***** మిత్రమా సెలవా మరి *****
స్మృతి కవిత
(ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇటీవల మృతిచెందిన నా బాల్యమిత్రునికి అక్షరాంజలి)
వాడెప్పుడు కన్పించినా
ఒరేయ్ పంతులు అంటూ...
ఆప్యాయతల పలకరింపులు చిలకరిస్తూ
ఆత్మీయ కరచాలనమై తీగలా అల్లుకుపోతాడు.
చెట్టాపట్టాలేసుకొని
మొన్నటి బాల్యం తోటలో
చెట్టుపుట్టలన్నీ తూనీగల్లా తిరిగాం.
నిన్నటి యవ్వనం రుతువులో
ఉరకల పరుగుల
దూకుడు జలపాతాలమై
కవ్విస్తు నవ్విస్తు
పసందైన ఆటపాటలతో
ఎందరినో అలరించాం.
కూడబలుక్కున్న తోడుదొంగల్లా
రకరకాల రుచులు వినోదాలు అన్వేషిస్తూ
పట్నంలో
హోటల్లు సినిమాటాకీస్ లెన్నింటినో
ముట్టడించాం.
క్రికెట్ లో బంతుల అస్త్రాలు సంధిస్తూ
వికెట్లవేటలో విలుకాడిలా నేను..
బ్యాట్ తో బంతుల్ని తరుముతు
పరుగులకు అయాసం పుట్టిస్తూ నీవు..
గెలుపుగుర్రాలపై సవారీ చేస్తు
మ్యాచ్ లెన్నో మలుపు తిప్పి
ప్రశంసలవర్షంలో అభినందనలవెల్లువలో
ఆనందాలపడవలమై తేలిపోయాం.
మనపై
విమర్శల రాళ్ళు,పుకార్లబురద పడినా
ప్రతిఘటన కవచాల్లా పరస్పరం
అండగా నిలిచాం.
గ్రాంఫోన్ రికార్డ్ లా తిరుగుతు
ఊరంతా నా ఉద్యోగవిజయాన్ని చాటావు.
నిన్నటి వర్తమానం వరకు నీడలా మసిలి
నేడు బ్రతుకుపుస్తకంలో
చివరి సంతకం చేసి వెళ్ళిపోతావా?
నీవు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలను మూటకట్టుకుంటూ
గుండెగూట్లో పదిలపర్చుకుంటున్నా
మళ్ళీ
రేపటి ముదిమి సంధ్యలో ఒక్కొక్కటిగా
నెమరేస్తూ పూటగడపాలి.
నన్నో స్తంభించిన కాలాన్ని చేసి
నీవొక చేరలేని కాంతిసంవత్సరలా దూరమైనావు
ఐనా మనస్నేహం
మైత్రివనాలకు స్వాగతం పలికే
సోపతిసోపానలై నిలుస్తాయి.
అక్షరాంజలి ఘటిస్తు...
మిత్రమా
ఇక సెలవా మరి
నీ నేస్తం
గంజి.దుర్గాప్రసాద్
9885068731
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి