LATEST UPDATES

16, మే 2021, ఆదివారం

మనదే కదా! - రచన శ్రీ గంజి దుర్గాప్రసాద్

This is a simple translate button.

****** మనదే కదా! *******

విపత్తులు...
విధ్వంసాల ఉక్కుపాదాలతో తొక్కేసిన
ఎవరెస్ట్ ల్లా ఎదిగిన 
కృషిసంకల్పాల కసి మనది కదా!

నీడల్లా వెన్నాడుతు
ఊడల్లా పాతుకుపోయిన
భయాందోళనల మౌఢ్యాన్ని 
ధైర్యం కరవాలంతో తెగనరికి
అడుగంటిన ఆశల శిథిలాల నుండి
ఆత్మవిశ్వాసాల మినార్ లమై నిలబడాలి.
వ్యాక్సిన్ మందు మాత్రమే...
ధైర్యం మృతసంజీవిని.

పగబట్టిన పాముల్లా
కనికరించని కాలం
వరుస కరువులతో
కసిరి బుసలు కొట్టినా
కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని
ముళ్ళపొదల్లా
బతికిన మొండితనాలు మనవే కదా!

జిత్తులమారి గుంటనక్కల్లా
రుగ్మతలెన్నో వెంటబడినా
మాటేసి మట్టబెట్టిన
వేటగాడి సంయమనం మనదే.,

ప్రతికూలతల పరిణామాల మధ్య
తలెత్తకొని 
విత్తనాల్లా మొలకెత్తిన ప్రస్థానం మనది.
ఒడిదొడుకుల సుడిగుండాల నెదుర్కొంటు
తొడగొట్టి నిలబడిన శౌర్యం మనది.
బొప్పికట్టిన అనుభవాల నుండి
గొప్పగుణపాఠాలు నేర్చుకున్న గతం 
అప్రమత్తత కొరవడిన వర్తమానం
మనదే...
మరేం ఫరవాలేదు
గ్రహణం చీకట్లు తాత్కలికమే!
కానీ...
జీవంలేని దేహాలపై
జీవచ్ఛవాలపై
బేరసారాలు సాగించే
కార్పొరేట్ ధనదాహలకు
బ్లాక్ మార్కెట్ దురాశ ల జాడ్యాలకు
ఇంతవరకు ఏ వ్యాక్సిన్ రాలేదు.

అవును
అంతా బహిరంగ రహస్యమే
నోటితో పరామార్శిస్తు
నొసటితో వెక్కిరించే
చేతగాని నపుంసకత్వానికి
పెత్తనమిచ్చిన
రసికత కూడ
మనదే కదా...!

              గంజి.దుర్గాప్రసాద్
                      వలిగొండ
                 9885068731

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి