LATEST UPDATES

4, ఏప్రిల్ 2015, శనివారం

Baala Bheemudu (బాల భీముడు) 3rd Class Telugu

This is a simple translate button.


     ఒకనాడు కుంతీదేవి తన కొడుకును భుజంమీదికి ఎత్తుకొని పూలతోటలోకి వెళ్ళింది. నడుస్తూ ఉంటే కాలి కొక రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతుల పట్టు తప్పింది. పిల్లవాడు కింద పడ్డాడు. ‘‘అయ్యో!’’ అని కుంతీదేవి బిగ్గరగా అరిచింది. రాజమందిరంలోని వాళ్ళందరూ పరుగెత్తుతూ వచ్చారు. ‘‘అయ్యో ... నా చిట్టితండ్రి కేమయిందో!’’ అంటూ కుంతీదేవి కంగారుపడుతూంది. బాలుణ్ణి కుంతీదేవి దుఃఖంతో ఆత్రుతగా ఎత్తుకుంది. కుంతీదేవి చేతుల్లోనుంచి మరోసారి జారి  ఆ బాలుడు అక్కడే ఉన్న పెద్ద బండపైన పడ్డాడు. ఆశ్చర్యం! ఆ బాలుడికి ఏమి కాలేదు. బాలుడు పడ్డ బండ మాత్రం పగిలి ముక్కలైంది. బాలుడు మాత్రం హాయిగా నవ్వుతూ ఉన్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తల్లి కుంతీదేవి ఆ బాలుణ్ణి ఎంతో మురిపెంతో ముద్ధాడింది. ఆబాలుడే మన బాలభీముడు.

     ‘‘బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా!’’ అంటూ చుట్టుపక్కలవాళ్ళు ముక్కున వేలు వేసుకున్నారు. పెద్దవాడైతే కొండల్నే పిండిచేసే ఘనుడౌతాడని పొగిడారు. తండ్రి పాండారాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని  చూసి మురిసిపోయాడు.

    పాండురాజుకు గల ఐదుగురు కుమారులలో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు భీముని తమ్ముళ్ళు. ఈ ఐదుగురినీ పంచపాండవులంటారు. పాండురాజు అన్నయ్య ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు. వీరినే కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు.

   బాల్యంలో కౌరవులు, పాండవులు కలిసి చదువుకునేవారు. ఆడుకునేవారు. భీముడు ఆటల్లో కౌరవులందరినీ ఓడించేవాడు. ఆటల్లో బాగా అలిసిపోయి ఆకలి ఆకలి అంటూ మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. ఇంట్లో ఉన్న పదార్థాలను భీముడు కడుపునిండా తినేవాడు. మళ్ళీ చదువుకు, ఆటలకు పోయేవాడు.

      ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు కోసుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కుతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీముడికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టుమీద ఉన్న కౌరవబాలలు పండ్లలాగా కిందరాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. భీముడు వారందరినీ చితకబాదాడు. రోషంతో కౌరవులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భీముడిపైన ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు.  కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిమీద చాలా కోపం పెంచుకున్నాడు.

      ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడం దుర్యోధనుడు చూశాడు. దురాలోచనతో అతనికి విషాహారం తినిపించాడు. భీముడు స్పృహ కోల్పోయాడు. కౌరవులు అందరూ తాళ్ళతో భీముణ్ణి బంధించారు. ఎత్తుకెళ్ళి నదిలో పడవేయాలనుకున్నారు.  కానీ అందరూ కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ వెళ్ళారు. నదిలోకి తోశారు. నదిలోని విషసర్పాలు భీముణ్ణి కాటు వేశాయి. ఆ విషంవల్లకూడా అతనికెటువంటి అపాయం కలగలేదు. కొంతసేపటికి భీముడికి తెలివి వచ్చింది. కట్లు తెంపుకొని బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాడు. 

      ఒకరోజు గురువు ద్రోణాచార్యులవారు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టారు. అందులో దుర్యోధనుడికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లోకూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. తల్లి, ‘‘నాయనా! నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు,’’ అని హితవు చెప్పింది. ‘‘అలాగేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్ళను శిక్షిస్తాను, మంచి వాళ్ళను రక్షిస్తాను’’ అన్నాడు భీముడు. 

1 కామెంట్‌: