💐 నాకొక పాట కావాలి 💐
*********
నేను పాడుకునేందుకు
ఒక పాటకావాలి!
ఆ పాటలో కథం తొక్కించే
భాష ఉండాలి!
ఆ పాటలో ఉత్తేజపరిచే
పదాలు ఉండాలి!
యుగళ గీతంలా కాదు
యువకుల నెత్తురు మండేలా ఉండాలి!
నేను పాడుకునేందుకు
ఒక పాట కావాలి!
ఆ పాటలో ఉప్పెంగే
సముద్రముండాలి!
వసంత కాల మేఘగర్జన ఉండాలి!
పర్వత శిఖరాల్ని తాకే
జలపాతాలుండాలి!
నెలవంకను తెంపుకొచ్చే తెగువుండాలి!
నేను పాడే పాటలో చరణాలు
జనరక్తంలో తడిసిన ఎర్రగులాబీలు!
ప్రజాస్వామ్య ముసుగులో
భ్రమలకు గురిచేస్తున్న భావాలు!
.అసత్యాలతో పబ్బం గడుపుతున్న
పాలకుల నీతిబాహ్యా చర్యలు!
దోపిడీ జలతారు ముసుగులో
సామాన్యుల కన్నీళ్ళను తాగే చర్యలు!
ఇవి మాత్రమే ప్రస్ఫుటించాలి!
పాటతోపాటు ఒక
ఆయుధం కూడా కావాలి!
ఆయుధం తో పాటు
ఉక్కులాంటి గుండె కూడా కావాలి!
రాజ్యాధికార కుంభస్తలంపై కొట్టాలి!
కష్టాలు కడతేర్చి కన్నీళ్లు తుడిచేసి
బాటసారులకు నేను భరోసా నవ్వాలి!
నెత్తురోడుతున్న రోడ్ల పై నిలబడి
మృత్యువు దాడిచేయకుండా రక్షణైపోవాలి!
నేను పాడుకునేందుకు
ఒకపాటకావాలి!
పసిపాపల మోములో
మొగ్గనై విరియాలి!
వలస బ్రతుకులకు
నేను రాగమైపోవాలి!
అనురాగమై మురియాలి!!
డా.గూటం స్వామి.
(9441092870)
👍👍👍👍👍👍👍👍
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి