LATEST UPDATES

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

నక్క - భూదేవర (కథ)

This is a simple translate button.

     ఒక నక్కకు భూమిమీద ఒక పైస దొరికింది. అది పైసతో పుట్నాలు కొనుక్కుంది. తినేసింది. కొన్ని రోజులు గడిచాయి. భూమి మీద పైస దొరికింది గనుక ఆ పైస భూదేవరది. ‘‘నాపైస నాకు తిరిగి ఈయవా?’’ అని భూదేవర అడిగింది. నక్క భూమిని తప్పించుకోవడానికి ఎంతో దూరం పరుగెత్తింది.

     అక్కడ కూడా భూమి ఉన్నది కదా!. ‘‘నాపైస తిరిగి ఈయవా’’ అని భూదేవర మళ్ళీ అడిగింది. నక్క మళ్ళీ పరుగెత్తింది. అక్కడ కూడా భూమి ఉన్నది. భూదేవర మళ్ళీ అడిగింది. నక్క మళ్ళీ పరుగెత్తింది. అలా తొగరి చేండ్ల నుండి పరుగెత్తుంటే దాని కంటికి తొగరి పుల్ల గుచ్చుకుంది. దాని కన్నొక్కటి పోయింది. భూదేవర నక్కను మళ్ళీ పైస అడిగినప్పుడు నక్క కోపంతో ‘‘నీవు గుడ్డి నక్కకు ఇచ్చావా మంచి నక్కవా’’ అని అడిగింది. భూదేవర ‘‘మంచి నక్కకే’’ అని అంది. నక్క తన కన్నును చూపింది. భూదేవర మళ్ళీ ఆ నక్కను పైస అడగలేదు.

     ‘‘నా కంటిని మంచిగా చేయి’’ అని నక్క పోచమ్మ దేవరను వేడుకుంది. భోనము వేస్తాను అంది. పోచమ్మ నక్క కన్నును నయం చేసింది. నక్క భోజనము వేయడం మరచిపోయింది. పోచమ్మ తల్లి నక్కను భోజనమేయమంది. ‘‘అమ్మా నీకు గుడ్డి నక్క భోనమేస్తా అన్నదా మంచి నక్కనా’’ అని నక్క అడిగింది. ‘‘గుడ్డి నక్కనే’’ అని పోచమ్మ తల్లి అంది. ‘‘నా కన్ను చూడు. నేను గుడ్డినక్కనా?’’ అని నక్క అడిగింది. ‘‘కాదు’’ అంది పోచమ్మ. మరి నేను భోనమువేయను అని నక్క తప్పించుకుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి