LATEST UPDATES

28, జూన్ 2018, గురువారం

నేటి కథ - జీవన సూత్రం

This is a simple translate button.

*నేటి కథ*

                    జీవన సూత్రం

రామాపురంలో నివసించే రంగయ్య మంచి ఆదర్శ రైతు. అతని పొలంలో పండే మొక్కజొన్న అద్భుతంగా ఉంటుందని చెప్పుకునేవాళ్ళు. లావుగా, బలంగా ఉండే మొక్కజొన్న పొత్తులతో అతని పొలం టన్నుల దిగుబడినిచ్చేది. ప్రతి ఏడాదీ రాజధానిలో జరిగే పంటల పోటీకి తన పంటను పంపించేవాడు రంగయ్య. ప్రతిసారీ అతని పంటకే అక్కడ మొదటి బహుమతి వస్తూండేది.

ఒకసారి అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన విలేఖరి అడిగాడు: "ఇన్నేళ్ళుగా మీరు ప్రతిసారీ మొక్కజొన్న పండిస్తున్నారు; ప్రతిసారీ మీరే మొదటి బహుమతి సాధిస్తూ వస్తున్నారు కదా, మీరు ఏ కంపెనీ విత్తనాలు వాడుతున్నారు?" అని.

రంగయ్య అన్నాడు- "అట్లాంటిదేమీ లేదండి, నేను అసలు ఏ కంపెనీ విత్తనాలూ‌ కొనను" అని. విలేఖరి వ్యవసాయం గురించి కొంచెం చదువుకున్నవాడు. అతను ఆశ్చర్యపోయాడు- "అంటే మీ విత్తనం.. నాటు విత్తనమా?" అని.

"అవునండి. నా పంటకు ఆధారం నాటు విత్తనమే" చెప్పాడు రంగయ్య.

"మరి నాటు విత్తనాలలో దిగుబడి రాను రాను తగ్గిపోతుంది కదా?!" అడిగాడు విలేఖరి.

"ఎందుకు తగ్గాలి?" అడిగాడు రంగయ్య. "నా విత్తనాల శక్తి అయితే మరి ఇంతకాలంగా ఏమీ తగ్గలేదు. నిజానికి ఈ విత్తనం మా నాన్న తరం నుండి వస్తూ ఉన్నది- దీని శక్తి తగ్గలేదు కదా మరి?"

"అట్లా కాదు- ఇప్పుడు మీరు ఒక కంపెనీ వారి మొక్క జొన్న వేశారనుకోండి. మీ ప్రక్కవాళ్ళు వేరే రకం వేసి ఉండచ్చు- అప్పుడు మీ పంటకు కావలసిన పుప్పొడి రేణువులు ప్రక్క పొలం నుండి, వాళ్లకు మీ పొలం నుండి- అట్లా వేరు వేరు చోట్ల నుండి వచ్చిన పుప్పొడి రేణువులు కలవటం వల్ల, వేరు వేరు లక్షణాలున్న కొత్త పంట తయారు అవుతూ పోతుంది. క్రమంగా మీ పంట నాణ్యత మారిపోతుంది, మీకు తెలియకుండానే!" వివరించాడు విలేఖరి.

"అట్లా అవ్వదులెండి, మీకు తెలీదు" అన్నాడు రంగయ్య.

"ఎందుకు కాదు?" అడిగాడు విలేఖరి.

"మా ఊళ్ళో రైతులకు అందరికీ ఓ అలవాటుంది- మేం ఒకరి విత్తనాలు ఒకరం పంచుకుంటుంటాం" చెప్పాడు రంగయ్య.

"అవునా?!" ఇంకా ఆశ్చర్యపోయాడు విలేఖరి. "మీ అవార్డు విత్తనాలను కూడా మీరు ఊళ్ళో అందరితోటీ పంచుకుంటారా?!"

"అవును. లేకపోతే కుదరదు. మా పొరుగు రైతులు సత్తువలేని పంట పండిస్తే, వాళ్ల పంటనుండి మా పొలంలోకి వచ్చిన పుప్పొడి, మా విత్తనాల నాణ్యతను దెబ్బతీస్తుంది కదా! నా విత్తనం బాగుండాలంటే, మా పొరుగు రైతులు నాణ్యమైన పంట పండించటం తప్పని సరి" చెప్పాడు రంగయ్య.

అతని అవగాహనకు విలేఖరి నివ్వెరపోయాడు.

నిజంగా చూస్తే 'ఇదే మంచి జీవన సూత్రం కూడా' అనిపిస్తుంది. మనం సంతోషంగా, నిండుగా, అర్థవంతంగా జీవించాలంటే, మన చుట్టూ ఉన్నవారితో మన సంతోషాన్నీ, జ్ఞానాన్నీ‌ పంచుకోవటం తప్పనిసరి. జాగ్రత్తగా చూస్తే మనవల్ల స్పృశించబడే వారివల్లనే మన జీవితానికీ ఒక విలువ ఏర్పడుతుంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు బాధ పడుతూ ఉంటే మనం ఒక్కరం సంతోషంగా ఉండటం కష్టమౌతుంది కదా. అలా సమాజంలో ఒకరి సంతోషం మిగతా వాళ్లందరి సంతోషంతోటీ ముడిపడి ఉన్నది! దీన్ని కావాలంటే సమైక్యతా బలం అనచ్చు; విజయ రహస్యం అనచ్చు; జీవన సూత్రం అనచ్చు- కానీ సత్యం ఏంటంటే- 'అందరం గెలిచేవరకూ ఏ ఒక్కరమూ గెలవలేం'. సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఇమిడి ఉన్నది!

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి