LATEST UPDATES

17, జులై 2018, మంగళవారం

కాళిదాసు గర్వభంగం

కాళిదాసు గర్వభంగం

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.

మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.

బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.

ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.

ఆమెను చూసి...
‘బాలికా! నాకు దాహంగా ఉంది.
నీళ్లు ఇవ్వమ’ని* అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...

‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని* బదులిచ్చింది.

కాళిదాసు:
‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?
పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.

అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...

‘మీరు అసత్య మాడుతున్నారు.

ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.

వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’* అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...

‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.

ముందు నీళ్లు ఇవ్వమని'* బతిమాలుకుంటాడు.

అయినా ఆ బాలిక కనికరించదు.

‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’

అని అడుగు తుంది. బాలిక.

‘నేను బాటసారి’ని* అన్నాడు కాళిదాసు.

‘మళ్లీ అసత్య మాడుతున్నారు.

బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.

మీరేమో అలిసి పోయారు కదా.

ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.

వారే సూర్యచంద్రులు!’

అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..

‘మాతా నీళ్లు ఇవ్వండి.

దాహం తో చనిపోయేలా ఉన్నాను..’
అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.

లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...

‘మీరెవరో సెలవివ్వండి...నీళ్లిస్తాను’  అంది.

కాళిదాసు దీనంగా...

‘నేను అతిథిని..!’* అని బదులిచ్చాడు.

‘మీరు అసత్యం చెబుతున్నారు.

ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.

ఒకటి ధనం, రెండోది యవ్వనం.

ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’* అంటుంది.

కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.

కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.

ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.

ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’* అని అడిగింది.

ఓపిక నశించిన కాళిదాసు..

‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు.

ఆ అవ్వ నవ్వుతూ...

ఇదీ అసత్యమే.

ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.

ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.
ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’* అని అంటుంది.

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.

ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు.

ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.

‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!

కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’
అని జలమును అనుగ్రహిస్తుంది.

15, జులై 2018, ఆదివారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

✓అడవులు మానవ మనుగడకు జీవనాధారం

✓చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు
✓పచ్చదనం-మన ప్రగతికి సంకేతం
✓జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
✓భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం
✓వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
✓వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు
✓ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం
✓మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం
✓మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం
✓చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి
✓వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
✓చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి
✓వనాలు పెంచు-వానలు వచ్చు
✓చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
✓పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
✓వనాలు-మానవాళి వరాలు
✓పచ్చని వనములు-ఆర్థిక వనరులు
✓అడవులు-మనకు అండదండలు
✓అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
✓అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
✓అటవీ సంపద-అందరి సంపద
✓చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
✓అడవులు-వణ్యప్రాముల గృహములు
✓పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
✓సతతం-హరితం
✓మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
✓చెట్టుకింద చేరు-సేదను తీరు
✓అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
✓అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు
✓దోసిలిలోకి తీసుకోమొక్కా!-ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
✓స్వార్ధం లేని మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది
✓పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది
✓ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకం
✓ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
✓పచ్చని చెట్టు-మన ప్రగతికి మెట్టు
✓వృక్షాలు- మన శరీరం బయటఉండే ఊపిరితిత్తులు
✓ఇంటింటా చెట్లు - ఊరంతా పచ్చదనం
✓వృక్ష సంపదను పెంచాలి-స్వచ్ఛతనే సాధించాలి
✓బిడ్డకు తల్లి రక్షణ-భూమికి ఓజోన్ రక్షణ
✓మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి
✓జీవులను బ్రతకనిస్తే అవి మనలను బ్రతకనిస్తాయి
✓జల సంరక్షణ-వన సంరక్షణ
✓పర్యావరణ రక్ష-విపత్తులకు శిక్ష
✓సృష్టికి మూలం జీవం-జీవానికి మూలం వనం
✓ఇంటింటికీ చెట్లు-సంక్షేమానికి మెట్లు
✓వరాల వర్షం కురవాలంటే -పసిడి పంటలే పండాలంటే చిన్నా పెద్దా చేతులు కలిపి చెట్టూచేమనే పెంచాలి
✓నా లక్ష్యం హరిత తెలంగాణ
✓మొక్కలు నాటడం గొప్ప కార్యం-సంరక్షించడం మహత్కార్యం