LATEST UPDATES

6, మే 2016, శుక్రవారం

బలపం (Balapam)

This is a simple translate button.

     రాధ పలక మీద అ ఆ లు దిద్దుతోంది.
     దిద్దుతూ గట్టిగా పలుకుతోంది.
     అంతలో రాధని వాళ్ళమ్మ పిలిచింది. రాధ పలక, బలపం పక్కన పెట్టింది. అమ్మ దగ్గరకు పరుగు తీసింది.
     అప్పటిదాకా రాధ వేళ్ళ మధ్య ఉన్న బలపం ‘ అమ్మయ్య’ అని గాలి పీల్చుకొంది. ఈ పాపను వాళ్లమ్మ ‘రాధ’ అని కేక వేసింది. ఆ పాప పేరు రాధ అయితే మరి నా పేరు? అనుకొంది బలపం.
     బలపానికి ఎంతసేపు ఆలోచించిన తన పేరు గుర్తు రాలేదు.
     రాధ వచ్చేలోగా తన పేరు తెలుసుకు రావాలని బయలు దేరింది బలపం.
     బలపానికి గబగబా నడిచి వెళుతున్న ఒక టీచర్ ఎదురయ్యాడు.
     ‘‘సార్ సార్! నా పేరు మరచి పోయాను. ఒకసారి గుర్తు చేయరా?’’ అని అడిగింది బలపం.
     ‘‘నాకు ఇప్పటికే బడికి ఆలస్యం అయిపోయింది. పిల్లలకంటే ముందుగానే టీచర్ బడిలో ఉండాలి. ఇప్పుడు కాదు తర్వాత కనబడు’’ అంటూ వెళ్ళి పోయాడు టీచర్.
     బలపం దగ్గరలో ఉన్న పాఠశాల వైపు నడుస్తోంది. దానికి రోడ్డు మీద ఒక కనిపించింది. బలపం పుస్తకం దగ్గరకు వెళ్ళింది.
     ‘‘ మా రాధమ్మ అ ఆ లు దిద్దుతుంటే నా పేరు మర్చిపోయాను. నా పేరు ఏమిటి?’’ అని అడిగింది బలపం.
     ‘‘నువ్వు యిలా రోడ్ల మీద పడి అందరినీ అడిగే బదులు మీ రాధనే అడగవచ్చు కదా?’’ అంది పుస్తకం.
    బలపానికి ఆ ఆలోచన నచ్చింది. వెంటనే ఇంటికి వెళ్ళింది. ఏం తెలీనట్లు పలక పక్కనే కూర్చింది.
     ‘‘ఎక్కడికి పోయావు’’ అడిగింది పలక.
     ‘‘ నాపేరు మర్చిపోయా! తెలుసుకొందామని వెళ్ళాను’’ అంది.
     నన్నడిగే నే చెప్పేదాన్ని కదా! నీ పేరు బలపం. నా పేరు పలక. మనిద్దరి సహకారం లేనిదే ఎవరూ అ ఆ లు కూడా నేర్చుకోలేరు’’ అంది పలక.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి