LATEST UPDATES

25, ఫిబ్రవరి 2016, గురువారం

దయ - 3వ తరగతి (చదువు ఆనందించు)

This is a simple translate button.

     పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడ ఉన్నది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు.

    ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికి పోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందుపడ్డది. గౌతముడు జాలితో, కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు.

     అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి, ‘‘నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే!’’ అన్నాడు. ‘‘ మిత్రమా! ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా!’’ అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళ కొట్లాట రాజుగారి దగ్గరికి పోయింది.

     ఇద్దరూ రాజాస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుని బాణం వల్ల హంస చచ్చిపోతే అది అతనిది అయ్యేది. కాని భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందు వల్ల అది గౌతమునిదే అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దానిమీద హంసను ఉంచమన్నాడు. గౌతముణ్ణి, దేవదత్తుణ్ణి విడివిడిగా హంసను పిలువమన్నాడు. అది ఎవరి దగ్గరకు పోతే అది వారిది అవుతుందని చెప్పాడు. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు.

     అతని కోపపు చూపుకు, కఠినమైన పిలుపుకు హంస రాలేదు. గౌతముడు అప్యాయంగా హంసను పిలువగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులకు ఎగిరి వచ్చి, చేతిపైన వాలింది. గౌతముని అహింసా పద్ధతికి సభలోని వారంతా చప్పట్లు కొట్టారు. రాజు, న్యాయాధికారి సంతోషించారు.

అందువల్ల కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్నవాళ్ళకే అందరి మన్నన దొరుకుతుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి