EHS సందేహాలు - సమాధానాలు
సందేహం: ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?
సమాధానం: ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.
సందేహం: తెల్ల రేషన్ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
సమాధానం: తెల్లరేషన్ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.
సందేహం: ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?
సమాధానం: కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.
సందేహం: సవతి పిల్లలు ( స్టెప్ చిల్డ్రన్ ) ఇహెచ్‌ఎస్ సదుపాయానికి అర్హులా?
సమాధానం: అవును. జి.ఓ. ఎంఎస్. నెం. 174, హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్ చిల్డ్రన్ ఇహెచ్‌ఎస్ ప్రయోజనాలకు అర్హులు.
సందేహం: దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?
సమాధానం: అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.
సందేహం: నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?
సమాధానం: కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
సందేహం: భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?
సమాధానం: అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్, ఇఎస్‌ఐఎస్, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.
సందేహం: ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్ క్రింద నమోదుకు అర్హులా?
సమాధానం: కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.
సందేహం: నిరుద్యోగి అయిన కుమార్తె, అవివాహిత అయితే, ఆమెకు పథకం వర్తిస్తుందా?
సమాధానం: అవును. అవివాహితలు, భర్త మరణించిన వారు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భర్త వదిలిపెట్టిన కుమార్తెలు నిరుద్యోగిగా వుంటే, వారు అర్హులవుతారు. తర్వాత వారికి వివాహం జరిగితే, వారు అనర్హులవుతారు.
సందేహం: *25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడి పేరును తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది?
సమాధానం: ఉద్యోగి / పింఛనుదారు పేర్కొన్న కుమారుడి జన్మదినం వివరాలు సిస్టమ్‌లో వుంటాయి. 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడిని సిస్టమ్ ఆటోమాటిక్‌గా అనర్హుడిగా చేయటంతో పాటు అతడి ఆరోగ్య కార్డును ఇన్‌వాలిడేట్ చేస్తుంది.
సందేహం: నా పాస్‌వర్డ్ మర్చిపోయాను. కొత్త పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయటం ఎలా?
సమాధానం: హోమ్ పేజీలో సైన్ ఇన్ బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత 'ఫర్‌గాట్ పాస్‌వర్డ్' పై క్లిక్ చేయాలి. సిస్టమ్ జెనరేట్ చేసిన పాస్‌వర్డ్ దరఖాస్తుదారు మొబైల్ నెంబరుకు, ఇ మెయిల్ ఐడికి అందుతుంది.
సందేహం: కొన్ని వివరాలను తప్పుగా వ్రాసి దరఖాస్తును ట్రస్ట్‌కు సమర్పించటం జరిగింది. వీటిని సరి చేయటం ఎలా?
సమాధానం: పింఛనుదారుల విషయంలో ఒకసారి సమర్పించిన తర్వాత, వ్యక్తిగతంగా దానిని సరిచేయటానికి కుదరదు. ట్రస్ట్ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారు వివరాలను సరిచేసి, అంగీకారం కోసం తిరిగి సమర్పించాలి. లేదా ఫిర్యాదును బట్టి ట్రస్ట్ జెఇఓ (ఇహెచ్‌ఎస్) సరిచేయవచ్చు. ఉద్యోగుల విషయంలో, డిడిఓలు ఆర్థిక శాఖకు అందజేసిన హెచ్‌ఆర్‌ఎంఎస్ డేటాను ఉపయోగిస్తూ ఆరోగ్య కార్డులను జారీ చేయటం జరుగుతుంది. అందజేసిన సమాచారంలో తప్పులను సరిచేసే అవకాశం ఉద్యోగులకు వుంది. ఉద్యోగులు ఆధార్ వివరాలను ఎడిట్ చేయవచ్చు. ఇతర వివరాలను ఎడిట్ చేయటానికి కుదరదు.
సందేహం: పాస్‌వర్డ్‌ను మారుస్తున్నప్పుడు నా మొబైల్ నెంబరును తప్పుగా పేర్కొనటం జరిగింది. ఇపుడు నేను ఏం చేయాలి?
సమాధానం: అటువంటి సందర్భాలలో, తగు చర్య తీసుకొనే నిమిత్తం www.ehf.telangana.gov.in పోర్టల్‌లో యూజర్ ఐడి, పేరు, అసలు మొబైల్ నెంబరు వివరాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి.
సందేహం: ఇచ్చిన యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌లతో నేను లాగిన్ కావాలనుకొన్నప్పుడు, 'ఇన్‌వాలిడ్ యూజర్ ఐడి లేదా పాస్‌వర్డ్' అనే హచ్చరిక సందేశం వస్తోంది. నేను ఏమి చేయాలి?
సమాధానం: ఇన్‌వాలిడ్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఏదీ వుండదు. రిజిస్టర్ చేసుకొన్న మొబైల్‌కు 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ను ఎస్‌ఎంఎస్ చేయటం జరుగుతుంది. ఇమెయిల్‌కు కూడ పంపటం జరుగుతుంది. ఈ 8 డిజిట్‌ల పాస్‌వర్డ్ "nAI0xQk7" ” (కేస్ సెన్సిటివ్) లా వుంటుంది. దీనిని సరిగా ఎంటర్ చేయాలి.
సందేహం: పింఛనుదారు దరఖాస్తును ట్రస్ట్ / ఎస్‌టిఓ / ఎపిపిఓ కొన్ని రిమార్కులతో తిరస్కరించారు. తిరిగి సమర్పించేందుకు అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి?
సమాధానం: రిమార్కుల ప్రకారం సరిచేసి, దానిని వెరిఫికేషన్ మరియు అంగీకారం నిమిత్తం తిరిగి సమర్పించాలి.
సందేహం: ఆధార్ కార్డులో ఉన్న ఉద్యోగి / పింఛనుదారు పేరుకూ సర్వీస్ రిజిస్టర్ / పిపిఓ కాపీలో వున్న పేరుకూ కొంత వ్యత్యాసం వుంది. నేను ఏ పేరు ఎంటర్ చేయాలి?
సమాధానం: సర్వీస్ రిజిస్టర్ / పిపిఓ కాపీలో ఉన్న పేరు వ్రాయండి.
సందేహం: పింఛనుదారులు నమోదయ్యేందుకు చివరి తేదీ ఏది?
సమాధానం : పింఛనుదారులు నమోదు అయ్యేందుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు.
సందేహం: లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ను ఎప్పుడు పంపుతారు?
సమాధానం: దరఖాస్తుదారు రిజిస్టర్ చేసుకొన్న మొబైల్ నెంబరుకు క్రింద సూచించిన సందర్భాలలో ఎస్‌ఎంఎస్ పంపటం జరుగుతుంది.
ఎ. దరఖాస్తుదారు పాస్‌వర్డ్ మారుస్తున్నప్పుడు
బి. దరఖాస్తుదారు ''ఫర్‌గాట్ పాస్‌వర్డ్'' ఆప్షన్‌ను ఎంచుకొన్నప్పుడు*
*సి. పింఛనుదారు దరఖాస్తు సమర్పించినప్పుడు*
*డి. ట్రస్ట్ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును అంగీకరించినప్పుడు / తిరస్కరించినప్పుడు / నిలిపివేసినప్పుడు
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి