సామెత కథ
‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి’
పూర్వ కాలంలో, వ్యాపారం రెండు విధాలుగా జరెగేది. చిన్న చిన్న వ్యాపారులు వస్తువులను బళ్ళమీద ఒక ఊరి నుండి ఇంకొక వూరికి తిప్పుతూ చేసే చిల్లర వస్తువుల వ్యాపారం ఒకటి. రెండవ రకం, బాగా ధనవంతులైన వ్యాపారులు ఓడల మీద సరుకులను విదేశాలకు తీసుకువెళ్ళి చేసే వ్యాపారం. దైవం అనుకూలించనప్పుడు, అదృష్టం కలిసిరానప్పుడు, సముద్ర యానంలో సంభవించిన ఏ తుఫాను లోనో సరుకులను తీసుకెళుతూండిన ఓడలు గల్లంతై పెద్ద పెట్టున నష్టపోయి తెల్లవారేసరికల్లా ధనవంతుడు దరిద్రుడై మిగలడం, దేశంలో పొరుగూళ్ళలో చేస్తూండిన చిన్న సరుకుల వ్యాపారమే దైవం అనుకూలించడం వలన బాగా కలిసొచ్చి కొద్ది రోజుల్లోనే బాగా ధనవంతుడై బళ్ళలో చేస్తూండిన వ్యాపారం వృధ్ధి చెంది ఓడల కెక్కి విదేశాలకు మళ్ళడం లాంటి సందర్భాలూ సన్నివేశాలూ నిజజీవితంలోనివి కథలలో కెక్కి కనిపిస్తూంటాయి.
‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న సామెత ఇలాంటి దృష్టాంతాలనుంచి పుట్టిందే. ఇందులో, కాలం కలిసొస్తే బండి ఓడవడం, కలిసి రానప్పుడు ఓడ బండవడం సరియైనది. అయితే, సుమతీ శతక కర్త అయిన బద్దెన మంత్రి ఈ సామెతను కలిమి లేముల్లాగా ఓడలు బళ్ళ మీదా, బళ్ళు ఓడల మీదా వస్తాయి అంటూ కలిమి లేముల ప్రసక్తి తెచ్చి వాటి రాకపోకలను అన్వయించడానికి చేసిన ప్రయత్నంలో, అన్వయం అంత బాగా కుదరక పోయినప్పటికీ, లోకం సరిపెట్టుకుంది. కానీ, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ గారు దీని అర్ధాన్నే పూర్తిగా మార్చి వేశాడు. కష్టాల్లో పరస్పర సహకారం అన్న అర్ధంలో దృష్టాంతంగా దీనిని వాడాడు. సరిపెట్టుకుందామని చూసినా సరే, సరిగా అన్వయం కుదరని సందర్భం ఇందులోది. నీటిపై ఓడలో బళ్ళు ప్రయాణించడం, నేల మీద బళ్ళపై ఓడలు ప్రయాణించడం లోకానుభవానికి దృష్టాంతాలుగా సాధారణంగా దొరికే సన్నివేశాలు కావు. అందువలన, సుమతీ శతకంలోనూ, భాస్కర శతకంలోనూ వాడబడిన రూపాలు సరియయినవి కావు. అన్వయానికి కుదరని రూపాలని తేలుతుంది.
లోకానుభవాలను సామెతల రూపంలో నీతి బోధకాలుగా చెప్పే ప్రక్రియలో, అతి తక్కువ మాటలలో చెపాల్సిన విషయాన్ని చెప్పడానికి వీలుగా మాటల్ని వడపోసి వడపోసి కూర్చగా అయినవే సామెతలు. వాటిలో వ్యర్ధ పదాలూ, అర్ధ రహితమైన మాటలు సాధారణంగా ఉండవు. ప్రతి మాట వెనుకా ఏదో బలమైన కారణం, అర్ధవంతమైన అనుభవ సారం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఈ సామెత ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న రూపమే అసలైనదీ, లోకానుభవ సిధ్ధమైనదీను!
సుమతీ శతకము లోని పద్యం
ఓడల బండ్లును వచ్చును
ఓడను నాబండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమిలేమి వసుధను సుమతీ!”
తెలుగులో ఈ సామెత భాస్కర శతకం రచించ బడిన రోజుల నుంచీ ఉంది. దీనికి నిదర్శనం భాస్కర శతకంలోనే ఉంది. భాస్కర శతకంలో మూడవ పద్యం:
“అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్క రొక్కరి
న్మక్కువ నుధ్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!”
బేధమల్లా, ఈ పద్యంలో భాస్కర శతకకర్తగా భావింప బడుతూన్న మారయగారి వెంకయ ఇప్పుడు వాడబడుతూన్న ‘ఓడలు బళ్ళు అవుతాయి’ అన్నరూపంలో కాకుండా, ‘ఓడల బండ్లు వచ్చుట’ అన్న రూపంలో వాడాడు. అర్ధం విషయంలో సందేహం లేకుండా స్పష్టత కోసంగా ‘నీటిలో, మెరక’ అన్న పదాలు గూడా వాడాడు. దీనిని బట్టి చూస్తే ఈ సామెత పూర్వం ‘ఓడలు బళ్ళు లాగుతాయి, బళ్ళు ఓడలు లాగుతాయి’ అన్న రూపంలో ఉండి, రాను రాను ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి’ అని మారినట్లుగా కనిపిస్తుంది.
భాస్కర శతకంలో ఈ సామెత వాడబడిన సందర్భములో విశదమయ్యే అర్ధానికీ, ఇప్పుడు వాడ బడుతూన్న అర్ధానికి కూడా తేడా కనిపిస్తుంది. భాస్కర శతకంలో ఇది ‘ఆపత్కాలంలో పరస్పర సహకారం’ అన్న అర్ధంలో వాడబడి కనిపిస్తూండగా, ఇప్పుడు దానికి సంబంధం లేని అదృష్టంతో తారు మారు కాగలిగే పరిస్థితులకు సూచకంగా వాడబడుతోంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి