అమ్మ పద్యం (మదర్స్ డే కవిత)
అలవోకగా
అమ్మనోట
తేనేచుక్కల్లా జాలువారిన
ఇతిహాస పద్యాలు
బతుకమ్మ పాటలు
నీతికథలు
ఆకలిని మరిపించి
హాయిగా నిద్రపుచ్చిన
అద్భుతమంత్రాలు.
అమ్మ నేర్పిన పద్యాలు
చెప్పిన కథలు
బ్రతుకుబాటలను చూపే
బడిపంతులును చేసాయి.
పరువు ప్రతిష్ఠల
వారసత్వాలు
గత వైభవ గౌరవాల బరువులతో
బీదరికపు బాధల
భిన్నధృవాల మధ్య నలుగుతు
గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చిన
అమ్మను చూస్తే
స్థితప్రజ్ఞతల భూమధ్యరేఖ లా
కన్పిస్తుంది.
తాను వేసిన పునాదులపై
తలెత్తుకు నిలబడిన
భవంతుల ఎదుగుదలను
తన క్షేత్రంలో
విత్తనాలుగా మొలకెత్తిన
ప్రయోజకత్వ
ఫలవృక్షాలను చూసిన
అమ్మ కళ్ళలో
కదలాడుతున్న
ఆనందాతిశయాల పారవశ్యం.
పరిపూర్ణ జీవితానుభవాలతో
పండిపోయిన
అమ్మను చూసినప్పుడల్లా
అన్పిస్తుంది.
మళ్ళీ!
అమ్మగా పుట్టకు
నా ఇంటి ఆడబిడ్డగా పుట్టు
ఏ కొంతైనా
నీ రుణం తీర్చుకోవాలనీ..,
గంజి.దుర్గాప్రసాద్
వలిగొండ
9885068731
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి