LATEST UPDATES

4, జులై 2018, బుధవారం

ఎన్ని జన్మ లైనా నీ కొడుకుగానే పుట్టాలని దేవుని ప్రార్ధిస్తున్నా నాన్నా!

This is a simple translate button.

ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోష పరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన.
పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు.
తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న.
పిల్లాడికి ఒక బొమ్మ నఛ్చి కొనిమ్మన్నాడు.
జేబులో ఉన్న డబ్బు చూసి , ఇంకొకటి కొందాం ,పద ముందుకు అన్నాడు నాన్న.
అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ , తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు.
పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది.
నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు. ఎందుకు తీసుకొచ్చినట్లు?
ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన. ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలని నాన్న మనసులో ఆరాటం.
ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు. పిల్లాడి చేయి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనిపించ లేదు.భయం కలిగింది. కన్నీళ్లు వచ్చాయి. ఏడుపు మొదలైంది.
అందరూ పోగయ్యారు. బొమ్మలిస్తాం ఏడవద్దు అన్నారు. బొమ్మలొద్దు నాన్న కావాలి అన్నాడు. తినుబండారాలు ఇఛ్చి ఏడవద్దు అన్నారు. నాన్న కావాలి అన్నాడు.ఎవ్వరు ఏమి చెప్పినా ఏడుపు ఆగలేదు.
బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నను తిట్టుకున్న పిల్లాడు బొమ్మలగురించి ఆలోచించడం లేదు.నాన్న కావాలి అంటూ ఏడుస్తున్నాడు. కొడుకును వెదుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు.
బొమ్మలు కొందాం పద అన్నాడు నాన్న. వద్దు నాన్న ! నువ్వెప్పుడూ నా చేయి విడవొద్దు . ఇంటికెళదాం పద అన్నాడు కొడుకు.
నాన్న ఉంటే భరోసా
నాన్న ఉంటే ధైర్యం
క్రొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్ఛే వాడు నాన్న!
రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్ఛే చెట్టులాంటి వాడు నాన్న!
వేలు పట్టి నడిపించేవాడు!
వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు!!
మన విజయం కొరకు తపించేవాడు!!!
కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడు నా నాన్న!
నాన్న చేసిన త్యాగాలు
నాన్న గొప్పతనం
నాన్న బాధ్యత
ఎన్ని చెప్పుకున్నా తక్కువే నాన్నా!
మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకొనేలా అవకాశం వస్తే నీ మనసు నొప్పించకుండా నీ చేయి పట్టుకుని నడుస్తాను నాన్నా!
ఎన్ని జన్మ లైనా నీ కొడుకుగానే పుట్టాలని దేవుని ప్రార్ధిస్తున్నా నాన్నా!
నాన్నకి ప్రేమతో!!

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి