LATEST UPDATES

1, మే 2020, శుక్రవారం

స్టీరింగ్ తిప్పలు, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴 స్టీరింగ్ తిప్పలు🌴   
చేతులతో స్టీరింగ్ తిప్పకుంటే
బతుకు బండి కదలని వాళ్ళు
రయ్యి రయ్యి మంటూ
సరిహద్దుల్ని చెరుపుకుంటూ
రాష్ట్రాల్ని  దాటుకుంటూ
వాయువేగంతో కదులుతుంటే
విషపురుగు విశ్వరూపం తో
లాక్ డౌన్ బ్రేకులు పడి
కరోనా  పంజరంలో చిక్కుకున్నారు
నిలువ నీడ లేక
ఊరి బయట ఉండిపోయారు
లారీ నే  క్వారంటై న్ గా మార్చుకుని
కాలం  ఎళ్లదీస్తున్రు
చేతిలో ఉన్న పదీ పరక వడిశినయ్
తిండి గింజలు లేక తిప్పలు మొదలైనయ్
ఊరి వైపు చూస్తే అనుమానపు
అడ్డుగోడలు ఎక్కువై అడుగు పెట్టనీయట్లే
దొరికినప్పుడు తిని
లేని నాడు నీళ్లతోనే కడుపు నింపుతున్రు
వాళ్లు మన ఇంటికి ఇనుప చువ్వలు
మన రూఫ్ కు కాంక్రీటును
పప్పులు ,ఉప్పులు, కూరగాయలు
సకలం అందించి సాదిన్రు
మన ఐశ్వర్యం వెనక వాళ్ల
చెమట చుక్కలు దాగున్నాయి
వాళ్లకిప్పుడు కష్టమొచ్చింది
కండ్లల్ల పెట్టుకొని కాపాడాలి
ఆర బెట్టిన కడుపులను
బుక్కెడు బువ్వ తో నింపాలి
ఏ తల్లి  కన్న బిడ్డలో
 మన బిడ్డల్లా చూసుకోవాలి
వారి గమ్యాలకు చేరేవరకు 
మానత్వాన్ని  చిలకరిస్తూ
వాడిపోకుండా చూడాలి

( లాక్ డౌన్ వలన పొరుగు రాష్ట్రాల లారీ డ్రైవర్లు, క్లీనర్లు పడుతున్న కష్టాలు
ఈనాడులో వచ్చిన కథనంపై స్పందన)
-----------------------------------
✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET

29, ఏప్రిల్ 2020, బుధవారం

అంతర్మథనం, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴అంతర్మథనం 🌴
గ్లోబలైజేషన్ ఊడలు దిగి
ప్రపంచమే కుగ్రామంగా మారడంతో
సోషల్ స్టేటస్ కోసం
ఉన్న ఊరును, కన్నతల్లిని వదిలేసి
ఆశల అలలతో అమెరికాలో వాలిపోయా
నేర్చుకున్న చదువుకు
న్యూయార్క్ లో కొలువు కొట్టేశా
భుజంపై తెల్లకోటు, చేతిలో స్టేతస్కోప్
సెకండ్ల ముళ్ళుతో పరిగెత్తి
పేరు ప్రతిష్టలు మూటగట్ఠా
ఐశ్వర్యాన్ని కూడ బెట్టా
హార్డిల్స్ లేని జీవితం
ఆహ్లాదంగా సాగుతుంటే
అపరిచితుడు లెక్క
మాయ పురుగు మంది లో చేరి
ఆకు పురుగు లెక్క ఆరగిస్తుంటే
డే అండ్ నైట్ కరోనా పై
జమ్మి చెట్టు మీద దాచిన
ఆయుధాలన్నీ తీసి వాడినా
కంట్రోల్  కాకపోవడంతో
పక్కనున్న పేషట్లు ప్యాక్ కట్టేస్తుంటే
చివరకు కలిగ్స్ కూడా కరోనా కాటుతో
మృత్యువు  కుహరంలోకి  జారుతుంటే
 ఆస్పత్రులన్నీ మరుభూమిగా మారి శవాల గుట్టలుగా దర్శనమిస్తుంటే            
కాలు కదలట్లేదు, చేతులు మెదలట్లేదు
ఒళ్లంతా వైబ్రేషన్,మనసంతా ఎమోషన్
భారంతో గుండె బరువెక్కుతుంది
ఎక్కడి నుండి ఏ వార్త వస్తుందో
ఏ గాలి ఏ దుర్వార్త మోసుకొస్తుందో
అని ఆందోళన , ఆ మహమ్మారి
ఎప్పుడు కబళిస్తొందోనని ఒకటే ఆవేదన
ధైర్యం ఆవిరై,జీవితం చీకట్లు కమ్ముకుంది
లాక్ డౌన్ కు లాక్ తీసేస్తే
సొంతగడ్డపై వాలిపోతా
అమ్మ ఒడిలో వొదిగి పోతా
జన్మభూమి రుణం తీర్చుకుంటా.
( అమెరికాలో ప్రవాస భారతీయ వైద్యుల
మరణాలకు నివాళి తో )
--‐----‐-------------------------
✍✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET .

26, ఏప్రిల్ 2020, ఆదివారం

నీతి కథలు - 18 తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క

నీతి కథలు - 18

తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది. నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క ఆనందంగా ఉండేది. రాను రాను నక్కకు ఇదొక వ్యాపకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు. ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది. అది అడవిలోని పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎవరి జోలికి పోకుండా వినయంగా ఉండేది. ఒక రోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో నక్క ‘అడవిలో జంతువులన్నీ తనను చూస్తే గౌరవంగా, తను చెప్పే కబుర్ల కోసం ఆసక్తిగా ఉంటే ఈ గుర్రం తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దీని సంగతి చూడాలి’ అనుకున్నది. పైకి గుర్రంతో ‘‘నీకు ఒక ప్రమాదం ముంచుకు రాబోతోంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడ నుంచి పారిపో’’ అన్నది.

‘‘ఏమిటా ప్రమాదం’’ అని అడిగింది గుర్రం. ‘‘మన మృగరాజు సింహం నిన్ను చంపటానికి వస్తోంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను’’ అంది నక్క. నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది. ‘‘అంతేనా? నాకు సింహం అంటే భయం లేదులే. దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని చెప్పి, ‘‘నక్కా... నక్కా... నా సంగతి అలా ఉంచుగానీ మొదట నీ ప్రాణాలు రక్షించుకో’’ అన్నది గుర్రం. నా ప్రాణాలకేమైంది అని అడిగింది నక్క.

మన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట. వైద్యం కోసం ఎలుగుబంటి దగ్గరకు వెళ్తే ‘తోక చివర తెల్ల మచ్చ ఉన్న నక్క రక్తం తాగిస్తే జబ్బు నయం అవుతుంద’ని చెప్పిందట. అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది. నువ్వు కనిపిస్తే చంపేస్తుంది. వెళ్లి దాక్కుని నీ ప్రాణాల్ని కాపాడుకో’’ అని చెప్పింది. దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్లమధ్యలో దూరి ఎవరికీ కనపడకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్లింది.

మూడు రోజుల తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది. నక్కకి కనీసం కుందేల్ని పట్టుకునే ఓపిక కూడా లేదు. తన విషయం అంతా చెప్పి ‘సింహం వస్తోందేమో చూసి చెప్ప’మని అడిగింది. ‘‘వామ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు. నేను వెళ్లను, నాకు భయం’’ అన్నది కుందేలు. మరొక రోజు నక్కను చూడడానికి కోతి వచ్చింది, అది కూడా అలాగే అన్నది. గతంలో అనవసరంగా వాటికి లేని పోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది. వారం రోజుల తర్వాత గుర్రం వచ్చింది. ‘‘సింహం వస్తోందా’’ అని అడిగింది నక్క. ‘‘సింహం రాదు. కావాలనే నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోనివి చెప్పి భయపెడుతున్నావు కదా? భయం అంటే నీకు తెలియాలనే అలా చెప్పాను’’ అంది గుర్రం. నక్క తప్పు తెలుసుకుని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది.

అక్బర్-బీర్బల్ కథలు - 11 బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి

అక్బర్-బీర్బల్ కథలు - 11

బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి

అక్బర్‌ చక్రవర్తి సభలో కొలువుదీరి వున్నప్పుడు ఒక యువకుడు మెల్లగా లోపలికి ప్రవేశించాడు. అక్బర్‌ చూపులు తనమీద పడగానే అతడు వంగి సలాం చేశాడు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు?' అని అడిగాడు అక్బర్‌ చక్రవర్తి. ప్రభూ! నా పేరు మహేశ్‌దాస్‌. ఆగ్రాకు నాలుగామడల దూరంలో వున్న కుగ్రామం మాది.
ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాను,'' అన్నాడు ఆ యువకుడు. ``నీకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు?'' అని అడిగాడు అక్బర్‌. ``నా తెలివితేటల్ని చూసి, `నువ్వు చక్రవర్తి దగ్గరికి వెళ్లు, నీకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది,' అని మా పంతులే చెప్పారు. ఆయన మాటవిని అంతదూరం కాలినడకనే వచ్చి, అతి ప్రయత్నం మీద తమ దర్శనం చేసుకోగలిగాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌.

``ప్రతి ఉపాధ్యాయుడూ, తన విద్యార్థుల గురించి అలాగే గొప్పగా అంచనా వేస్తాడు. ఉత్తమ అర్హతలు గలవారికి మాత్రమే మేము ఇక్కడ ఉద్యోగలిస్తాం,'' అన్నాడు అక్బర్‌. "నేను ఉత్తముల్లోకెల్లా ఉత్తముడినని రుజువు చేయగలను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో. "చేసి చూపు మరి. ఆలస్యం దేనికి?'' అన్నాడు అక్బర్‌.
``అందుకు ప్రభువులు ఒక చిన్న కానుకను దయచేయాలి,'' అన్నాడు మహేశ్‌. ``మొదట ప్రతిభను నిరూపించుకుంటే తప్ప కానుకలు ఇవ్వరు,'' అన్నాడు అక్బర్‌. ``నేను అడిగే కానుకకు దమ్మిడీ ఖర్చుకాదు ప్రభూ!'' అన్నాడు మహేశ్‌. ``అలాగా? ఏమిటది?'' అని అడిగాడు అక్బర్‌. 30 కొరడా దెబ్బలు, ప్రభూ! అన్నాడు మహేశ్‌. అతడి కోరిక విని చక్రవర్తితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.
``నీకేమైనా పిచ్చి పట్టిందా?'' అన్నాడు అక్బర్‌ అసహనంగా. ``ఆ సంగతి తరవాత తెలుస్తుంది. మొదట నేను అడిగింది దయచేసి ఇప్పించండి ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ వినయంగా. అక్బర్‌ వెంటనే కొరడా తెప్పించి, దాన్ని తెచ్చిన వాణ్ణి దగ్గరికి పిలిచి, "కొరడాతో వాణ్ణి నిజంగానే కొట్టొద్దు. కొడుతున్నట్టు అభినయిస్తూ, మెల్లగా తాకించు,'' అని చెవిలో చెప్పాడు. భటుడు వెళ్ళి అలా ఝళిపిస్తూంటే, ముందుకు వంగిన మహేశ్‌, ఒకటి, రెండూ... అంటూ లెక్కించి, పది రాగానే, "ఆగు!'' అని అరిచి తలెత్తి అక్బర్‌ చక్రవర్తిని చూస్తూ, "ప్రభూ, కానుకలో నా వాటా నేను పుచ్చుకున్నాను.

ఇక మిగిలిన దాన్ని తమ ఉద్యోగుల్లో ఇద్దరు సమంగా పంచుకుంటారు,'' అన్నాడు. ``ఏమిటి నువ్వంటున్నది?'' అని అడిగాడు అక్బర్‌ అతడు చెబుతున్నది అంతుబట్టక. "అవును ప్రభూ! భవన ద్వారం వద్ద నిలబడ్డ ఇద్దరు కాపలా భటులు ఏదైనా ఇస్తే తప్ప నన్ను లోపలికి వదలనన్నారు. `నా దగ్గర డబ్బులు లేవు. ప్రభువిచ్చే కానుకను మీతో సమానంగా పంచుకుంటాను,' అని మాట ఇచ్చి లోపలికి వచ్చాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌. ``అలాగా!'' అన్నాడు అక్బర్‌ కోపంతో. "వాళ్ళను పిలిపిస్తే అంతా తమకు తెలుస్తుంది,'' అన్నాడు మహేశ్‌. అక్బర్‌ తల పంకించాడు.కొంతసేపటికి ఆ ఇద్దరు భటులూ అక్కడికి రాగానే, ``మిత్రులారా, మీరు నాకెంతో సాయపడ్డారని ప్రభువులకు విన్నవించాను. మీ దయ లేకుంటే నాకు ప్రభువుల దర్శన భాగ్యం లభించేదికాదని చెప్పాను. ఆయన దయచేసిన కానుకలో మీకు తలా ఒక వాటా ఇవ్వాలి కదా. ప్రభువులు ఇప్పిస్తారు. పుచ్చుకోండి,'' అన్నాడు మహేశ్‌.

ఇద్దరు భటులూ, సంతోషంగా తలలూపారు. ఒక భటుణ్ణి ముందుకు రమ్మని, కొరడా పట్టుకున్న వ్యక్తి పది దెబ్బలు కొట్టాడు. ఆ తరవాత రెండవ కాపలాభటుడు కుయ్యో మొర్రో అంటూ మిగిలిన పది కొరడాదెబ్బలూ తిన్నాడు. "ఈ క్షణమే, లంచగొండులైన మిమ్మల్ని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను,'' అన్న అక్బర్‌ చక్రవర్తి, మహేశ్‌ కేసి తిరిగి, "నువ్వు చాలా తెలివైనవాడివి.మీ బడిపంతులు చెప్పింది నిజం. నీ సమర్థత నిరూపించుకున్నావు. ఇప్పుడే నిన్నుపేరుతో నా ఆస్థానంలో ఉన్నత పదవిలో నియమిస్తున్నాను,'' అన్నాడు చిన్నగా నవ్వు తూ.

ప్రశ్న: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?

ప్రశ్న: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?

జవాబు: స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి.

కరోనా రంగస్థలం

🌴 కరోనా రంగస్థలం🌴
1. నిన్నటి వరకు పిల్లల గుంపుతో
   తల్లి కోడిలా స్కూల్ మైదానమంతా
   తనివితీరా తిరిగి నాను
   సకల నైపుణ్యాలతో బోర్డుపై బోధించి
   కరుణ, దయ, జాలి, ప్రేమ అనే
   పిల్లర్ల పాదులను తవ్వి
   భవిష్యత్ తరాల ను నిర్మించాను
2. నేడు నేను జీవం పోసిన
   పాత్రలు కరోనా రంగస్థలంలో
   అద్భుతంగా నటించి
   అందరి మన్ననలను పొందుతుంటే
   నేను ఆనంద సాగరంలో మునిగి                                   
   పోతున్నాను.
3. లాఠీ పట్టిన చేతులు
   నవరసాలను పండిస్తుంటే
   రోడ్లన్నీ నిశ్శబ్ద రాగాలు ఆలపిస్తుంటే
   ఖాకీల పై జనం పూల వర్షం కురిపిస్తుంటే
   నేను ఆనంద డోలికల్లో తేలిపోతున్నాను
4. తెల్లకోటు వేసినోళ్ళు
   బతికించాలనే ఆరాటం ఒకవైపు
   బతకాలనే పోరాటం మరోవైపు
   మరణాల సంఖ్యను మైనస్ లోకి
   రావడానికి ఊపిర్లు ఊదుతూ
   కరోనా క్లైంట్ లకు
   ఆశల అమృతాన్ని తాగిస్తుంటే
   సబ్బండ వర్గాల నుండి
   ప్రశంసల జల్లుకు తడిసి ముద్దవుతుంటే
   నా కండ్ల నుండి ఆనంద భాష్పాలు
   రాలుతున్నాయి.
5. చీకట్లో లేచి, చీపుర్లను చేతబట్టి
   రోడ్లను నిద్ర లేపి, మలినాలను
   కడిగిపారేస్తున్న సఫాయి కర్మచారులను
   పాలకులు పాదాలు కడుగుతుంటే
   నేను పొంగిపోతున్నాను
6. కరెన్సీ కట్టలను గుట్టలుగా పేర్చి నోళ్లు
   ఘనీభవింఛిన దాతృత్వాన్నికరిగించుకొని
   ముడుచుకున్న మనసులను విప్పుకొని
   రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరి వచ్చి
   సహాయపు కుసుమాలను పంచుతుంటే
   రంతి దేవుడికి వారసులయ్యారని
   నేను మురిసి పోతున్నాను
7. పుడమిపై పుడుతున్న
   రాచపుండు లను
   భవిష్యత్ తరాలకు తాకకుండా
   మరింతమంది వైజ్ఞానికులను
   తయారుచేయడానికి
   ఫ్యూచర్ కోసం కరికులం ఫ్రేమ్ ను
   మార్చుకొని నవ్య వ్యూహాలతో
   బోధిస్తూ నవ సమాజాన్ని నిర్మిస్తాను.
--------------------------------------------
✍✍✍✍✍✍✍✍✍
         తాటిపాముల రమేష్
       జడ్.పి.హెచ్.ఎస్ వర్ధన్నపేట.