సామెతల కథలు
ఈగలమోత
పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు. పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది విచిత్రసేనుడికి ఉపశమనం మాత్రమే కలిగిస్తోంది. అంతఃపురంలోని రాజపరివారమంతా ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోసాగారు.
వంద ఈగల్ని చంపితే ఒక బంగారు వరహాను బహుమతిగా ప్రకటించాడు విచిత్రసేనుడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. పనీపాట లేని వాళ్ళు తప్ప ఇతరులు ఈగల్ని చంపడానికి ఆసక్తి చూపలేదు. దాంతో.. ’ కోటనుంచి ఈగల్ని తక్షణమే తరమగలిగిన వారికి లక్షవరహాలు బహుమతి ఇవ్వబడుతుందని' దండోరా వేయించాడు.
మరుసటిరోజు కిరీటి అనే యువకుడు సభకు వచ్చాడు. ఈగల్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్న సంగతి విచిత్రసేనుడికి తెలియపరిచాడు. "నీవు ఏం చేసినా, ఎలా చేసినా... ఈగలమోత మాత్రం ఇక వినపడకూడదు. నీ పనిని ప్రారంభించు." అని రాజు ఆదేశించాడు. సభలోంచి బయటకు వెళ్ళిన కిరీటి ఓ అర్ధగంట తర్వాత తిరిగివచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికే ఈగలన్నీ బయటకు జారుకున్నాయి. సభలో ఒక్కటి కూడా లేదు! రాజు, సభికులు ఆనందం, ఆశ్చ్యర్యం కలగలిపిన ముఖాలతో ఉన్నారు.
"ఏం మంత్రం వేశావు? లేక ఏదైనా మాయ చేశావా?" విచిత్రసేనుడు అడిగాడు.
"ఇందులో మాయమంత్రాలు ఏమీలేవు... ఏదో నాకున్న కాస్త లోకజ్ఞానఫలితం" వినయంగా అన్నాడు కిరీటి.
"ఎలా చేసినా పెద్ద ఇబ్బందిని తొలిగించావు. ఇవిగో లక్ష వరహాలు.." అంటూ ధనం మూటను ఇవ్వబోయాడు విచిత్రసేనుడు.
"రాజా.. మీ బహుమతిని స్వీకరించలేక పోతున్నందుకు నన్ను క్షమించండి. ఈగలు మళ్ళీ కోటలోకి వచ్చి గతంలో లాగానే మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రస్తుతం నేను వాటిని కోట బయటికి మాత్రమే తీసుకెళ్ళగలిగాను. నాది శాశ్వతమైన పరిష్కారం కాదు."
"ఇంతకీ ఏం చేశావు?" గద్దించి అడిగాడు విచిత్రసేనుడు.
"పెద్ద బెల్లం ముద్దను కోట బయట ఉంచి వచ్చాను. దాంతో ఈగలన్నీ బెల్లం చుట్టూ చేరాయి. ఆ ముద్దను పూర్తిగా జుర్రుకోగానే కోటలోకి రావడం ఖాయం."
ఆ మాటలు వినగానే విచిత్రసేనుడికి కోపం తారాస్థాయికి చేరింది.
"మేము కోరింది శాశ్వతపరిష్కారం, ఇలాంటి చిట్కాలు కాదు. సమయం వృధా చేస్తే నీకు కారాగారశిక్ష తప్పదు." ఉచ్ఛస్థాయి గొంతుతో చెప్పాడు.
"శాశ్వతపరిష్కారం మీదగ్గరే ఉంది. విచక్షణ లేని ప్రజలు రాజ్యాన్ని చెత్తకుప్పలు, ఎరువుదిబ్బలుగా మార్చారు. వాటివల్ల పెరిగిన ఈగలు ఎన్నో రోజుల నుండి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోసాగాయి. పలుసార్లు మీ దృష్టికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటి ప్రభావం అంతఃపురానికి పాకిందనే దండోరా విన్నప్పుడు సమస్య పరిష్కార మవుతుందని సంతోషించాం. రాజ్యపరిస్థితిని పూర్తిగా తెలిపేందుకే వచ్చానుకాని, బహుమతి కోసం కాదు." వివరంగా చెప్పాడు కిరీటి.
విచిత్రసేనుడికి జ్ఞానోదయమైంది. మూలకారణాన్ని తొలగించాలే గాని, ఉపశమన చర్యల వల్ల సమస్య పరిష్కారం కాదని గ్రహించాడు. కిరీటిని మంత్రిగా నియమించుకుని రాజ్యాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనిని అప్పగించాడు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి