మర్యాద రామన్న కథలు
సూరయ్య - పేరయ్య
రామాపురం లోనే సూరయ్య , పేరయ్య అనే స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకటే తరగతి, ఒకటే పాఠశాలలో చదవడం చేత స్నేహముగా ఉండేవారు. చదువులు అయిపోయిన తర్వాత ఇద్దరు చెరొక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. సూరయ్య ఇనుము వ్యాపారం చేసేవాడు. కాని మంచిగా అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. నిజాయితీగా వ్యవహరించేవాడు. అలాగే పేరయ్య పేరు తగ్గట్టుగా పేరాశ ఎక్కువ. పేరయ్య కిరానా దుకాణం నిర్వహించేవాడు. ఎదుటివారి అవసరాన్ని బట్టి ధర చెప్పేవాడు.
ఎవరి వ్యాపారం వారిదైనా ఇద్దరూ తరచూ కలిసే కొనుగోలుకై పట్టణానికి వెళ్ళి కొనుగోళ్ళు చేసుకుని తిరిగి కలిసే వచ్చేవారు. సూరయ్యకు ఇద్దరు కుమార్తెలు. పేరయ్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఒకరోజు సూరయ్య కుటుంబంతో సహా తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నాము. నా వద్దనున్న ఇనుము ఇంటి ముందు వదిలేసి వెళ్తే,తిరిగి వచ్చేసరికి ఎవరైనా దొంగతనము చేస్తారేమో మీ ఇంటి ఆవరణలో పెట్టనా ? అని పేరయ్యను అడిగాడు. దాందేముంది మా ఇంటి ప్రక్కన గల స్థలంలో వేసుకొని నిశ్చింతగా వెళ్ళి రమ్మని పేరయ్య చెప్పాడు. సూరయ్య ఒక మంచి రోజు చూసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు.
తీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, “అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?” అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. “ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?” అడిగాడు పేరయ్య.
“పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది” అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు చెప్పుకుంటూ, అందరితోనూ “ధర్మప్రభువు మర్యాద రామన్న” అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి