LATEST UPDATES

25, మే 2020, సోమవారం

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

☺️ మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా ☺️

(లాక్ డౌన్ అరవై రోజులు పూర్తైన సందర్భంగా)

ప్రభుత్వాలు చేతులెత్తేసాయ్!
ఎవరి ప్రాణం వారు కాపాడుకోవలసిందే!
"తాంబూలం ఇచ్చేసాం తన్నుకు చావండి"
ఇది నాటి అగ్నిహోత్రవదాన్ల మాట!
"లాక్ డౌన్ ఎత్తేసాం మీ చావు మీరు చావండి"
ఇది నేటి పాలకుల అంతరంగం!

కరోనాకు తాళాలు ఇచ్చేసారు
ఇక తన్నుకు చావవలసిందే!
ప్రభుత్వాలు ఆధాయాన్వేషణలో పడ్డాయి!
రైల్లు,బస్సులు, కార్లు,ఆటోలు
ఎప్పటిలాగే రోడ్లెక్కాయి!
కరోనా తో కాపురం వేగవంతమయ్యింది!

ఆహారం దొరకని పులి
ఆబగా పొంచి చూసినట్టు
మీ కోసం కార్పొరేట్ ఆసుపత్రులు
గ్రీన్ కార్పెట్ పరచి ఎదురుచూస్తున్నాయ్!
దొరికితే సున్నంలోకి
ఎముకలు కూడ మిగలవు!
మరికొన్నిరోజులుపోతే
ఆసుపత్రులేవి ఖాళీ ఉండకపోవచ్చు!

ఇకనుంచి అందరివి
అనుమానపు బ్రతుకులే!
ఇక అనుమానించడమే
నీ జన్మహక్కు అవుతుంది!
ఎవరికి కరోనా ఉందో తెలియక
సతమతమైపోవలసిందే!
నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి!

ఇకపై హెల్త్ బులెటిన్ లు ఉండకపోవచ్చు!
ప్రసారమాధ్యమాలు మన్నుతిన్న పాములౌతాయి!
నాయకుల మాటలు కోటలు దాటతాయి!

ప్రాణంపోతే తేలేము!
అప్రమత్తంగా లేకపోతే మనలేము!
చావో బ్రతుకో మీ చేతిలోనే!
మరణానికి కొంచెం దూరంగా
మరి కొంచెం దగ్గరగా అంతే!

ఇది కరోనా కాలం!
మీ తలరాతలు మారి'పోయేకాలం'!!

డా.గూటం స్వామి
(9441092870)
☺️☺️☺️☺️☺️☺️☺️☺️

23, మే 2020, శనివారం

నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

💐 నాకొక పాట కావాలి  💐
*********

నేను పాడుకునేందుకు
ఒక పాటకావాలి!
ఆ పాటలో కథం తొక్కించే
భాష ఉండాలి!
ఆ పాటలో ఉత్తేజపరిచే
పదాలు ఉండాలి!
యుగళ గీతంలా కాదు
యువకుల నెత్తురు మండేలా ఉండాలి!

నేను పాడుకునేందుకు
 ఒక పాట కావాలి!
ఆ పాటలో ఉప్పెంగే
సముద్రముండాలి!
వసంత కాల మేఘగర్జన ఉండాలి!
పర్వత శిఖరాల్ని తాకే
జలపాతాలుండాలి!
నెలవంకను తెంపుకొచ్చే తెగువుండాలి!

నేను పాడే పాటలో చరణాలు
జనరక్తంలో తడిసిన ఎర్రగులాబీలు!
ప్రజాస్వామ్య ముసుగులో
భ్రమలకు గురిచేస్తున్న భావాలు!
.అసత్యాలతో పబ్బం గడుపుతున్న
పాలకుల నీతిబాహ్యా చర్యలు!
దోపిడీ జలతారు ముసుగులో
సామాన్యుల కన్నీళ్ళను తాగే చర్యలు!
ఇవి మాత్రమే ప్రస్ఫుటించాలి!

పాటతోపాటు ఒక
ఆయుధం కూడా కావాలి!
ఆయుధం తో పాటు
ఉక్కులాంటి గుండె కూడా కావాలి!
రాజ్యాధికార కుంభస్తలంపై కొట్టాలి!

కష్టాలు కడతేర్చి కన్నీళ్లు తుడిచేసి
బాటసారులకు నేను భరోసా నవ్వాలి!
నెత్తురోడుతున్న రోడ్ల పై నిలబడి
మృత్యువు దాడిచేయకుండా రక్షణైపోవాలి!

నేను పాడుకునేందుకు
ఒకపాటకావాలి!
పసిపాపల మోములో
మొగ్గనై విరియాలి!
వలస బ్రతుకులకు
నేను రాగమైపోవాలి!
అనురాగమై మురియాలి!!

డా.గూటం స్వామి.
(9441092870)
👍👍👍👍👍👍👍👍

18, మే 2020, సోమవారం

ఇక అదేగా మిగిలింది! - రచన శ్రీ డా.గూటం స్వామి

ఇక అదేగా మిగిలింది! - రచన శ్రీ డా.గూటం స్వామి

☺️ ఇక అదేగా మిగిలింది! ☺️
*********
ఇప్పుడు రాత్రి పగలు
ఒక్కలాగే కనిపిస్తున్నాయి!
జీవితంలో ఒక మెరుపూ లేదు!
భవిష్యత్తు ను గూర్చిన భరోసా లేదు!
ఆలోచనలు చుట్టుముడుతున్నవేళ
అనునిత్యం అన్వేషిస్తున్న సమయాన
విహ్వలత తప్ప విహారాలు కొరవడ్డాయి!

ఏభైమూడురోజులు
లాక్ డౌన్ నేర్పిన పాఠంలో
తిరిగి చూసుకుంటే సాదించిందేమి లేదు!
అన్నీ సాధించానని కాలరెగరేసిన మనిషి
కరోనా ముందు బోర్లపడ్డాడు!

ఈ సమస్యకు పరిష్కారం దొరకని పాలకులు
రాయితీల రొట్టెముక్కలు విసిరి
పంచుకోమంటూ తమాషా చూస్తున్నారు!

అవి తమవరకు రావని తెలిసినా ప్రజలు
గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారు!
చేవ చచ్చిన యువత
సెల్ ఫోన్, ల్యాప్ టేప్లతో
కాలక్షేపం చేసేస్తున్నారు!
రేపటికి ఉంటామో,లేమో తెలియని మనిషి
కలల లోకం లో విహరిస్తున్నాడు!

రాజకీయ ఆటలో జోకరౌతున్న మనిషి
కరోనా కాటుతోనైనా బుద్ధి తెచ్చుకుంటే సరి...!
లేకపోతే కాలమే సమాధానం చెబుతుంది!
ఇక అదేగా మిగిలింది!!

డా.గూటం స్వామి
(9441092870)
☺️☺️☺️☺️☺️☺️☺️

15, మే 2020, శుక్రవారం

ఉత్తరాల తీగ - రచన శ్రీ డా.గూటం స్వామి


ఉత్తరాల తీగ - శ్రీ డా.గూటం స్వామి
💐 ఉత్తరాల తీగ 💐
********

ఇది ఇనుప వస్తువు కాదు
అదొక జ్ఞాపకాల మాల!
తలపుల దొంతర్లను
తన గుండెల్లో గుచ్చుకునే
అపురూప చెలికాడు!

గతంలో ప్రతి ఇంట ఉత్తరాల తీగకు
ఉత్తరాలు గుత్తులుగా పూసేవి!
ఆప్యాయతా పరిమళాలు వెదజల్లేవి!
అందంగా పలకరించేవి!
బంధుత్వాలను పెంచేవి!
స్నేహితులను కలిపేవి!
ఓదార్పును కలిగించేవి!
గతాన్ని కళ్ళముందు పరిచేవి

ఉత్తరాల తీగ ఒక గ్రంథాలయమే!
తాత అమ్మకు రాసిన ఉత్తరం
నాన్న నాయనమ్మకు రాసిన ఉత్తరం
అమ్మ నాన్న ల పెళ్ళికార్డు
ఉత్తరాల తీగలో పదిలం!!

అదొక పురాతన ఆత్మీయ నిధి!
ఒంటరి జీవుల పాలిట పెన్నిధి!
గత చరిత్రకు సాక్షీభూతి!

నేడు ఉత్తరాలు లేవు
ఉత్తరాల తీగలు లేవు!
రాసే తీరుబడి లేదు
చదివే ఓపిక లేదు!
సెల్ ఫోన్ సవ్వడులమధ్య
ప్రాణం లేని పలకరింపుల మధ్య
ఉత్తరాల తీగకు చోటెక్కడిది?
సంబంధాలు వ్యాపారమైన రోజుల్లో
ఉత్తరాలు రాసే అలవాటు ఎక్కడిది!

ఎన్ని సమాచార విప్లవాలు వచ్చినా
సామాన్యుని సమాచార సౌకర్యం ఉత్తరమే కదా!

ఈసారి మా ఊరెళ్ళినప్పుడు
అటకమీద పాత మానుపెట్టెలో
మా తాత భద్రంగా దాచిపెట్టిన
ఉత్తరాలతీగను తెచ్చుకోవాలి!
నా మూలలను ఒకసారి తడుముకోవాలి!!

డా.గూటం స్వామి
(9441092870)
💐💐💐💐💐💐💐

13, మే 2020, బుధవారం

పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది! - రచన శ్రీ డా.గూటం స్వామి

😢పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది!😢
********

ఎర్రని తూర్పు వాకిలి‌లో నిలబడి చూస్తే
పచ్చని మా పల్లె కనబడుతోంది!
మా పల్లె పక్కనే ఏరు కనబడుతోంది!
ఏటిఒడ్డన మా వాళ్ళ పాట వినబడతోంది!
మమ్మల్ని పంపండి సారూ!మేముండలేం ఇక్కడ!
ఎన్నాళ్ళు మాకీ చిత్రహింస!

బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన వాళ్ళం!
ఇప్పుడు మా బ్రతుకులు చిధ్రం అయ్యాయి!
తింటానికి తిండి కరువయ్యాక
ఇక్కడెలా ఉత్తినే ఉంటాము సారూ!
మమ్మల్ని మా ఊరికి పంపేయండి!
ఎన్నాళ్ళు మాకీ గుండెకోత!

ఇప్పుడు మా బతుకులు
నెత్తురు ముడుగులు!
ఇప్పుడు మా జీవనం
కన్నీటి కడలి తరంగం!
ఇప్పుడు మా ఆలోచన లు
గురితప్పిన గుళకరాళ్ళు!
ఇప్పుడు మా ముందున్నదంతా రక్తసిక్త జీవితం!
ఇప్పుడు మా మార్గమంతా అపజయాల వ్రణాలే!
ఇప్పుడు మా పోరాటమంతా
రేపటిని లోతుగా తవ్వుకోవడం కోసమే!

కాలం ప్రవహిస్తూనే ఉంటుంది!
కాలం పురోగమిస్తూనే ఉంటుంది!
మా వలసకూలీలు మాత్రం
ఇక్కడే ఆవిరైపోవాలా సారూ!

సూర్యాస్తమయాలు ఎప్పుడూ
ఎర్రగానే ఉంటాయి!
ఈ మధ్య సమయంలోనే
జనం పదునెక్కుతారు!
ఎర్రటి తూర్పు వాకిట్లో నిలబడి చూస్తే
పల్లె దిక్కు కనబడుతోంది!
ఇక తెగించటమే తరువాయి!

(లాక్ డౌన్ నేపథ్యంలో వలసకూలీల పాట్లు టి.వి లో చూసి వారి మనో వేదనను కవిత్వీకరించే ప్రయత్నం లో)

డా.గూటం స్వామి
(9441092870)
😢😢😢😢😢😢😢😢

12, మే 2020, మంగళవారం

వలస విలాపం! - రచన డా.గూటం స్వామి

😢  వలస విలాపం! 😢
**********************
వలసకూలీల
సర్కాస్ ఫీట్లు చూసి
మానవత్వం సిగ్గుతో చచ్చిపోయింది!
తినడానికి బుక్కెడు బువ్వ
ఉండటానికి రవ్వంత చోటు
సొంతూరు కి వెళ్ళడానికి
కావలసిన ఏర్పాట్లు
ఇవేమి చేయలేని పాలకుల తీరుకు
భరతమాత భోరున విలపిస్తోంది!

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను
విమానాల్లో తరలిస్తున్న పాలకులు
దేశాభివృద్ధి లో పాలుపంపులున్న
వలసకూలీల ను 
గాలికొదిలేయడం ఏమిటని
మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు!

వాళ్ళు మణులడిగారా?
మాన్యాలు అడిగారా?
మా ఊళ్ళకి మమ్మల్ని పంపండి అంటుంటే
మీనమేషాలు లెక్కిస్తారెందుకు?

కరోనా తెచ్చింది విదేశాలనుంచి వచ్చినవారే!
దేశ పరిస్థితి ని చిధ్రంచేసిందీ వారే!
అయినా వలసకూలీలంటే
ఎందుకో పాలకులకు అంత అలుసు?

పాలకులారా!నాయకులారా!
వారి కోపం కట్టలు తెంచుకోకముందే
వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి!
వారి ఉసురు మీకు తగలకముందే
వాళ్ళ ఇంటికి వాళ్ళు ను చేర్చండి!
దేశం మీ రొక్కరిదే కాదు!
దేశమంటే ఇలాంటి వారితో కలిపే!!

(లారీలెక్కి ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్న వలసకూలీల ఫోటో చూసి బాధతో)

డా.గూటం స్వామి
(9441092870)
😢😢😢😢😢😢