*💥మట్టిలోని మాణిక్యాలకు ఉపకారం*
*💥నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్*
*💥ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు అర్హులు*
*♦విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగు చూడకపోవడానికి పేదరికం, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలు. పుస్తకాలు, కనీస సౌకర్యాలు లేక చదవలేకపోవడం లేదా మధ్యలోనే బడి మానేయడం వంటి వాటిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షమందికి స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.*
*♦రాత పరీక్షలో మెరిట్ సాధిస్తే నాలుగు విద్యా సంవత్సరాల వరకు మట్టిలోని మాణిక్యాలకు ఈ ఉపకారం అందుతుంది.*
*♦ఉన్నత పాఠశాల స్థాయిలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోడానికి, డ్రాపవుట్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్)’ పథకాన్ని అమలు చేస్తోంది.*
*♦దేశవ్యాప్తంగా లక్ష ఉపకారవేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు మూడువేలు, ఆంధ్రప్రదేశ్‌కి నాలుగువేలకు పైగా అందుతున్నాయి. రాష్ట్రాల వారీగా నిర్ణీత పద్ధతిని అనుసరించి ఉపకారవేతనాల సంఖ్యను నిర్ణయిస్తారు. ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి రిజర్వేషన్లు అమలు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రకటన సాధారణంగా ఏటా ఆగస్టులో వెలువడుతుంది.*
*♦నవంబరు లేదా డిసెంబరులో రాతపరీక్ష జరుగుతుంది.*
*♦ఏడు లేదా తత్సమాన తరగతిలో 55 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్‌ను పొందిన విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హులు.*
*♦తుది ఎంపిక సమయానికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థులు ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు, కేజీబీవీ పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.*
*♦అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,50,000 మించకూడదు. ప్రభుత్వం ఆమోదించిన కోర్సుల్లో మాత్రమే చేరి ఉండాలి.*
*♦ప్రధానోపాధ్యాయుడు లేదా తత్సంబంధిత అధికారి నుంచి కాండక్ట్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.*
*💥ఎంపిక విధానం*
*♦అభ్యర్థులను ఎంపిక చేయడానికి రాష్ట్రస్థాయిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.*
*♦మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్): దీనిలో వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ నుంచి 90 ప్రశ్నలను 90 మార్కులకు ఇస్తారు. ప్రధానంగా అనాలజీ, క్లాసిఫికేషన్, న్యూమరికల్ సిరీస్, ప్యాట్రన్ పర్‌సెప్షన్, హిడెన్ ఫిగర్స్ తదితరాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.*
*♦సమయం 90 నిమిషాలు.*
*♦స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్): ఇందులోనూ 90 ప్రశ్నలను ఏడు, ఎనిమిది తరగతుల స్థాయిలో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. కేటాయించిన సమయం 90 నిమిషాలు.ఫిజిక్స్ 12, కెమిస్ట్రీ 11, బయాలజీ 12, గణితం 20, హిస్టరీ 10, జాగ్రఫీ 10, సివిక్స్ 10, అర్థశాస్త్రం 10 ప్రశ్నలు వస్తాయి.*
*♦ప్రతి పేపర్‌లోనూ దివ్యాంగులకు 30 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీలకు 25 శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. మెరిట్‌ను అనుసరించి స్కాలర్‌షిప్‌కు తుది ఎంపిక జరుగుతుంది.*
*💥ఉపకార వేతనం ఎంత?*
*♦ఇటీవలి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 1000 చొప్పున మొత్తం సంవత్సరానికి రూ. 12000 స్కాలర్‌షిప్ ఇస్తారు. ఈ విధంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం లేదా తత్సమాన తరగతి వరకు అందిస్తారు. తొమ్మిది నుంచి పదో తరగతికి స్కాలర్‌షిప్ కంటిన్యూ కావాలంటే అభ్యర్థి 55 శాతం మార్కులతో ప్రమోట్ కావాలి. పదోతరగతిలో 60 శాతం మార్కులను పొందితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉపకారవేతనం అందుతుంది. మళ్లీ ఇంటర్ ఫస్టియర్ నుంచి 55 శాతం మార్కులతో ప్రమోట్ అయితే ఇంటర్ రెండో సంవత్సరానికి స్కాలర్‌షిప్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థి ప్రతి సంవత్సరం తన స్కాలర్‌షిప్‌ను రెన్యువల్ చేసుకోవాలి.*
*💥దరఖాస్తు ఎలా?*
*♦సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల అప్లికేషన్లను ఆయా స్కూళ్లు సమర్పించాలి. తర్వాత ఆ దరఖాస్తుల ప్రింటవుట్లతోపాటు ఆదాయం, కుల ధ్రువీకరణ తదితర అటెస్టెడ్ కాపీలను డీఈఓలకు పంపాలి. దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ. 100 ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.*
*💥నేరుగా అకౌంట్‌లోకి!*
*♦స్కాలర్‌షిప్‌కి ఎంపికైన అభ్యర్థులు తల్లిదండ్రులతో కలిపి ఒక జాయింట్ అకౌంట్‌ను ఎస్‌బీఐ లేదా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులో ఓపెన్ చేయాలి.*
*♦రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 3000 లను ఎస్‌బీఐ అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తుంది. రిజిస్టర్ అయిన ఒక నెలలో విద్యార్థి కోర్సు మానేస్తే స్కాలర్‌షిప్ ఇవ్వరు. ఏదైనా ఆరోగ్య కారణాల వల్ల అభ్యర్థి వార్షిక పరీక్షలకు హాజరుకాలేకపోతే నిర్ణీత మెడికల్ సర్టిఫికెట్‌ను ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్ ద్వారా అనారోగ్యానికి గురైన మూడు నెలల్లో పంపాలి.*
*అప్పుడే స్కాలర్‌షిప్ కంటిన్యూ అవుతుంది(ఆగస్టులో ప్రకటన వెలువడుతుంది. వివరాలకు www.bseap.org,*
*bse.telangana.gov.in చూడవచ్చు.)*
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి