LATEST UPDATES

13, మే 2020, బుధవారం

పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది! - రచన శ్రీ డా.గూటం స్వామి

This is a simple translate button.

😢పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది!😢
********

ఎర్రని తూర్పు వాకిలి‌లో నిలబడి చూస్తే
పచ్చని మా పల్లె కనబడుతోంది!
మా పల్లె పక్కనే ఏరు కనబడుతోంది!
ఏటిఒడ్డన మా వాళ్ళ పాట వినబడతోంది!
మమ్మల్ని పంపండి సారూ!మేముండలేం ఇక్కడ!
ఎన్నాళ్ళు మాకీ చిత్రహింస!

బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన వాళ్ళం!
ఇప్పుడు మా బ్రతుకులు చిధ్రం అయ్యాయి!
తింటానికి తిండి కరువయ్యాక
ఇక్కడెలా ఉత్తినే ఉంటాము సారూ!
మమ్మల్ని మా ఊరికి పంపేయండి!
ఎన్నాళ్ళు మాకీ గుండెకోత!

ఇప్పుడు మా బతుకులు
నెత్తురు ముడుగులు!
ఇప్పుడు మా జీవనం
కన్నీటి కడలి తరంగం!
ఇప్పుడు మా ఆలోచన లు
గురితప్పిన గుళకరాళ్ళు!
ఇప్పుడు మా ముందున్నదంతా రక్తసిక్త జీవితం!
ఇప్పుడు మా మార్గమంతా అపజయాల వ్రణాలే!
ఇప్పుడు మా పోరాటమంతా
రేపటిని లోతుగా తవ్వుకోవడం కోసమే!

కాలం ప్రవహిస్తూనే ఉంటుంది!
కాలం పురోగమిస్తూనే ఉంటుంది!
మా వలసకూలీలు మాత్రం
ఇక్కడే ఆవిరైపోవాలా సారూ!

సూర్యాస్తమయాలు ఎప్పుడూ
ఎర్రగానే ఉంటాయి!
ఈ మధ్య సమయంలోనే
జనం పదునెక్కుతారు!
ఎర్రటి తూర్పు వాకిట్లో నిలబడి చూస్తే
పల్లె దిక్కు కనబడుతోంది!
ఇక తెగించటమే తరువాయి!

(లాక్ డౌన్ నేపథ్యంలో వలసకూలీల పాట్లు టి.వి లో చూసి వారి మనో వేదనను కవిత్వీకరించే ప్రయత్నం లో)

డా.గూటం స్వామి
(9441092870)
😢😢😢😢😢😢😢😢

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి