అరవై సామెతలతో.. అందమైన కధ.
"కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.." అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి.. " ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..
"ఏం చెప్పమంటారు.. " చిలక్కి చెప్పినట్లు చెప్పాను" మీకు.. విన్నారా.. మీ అక్కగారి" నోట్లో నువ్వు గింజ దాగదు " అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందే గా
"తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని" మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.." మన బంగారు మంచిదవాలి కానీ".. ఇక దీనికి పెళ్ళి అయినట్టే.." అంది సుమతి.
"ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..
"అనుమానం.. పెను భూతం.." అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.
"ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు" ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు."ఆడలేనమ్మ మద్దెల గోల" లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.
"ముంజేతి కంకణానికి అద్దమేల".. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. " చెవిలో జోరీగ లాగా " నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.
"ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ" కడుపే కైలాసం.. ఇల్లే వైకుంఠం" నా మాట ఎప్పుడు పట్టించుకున్నారు కనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అనిగానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి నిష్ఠూరం గా..
"ఓసి, పిచ్చిదానా.. " కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ".. ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..
"అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా " తల ప్రాణం తోకకివస్తోంది" . " చెవినిల్లు కట్టుకుని పోరినా" వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి
"గుండెల మీద కుంపటి" దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి." అంది సుమతి.
"వాడినా.. వాడు" ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయేరకం." వాడినుంచి నేను సహాయం ఆశించడం "ఇసుకలో నూనె పిండినంత".. అయినా వాడు
"అయినవాళ్ళకి ఆకులు.. కాని వాళ్ళకి కంచాలు" పెట్టే తరహా.. వాడిని చచ్చినా అడగను." అన్నాడు కాంతారావు.
"అయ్యో.." అలా అనుకుంటే ఎలా అండీ..
"వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు" ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత" అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకుందాం." అంది సుమతి.
"వాడి గురించి "అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు" చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే..
"తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే" నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా..
"హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు.."
"మేనరికమా... లేదన్నయ్యా.. నీకు తెలీనిదేముందీ.. "పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు" అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... "మొక్కై వంగనిది మానై వంగునా" వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనే వుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు" వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..." అన్నాడు కాంతారావు..
ఆ ఫోను లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..
"ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య?" అంది సుమతి.
"నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. "మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట" ఇలాంటి వాడే..."కళ్ళు నెత్తికెక్కాయి" వాడికి."కడుపు నిండిన బేరాలూ.. కడుపు నిండిన మాటలూ" వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని "గంతకి తగిన బొంతని" వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు."* *"ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు" అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను" అన్నాడు కాంతారావు కోపంగా..
"అయ్యో.. అంతమాటన్నారా.. అయినా..
"జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి" పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... "తలని తన్నేవాడొకడుంటే.. తాడిని తన్నేవాడొకడుంటాడు." ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. "ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు".. మీరేం బాధ పడకండి.. "మనసుంటే మార్గముంటుంది".. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో... "విత్తం కొద్దీ వైభోగం" పైగా మన దురదృష్టం "గోరు చుట్టు మీద రోకలి పోటు" లాగా పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.." అంది సుమతి.
మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.
"ఏంటోయ్.. "గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ".... కొంపతీసి ఉదయం నేను "నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను".. అన్నారు.. చమత్కారంగా..
"పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. "ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి" అంది. "ముద్దొచ్చినపుడే చంకకెక్కాలి" అనుకుంది సుమతి.
బుద్ధి గా చేతులుకట్టుకుని..ఆ.. ఇప్పుడు చెప్పు" అన్నాడు కాంతారావు.
"నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా.. మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా
"చిదిమి దీపం పెట్టుకునేలా వుంది" అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. "అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది" అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి
ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... "వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు" అనిపించింది. "ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో" మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.
"నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం." అన్నాడు కాంతారావు.
రేపటిదాకా ఎందుకూ..
"శుభస్య శీఘ్రం..." ."తలుచుకున్నపుడే తాత ప్రయాణం" అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను."మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది".. లేవండి.. లేవండి.." అంది సుమతి.
"లేడికి లేచిందే పరుగు".. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.
"గంతకి తగిన బొంత" అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనిపించాలి. "ఇనుము విరిగినా అతకవచ్చుకానీ.. మనసు విరిగితే అతకలేము..".. అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు." అన్నాడు కాంతారావు.
"పోన్లెండి.. "ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి" వదిలేయండి.. ఆయనని.. "గురివింద గింజ తనకింద నలుపెరగదట" మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.
వెళ్లే దారిలో..."ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషం తో.. నానా మాటలు అన్నారు.."ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి".. ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయిసంబంధాలకి పోతున్నారూ.. "కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది" అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ..
"శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు... ఏది ?" అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు" అంది సుమతి.
"పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.."గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు" పట్టించుకోకు..."గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం" తప్ప దానికి వేరే పనీపాటా లేదు.
"పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు" అది అలా వాగుతూనే వుంటుంది. వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.." అంటూ భార్య ని ఓదార్చాడు.
పెళ్లి చూపులు అయిపోవడం.. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమోత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద.. కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.
పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ..
"అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా" అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి.
ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.
ఇంతలో ఫోన్మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ... పెదనాన్న కొడుకు.... "ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట. సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.." అన్నాడు..
"ఆ.. అన్నయ్యా... "దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట".. అర్ధమయిందనుకుంటాను.." అంటూ ఫోన్ పెట్టేసాడు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి