అహం (వరల్డ్ ఈగో అవేర్ నెస్ డే సందర్భంగా)
చేసిన తప్పులను
ఒప్పు కోవాలనుకున్న ప్రతీసారి
వద్దు వద్దంటూ
సైంధవుడిలా అడ్డగిస్తావు.
అంతరాలు భేషజాలు లేకుండా
అందరితో మమేకం కావాలని చూస్తే
కులం మతం
పేద ధనిక
స్థాయి భేదాలంటూ
ప్రహరిగోడలా ప్రత్యక్షమవుతావు.
వివాదాల పరంపరకు
వీడ్కోలు చరమగీతం
పాడాలనుకుంటే
వీల్లేదంటూ
ముళ్ళకంచెలా హద్దులు గీస్తావు.
అంతరాత్మ అద్దంలో
నన్ను నేను చూడబోతే
అడంబరపు ముసుగులా
అడ్డమొస్తావు.
ఎంత ఎత్తులకెదిగినా
నీడలా వెంటపడి వేధిస్తావు.
రంగమేదైనా వ్యక్తులెవరైనా
తరతరాలు నీ నిరంకుశత్వ
పరంపరకు
తలొంచక తప్పలేదు.
చివరకు
నా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని
ప్రయత్నిస్తావు.
గంజి.దుర్గాప్రసాద్
వలిగొండ.
9885068731
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి