LATEST UPDATES

15, మే 2020, శుక్రవారం

ఉత్తరాల తీగ - రచన శ్రీ డా.గూటం స్వామి

This is a simple translate button.


ఉత్తరాల తీగ - శ్రీ డా.గూటం స్వామి
💐 ఉత్తరాల తీగ 💐
********

ఇది ఇనుప వస్తువు కాదు
అదొక జ్ఞాపకాల మాల!
తలపుల దొంతర్లను
తన గుండెల్లో గుచ్చుకునే
అపురూప చెలికాడు!

గతంలో ప్రతి ఇంట ఉత్తరాల తీగకు
ఉత్తరాలు గుత్తులుగా పూసేవి!
ఆప్యాయతా పరిమళాలు వెదజల్లేవి!
అందంగా పలకరించేవి!
బంధుత్వాలను పెంచేవి!
స్నేహితులను కలిపేవి!
ఓదార్పును కలిగించేవి!
గతాన్ని కళ్ళముందు పరిచేవి

ఉత్తరాల తీగ ఒక గ్రంథాలయమే!
తాత అమ్మకు రాసిన ఉత్తరం
నాన్న నాయనమ్మకు రాసిన ఉత్తరం
అమ్మ నాన్న ల పెళ్ళికార్డు
ఉత్తరాల తీగలో పదిలం!!

అదొక పురాతన ఆత్మీయ నిధి!
ఒంటరి జీవుల పాలిట పెన్నిధి!
గత చరిత్రకు సాక్షీభూతి!

నేడు ఉత్తరాలు లేవు
ఉత్తరాల తీగలు లేవు!
రాసే తీరుబడి లేదు
చదివే ఓపిక లేదు!
సెల్ ఫోన్ సవ్వడులమధ్య
ప్రాణం లేని పలకరింపుల మధ్య
ఉత్తరాల తీగకు చోటెక్కడిది?
సంబంధాలు వ్యాపారమైన రోజుల్లో
ఉత్తరాలు రాసే అలవాటు ఎక్కడిది!

ఎన్ని సమాచార విప్లవాలు వచ్చినా
సామాన్యుని సమాచార సౌకర్యం ఉత్తరమే కదా!

ఈసారి మా ఊరెళ్ళినప్పుడు
అటకమీద పాత మానుపెట్టెలో
మా తాత భద్రంగా దాచిపెట్టిన
ఉత్తరాలతీగను తెచ్చుకోవాలి!
నా మూలలను ఒకసారి తడుముకోవాలి!!

డా.గూటం స్వామి
(9441092870)
💐💐💐💐💐💐💐

1 కామెంట్‌:

  1. అద్భుతమైన భావవ్యక్తీకరణ సర్!
    ఉత్తరాలు ఉత్త కాగితాలు కాదు మన మధుర స్మృతులను గుర్తు చేసే మహత్తర సాధనాలు!!
    మీకు హార్ధిక శుభాభినందనలు సర్!!
    💐💐💐💐

    రిప్లయితొలగించండి