"టిట్టిభం అనేది చాలా చిన్న పక్షి జాతి. దీన్నే లకుముకి పిట్ట అంటాం.
టిట్టిభ జాతికి చెందిన ఓ ఆడ పక్షి ఓసారి సముద్రతీరంలో గుడ్లు పెట్టింది...
అవి బిడ్డలుగా మారాలని ఎదురుచూస్తోంది....
ఓ రోజున ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఇంతలో ఉద్ధృతంగా వచ్చిన సముద్రపు అల ఆ గుడ్లను సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది.
ఇంతలో ఆ పక్షి తిరిగొచ్చింది... చూస్తే గుడ్లు లేవు. కట్టుకున్న కలలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి..
తీవ్రంగా ఆవేదన చెందిందా పక్షి..
తాను చూస్తే ఇంత... ఆ జలరాశేమో అనంతం... తన బిడ్డలకు ఎలాగైనా లోకం వెలుగు చూపించాలి. సముద్రం నుంచి తన గుడ్లు బయటకు తీసుకురావాలనుకుందా పక్షి. తన ముక్కుతో సముద్రపు నీటిని పీల్చి ఒడ్డున వదిలిపెట్టింది. ఇలా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తే తన గుడ్లు బయటకు వస్తాయని ఆ పిట్ట ఆలోచన. ఓ బుల్లి పిట్టకు సముద్రపు నీరంతా తోడటం సాధ్యమయ్యే పనేనా? పిట్టకు మాత్రం ఈ సందేహం రాలేదు. దాని మనసులో ఉన్నది ఒకే లక్ష్యం. తన బిడ్డలను లోకానికి పరిచయం చేయడం, నీరు తోడుతూనే ఉంది.
సాటి పక్షులు ఇదంతా చూశాయి. కొన్ని పక్షులు నిరాశ పరిచాయి. మరికొన్ని తోటి పిట్టకు సాయం చెయ్యాలని తామూ నీరు తోడటం ప్రారంభించాయి. క్రమంగా వేలాది పక్షులు ఈ పనికి జతకూడాయి. క్రమంగా ఈ విషయం పక్షిరాజు గరుత్మంతుడి వరకూ వెళ్ళింది. రాజాజ్ఞతో లక్షలాది పక్షులు సముద్రపు నీరు తోడటం ప్రారంభించాయి. తన తీరంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని సముద్రుడు గుర్తించాడు. విషయం తెలుసుకుని, తన గర్భంలో ఉన్న గుడ్లను తీసుకువచ్చి లకుముకి పిట్టకు అందించాడు. పిట్ట చిన్నదే. కానీ దాని సంకల్ప బలానికి సముద్రుడే తలవంచాడు."
అలాగే ఇంటి నుండి ఏ ఒక్కరు బయటకు వెళ్ళకూడదు అనే సంకల్ప బలానికి కరోనా వైరస్ ఖచ్చితంగా తలవంచుతుంది. కనుక అందరు దీనిని ఒక యఙ్ఞంగా భావించి బయటకు వెళ్ళకుండ, పొంచి ఉన్న ప్రమాదం నుండి రక్షించుకోవడం లో అందరమూ భాగస్వాములం అవుదాం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి