LATEST UPDATES

1, మే 2020, శుక్రవారం

స్టీరింగ్ తిప్పలు, రచన శ్రీ తాటిపాముల రమేష్

This is a simple translate button.

🌴 స్టీరింగ్ తిప్పలు🌴   
చేతులతో స్టీరింగ్ తిప్పకుంటే
బతుకు బండి కదలని వాళ్ళు
రయ్యి రయ్యి మంటూ
సరిహద్దుల్ని చెరుపుకుంటూ
రాష్ట్రాల్ని  దాటుకుంటూ
వాయువేగంతో కదులుతుంటే
విషపురుగు విశ్వరూపం తో
లాక్ డౌన్ బ్రేకులు పడి
కరోనా  పంజరంలో చిక్కుకున్నారు
నిలువ నీడ లేక
ఊరి బయట ఉండిపోయారు
లారీ నే  క్వారంటై న్ గా మార్చుకుని
కాలం  ఎళ్లదీస్తున్రు
చేతిలో ఉన్న పదీ పరక వడిశినయ్
తిండి గింజలు లేక తిప్పలు మొదలైనయ్
ఊరి వైపు చూస్తే అనుమానపు
అడ్డుగోడలు ఎక్కువై అడుగు పెట్టనీయట్లే
దొరికినప్పుడు తిని
లేని నాడు నీళ్లతోనే కడుపు నింపుతున్రు
వాళ్లు మన ఇంటికి ఇనుప చువ్వలు
మన రూఫ్ కు కాంక్రీటును
పప్పులు ,ఉప్పులు, కూరగాయలు
సకలం అందించి సాదిన్రు
మన ఐశ్వర్యం వెనక వాళ్ల
చెమట చుక్కలు దాగున్నాయి
వాళ్లకిప్పుడు కష్టమొచ్చింది
కండ్లల్ల పెట్టుకొని కాపాడాలి
ఆర బెట్టిన కడుపులను
బుక్కెడు బువ్వ తో నింపాలి
ఏ తల్లి  కన్న బిడ్డలో
 మన బిడ్డల్లా చూసుకోవాలి
వారి గమ్యాలకు చేరేవరకు 
మానత్వాన్ని  చిలకరిస్తూ
వాడిపోకుండా చూడాలి

( లాక్ డౌన్ వలన పొరుగు రాష్ట్రాల లారీ డ్రైవర్లు, క్లీనర్లు పడుతున్న కష్టాలు
ఈనాడులో వచ్చిన కథనంపై స్పందన)
-----------------------------------
✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి