తెనాలి రామకృష్ణ కథలు - 18
అత్యంత మూర్ఖుడు
కృష్ణదేవరాయల మహారాజు ఆస్దానంలో ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరిగేది. పాల్గొనే వారందరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఆ సంవత్సరానికిగానూ అత్యంత ముర్ఖుడు అనే బిరుదునిచ్చి 5000 వరాహాలు బహుమానంగా అందజేసేవారు. ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి 5000 వరాహాలు ఎగరేసుకు పోయేవాడు. ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్ధానకవులు, అధికారులు అతని వద్ద పనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు. ఆ కుర్రాడు అలాగే చేశాడు.
పోటీ అయిపోయిన తర్వాత రామలింగడు సభకు చేరుకున్నాడు. "ఇదేమిటి రామలింగా! నీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావు" అని అడిగాడు కృష్ణదేవరాయలు. "ప్రభూ! నాకు వంద వరహాలు అవసరమయ్యాయి. వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది" అని జవాబిచ్చాడు రామలింగడు.
"నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే 5000 వరహాలు సంపాదించేవాడివి కదా! వంద వరహాలు కోసం 5000 వరహాలు కాదనుకున్నావు" అన్నాడు మహారాజు. "ప్రభూ! నేనొక పెద్ద మూర్ఖుడిని" అన్నాడు రామలింగడు. బదులుగా మహారాజు "నువ్వు అత్యంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనే లేదు" అన్నాడు.
"అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట!" అని ఎగిరి గంతేశాడు రామలింగడు. అప్పటికి గాని రాజుగారికి తను నోరుజారానని అర్ధం కాలేదు. కాని రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు. మరోసారి రామలింగడే అందరికన్నా తెలివైన మూర్ఖుడని రాయలవారి ఆస్ధానంలో నిరూపితమైంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి