* నేటి కథ *
గొడవ పడి ఏమి లాభము?
ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండే వారు. వాళ్ళు రోజూ కలిసి స్కూల్ కి వెళ్ళే వారు, కలిసి ఆడుకునేవారు, అసలు ఎప్పుడు ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించే వారే కాదు. ఊళ్ళో అందరికి వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు.
ఒక రోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవడానికి వెళ్ళారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరు ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది, అంటే నాది అని దేబ్బలాడుకున్నారు.
హోరా హరీ దెబ్బలాడుకుంటూ తలో అంచు పట్టుకుని లాగటం మొదలెట్టారు. ఒకడు ఒక అంచున, మరొకడు మరో అంచున పట్టుకుని ఉన్న శక్తంతా వాడి ఆ తాడు గుంజుకోవాలని ప్రయత్నించారు.
ఇలాలాగుతుంటే, తాడు పాతదేమో ఠప్పు మని విరిగి పోయింది. ఇద్దరు ఒకటే సారి ధమ్మని తలోక వైపు పడ్డారు. ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి.
ఆ విరిగి పోయిన తాడు ఏమి చేసుకుంటారు? అక్కడే పడేసి ఇంటికి వెళ్ళారు.
కంది పోయిన మొహాలు, మాసి పోయిన బట్టలు, రేగిన జుట్టు, వంటి మీద గాయాలు వేసుకుని వెళ్ళిన ఇద్దరికీ ఇంట్లో బాగా తిట్లు పడ్డాయి.
మొన్నాడు ఇద్దరు స్నేహితులు కలిసి సంధి చేసుకున్నారు. తాడూ దక్కలేదు, దెబ్బలూ తగిలాయి; ఇంట్లోను చివాట్లు పడ్డాయి అనుకున్నారు. అదే దేబ్బలాడుకోకుండా ఆ తాడుని పంచుకుని వుంటే ఇద్దరు వంతులేసుకుని స్కిప్పింగ్ చేసేవారని బాధ పడ్డారు.
ఇద్దరు అనుకున్నారు: అవును, గొడవ పడి ఏమి లాభము?
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి