LATEST UPDATES

11, ఏప్రిల్ 2020, శనివారం

సామెత కథ - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

సామెత కథ

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

పూర్వం మన దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!

ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం " అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.

ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు "వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా! " అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు" అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.

తాపసి దయతలచి సరే అన్నాడు.

ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.

9, ఏప్రిల్ 2020, గురువారం

మర్యాద రామన్న కథలు: సూరయ్య - పేరయ్య

మర్యాద రామన్న కథలు

సూరయ్య - పేరయ్య

రామాపురం లోనే సూరయ్య , పేరయ్య అనే స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకటే తరగతి, ఒకటే పాఠశాలలో చదవడం చేత స్నేహముగా ఉండేవారు. చదువులు అయిపోయిన తర్వాత ఇద్దరు చెరొక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. సూరయ్య ఇనుము వ్యాపారం చేసేవాడు. కాని మంచిగా అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. నిజాయితీగా వ్యవహరించేవాడు. అలాగే పేరయ్య పేరు తగ్గట్టుగా పేరాశ ఎక్కువ. పేరయ్య కిరానా దుకాణం నిర్వహించేవాడు. ఎదుటివారి అవసరాన్ని బట్టి ధర చెప్పేవాడు.

ఎవరి వ్యాపారం వారిదైనా ఇద్దరూ తరచూ కలిసే కొనుగోలుకై పట్టణానికి వెళ్ళి కొనుగోళ్ళు చేసుకుని తిరిగి కలిసే వచ్చేవారు. సూరయ్యకు ఇద్దరు కుమార్తెలు. పేరయ్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఒకరోజు సూరయ్య కుటుంబంతో సహా తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నాము. నా వద్దనున్న ఇనుము ఇంటి ముందు వదిలేసి వెళ్తే,తిరిగి వచ్చేసరికి ఎవరైనా దొంగతనము చేస్తారేమో మీ ఇంటి ఆవరణలో పెట్టనా ? అని పేరయ్యను అడిగాడు. దాందేముంది మా ఇంటి ప్రక్కన గల స్థలంలో వేసుకొని నిశ్చింతగా వెళ్ళి రమ్మని పేరయ్య చెప్పాడు. సూరయ్య ఒక మంచి రోజు చూసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు.

తీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, “అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?” అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. “ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?” అడిగాడు పేరయ్య.

“పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది” అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు చెప్పుకుంటూ, అందరితోనూ “ధర్మప్రభువు మర్యాద రామన్న” అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు.

8, ఏప్రిల్ 2020, బుధవారం

సమాధానం ప్రయత్నించండి

సమాధానం ప్రయత్నించండి

1) ఆకాశాన్ని ఆ చివరి నుంచీ ఈ చివరి దాకా కప్పి వేసే ముచ్చటైన ఆయుధం ఏది?

2) పిట్ట గాని పిట్ట, నాలుగు కాళ్ళతో నడుస్తుంది. ఏమిటది?

3) తీసిన కొద్దీ పెద్దదయ్యేది ఏది ?

4) కీలుగాని కీలు, వనంగాని వనం కొన్నాడట. ?

5) పావుశేరు పాలల్లో పాలెన్ని?

6) నాలుగు అక్షరాల పదం - అర్థం శివుడు, మొదటి అక్షరం తప్పిస్తే, విష్ణువు, మళ్లీ అలాగే చేస్తే భర్త.

7) పెంచిన కారుగాని కారు, వరంగాని వరం చేయించుకోటానికి వెళ్ళాడు. 

8) కాయగాని కాయ మీద కాయగాని కాయ వేస్తే, కుయ్యో, మొఱ్ఱో అన్నాట్ట!

9) అక్షరాల పదాన్ని. కానుక అని అర్థం. మొదటి రెండు అక్షరాలు కలిపితే 'ఎక్కువ' అనీ, చివరి రెండు అక్షరాలు కలిపితే 'బుద్ధి' అనీ అర్థం. నేనెవరు?

10) నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో
మొదటి రెండు అక్షరాలు  కలిపితే తోటి అని అర్థం,

11) నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1,2,3,6 కలిపితే ఓ పురాణ గ్రంథం, 4,5,6 - భూభాగం, 1,2,6 - బరువు, 3,2,6 - జీవిత కాలం, 5,2,6 - బాణము అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?

12) నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1,2,3,6 కలిపితే గెలుపు, 4,5,6 - తోవ, 4,1 - మామిడి చెట్టు,
4,3,6 - అదృశ్యం ఇంతకీ నేనెవరిని?

13) నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో మొదటి రెండు అక్షరాలు కలిపితే - క్రీడ అని అర్థం. అలా 3,4 - ధర 1,5 - మొదలు ఇంతకీ నేనెవరిని ?

14) గంగావతరణ కోసం ఓ మహనీయుని కృషి ?

15) రామాంజనేయ యుద్ధానికి కారకుడు ?

16) సుప్రసిద్ధ కర్ణాటక సంగీతపు రాగం ?

17) శుక్రసుత క్రింది నుంచి పైకి వచ్చింది.

18) అజ్ఞాతంలో ద్రౌపది పేరు ?

19) మంగళ వాద్యాలలో ఉండే ప్రధాన వాద్యాలు ఏమిటి?

20) ధూమకేతువు అనగా ?

జవాబులు:

1)ఇంధ్ర ధనుస్సు
2)లొట్ట పిట్ట - ఒంటె
3)గొయ్యి
4)వకీలు, జనవరి, భవనం
5)రెండు ('పా' అనే అక్షరం)
6)ఉమాపతి - మాపతి - పతి
7)షావుకారు, క్షవరం
8)తలకాయ మీద మొట్టికాయ
9)బహుమతి
10)సహకారము
11)భారత దేశము
12)విజయ మార్గము
13)ఆట వెలది
14)భగీరథ ప్రయత్నం 
15)యయాతి
16)ఆరభి
17)దేవయాని
18)మాలిని
19)నాదస్వరం & డోలు 
20)తోకచుక్క

మర్యాద రామన్న కథలు - గంగమ్మ మోసకారితనం

మర్యాద రామన్న కథలు

గంగమ్మ మోసకారితనం

రంగాపురానికి దగ్గరగా మాచవరం అనే గ్రామము ఉండేది. ఆఊరిలో నివశించే రంగమ్మ చాలా నిజాయితీగా, ఎక్కువ తక్కువగా దుబారా చేయక తనకు ఉన్నదానిలోనే తృప్తిగా బ్రతికేది. రంగమ్మకు రెండు గేదెలు ఉండేవి. ఆ గేదెలు ఇచ్చేపాడితోనే కొన్ని పాలు అమ్ముకుని తన కుటుంబ అవసరాలకు మరికొన్ని ఉంచుకునేది. తన ఇంటిలోని పాలు వలన వచ్చే నెయ్యి కాచి అప్పుడప్పుడు ఆ నెయ్యి ని కూడా అమ్మేది. ఆమె ఇంటికి పొరుగున గంగమ్మ కుటుంబం ఉండేది. గంగమ్మ చాలా గడసరి. అయినదానికి కానిదానికి దుబారాగా ఖర్చు చేసేది. ఆర్భాటాలు ఎక్కువగా ప్రదర్శించేది. ఆమెకు ఎనిమిది గేదెల పాడి ఉండేది. ఊర్లో ఎక్కువ మందికి ఆమెనే పాలు పోసేది. అందుకని ఆమె మాటలను ఊరిలోని నమ్మేవారు.

ఒకసారి అనుకోకుండా గంగమ్మ ఇంట్లోని నెయ్యగిన్నె జారి పడింది. ఒక వీశెడు నెయ్యి నేలపాలైంది. సరేలే ఏం చేస్తాను నాకు ప్రాప్తతం లేదని సర్ధిచెప్పుకునే సమయంలో ఆ ఊరిలోని రామయ్య బానే మోతుబరి రైతు వచ్చి తనకు ఆరు వీశెల నెయ్యి కావాలని అడిగాడు. గంగమ్మకు ఏమి చెయ్యాలో పాలుపోక ఆలోచనలో పడింది. వెంటనే ఆమెకు రంగమ్మ గుర్తుకు వచ్చింది. తన ఇంటిలోని నెయ్యిని ఒక డబ్బాలో పోసి రంగయ్యను కూర్చోమని నెయ్యి గిన్నెతో రంగమ్మ ఇంటికి వెళ్ళి ఒక్క వీశెడు నెయ్యి అరువుగా ఇవ్వమని రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఎంతైనా పొరుగున ఉన్న మనిషి కదా అని వీశెడు నెయ్యి ఇస్తూ రెండు రోజుల్లో ఇవ్వాలని చెప్పింది. సరేనంటూ గంగమ్మ నెయ్యి తీసుకుని వెళ్ళి రంగయ్యకు ఆరు వీశెల నెయ్యి ఇచ్చి పంపివేసింది.

రెండు రోజుల్లో తిరిగి ఇస్తానన్న గంగమ్మ నెయ్యి గురించి ఏమీ మాట్లాడకుండా , ఏమీ తెలియనిదానిలా ఉన్నది. అలా వారం గడిచింది. కానీ గంగమ్మ తిరిగి నెయ్యి ఇవ్వలేదు. ఉండబట్టలేక రంగమ్మ వెళ్ళి తనకు ఇవ్వాల్సిన నెయ్యి గురించి అడిగింది. వెంటనే గంగమ్మ నేను నీ దగ్గర నెయ్యి తీసుకోవడం ఏమిటి? నేనే ఊరిలోని వారికి అమ్ముతాను. నీదగ్గర నేను అరువు తీసుకున్నానంటే నవ్వుతారు. ఇప్పటికైనా వెళ్ళిపో, ఎవరైనా వింటే పరువుపోతుంది అని గదమాయించింది. ఇరుగుపొరుగు వారితో రంగమ్మ చెబితే ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా,ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు.

ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.

7, ఏప్రిల్ 2020, మంగళవారం

తమాషా ప్రశ్నలు

తమాషా ప్రశ్నలు

1. పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?

2. నడవలేని కాలు ఏమిటి?

3. ఆడలేని బ్యాట్ ఏమిటి?

4. కనిపించని గ్రహం ఏమిటి?

5.. భోజనంలో పనికి రాని రసం ఏమిటి?

6.. తాగలేని రమ్ ఏమిటి?

7. దేవుడు లేని మతం ఏమిటి?

8. దున్నలేని హలం?

9.  రాజులు నివశించని కోట ఏమిటి?

10. స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు

11. నోరు లేకపోయినా కరిచేవి?

12. చేయడానికి ఇష్టపడని ధర్మం

13. ఓకే చోదకుడితో నడిచే బస్సు

14. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర

15. ఉత్తరానికి, దక్షిణానికి తేడా?

16. మిసిసిపీ నదిలో ఎక్కువ ఏమున్నాయి?

17. మొదటి ర్యాంకు రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?

18. మనకు కలలు ఎందుకు వస్తాయి.

19. మిరపకాయ కొరితే  ఏమవుతుంది?

20. రోజూ మారేదేది?

జవాబులు

1) డ్రైవింగ్ స్కూల్

2) పంపకాలు

3) దోమల బ్యాట్

4) నిగ్రహం.

5) పాదరసం.

6) తగరం.

7) కమతం

8) కుతూహలం.

9) తులసి కోట

10) రిక్టర్ స్కేలు

11) చెప్పులు

12) కాలధర్మం

13) డబుల్ డెక్కర్ బస్సు

14) విసనకర్ర

15) ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్ని వేయలేం.

16)  ‘సీ’లు

17) పెన్నుతో

18) కంటాం కాబట్టి

19) రెండు ముక్కలవుతుంది.

20) తేదీ

మర్యాద రామన్న కథలు - పేదరాసి పెద్దమ్మ - దొంగలు

మర్యాద రామన్న కథలు

పేదరాసి పెద్దమ్మ - దొంగలు

రంగాపురం అనే ఊరిలో ఒక పేదరాసి పెద్దమ్మ ఉండేది. ఆమె ఆ ఊరికి వచ్చేవారికి పూటకూళ్ళ భోజనాలు పెడుతూ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె ఇంటికి నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెను తమకు భోజనం వండి పెట్టమని, ఆ ఊర్లో రెండు, మూడు రోజుల పాటు ఉంటామని తెలిపారు. సరేనని పెద్దమ్మ వారిని స్నానపాదులు ముగించుకుని వచ్చేలోగా భోజనం సిద్ధం చేస్తానని తన పనిలో నిమగ్నమైనది.

ఆ నలుగురు వ్యక్తులు దొంగతనాలు చేస్తూ వచ్చిన సొమ్మును పంచుకునేవారు. వారు పెద్దమ్మ ఇంటికి రాకముందే వేరే గ్రామంలో దొంగతనము చేసి ఆ సొమ్ముతో పెద్దమ్మ ఇంటికి వచ్చారు. వారు ఒకసారి ఆ గ్రామ పరిస్థితులు తాము దొంగతనము చేయడానికి ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరాలని అనుకున్నారు. అలాగే పెద్దమ్మ అమాయకత్వం కూడా వారికి అర్థమైంది. ఎలాగైనా ఆమె వద్ద సొమ్ము భద్రముగా ఉంటుందని ఆ నలుగురు లోపలకి వెళ్ళి పెద్దమ్మా ఇదిగో మాకు చిన్న సహాయం చేసిపెట్టు. మేము ఒకపని కోసం ఊరిలోకి వెళ్తున్నాము. ఈ వరహాల మూటను నీవద్ద భద్రముగా ఉంచు. మేము నలుగురం కలసి వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఒక్కరు వచ్చి అడిగినా ఇవ్వవద్దు అని చెప్పి ఊర్లోకి వెళ్దామన రెండడుగులు వేశారు.

ఆ నలుగురిలో ఒకడు పెద్దమ్మ అమాకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాగైనా ఆ వరహాలను కాజేయాలని పథకం వేసి తోటి మిత్రులతో నేను పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి రాతిచెంబు తెచ్చుకుంటాను అని, పెద్దమ్మ చెంబును ఇవ్వదేమో మీరు కూడా ఇవ్వమని చెప్పండి అన్నాడు. మేము చెబుతాములే అని ఆగారు. ఆ నాలుగవ వాడు పెద్దమ్మను వరహాల మూటను తెమ్మన్నారు ఇవ్వు అని అడిగాడు. పెద్దమ్మ లేదు మీ నలుగురు కలిసి వస్తేనే ఇవ్వమన్నారు కదా నేను ఇవ్వను అని చెప్పింది. వెంటనే వాడు ఆ ముగ్గురితో పెద్దగా మీరు కూడా చెబితేనే ఇస్తుందట, ఇవ్వమని చెప్పండి అన్నాడు. ఆ ముగ్గురూ రాతిచెంబేకదా అడిగేది దానికి లోపలకి వెళ్ళి చెప్పటం ఎందుకని బయట నుండి పెద్దమ్మా ఇవ్వు అన్నారు. పెద్దమ్మ మళ్ళీ అడిగింది ఇవ్వనా అని, వాళ్ళు సరే ఇవ్వు అని ఊర్లోకి వెళ్ళారు.

ఆ నాలుగవ వాడు వరహాల మూటను తీసుకుని దొడ్డి దారిన పారిపోయాడు. పెద్దమ్మ వంట సిద్ధం చేసి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ముగ్గురు వచ్చి భోజనం చేశాక పెద్దమ్మను వరహాల మూటను అడిగారు. పెద్దమ్మ అదేమిటి మీరు ఇవ్వమని బయటి నుంచి చెబితేనే కదా ఆ నాలుగవ వానికి ఇచ్చాను. మరలా నన్ను అడుగుతారేమిటి? అని అమాయకంగా అన్నది.‌ మేము నిన్ను ఎప్పుడు ఇవ్వమన్నాము? వాడు రాతిచెంబు కదా నిన్ను అడిగినది. అదే ఇవ్వమని చెప్పాము. మాకు తెలియదు మంచితనంగా మా వరహాలు మాకివ్వు లేదంటే న్యాయాధికారి వద్దకు వెళ్తాం అని గొడవ చేశారు. తనకేం తెలియదని మీరు బయటనుండి ఇవ్వమంటేనే ఇచ్చాను అని పెద్దమ్మ మొత్తుకున్నా వినలేదు ముగ్గురూ పెద్దమ్మను న్యాయాధికారి వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి పెద్దమ్మ వద్ద నుండి వరహాలు ఇప్పించమని కోరారు. పెద్దమ్మ జరిగిన విషయాన్ని చెప్పినా న్యాయాధికారి పట్టించుకోకుండా పెద్దమ్మనే వరహాలు చెల్లించాలని తీర్పు చెప్పాడు.

అప్పుడే ఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, “ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే” అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమని కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.

6, ఏప్రిల్ 2020, సోమవారం

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు - రచయితలు

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు 

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపల్లి  - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్‌ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్‌ సిఆర్‌ రెడ్డి

●వేమన పద్యాలు - వేమన

●కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి - రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం - పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం - మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం - చలం

●వైతాళికులు - ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్‌ - పఠాభి

●సౌందర నందము - పింగళి, కాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్‌ - చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్‌ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●నీలిమేఘాలు - ఓల్గా

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య - నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి - రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర - కందుకూరి

●మ¬దయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర - సినారె

●దాశరథి కవిత - దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర - శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర - కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

●స్వప్ప లిపి - అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం - శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●అడవి ఉప్పొంగిన రాత్రి - విమల

●చంఘీజ్‌ ఖాన్‌ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్‌ పాటలు - గద్దర్

●హాంగ్‌ మీ క్విక్‌ - బీనాదేవి

●ఇస్మాయిల్‌ కవిత - ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●కొయ్య గుర్రం - నగ్నముని

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకర, వాసిరెడ్డి

●మోహన వంశీ - లత

●నగరంలో వాన - కుందుర్తి

●రాముడుండాడు రాజ్యముండాది - కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●శివారెడ్డి కవిత - శివారెడ్డి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్‌ సుదర్శనం

●స్వేచ్ఛ - ఓల్గా

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం - రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్‌ బ్రౌన్

మర్యాద రామన్న కథలు - సుబ్బయ్య మూర్ఖత్వం

మర్యాద రామన్న కథలు
సుబ్బయ్య మూర్ఖత్వం

ఒక ఊళ్లో సుబ్బయ్య, శంకరయ్య అనే వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో కాపురం ఉండేవారు. సుబ్బయ్య వ్యాపారి కాగా, శంకరయ్య ఊర్లో కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. సుబ్బయ్య అహంకారి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగినవాడు. శంకరయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు.

ఒకరోజు సుబ్బయ్య ఏదో పనిమీద పక్క ఊరికి వెళ్తూ... "శంకరయ్యా...! నేను పక్కనే ఉండే శివపురానికి వెళ్తున్నాను. తిరిగీ వచ్చేందుకు వారం రోజులుదాకా పట్టవచ్చు. అప్పటిదాకా నా గుర్రాన్ని నీ ఇంట్లో కట్టేసి వెళ్తాను" అని అన్నాడు. దీంతో మంచివాడైన శంకరయ్య, సరేనని గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు.

సుబ్బయ్య ఊరెళ్లిన తరువాత రెండు రోజులపాటు బాగా ఆరోగ్యంగానే ఉన్న గుర్రం... మూడోరోజు అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోయింది. ఏం చేయాలో, సుబ్బయ్యకు ఏమని చెప్పాలో తెలియని శంకరయ్య దేవుడా...! అంటూ తలపట్టుకుని బాధపడుతూ కూర్చున్నాడు. ఇక చేసేదేముంది.. సుబ్బయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిచ్చేస్తే సరిపోతుందని తనను తాను సముదాయించుకున్నాడు.

చెప్పినట్టుగానే వారం రోజుల తరువాత వచ్చాడు సుబ్బయ్య. గుర్రం చనిపోయిన విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఆగ్రహంతో.. "చూడు శంకరయ్యా...! నేను గుర్రాన్ని అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నా గుర్రం నాకు కావాలి. దానికి బదులుగా డబ్బుగానీ, మరే ఇతర గుర్రముగానీ వద్దు...! ఏమైనా చేయి, నాకు దాంతో సంబంధం లేదు" అని తెగేసి చెప్పాడు. దీంతో ఏమీ పాలుబోని శంకరయ్య మర్యాద రామన్న వద్దకెళ్లి జరిగినదంతా చెప్పి వాపోయాడు.

అంతా విన్న మర్యాద రామన్న... ఒక గొప్ప ఎత్తువేసి, వివరంగా చెప్పి శంకరయ్యను పంపించాడు. మర్యాద రామన్న సలహా మేరకు కాచుక్కూర్చున్న శంకరయ్య ఇంటికి గుర్రం గురించి అడిగేందుకు వచ్చాడు సుబ్బయ్య. రావడమేగాకుండా, గోడకు ఆనించి పెట్టిన పెద్ద పెద్ద కుండలను పొరపాటున బద్దలు కొట్టేశాడు.

దీంతో "అయ్య బాబోయ్..! నా కుండలు బద్ధలైపోయాయి సుబ్బయ్యా... ఇప్పుడెలా..?" అని గట్టిగా అరిచాడు శంకరయ్య. "దీని కోసం ఇంత రాద్ధాంతం చేయాలా శంకరయ్యా...? వాటి ఖరీదు నేను కట్టిస్తాన్లే, లేకపోతే వేరే కుండలను కొనిస్తాను" అన్నాడు సుబ్బయ్య. "అయ్యో అలా చెబుతారేంటి..? నాకు నా కుండలే కావాలి, వేరేవి వద్దు" అని గట్టిగా పట్టుబట్టాడు శంకరయ్య.

సుబ్బయ్య, శంకరయ్యలు ఎంతసేపు వాదించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకక పోవడంతో... చివరకు ఇద్దరూ కలసి మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు. ఇద్దరి మాటలను ఓపికగా విన్న మర్యాద రామన్న... సుబ్బయ్యను మందలించి, గుర్రం ఖరీదును శంకరయ్య వద్ద తీసుకుని, అతడి కుండల ఖరీదును చెల్లించమని తీర్పు చెప్పాడు. దీంతో.. తప్పు తెలుసుకున్న సుబ్బయ్య ప్రశ్చాత్తాపంతో ఇంటిదారిపట్టాడు.

5, ఏప్రిల్ 2020, ఆదివారం

విక్రమాదిత్య కథలు -తెల్ల కాకులు - మంచి పాములు

విక్రమాదిత్య కథలు
తెల్ల కాకులు - మంచి పాములు

అనగనగా  ఓ రోజు లోకంలో కాకులన్నీ తెల్లగా అయిపోయాయిట.

'తెల్లకాకులేమిటి చెప్మా' అని అందరూ వింతగా చెప్పుకోనేలోపు గోవులన్ని తెల్లగా మారిపోయాయిట.
కర్రావులు, నల్లావులు, మచ్చల ఆవులూ తెల్లగా తెల్లబడిపోయాయిట.*
*పుట్టల నుంచి బయటకు వచ్చిన తెల్లటి పాములు, వీధుల్లో పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాయిట.

ఏమవుతోందసలని అందరూ రచ్చబండల దగ్గర చేరి తోచిన కారణం చెప్పుకుంటుండగా, బావుల దగ్గర నీళ్ళు చేదుకుంటున్న ఆడంగులు, బిత్తరపోతూ రంగు మారిన నీళ్ళని చేతి లోకి తీసుకు చూసారట. అవి పాలు! కమ్మటి, చిక్కటి పాలు.

వంటిళ్ళలో ఉప్పుగల్లు ఘుమ ఘుమలాడుతూ కర్పూరం అయిపోయిందట.

ఉమ్మెత్త పువ్వులు దివ్య పరిమళాలు వెదజల్లడం మోదలుపెట్టాయట.

ఒక వింతా! ఎటు చూసినా ఏదో ఒక కబురే! అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యమే!

మేతకి వెళ్ళిన మందలని తీసుకొచ్చే కాపరులకి, ఎవరిదే ఆవో తెలియక గడబిడ పడుతూ వస్తూ వస్తూ ఇంకో వింత కబురు మోసుకొచ్చారు. "అయ్యలూ, ఎవరి పశువు ఏదో తేల్చుకోవడమెలా ఉన్నా, రేపటికి మందలకి గడ్డి లేదయ్యా! బీళ్ళు అన్ని ఖాళీ. గడ్డి పోచన్నది లేకుండా పీక్కుపోయారయ్యా!" అని. ఎవరయ్యా గడ్డి పట్టుకుపోయినదీ అంటే.. రాజులు. భూమండలం లో ఉన్న బుల్లి రాజులు, చిన్న రాజులు, చిటికె రాజులు, పొటికె రాజుల మొదలు మహా రాజుల వరకూ అందరూ గడ్డి బీళ్ళమ్మట పడి పీక్కుపోయారట.

ఇవన్ని పైనుంచి చూస్తూ విస్తుపోయిన సురలోకవాసులు విష్ణుమూర్తి దగ్గరకు పరుగులు తీసారుట.

పాల సంద్రంలో పాముసజ్జె మీద కునుకు తీస్తున్న దేవరవారిని లక్ష్మి కుదిపి లేపింది.

కళ్ళు తెరిచిన స్వామికి తన పద్మహస్తాన ఉన్న తెల్ల తామరపువ్వును చూపి" ఇదేంటి నాథా, తెల్ల తామరల మయం అయిపోయింది మన పెరటి కొలను. మరో రంగే కనిపించడం లేదే! ఏం చిత్రం స్వామీ !" అని తెల్లబోయింది.

ఈ లోపు అక్కడికి చేరిన దేవతలు తమ గోడు ఏలికతో వెళ్ళబోసుకున్నారిలా.

"స్వామీ! భూలోకంలో ఏ గోవు చూసినా కామధేనువులా ఉంది. నందిని మించినట్టున్నాయ్ గిత్తలన్నీ. ఏ పూవు చూసినా పారిజాత పరిమళమే. భూమి మీద తెల్లఏనుగులని చూసి తన గొప్పింకేమిటని ఐరావతం అలిగి పడుకుంది. హిమాలయానికి దారి తెలియడం లేదు. అన్ని కొండలూ తెల్లగా మెరిసిపోతున్నాయ్. ఉప్పు, నీళ్ళు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. తెల్లారితే పశువులకి ఓ గడ్డిపోచ కూడా లేదు. తెల్లారడమేమిటి మహానుభావా! సూర్యుడు కుంగి ఝాము కావొస్తున్నా, ఎక్కడా చీకటి ఛాయలే లేవు. చంద్రుడికి ఏం చెయ్యాలో పాలుబోవడం లేదు. పాలంటే గుర్తొచ్చింది ప్రభో! అన్ని సంద్రాలూ పాల సంద్రాలై పోయాయ్. చేపజాతి మొత్తం అజీర్తితో ధన్వంతరి ఇంటికి చేరుకున్నాయ్. ఇంకా ఏం జరగనుందో! ఏమిటి ఉత్పాతం తండ్రీ? "

కలువ రేకుల వంటి కళ్ళని ఓ క్షణకాలం మూసి తల పంకించి, నవ్వుతూ కళ్ళు తెరిచాడు నారాయణుడు.
"ఈ మార్పులకి కారణం 'భోజరాజ కీర్తి చంద్రిక'. ఆ రాజు కీర్తి  ప్రభావానికి నల్లనివన్నీ తెల్లబడ్డాయ్. లేని సుగుణాలు చరాచరాలకు అంటుతున్నాయ్." అని చెప్పాడు.

"మరెలా అన్నగారూ, తెల్ల తామరలు లక్ష్మికి, తెల్లని పాములు ఫరమేశ్వరునికి తప్పవా ఇకపై?" అడిగింది పార్వతి.

"తెల్లబడిన నారాయణుడిని కూడా చూడాల్సివస్తుందేమో, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే!" హాస్యమాడాడు నారదుడు.

"ఇంకేం, ఈ సమస్యని నువ్వే చక్కదిద్దగలవాడివి నారదా!" అని చురక వేస్తూ, కర్తవ్యం బోధించి పంపాడు నారదుడిని భోజరాజు వద్దకు శ్రియఃపతి.

భూలోకంలో భోజరాజాస్థానం గడ్డి పోచ నోటకరిచి కానుకలతో నిలబడ్డ రాజులతో కిక్కిరిసిపోతోంది.
భూమండలంలో రాజులంతా భోజుడికి సామంతులవడానికి వచ్చి చేరారక్కడ. ఎక్కడెక్కడి దేశాలనుంచో ఇంకా తరలి వస్తున్నారు. ఏం జరుగుతోందో అంతు చిక్కక ఆశ్చర్యపోతున్న భోజుడిని సమీపించాడు నారదుడు.

"మహానుభావా, వందనం. సరైన సమయానికి విచ్చేసారు. ఏమిటీ వైపరీత్యం?" అని ప్రశ్నించాడు భోజుడు.

"నీ గొప్పదనమే భోజరాజా, ఈ విచిత్రాలకు నువ్వే కారణం. నీ కీర్తి కాంత ప్రభావమే ఇదంతా! భూలోకం ఏం చూసావ్! దేవతలు సైతం అసూయపడేంత దూరం పాకింది నీ కీర్తి. నారాయణుడే నెవ్వెరబోయాడు." అని చెప్పాడు నారదుడు.

"అవునా..!!!" అని ఆశ్చర్యపోయిన భోజుడు, మునివేళ్ళతో గర్వంగా మీసాన్ని మెలేయడం, లోకం యథాతథం కావడం ఒకేసారి జరిగింది.

దిక్కుల్ని జయించిన మహారాజయినా పొగడ్తకి దాసుడే కదా!

పొగడ్తకి లొంగిన వాడు పదుగురిలో ఒకడు, సామాన్యుడు.