LATEST UPDATES

22, ఫిబ్రవరి 2016, సోమవారం

మూడు నిజాలు (కథ)

This is a simple translate button.

     అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తెలివైన మేకపిల్ల ఉండేది. అది ఒకసారి మందలో నుంచి తప్పిపోయింది. తన వాళ్ళ కోసం అడవి అంతా తిరిగింది. అయినా ఏ ఒక్కరూ కనిపించలేదు. చివరకు నీరసంగా ఒక చెట్టుకింద కూలబడింది. అప్పుడే అక్కడికొక పులి వచ్చింది. మేకపిల్ల పులిని చూసింది. అయినా భయపడలేదు. దాని ధైర్యం చూసి పులికి ముచ్చటేసింది. మేకపిల్ల దగ్గరకెళ్ళి ‘ఏమోయ్.. నేనంటే నీకేం భయం లేనట్టుంది’ అంది పులి. ‘చూసి భయపడేంత భయంకరంగా లేవే!’ అంది మేక పిల్ల. ‘ఆహా.. మాటలు బాగానే మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావు?’ అడిగింది పులి. ‘మందలో నుండి తప్పిపోయాను, మా వాళ్ళ కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. మరి వెళ్తాను..’ బయలు దేరుతూ అంది మేకపిల్ల. ‘ఎక్కడికెళ్లేది? నన్ను తప్పించుకుని వెళ్ళడం నీతరం కాదు’ అంది పులి. ‘కాదు నేను వెళ్ళి తీరాలి’ గట్టిగా అంది మేక. తప్పకుండా వెళ్లి తీరాలంటే నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి’ అంది పులి. ‘చెప్తే నా దారిన నన్ను వెళ్ల నిస్తావా?’ అడిగింది మేకపిల్ల. ‘ఓ నిక్షేపంగా’ అంది పులి అయితే వినండి ‘నేను మావాళ్ల వద్దకు వెళ్లి.. నేనొక పులిని చూశాను. అది నన్నుచంపకుండా వదిలేసింది’ అంటాను. ‘వాళ్ళు నమ్మరు. ఇది మొదటి నిజం’. ఇక రెండో నిజం... ‘మీరు మీ స్నేహితుల దగ్గరకెళ్లి నేనొక మేకపిల్లను చూశాను. దాన్ని నేను చంపకుండా వదిలేశాను’ అంటారు. వాళ్లెవరూ మీరు చెప్పింది నమ్మరు. ఇది రెండో నిజం అంది మేకపిల్ల. మరి మూడో నిజం.. అంటూ కుతుహలంగా అడిగింది పులి. ‘ఎదురుగా నేనున్నా మీరు నింపాదిగా మాట్లాడుతూ కూర్చున్నారంటే ఇప్పుడు మీకు ఆకలెయ్యట్లేదు. ఇదే మూడో నిజం అంది మేక పిల్ల. ‘అబ్బో! ఏమో అనుకున్నాను. నువ్వు నిజంగా తెలివైన మేకపిల్లవే. నీ తెలివి తేటలకు మెచ్చి నిన్ను వదిలేస్తున్నాను అంది పులి. మేక పిల్ల సంతోషంగా వెళ్లపోయింది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి