LATEST UPDATES

5, జులై 2018, గురువారం

మలబద్దకాన్ని దూరం చేసే చిట్కాలు..!

*Health Tip*

🛑 మలబద్దకాన్ని దూరం చేసే చిట్కాలు..!

*స్థూలకాయం, మధుమేహం, థైరాయిడ్‌, ఎక్కువ సేపు కూర్చోవడం, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు వంటి అనేక అంశాల కారణంగా చాలా మందికి నేటి తరుణంలో మలబద్దకం వస్తున్నది. దీని వల్ల గంటల తరబడి బాత్ రూంలో కుస్తీలు పడాల్సి వస్తున్నది. అయినప్పటికీ విరేచనం సుఖంగా అవుతుందా..? అంటే.. కావడం లేదు. దీంతో రోజంతా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. అయితే కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. దాంతో మలబద్దకం సమస్య నుంచి ఇట్టే బయట పడవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

🛑 1. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అనే మాట మనకు తెలిసిందే. అయితే రోజుకో యాపిల్‌ను తింటే మలబద్దకం సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.

ఎందుకంటే యాపిల్‌లో 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. మలబద్దక సమస్యను దూరం చేస్తుంది. దీంతో సులభంగా విరేచనం అవుతుంది.

🛑 2. నారింజ పండ్లలో విటమిన్ సి మాత్రమే కాదు ఫ్లేవనాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది నాచురల్ లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య పోతుంది. ఒక నారింజ పండులో 4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. కనుక ఈ పండును రోజూ తింటే చాలు మలబద్దకం అన్న మాటే ఉండదు.

🛑 3. ఒక కప్పు పాప్ కార్న్‌లో ఒక గ్రామ్ ఫైబర్ ఉంటుంది. కనుక రోజుకు 4 కప్పుల వరకు పాప్ కార్న్ తిన్నా చాలు. దాంతో 4 గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం ఉండదు. అయితే పాప్ కార్న్‌ను అలాగే తినాలి. అందులో ఫ్లేవర్ కోసం ఏ పదార్థాన్ని కలపకూడదు. కలిపితే క్యాలరీలు అధికంగా చేరుతాయి.

🛑 4. రోజుకు రెండు కప్పుల ఓట్స్ తినడం అలవాటు చేసుకున్నా చాలు. దాంతో 4 గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది. అది మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.

🛑 5. రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజలను తిన్నా చాలు. ఫైబర్ పుష్కలంగా అందుతుంది. మలబద్దక సమస్యను దూరం చేసుకోవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

🛑 6. రోజూ ఉదయాన్నే పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో కలబంద గుజ్జును తింటే దాంతో మలబద్దక సమస్య దూరమవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై, విరేచనం సాఫీగా అయ్యేలా చూస్తుంది.

వెర్రి వెంగళమ్మలు - కథ

            *వెర్రి వెంగళమ్మలు*

*అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని.*

*“మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ.*

*“ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు.*

*“ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ.*

*వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు.*

*తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా.*

*వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా.*

*"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లో‌నే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా.*

*బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు.*

*మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది.*

*“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ‌ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా.*

*“అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు.*

*ఆమె అమాయకపు మాటలకి వ్యాపారికి బలే కోపం వచ్చింది. అయినా తమాయించుకుని "ఆ బేరగాడి ఆచూకీ తెలుసుకొని వస్తాను ఆగు!" అని హడావుడిగా సంత వైపు బయలుదేరి పోయాడు.*

*సంతలో‌ మోసగాడి ఆచూకీ కొంత సులభంగానే దొరికింది. వాడి ఊరు మరీ ఏమంత దూరం కాదు. వ్యాపారి ఆ మోసగాడి ఆనవాలు పట్టుకుని ఆ ఊరికి బయలుదేరాడు.*

*నడుస్తూ నడుస్తూ వెనుదిరిగి చూసిన వ్యాపారికి ఓ వింత దృశ్యం కనబడింది. అతని వెనకగా ఎద్దుల బండి ఒకటి వస్తున్నది. ఆ బండి ఇరుసుపైన ఒక కాలు నిటారుగా మోపి, క్రిందికి పడిపోకుండా సర్దుకుంటూ నిలబడి బండిని తోలుతున్నది ఒకామె. బండిలో నిండుగా గడ్డి ఉంది- కావాలనుకుంటే ఆమె గడ్డి మీదైనా కూర్చోవచ్చు; లేదా దిగి నడుచుకుంటూ అయినా రావొచ్చు. రెండూ కాకుండా ఇరుసు మీద ఎందుకు, అలా ఒంటికాలి మీద నిలబడటం? 'ఈమె ఎవరో గొప్ప అమాయకురాలిలాగానే ఉంది' అనుకుని నవ్వుకున్నాడు వ్యాపారి.*

*వెంటనే అతనికి వెంగమ్మ మాటలు గుర్తొచ్చాయి. "పాపం, వెంగమ్మ మాటలు నిజమే కావొచ్చు- లోకం ఏమంత తెలివిగా లేదు- ఈమె ఎంత వెర్రివెంగళమ్మో కనుక్కుందాం!" అనుకున్నాడు.*

*కొంచెంసేపు ఆగి, బండి తన దగ్గరికి రాగానే ఆమెని పలకరిస్తూ "ఏమమ్మా, ఎందుకట్లా ఒంటి కాలిమీద నిలబడటం? పడితే ప్రమాదం కదా? గడ్డి మీద కూర్చొని రావొచ్చు; లేకపోతే అసలు పూర్తిగా దిగి నడిచి రావొచ్చు" అన్నాడు అతను.*

*“మా అబ్బాయి అట్లా చెప్పలేదు- బండి మీదే రమ్మన్నాడు" అన్నదామె పడిపోకుండా మళ్ళీ సర్దుకొని నిలబడుతూ- "ఇంతకీ నువ్వెవరు? నిన్ను మా ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు- ఏదో ఆకాశంలో నుండి ఊడి పడ్డట్లున్నావు!" అన్నది ఆమె.*

*వ్యాపారికి ఆమెను కొంచెం ఆటపట్టించాలనిపించింది. "అవునవును- బలే కనుక్కున్నావే?! నిజంగానే నేను ఆకాశం నుండి ఊడిపడ్డాను- మీ ఊరు చూసి పోదామని!" అన్నాడు ఎగతాళిగా.*

*ఆమె నిజంగానే అమాయకురాలు. వ్యాపారి మాటలు నిజమనుకున్నది. "అవునా, అయితే నిన్నొకటి అడుగుతా చెప్తావా? మా ఇంటాయన పైకి వెళ్ళి మూడేళ్ళవుతున్నది. నీకు ఆయన అక్కడ కనిపించే ఉండాలి కదా, ఎట్టా ఉన్నాడు, కులాసానేనా?!” అని అడిగింది సూటిగా.*

*'వార్నాయనో, ఈమెవరో మా వెంగమ్మ కంటే వెంగళమ్మ. దేశంలో నిజంగానే చాలామంది అమాయకులు ఉన్నట్లున్నది" అనుకున్నాడు వ్యాపారి- "ఓఁ, చూడకేమి?! రోజూ చూస్తూనే ఉన్నాను మీ ఇంటాయన్ని. పాపం ఆయనకి అక్కడ గొర్రెలు కాచే పని ఇచ్చారు. మరి అవేమో, ఒక్క చోట నిలవకుండా కొండా-కోనా; గుట్టలూ-మిట్టలూ తిరుగుతున్నాయి. వాటి వెంబడి తిరగలేక మీ ఆయన నానా అవస్థలు పడుతున్నాడు. గుడ్డలు కూడా పీలికలై పోయాయి!" అన్నాడు పైకి.*

“అయ్యో, మాకు ఎట్టా తెలుస్తుంది ఆ సంగతి?! మేం‌ ఇక్కడే ఉన్నామాయె. అయినా మొన్న సంక్రాంతి పండక్కి బట్టలు కూడా పెట్టుకున్నామే; అంత అవసరం ఉంటే వచ్చి తీసుకు పోకూడదా?” అని యాష్టపడిపోయిందామె. "ఇక్కడే ఉండండి, ఇంటికి పోయి గుడ్డలు తెచ్చిస్తాను. ఈసారి పైకి వెళ్ళగానే మా యింటాయనకు ఇద్దురు" అని వేడుకున్నది.

వ్యాపారికి నవ్వు ఆగలేదు. ఆమెని ఇంకా పరీక్షించటం కోసం అతను "అది వీలు పడదు తల్లీ, ఆకాశానికి ఒక పెద్ద ద్వారం ఉంటుంది. అక్కడ ఉండే ద్వారపాలకుడికి లంచం ఇస్తేగాని వేటినీ లోపలికి తీసుకోని పోనివ్వడు, ఏం చేయను?!" అన్నాడు. “అలాగేలే, ఎంతో కొంత ఇస్తే సరి! నిన్ననే మా అబ్బాయి ధాన్యం అమ్మిన డబ్బులు తెచ్చి ఇనప్పెట్టెలో పెట్టాడు. గుడ్డలు, డబ్బులు తెచ్చి ఇస్తాను- కాసేపు ఆగండి" అని బండిని తోలుకొని ఇంటికి వెళ్ళింది ఆమె. వ్యాపారి అక్కడే ఆగిపోయాడు.

కొద్దిసేపటికల్లా గుడ్డలు, పైకం తీసుకుని అక్కడకి వచ్చింది అమె!

'ఈమె వెంగమ్మకు అక్క' అని గ్రహించిన వ్యాపారి కలవర పడిపోయి "ఒక్కసారి మీ అబ్బాయిని చూసి వెళతాను తల్లీ!" అని ఆమెతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె కొడుకుకు జరిగినదంతా చెప్పి, ఆమె ఇచ్చిన డబ్బులు, గుడ్డలు అతనికి తిరిగి ఇచ్చేశాడు.

ఆ యువకుడు వ్యాపారికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుని "మీరెవరు? ఏం పని మీద వచ్చారు?' అని అడిగాడు. "నా భార్య వెంగమ్మ కూడా మీ అమ్మ మాదిరిదే- ఏమీ తెలీదు పాపం. మొన్న నేను ఊళ్ళో లేనప్పుడు మీ ఊరివాడు ఎవడో వచ్చాడట; మా వెంగమ్మని మోసం చేసి ఆవులని రెండింటిని తీసుకెళ్ళిపోయాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఇట్లా వచ్చాను" చెప్పాడు వ్యాపారి విచారంగా.

ఆ కుర్రవాడికి ఊళ్ళో వాళ్ళంతా పరిచయమే- "ఓఁ, వాడు నాకు తెలుసు. వాడో పెద్ద మోసగాడు. నిన్ననే రెండు ఆవుల్ని తెచ్చాడు. అవి మీవే అయి ఉంటాయి- చూద్దాం పదండి" అని అతని ఇంటికి తీసుకు వెళ్ళాడు వ్యాపారిని.

తన ఆవుల్ని చూడగానే గుర్తుపట్టాడు వ్యాపారి. అవి కూడా వ్యాపారిని చూసి సంతోషంగా అరిచాయి. వెంటనే వ్యాపారి న్యాయాధికారికి ఫిర్యాదు చేయటం, న్యాయాధికారి విచారణ జరిపి మోసగాడిని శిక్షించటం, జరిమానాతో సహా ఆవుల్ని వ్యాపారికి ఒప్పచెప్పటం జరిగాయి.

వ్యాపారి ఇంటి కొచ్చి ఆవుల్ని కొట్టంలో కట్టేస్తుంటే "నేను చెప్పలేదూ, అతను చాలా మంచివాడేనని?! పాపం, మన ఆవుల్ని మనకు ఇచ్చేశాడు చూడు!" అన్నది వెంగమ్మ.

"నిజమేనే, లోకంలో నీలాంటివాళ్ళూ, నాలాంటివాళ్ళూ చాలా మందే ఉన్నారు. వాడిలాంటివాళ్ళూ ఉంటారు. అయితే అమాయకుల్ని మోసం చేస్తే ఎప్పటికైనా శిక్ష మటుకు తప్పదు"అన్నాడు వ్యాపారి

ఓ విద్యార్థి అడిగిన ప్రశ్న : సార్, మీరు నేర్పించిన విద్యతో మేము చాలా ఎత్తుకి ఎదిగినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ రాదా ?

ఒక మాస్టార్ని ఓ విద్యార్థి అడిగాడు. సార్, మీరు నేర్పించిన విద్యతో మేము చాలా ఎత్తుకి ఎదిగినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ రాదా అని. ఎందుకు అని ఆయన అడిగితే "మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం కానీ మీరు మాత్రం ఇలాగే ఉండిపోతున్నారు కదా" అని.

దానికి మాస్టారు శైలిలో కొంత విడమరిచి చెప్పాల్సి వచ్చింది.

"ఓ యాభై అంతస్తులున్న బిల్డింగ్ ఎవరు కడతారు. యాభై అడుగుల మనిషి కాదు కదా. ఆరు అడుగుల లోపే ఉన్న మనిషి కడతాడు. అంటే ఎంత ఎత్తున బిల్డింగ్ కట్టడానికి అంత ఎత్తున్న మనిషి కావాలి అంటే ఎలా??

ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు. తను నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే నలుగురికి నీడనివ్వగలదు. టీచర్ కూడా అంతే. తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా గుర్తించి ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. అది నేను ఆస్వాదించాను" అని చెప్పాడు.

"Being a Teacher"
Dedicated to all Teachers

అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !

*మా అమ్మ (చీర) కొంగు*
.          
*ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు.* *ఎందుకంటే నేటి మమ్మీలు  చీరకట్టు తక్కువే.*
*చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం !*
అంతేకాకుండా ..

*పొయ్యి మీద వేడి గిన్నెలను*
*దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం*

*పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం*

*చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు  కాగా  వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!*

*కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం  దాచుకునేది *అమ్మ కొంగు వెనకే.*
*అలాగే పిల్లలు ఈ మహా  చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు  అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!*

*అలాగే వాతావరణం:చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని  వెచ్చగా చుట్టేది !*

*వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !*

*వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!*

*అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.*

*అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది!*

*ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం!*

*ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!*

అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !
             
*అమ్మ ఒక మధుర జ్ఞాపకం.*
*తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు......*
*కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...*
*పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...*
*బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....*
*ఇలా ఎన్నో ఎన్నెన్నో....*

*అమ్మ పాలు తాగుతూ, పలుమార్లు తన్నుతూ ఉంటాడు/ఉంటుంది...*
*తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు....*

అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......

ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించివున్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు,
అదృష్టవంతులు....

మీరు ఆరోగ్యంగానే ఉన్నారా ?

1.  మీ నోరు నిద్ర లేచిన వెంటనే దుర్వాసన రాకుండా లాలాజలం తియ్యగా ఉంటే, మీలో ఉన్న 70 శాతం నీరు పరిశుభ్రంగా ఉన్నట్లు తెలుసుకోవచ్చు.

2.   మీ నాలుక మీద పాచి మందంగా లేకుండా, నాలుక చేదు లేకుండా పరిశుభ్రంగా ఉంటే మీ జీర్ణాశయం పరిశుభ్రంగా ఉన్నట్లు అంచనా వేయవచ్చు.

3, స్నానం చేయకపోయినా సబ్బు పెట్టకపోయినా, మీ చెమట కంపు కొట్టకూడదు. అలా ఉంటే మీ చర్మం పూర్తిగా పరిశుభ్రంగా ఉన్నట్లు లెక్క.

4, మీరు ఎప్పుడు మూత్రం పోసినా, బాత్‌రూంమ్‌లో నీరు పోయక పోయినా మీ బాత్‌రూం కంపు కొట్టకూడదు. మీ మూత్రం ఎప్పుడూ పలుచగా, తెల్లగా వస్తూ ఉంటే, మీ లోపల ఉన్న 5 లీటర్ల రక్తం యొక్క పరిశుభ్రతను గమనించవచ్చు.

5, మీ విరేచనం ఎప్పుడు వచ్చినా ప్లేటుకు అంటకుండా మరకలు పడకుండా, వాసన లేకుండా, క్షణాల్లో బయటకు వచ్చేస్తుంటే, దాన్ని బట్టి మీ లోపల ఉండే కోటానుకోట్ల జీవకణాల పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు.

ఇప్పటి వరకూ చెప్పిన ఐదు విషయాల్లో వాసన లేకుండా గనుక ఉంటే, మీ శరీరం లోపల పరిశుభ్రంగా, ప్రశాంతమైన వాతావరణంలో మీ అవయవాలన్నీ జీవిస్తున్నాయని తెలుసుకోండి. లేదా వాసనలు ఎంత గాఢంగా వస్తూ ఉంటే, మీ లోపల అంత మురుగు గుంట వాతావరణం ఉన్నట్లుగా గ్రహించండి.

పరిశుభ్రత మీ శరీరంలో వచ్చేటట్లు చేయడానికి రోజుకు 4,5 లీటర్లు నీళ్లు తాగడం, 2, 3 సార్లు సాఫీగా విరేచనానికి వెళ్లడం, ఎంతో కొంత వ్యాయామం చేయడం, రోజుకు 50 - 60 శాతం ప్రకృతి సిద్ధమైన ఆహారం (వండని) తినడం, మాంసాహారాన్ని మానడం మొదలగునవి చేయండి. త్వరలో మీరు అలాంటి పరిశుభ్రతను అనుభవించగలరని ఆశిస్తున్నాను.

మట్టిలోని మాణిక్యాలకు ఉపకారం - నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

*💥మట్టిలోని మాణిక్యాలకు ఉపకారం*

*💥నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌*

*💥ప్రభుత్వ, ఎయిడెడ్‌,  స్థానిక సంస్థల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు అర్హులు*

*♦విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగు చూడకపోవడానికి పేదరికం, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలు. పుస్తకాలు, కనీస సౌకర్యాలు లేక చదవలేకపోవడం లేదా మధ్యలోనే బడి మానేయడం వంటి వాటిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షమందికి స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.*

*♦రాత పరీక్షలో మెరిట్‌ సాధిస్తే నాలుగు విద్యా సంవత్సరాల వరకు మట్టిలోని మాణిక్యాలకు ఈ ఉపకారం అందుతుంది.*

*♦ఉన్నత పాఠశాల స్థాయిలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోడానికి, డ్రాపవుట్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)’ పథకాన్ని అమలు చేస్తోంది.*

*♦దేశవ్యాప్తంగా లక్ష ఉపకారవేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు మూడువేలు, ఆంధ్రప్రదేశ్‌కి నాలుగువేలకు పైగా అందుతున్నాయి. రాష్ట్రాల వారీగా నిర్ణీత పద్ధతిని అనుసరించి ఉపకారవేతనాల సంఖ్యను నిర్ణయిస్తారు. ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి రిజర్వేషన్లు అమలు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రకటన సాధారణంగా ఏటా ఆగస్టులో వెలువడుతుంది.*

*♦నవంబరు లేదా డిసెంబరులో రాతపరీక్ష జరుగుతుంది.*

*♦ఏడు లేదా తత్సమాన తరగతిలో 55 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్‌ను పొందిన విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాయడానికి అర్హులు.*

*♦తుది ఎంపిక సమయానికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థులు ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థలు, కేజీబీవీ పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో చదువుతూ ఉండాలి. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్‌ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని రకాల రెసిడెన్షియల్‌ స్కూళ్లు,  ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.*

*♦అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,50,000 మించకూడదు. ప్రభుత్వం ఆమోదించిన కోర్సుల్లో మాత్రమే చేరి ఉండాలి.*

*♦ప్రధానోపాధ్యాయుడు లేదా తత్సంబంధిత అధికారి నుంచి కాండక్ట్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.*

*💥ఎంపిక విధానం*

*♦అభ్యర్థులను ఎంపిక చేయడానికి రాష్ట్రస్థాయిలో రాత  పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.*

*♦మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (మ్యాట్‌): దీనిలో వెర్బల్‌, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌, క్రిటికల్‌ థింకింగ్‌ నుంచి 90 ప్రశ్నలను 90 మార్కులకు ఇస్తారు. ప్రధానంగా అనాలజీ, క్లాసిఫికేషన్‌, న్యూమరికల్‌ సిరీస్‌, ప్యాట్రన్‌ పర్‌సెప్షన్‌, హిడెన్‌ ఫిగర్స్‌ తదితరాల నుంచి ప్రశ్నలు  ఇస్తారు.*

*♦సమయం 90 నిమిషాలు.*

*♦స్కొలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (శాట్‌): ఇందులోనూ 90 ప్రశ్నలను ఏడు, ఎనిమిది తరగతుల స్థాయిలో బోధించిన సైన్స్‌, సోషల్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. కేటాయించిన సమయం 90 నిమిషాలు.ఫిజిక్స్‌ 12, కెమిస్ట్రీ 11, బయాలజీ 12, గణితం 20, హిస్టరీ 10, జాగ్రఫీ 10, సివిక్స్‌ 10, అర్థశాస్త్రం 10 ప్రశ్నలు వస్తాయి.*

*♦ప్రతి పేపర్‌లోనూ దివ్యాంగులకు 30 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్‌ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ సిద్ధం చేస్తారు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీలకు 25 శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. మెరిట్‌ను అనుసరించి స్కాలర్‌షిప్‌కు తుది ఎంపిక జరుగుతుంది.*

*💥ఉపకార వేతనం ఎంత?*

*♦ఇటీవలి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 1000 చొప్పున మొత్తం సంవత్సరానికి రూ. 12000 స్కాలర్‌షిప్‌ ఇస్తారు. ఈ విధంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం లేదా తత్సమాన తరగతి వరకు అందిస్తారు. తొమ్మిది నుంచి పదో తరగతికి స్కాలర్‌షిప్‌ కంటిన్యూ కావాలంటే అభ్యర్థి 55 శాతం మార్కులతో ప్రమోట్‌ కావాలి. పదోతరగతిలో 60 శాతం మార్కులను పొందితే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ఉపకారవేతనం అందుతుంది. మళ్లీ ఇంటర్‌ ఫస్టియర్‌ నుంచి 55 శాతం మార్కులతో ప్రమోట్‌ అయితే ఇంటర్‌ రెండో సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థి ప్రతి సంవత్సరం తన స్కాలర్‌షిప్‌ను రెన్యువల్‌ చేసుకోవాలి.*

*💥దరఖాస్తు ఎలా?*

*♦సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల అప్లికేషన్లను ఆయా స్కూళ్లు సమర్పించాలి. తర్వాత ఆ దరఖాస్తుల ప్రింటవుట్లతోపాటు ఆదాయం, కుల ధ్రువీకరణ తదితర అటెస్టెడ్‌ కాపీలను డీఈఓలకు పంపాలి. దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ. 100 ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.*

*💥నేరుగా అకౌంట్‌లోకి!*

*♦స్కాలర్‌షిప్‌కి ఎంపికైన అభ్యర్థులు తల్లిదండ్రులతో కలిపి ఒక జాయింట్‌ అకౌంట్‌ను ఎస్‌బీఐ లేదా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులో ఓపెన్‌ చేయాలి.*

*♦రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 3000 లను ఎస్‌బీఐ అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తుంది. రిజిస్టర్‌ అయిన ఒక నెలలో విద్యార్థి కోర్సు మానేస్తే  స్కాలర్‌షిప్‌ ఇవ్వరు. ఏదైనా ఆరోగ్య కారణాల వల్ల అభ్యర్థి వార్షిక పరీక్షలకు హాజరుకాలేకపోతే నిర్ణీత మెడికల్‌ సర్టిఫికెట్‌ను ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్‌ ద్వారా అనారోగ్యానికి గురైన మూడు నెలల్లో పంపాలి.*
*అప్పుడే స్కాలర్‌షిప్‌ కంటిన్యూ అవుతుంది(ఆగస్టులో ప్రకటన వెలువడుతుంది. వివరాలకు www.bseap.org,*
*bse.telangana.gov.in చూడవచ్చు.)*