LATEST UPDATES

29, మే 2021, శనివారం

ఏంచేయను...! - శ్రీ గంజి దుర్గాప్రసాద్

This is a simple translate button.

***** ఏంచేయను...! ******

కరోనా కష్టకాలంలో
ఇంటామె చేసిన
ఇష్టమైన వంటకాల రుచులను
ఆస్వాదిస్తు ఆరగిస్తు
ప్రశంసలు విమర్శలు చేసే
పనిలో బిజీగా...

ప్రశంసలకు పరవశిస్తు
కొసరి కొసరి
వడ్డింపులు
విమర్శలకు..
గిట్లనే చేస్తాం
ఇష్టముంటే తిను
లేదంటే ఊర్కోమంటూ
కసుర్లు విసుర్ల హెచ్చరికలు
జారీచేస్తూ...

నేనో..
జిహ్వాచాపల్యపు బూకరిబుచ్చిగాన్ని
రుచి చూసిన ప్రతీపదార్థం
గుణదోషాలు వ్యాఖ్యానం చేయందే
ఉండలేని నోటిదురద
ముద్ద తిని మూలన కూచొని
కలంతో కవితలు రాసుకొనక
ఎందుకీ పాకశాస్త్ర సమీక్ష.
పాపం ఆమెకు..
వంటావార్పుల్లో చేతనైన సహాయం
చేయకపోగా
కనీసం పొగడ్తల కూత సాయమైనా
చేతగాక 
ఉన్నదున్నట్లు వాగేస్తాను.

ఏంచేయను!
చపలత్వపు నాలుక
చెప్పిన మాటవినదు.
మూతికి ముసుగేస్తే సరిపోతుందా
నాలికకు లాక్ డౌన్ చేయాలి కదా!

ఇప్పుడు
రాత్రింబగళ్ళు తేడాలేదు
చేసేదేమిలేనపుడు
కూచొనితినడమేగ
కానీ! కూచొనితింటే
పిలుపుల మర్యాదల్లో కూడ
తేడాలొస్తున్నాయ్.
బహువచనాలు కాస్త
బక్కచిక్కి
ఏకవచనాలుగా
నామవాచకాలుగా
రూపాంతరం చెందుతున్నాయి.

రోజులతరబడి
బూజుపట్టిన వస్తువులన్నీ
అనివార్యపు శ్రమదానంతో
నిగనిగలాడుతున్నాయి.
విరహవేదన భరించలేని
పాత అలవాట్లన్నీ
కాంక్షతో రగిలిపోతు
కసిగా బుసకొడ్తున్నాయి.
మనకిప్పుడు..
పచ్చీసులు,అష్టాచెమ్మలు,అంత్యాక్షరులే
అక్కచెల్లెండ్లు అన్నదమ్ముండ్లు.
సినిమాలు,సీరియళ్ళు
సెల్ ఫోన్లే - సోపతిగాండ్లు
నాలుగుగోడలు బాడీగార్డులు.

  ఏంచేయాలి!
ఏమీ చేయోద్దు
ఇది కరోనా కలికాలమని
సరిపెట్టుకో
కాదంటే
ఇల్లు గడవటం
ఇంట్లో గడపటం
కష్టమైతది.

                              గంజి.దుర్గాప్రసాద్
                                      వలిగొండ
                                9885068731

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి