LATEST UPDATES

28, జూన్ 2018, గురువారం

నిమ్స్‌లో ఉద్యోగులకు సాయంత్రపు ఓపీ సేవలు

This is a simple translate button.

*నిమ్స్‌లో ఉద్యోగులకు సాయంత్రపు ఓపీ సేవలు

వచ్చేనెల 1 నుంచి ప్రారంభానికి సన్నాహాలు

ఉచితంగా ఔషధాల అందజేతకూ ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో భాగంగా ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులకు నిమ్స్‌లో సాయంత్రపు వేళ కూడా బయట రోగుల (ఓపీ) సేవలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదేరోజు నుంచి సాయంత్రపు వేళ ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం నిమ్స్‌ సహా వనస్థలిపురం, ఖైరతాబాద్‌, వరంగల్‌ తదితర కేంద్రాల్లో ఓపీ సేవలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. సాయంత్రం తర్వాత ఓపీ సేవలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నిమ్స్‌లో ప్రాథమికంగా ఓపీ సేవలను సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకూ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అంతర్గత ఆదేశాలను వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఇటీవలే నిమ్స్‌ సంచాలకులకు జారీచేశారు. ఉద్యోగులు, పాత్రికేయుల కోసం సాయంత్రపు వేళలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. వైద్యులు సూచించే నిర్ధారణ పరీక్షలనూ నిమ్స్‌లోనే ఉచితంగా నిర్వహిస్తారు. ఆరోగ్య పథకంలో భాగంగా ఇతర ఓపీ సేవల కేంద్రాల్లో అందజేస్తున్నట్లుగా నిమ్స్‌లోనూ ఔషధాలను ఉచితంగా అందజేయటానికి ప్రత్యేకంగా ఔషధ నిల్వ గోదామును ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి