మనం తీసుకునే ప్రతి శ్వాస,
అమ్మ ప్రేమతో వేసిన భిక్ష!
మన జన్మ అమ్మకు అదో పునర్జన్మ!!
తన ప్రాణానికి ప్రాణం అడ్డువేసి,
మనకు ప్రాణం పోసేది అమ్మ!!
అమ్మ లేనిదే జీవం లేదు!
అమ్మ లేనిదే సృష్టే లేదు!!
సృష్టికి సృష్టే అమ్మ!
దైవానికి దైవం అమ్మ!!
లోకం లోకి తెచ్చేది అమ్మ!
లోకాన్ని చూపేది అమ్మ!!
తన రుధిరం మనకు మధుర ఆహారం!
తన అనురాగం, మనకు అనుబంధం!
తన ఒద్దికైనా ఒడి, మనకు ఇంపైన గుడి!!
అనుక్షణం మన గురించి తన విచారం!
ప్రతిక్షణం మన బాగోగులు తన ఆచారం!!
గోరంత ముద్దలతో కొండంత బలం ఇస్తుంది!
చిరు కోపంతో క్రమశిక్షణ కలిగిస్తుంది!!
బుడిబుడి అడుగులు వడివడి పరుగులు,
అన్ని తానై, అన్నింటా తానై!
నడకతో పాటు నడతను నేర్పిస్తుంది!!
మనమే అమ్మకు శ్వాస! మనమే అమ్మకు ధ్యాస!!
అమ్మ మనసు వెన్న, అవనిలో మిన్న!!
అమ్మకు అమ్మగా తన రుణం తీర్చగలమా!??
అమ్మ ప్రేమకు అనంతకోటి వందనాలు!
(ప్రతిరోజూ అమ్మ పూజనీయం!
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా)
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
10/05/2020, 18:30, ఆదివారం.