతాలుండాలి!
నెలవంకను తెంపుకొచ్చే తెగువుండాలి!

నేను పాడే పాటలో చరణాలు
జనరక్తంలో తడిసిన ఎర్రగులాబీలు!
ప్రజాస్వామ్య ముసుగులో
భ్రమలకు గురిచేస్తున్న భావాలు!
.అసత్యాలతో పబ్బం గడుపుతున్న
పాలకుల నీతిబాహ్యా చర్యలు!
దోపిడీ జలతారు ముసుగులో
సామాన్యుల కన్నీళ్ళను తాగే చర్యలు!
ఇవి మాత్రమే ప్రస్ఫుటించాలి!

పాటతోపాటు ఒక
ఆయుధం కూడా కావాలి!
ఆయుధం తో పాటు
ఉక్కులాంటి గుండె కూడా కావాలి!
రాజ్యాధికార కుంభస్తలంపై కొట్టాలి!

కష్టాలు కడతేర్చి కన్నీళ్లు తుడిచేసి
బాటసారులకు నేను భరోసా నవ్వాలి!
నెత్తురోడుతున్న రోడ్ల పై నిలబడి
మృత్యువు దాడిచేయకుండా రక్షణైపోవాలి!

నేను పాడుకునేందుకు
ఒకపాటకావాలి!
పసిపాపల మోములో
మొగ్గనై విరియాలి!
వలస బ్రతుకులకు
నేను రాగమైపోవాలి!
అనురాగమై మురియాలి!!

డా.గూటం స్వామి.
(9441092870)
👍👍👍👍👍👍👍👍

22, మే 2020, శుక్రవారం

ఆమె - రచన శ్రీ తాటిపాముల రమేష్

ఆమె - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴ఆమె  🌴
1.  మూడు ముళ్ళు, ఏడడుగుల
 బంధంతో ఒక్కటైన జంట
 పట్టుమని పది వసంతాలు గడవకుండానే
 మద్యం మహమ్మారి
  పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది
2.  ఇంటి పని ,వంట పనితో
నడుము వాల్చకుండా
రాత్రి దాకా మిషన్ లాగా
ఇకమత్ గా ఇంటినంత ఈడ్చు కొస్తుంటే
తాగొచ్చి తందనాలు ఆడుతుంటే
ఆమె ఆత్మాభిమానం ఆవిరై
కలలన్నీ కరిగి పోయి
దిగులు పక్షిలా దిగాలుగా చూస్తుంది
3.   సిక్స్ అయితే సీనే మారిపోయి
ఇరుకు ఇంట్లో వీరంగం మొదలెడితే
ఇంటి గుట్టు రట్టు కాకుండా
 పదిమందిలో పలచన కాకుండా
 కండ్లల్లో ఉబికి వచ్చిన ఊటను
 పైట కొంగుతో తూడ్చుకుంటూ
 పిల్లల కోసం బతుకుతుంది
4.  కాయకష్టం చేసుకొచ్చి
కంచం లోకి అందించి
ప్రేమనంతా గంపల కొద్దీ కుమ్మరించినా
సూటీ పోటి మాటలతో
శూలాలను మనసులో గుచ్చుతుంటే
ఆమే పస్తులున్న రాత్రులెన్నో
నిద్రపోని రోజులెన్నో
5. పని లేదని ఒకరు
ఊసుపోత లేదని మరొకరు
కాటన్ల కొద్దీ గుంజుతున్రు
సర్కారీ ఖజానా నింపుతున్రు
రాబడికి మరిగిన పాలకులు
ప్రజల పాణాలను గాలికొదిలిన్రు
6. చట్టాలెన్ని తెచ్చినా
హెల్ప్ లైన్లు ఎన్ని వచ్చినా
ఆమె రాత మారట్లేదు
ఆమెను కష్టపడితే కాళిమాతై
కన్నెర్ర జేస్తుంది
 లవ్ లీ గా చూసుకుంటే
లక్ష్మీ దేవతై వరములిస్తది
---‐-‐----------------------------------
✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHSWARDHANNAPET.

21, మే 2020, గురువారం

ఆటవెలది పద్యం - 4 - రచన శ్రీమతి యం. రమ


ఆటవెలది పద్యం - 4 - రచన శ్రీమతి యం. రమ
ఆ.వె
మెచ్చలేనినెయ్య మేలనిల్వగలదు?
స్వార్ధగుణమెయున్న సాయమగున?
కార్యదోషమున్న కలుగునాఫలితమ్ము
సత్యమరసిమెరుగు నిత్యముగను!
                     యం.రమ🙏

20, మే 2020, బుధవారం

ఆటవెలది పద్యం - 3 - రచన శ్రీమతి యం. రమఆటవెలది పద్యం - 3 - రచన శ్రీమతి యం. రమ
ఆటవెలది పద్యం
చదువునేర్చకూడా సంస్కారమును లేక
సార్థకంబుకాదు సాధనెపుడు
విద్యవినయమున్న విద్యార్థివిలసిల్లు
విజయపథమునందు వెలుగులీను.
     - రచన శ్రీమతి యం. రమ

19, మే 2020, మంగళవారం

ఆటవెలది పద్యం - 2 - రచన శ్రీమతి యం. రమ

ఆ.వె. పద్యం:
కల్మషమ్ములేక కమనీయమవు మాట
యెంతవారినైన శాంతపరచు
కఠినమాటలాడు కర్కశులమదికి
వందనములెవేయు బంధనములు
-శ్రీమతి ముంజ రమ.

వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

శ్రీరామ భక్తాగ్రేసరా రామదూత హనుమా!!
మా ప్రార్థనలను ప్రీతితో స్వీకరించుమా!
మా మొరలను ముదముతో ఆలకింపుమా!
అంజనీపుత్ర అమేయ గుణసంపన్న హనుమా!!
మాకు సద్భుద్ధి సతతం ప్రసాదింపుమా!
మాకు సన్మార్గం సత్వరమే చూపుమా!
వాయునందనా మహాబలశాలీ హనుమా!!
మా ఆరోగ్యాలను సదా రక్షింపుమా!
మా భయక్రోధాలను నిత్యం నివారింపుమా!
సుగ్రీవమిత్ర వినయవిధేయ హనుమా!!
మా శోకకారకాలను శీఘ్రముగా నివారించుమా!
మా మనోవ్యాకులతను మమతతో మట్టుబెట్టుమా!
భక్త సులభానుగ్రహ భక్తశ్రేష్ఠ హనుమా!!
మాకు సద్గుణాలను సదా సిద్దింపజేయుమా!
మాకు లక్ష్యసాధనా మార్గమ్మును హితముతో బోధింపుమా!
లక్ష్మణ ప్రాణరక్షకా లంకపురి దహన హనుమా!!
మా విజయాతిశయములను  మమతతో త్రుంచుమా!
మాకు వినయ విధేయతలను విస్తృతంగా అందింపుమా!
రుద్రాంశ సంభూత భవిష్యత్తు బ్రహ్మా హనుమా!!
నీదు కీర్తనములే  మా సకల సంకట హరణం హరణం!!
నీదు నామమే అనవరతము మాకు శరణం శరణం!!
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
(వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా)
17/05/2020, 13:20, ఆదివారం.