LATEST UPDATES

4, ఏప్రిల్ 2015, శనివారం

Dharithappina Balu (దారితప్పిన ‘బాలు’) 3rd Class Telugu

This is a simple translate button.



      ఒక అడవిలో ‘బాలు’ అనే ఎలుగుబంటి పిల్ల ఉండేది. అది ఒక రోజున దాని స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడడం మొదలుపెట్టింది. బాలు ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని వాళ్ళ దగ్గరనుంచి చాలా దూరం వచ్చేసింది. తన స్నేహితులు ఎంతసేపటికి రాకపోయేసరికి బండ వెనక దాగిఉన్న బాలు ఇవతలికి వచ్చింది. స్నేహితులను పిలిచింది. ఎవరూ పలకలేదు. అలా స్నేహితులను వెదుక్కుంటూ బాలు అడవి దాటి రోడ్డు మీదకు వచ్చింది. 

      రోడ్డుమీద కార్లు, మోటరు సైకిళ్ళు, బస్సులు రయ్ ....... రయ్ మని పోతున్నాయి. రోడ్డుపైన ఆగి ఉన్న బస్సు ఒకటి బాలుకు కనిపించింది. బాలు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. దానికి ఆశ్చర్యంగా ఉంది. బాలు మెల్లగా బస్సు దగ్గరకు వచ్చింది. బస్సును అంత దగ్గరగా ఎప్పుడూ చూడని బాలుకు అంతా వింతగా అనిపించింది. బస్సులోకి చూద్దామని బస్సు కిటికీ ఊచలు పట్టుకొని లోపలికి తొంగిచూసింది. లోపల చాలా మంది మనుషులు కూర్చుని ఉన్నారు. పిల్లలున్నారు. పెద్దవాళ్ళున్నారు. బస్సుముందరినుంచి డుర్..... డుర్..... అని శబ్దం వస్తోంది. అక్కడ చక్రం ముందు ఒకతను కూర్చొని కనిపించాడు. అతని ముందున్న అద్దంలోనుంచి ముందు రోడ్డంతా పొడవుగా కనిపిస్తోంది. అతను తల తిప్పి బాలును చూశాడు. అంతే -- ఒక్క ఉదుటున బస్సులోనుంచి బయటకు దూకాడు.

      బాలు బస్సులోపలికి వెళ్ళంది. బస్సులోని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ బస్సు వెనక సీట్లలోకి పారిపోయారు. పెద్దవాళ్ళు భయంతో అరవడం మొదలెట్టారు.  చిన్నపిల్లలు ఈ చిన్ని బాలువైపు ఆసక్తిగా వింతగా చూస్తున్నారు. బాలుకు వీళ్ళంతా తనను చూసి అలా ఎందుకు భయపడుతున్నారో అర్థంకాలేదు. వీళ్ళ అరుపులకు బాలుకు కూడా భయంవేసింది. బాలు మెల్లగా బస్సు దిగి దానికింది దాక్కుంది. 

      బస్సుకిందకు చేరిన బాలుకు కింద చాలా వేడిగా అనిపించింది. పొగవాసన వేసింది. బాలు అక్కడ ఉండలేక పోయింది. ఇంతలో బస్సులోవాళ్ళంతా బస్సు దిగి దూరంగా పోయారు. కొందరు దూరంనుంచే బస్సుకిందకు వంగి చూస్తున్నారు. బాలు మళ్ళీ బస్సు ఎక్కింది. బస్సులో చక్రం ఉన్నచోటికి వెళ్ళి కూర్చుంది. అక్కడనుంచి దానికి ముందు రోడ్డు, చెట్లు, కొండలు అన్నీ కనిపించాయి. చక్రంమీద చేతులు వేసి అటూ ఇటూ కదిపింది. అలా చేయడం బాలుకు చాలా సరదగా అనిపించింది. ఇంతలో ఎదురుగా ఒక బస్సు రావడం చూసింది. అందులో కూడా చాలామంది మనుషులు ఉన్నారు. బాలు వెనక్కి తిరిగి చూసింది. తాను కూర్చున్న బస్సులో వెనకంతా ఖాళీగా కనిపించింది. ‘‘అరే! ఆ బస్సులో అంతమంది ఉంటే తన బస్సులో వాళ్ళంతా ఎందుకు కిందికి దిగి వెళ్ళిపోయారబ్బా!’’ అని ఆలోచిస్తూ కూర్చుంది.

      ఈ బస్సు దిగిన వారందరూ సెల్ ఫోన్ లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. అటుగా పోతున్న వాహనాలన్నీ అగిపోయాయి. వాహనాల్లో వాళ్ళంతా ఈ బస్సుకేసి చూస్తున్నారు. బాలు అడవంతా తిరిగి తిరిగి అలిసిపోయిందేమో నిద్ర ముంచుకొచ్చేసింది. నిద్ర ఆపుకోలేక బాలు ఆ చక్రం మీదే అలాగే నిద్రపోయింది.

      తరవాత ఏం జరిగి  ఉంటుందో ఊహించి చెప్పండి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి