భయం
ఆధిపత్యపు చీకట్లకు
వాతలు పెడుతు
గీతలు గీస్తు
మెరుపుల మరకలతో
ఉరకలు వేసే మిణుగురుల
ఉత్సాహం చూస్తే భయం.
నత్తనడకలకు కొత్తపరుగులు
నేర్పిస్తాయని...!
గబ్బిలాల్ల తలకిందులుగా వేలాడే
అస్తవ్యస్త వ్యవస్థల అపసవ్యాలు
ఒడిసిపట్టే చేతుల చేవ చూస్తే భయం.
చేష్టలుడిగిన చేతుల తో
చేయి కలుపుతాయని...!
మన్నుతిన్న పాముల్లా మత్తుగా
నిర్లక్ష్యం కుబుసాల్లో
కులాసాగ నిద్రించే కర్తవ్యాలను
అదిలించే కర్రల అజమాయిషీలు చూస్తే భయం.
పేరుకున్న స్తబ్ధతలో
కూరుకుపోయిన బుర్రలకు
ఊతమైపోతాయని...!
నిమ్మకు నీరెత్తినట్లు
గడపదాటని
ఉదాసీన విధానాల సోమరితనాలకు
చురకలేసే కొరకంచు రాతల వేడిమంటే భయం.
అక్షరాలకు తర్ఫీదునిచ్చి
అగ్గిపిడుగుల్ని చేస్తాయని...!
తెప్పచినుకుల్లా కురిపించిన
తప్పుడు వాగ్ధానాలు
తవ్వితీసే కలం గునపాలు చూస్తే భయం.
అధికారం పునాదులు కదిలిపోతాయని...!
మౌనం దిబ్బలు బద్ధలు కొడుతు
తిరగబడే ధిక్కారస్వరాల
పొలికేకలంటే భయం.
మూగనోము పట్టిన గొంతులు
వంతలు పలుకుతాయని...!
ఏటివరద కు ఎదురీదుతు ఎగిరే
పరక పిల్లల చురుకుదనం చూస్తే భయం.
చతికిలపడ్డ నిస్తేజాలు
ఉత్తేజంతో నిలబడతాయని...!
గంజి దుర్గాప్రసాద్
వలిగొండ
9885068731
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి